breaking news
Sub-Treasury Office
-
ఏసీబీ వలలో అవినీతి చేప
-
ఏసీబీ వలలో అవినీతి చేప
- చనిపోయిన రిటైర్డ్ వాచ్మెన్ సొమ్ము ఇచ్చేందుకు రూ.15 వేలు డిమాండ్ చేసిన ఖజానా శాఖ ఉద్యోగి - రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ డీఎస్పీ చీరాల: వసతిగృహ వాచ్‌మెన్‌గా పనిచేసి అనారోగ్యంతో చనిపోయిన ఉద్యోగికి రావాల్సిన సొమ్ము ఇచ్చేందుకు రెండేళ్లు తిప్పించుకుని చివరకు రూ.15 వేలు ఇస్తేనే బిల్ పాస్ చేస్తానని డిమాండ్ చేసిన చీరాల ఉప ఖజానా కార్యాలయంలోని ఓ అవినీతి చేపను సోమవారం సాయంత్రం ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్లే..చీరాలకు చెందిన గరిక శంకరరావు ఇంకొల్లు సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్లో వాచ్‌మన్‌గా పనిచేశాడు. 2013లో ఉద్యోగ విరమణ చేసిన శంకరరావు 2014లో అనారోగ్యంతో మృతిచెందాడు. ఆయన 24 ఏళ్ల సర్వీసులో రావాల్సిన ఇంక్రిమెంట్లు, ఇతర సొమ్ము రూ.1.20 లక్షల కోసం భార్య సామ్రాజ్యం, కుమారుడు వినోద్‌కుమార్‌లు రెండేళ్లుగా చీరాల ఉప ఖజానా కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. కార్యాలయంలో సీనియర్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న బండి అక్కేశ్వరరావు రకరకాల సాకులు చెప్పి సొమ్ము చెల్లింపులకు కావాల్సిన బిల్లులు పాస్ కానివ్వకుండా బాధించాడు. చివరకు బిల్లు పాస్ కావాలంటే రూ.15 వేలు చెల్లించాలని డిమాండ్ చేశాడు. అయితే బాధితులు అప్పటికే పలుమార్లు లంచాలు ఇచ్చి విసిగి వేసారారు. చేసేదేమీలేక ఈనెల 4న ఒంగోలు డీఎస్పీ మూర్తికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు లంచం కోసం వేధిస్తున్న ఉద్యోగి అక్కేశ్వరరావును పట్టుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రతిరోజూ అక్కేశ్వరరావు ఒంగోలు నుంచి చీరాలకు రైల్లో వచ్చి నిధులు నిర్వహిస్తుండేవాడు. సోమవారం విధులు ముగించుకుని ఒంగోలు వెళ్లేందుకు రైల్వేస్టేషన్‌కు చేరుకున్నాడు. శంకరరావు కుటుంబ సభ్యులు ఏసీబీ అధికారుల సూచనలతో మొదటి విడత రూ.10 వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనికి అక్కేశ్వరరావు రూ.5 వేలు డబ్బులు ఇచ్చి మరో రూ.5 వేలకు ఒక వస్తువు కొనివ్వాలని సూచించాడు. దీంతో సోమవారం సాయంత్రం అక్కేశ్వరరావుకు రూ.5 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లంచంగా తీసుకున్న రూ.5 వేలను స్వాధీనం చేసుకోవడంతో పాటు, అక్కేశ్వరరావును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏసీబీ డీఎస్పీ ఆర్వీఎస్ మూర్తి తెలిపారు. ఈ దాడుల్లో ఇన్స్పెక్టర్ పీవీవీ ప్రతాప్‌కుమార్, ఏఎస్సై కరీముల్లా, సిబ్బంది పాల్గొన్నారు. రెండేళ్లుగా వేధించారు నా భర్త 24 ఏళ్లపాటు వాచ్‌మెన్‌గా సర్వీస్ చేసి తీవ్ర