ఓడిపోయిన ఒబామా!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఓడిపోయారు.. అది కూడా కెనడా ప్రధాన మంత్రి స్టీఫెన్ హార్పర్ చేతిలో.. గెలిచిన హార్పర్‌కు రెండు కేసుల బీర్‌ను బహుమతిగా పంపించారు కూడా. ఒబామా ఏంటి.. కెనడా ప్రధాని చేతిలో ఓడిపోవడమేమిటని ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజమే.. కానీ, ఓడిపోయింది ఒక పందెంలో మరి. రష్యాలోని సోచిలో జరుగుతున్న వింటర్ ఒలింపిక్స్ ‘ఐస్ హాకీ’ సెమీఫైనల్స్‌లో కెనడా జట్టు విజయం సాధించిన విషయం తెలిసిందే.
అయితే నెల రోజుల కింద కెనడాలోని మెక్సికోలో ఒక సదస్సులో కలిసినప్పుడు... కెనడా ఓడిపోతుందని ఒబామా, గెలుస్తుందని హార్పర్ పందెం కట్టారు. ఇందులో గెలిచిన హార్పర్‌కు అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్‌హౌజ్ గార్డెన్లో సేకరించిన తేనెతో తయారు చేసిన ‘హనీ పోర్టర్, హనీ బ్లాండే’ బ్రాండ్ల బీర్లను ఒబామా పంపించారు. ఈ విషయాన్ని వైట్‌హౌజ్ సెక్యూరిటీ కౌన్సిల్ ట్విట్టర్లో వెల్లడించింది. ‘‘ఒబామా నాతో వరుసగా పందాలు ఓడిపోతున్నారు. పందెంగా కాసినవన్నీ పంపుతూనే ఉన్నారు’’ అని హార్పర్ వ్యాఖ్యానించడం గమనార్హం.