అనారోగ్యంతో 2014లో మరణించాడు. ఆయనకు రావాల్సిన పింఛను, ఇతర బెనిఫిట్లకు సంబంధించి ఖజానా కార్యాలయం సీనియర్ అకౌంటెంట్ అక్కేశ్వరరావు బిల్లులు కాకుండా వేధించి నరకయాతనలకు గురిచేశాడు. చివరకు రూ.15 వేలు లంచం ఇస్తేనే బిల్లు పాస్ చేస్తానని డిమాండ్ చేయడంతో సహనం నశించి ఏసీబీ అధికారులను ఆశ్రయించాం. లంచగొండి అధికారులను ఖఠినంగా శిక్షించాలి. - గరిక సామ్రాజ్యం, వినోద్‌కుమార్, బాధితులు -
బెండి తీశారు
శ్రీకాకుళం క్రైం: శ్రీకాకుళం సబ్ ట్రెజరీ కార్యాలయంలో ఓ అవినీతి చేప ఏసీబీకి చిక్కింది. ట్రెజరీ కార్యాలయంలో సీనియర్ అకౌంటెంట్ బెండి మోహనరావు లంచం తీసుకుంటూ మంగళవారం ఏసీబీకి చిక్కాడు. వివరాల్లోకి వెళ్తే... విశాఖపట్నంలో నివాసముంటు న్న ఓ ఉద్యోగి శ్రీకాకుళం జిల్లాలో ఇరిగేషన్ శాఖలో పనిచేస్తూ పదవీ విరమణ పొందారు. అయితే అతనికి రావల్సిన గ్రాట్యుటీ సొమ్ము కోసం తను పని చేసిన ఇరిగేషన్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. అక్కడ్నుంచి ఆ ఫైల్ జిల్లా ట్రెజరీకి వెళ్లగా అక్కడ్నుంచి శ్రీకాకుళం సబ్ ట్రెజరీకి వచ్చింది. ఇక్కడ నుంచి ఫైల్ మంజూరై బదిలీ చేయటానికి సీనియర్ అకౌంటెంట్ మోహనరావు లంచం అడిగాడు. ఆ విశ్రాంతి ఉద్యోగికి సుమారు ఐదు నుంచి ఆరు లక్షల వరకు గ్రాట్యుటీ సొమ్ము అందాల్సి ఉంది. వచ్చే సొమ్ములో పది శాతం తనకు లంచంగా ఇవ్వాలని, అలా అయితేనే ఫైల్ బదిలీ జరుగుతుందని తేల్చిచెప్పాడు. అంటే రూ.50 వేల నుంచి 60 వేలు వరకు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అంత ఎక్కువ మొత్తం ఇచ్చుకోలేనని ఆ విశ్రాంతి ఉద్యోగి చెప్పగా ముందు రూ.పది వేలు ఇవ్వు తరువాత మాట్లాడుకుందామని మోహనరావు చెప్పాడు. దీంతో చేసేది లేక ఆ విశ్రాంతి ఉద్యోగి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి రసాయనాలు పూసిన రూ.500 నోట్లు పది వేల రూపాయలు ఆ విశ్రాంతి ఉద్యోగికిచ్చి పంపించారు. బెండి.. ఎంచక్కా ఆ నోట్లను తీసుకుని లెక్కపెట్టి జేబులో పెట్టుకున్నాడు. వెంటనే ఏసీబీ అధికారులు సబ్ ట్రెజరీ కార్యాలయంలోకి దూసుకెళ్లి మోహనరావును అదుపులోకి తీసుకున్నారు. దాడుల్లో ఏసీబీ డీఎస్పీ కె.రంగరాజు, విజయనగరం సీఐలు లకో్ష్మజీ, రమేష్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఓ విశ్రాంతి ఉద్యోగి గ్రాడ్యూటీకి సంబంధించిన ఫైల్‌ను మంజూరు చేసి జారీ చేయటానికి సబ్ ట్రెజరీలో సీనియర్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న మోహనరావు రూ.పది వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడన్నారు. విశ్రాంతి ఉద్యోగి తన వివరాలను గోప్యంగా ఉంచాలని చెప్పడంతో బయటకు చెప్పలేకపోతున్నామని వివరించారు. ఏ ప్రభుత్వ ఉద్యోగైనా అవినీతికి పాల్పడితే దాడులు తప్పవని హెచ్చరించారు.