breaking news
The state government budget
-
రూ.100 కోట్లు.. 150 రోజులు
‘గాంధీ’ నిధుల ఖర్చుకు గడువు మార్చి 31 వినియోగించకపోతే మురిగి పోయినట్టే అప్రమత్తమైన అధికారులు నేడు విభాగాధిపతులతో సమావేశం గాంధీ ఆస్పత్రి: రోగులకు మరింత మెరుగైన వైద్యసేవలందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి రూ.100 కోట్లు కేటాయించింది. సదరు నిధులను వచ్చే ఏడాది మార్చి 31లోగా ఖర్చు చేయాల్సి ఉంది. లేకపోతే ఆ నిధులు మురిగిపోయే ప్రమాదం ఉందని ఆస్పత్రి పాలనాయంత్రాంగం భావిస్తోంది. సదరు నిధులను ఖర్చు చేయడం సులభమే, కానీ ఆయా పనులను ఆస్పత్రి పాలనాయంత్రాంగం స్వయంగా చేపట్టే అవకాశం లేదు. తెలంగాణ వైద్య ఆరోగ్య మౌలిక సదుపాయాల సంస్థ ఆధ్వర్యంలోనే ఈ నిధులు వెచ్చించాల్సి ఉంటుంది. ప్రతిపాదనలు రూపొందించి మౌలిక సదుపాయాల సంస్థలకు అందిస్తే సదరు సంస్థ ఆధ్వర్యంలో టెండర్ ప్రక్రియ చేపట్టి, పనులు ప్రారంభించి పూర్తి చేయడం వంటి మూడు దశలు 150 రోజుల్లో సాధ్యపడుతుందా? అనే అనుమానం కలుగుతోంది. ఇంకా నిలదొక్కుకోని కార్పొరేషన్.. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏపీఎంఎస్ఐడీసీ (ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్) నుంచి విడిపోయి పూర్తిస్థాయి సాధనాసంపత్తిని సమకూర్చుకోలేదని, దీంతో టెండర్లు. ఇతర ప్రక్రియల్లో జాప్యం జరిగే అవకాశం ఉందని పలువురు అధికారులు భావిస్తున్నారు. అప్రమత్తమైన పాలనా యంత్రాంగం... ఆస్పత్రుల అభివృద్ధికి బడ్జెట్లో నిధులు కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల సూపరింటెండెంట్లు, కళాశాలల ప్రిన్సిపాళ్లు గురువారం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి రాజయ్యను కలిశారు. మార్చి 31వ తేదీలోగా నిధులు ఖర్చు చేయకపోతే మురిగిపోయే ప్రమాదముందని ఆ మంత్రి హెచ్చరించినట్టు తెలిసింది. దీంతో సంబంధిత విభాగాల అధికారులతో సమావేశమై తక్షణమే ప్రతిపాదనలు సిద్ధం చేసి, నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు గాంధీ పాలనయంత్రాంగం కసరత్తు చేస్తోంది. నేడు గాంధీ హెచ్ఓడీల సమావేశం.. గాంధీ ఆస్పత్రిలోని అన్ని విభాగాలకు చెందిన హెచ్ఓడీలతో ఆస్పత్రి పాలనాయంత్రాంగం శనివారం సమావేశం నిర్వహించనుంది. రూ.176 కోట్లతో ప్రతిపాదనలు పంపగా, బడ్జెట్లో వంద కోట్లే కేటాయించడంతో ప్రాధాన్యతల ప్రకారం మరోమారు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని భావిస్తోంది. ఆయా విభాగాల్లో అత్యవసరమైన వైద్యపరికరాలు, అభివృద్ధి వంటి అంశాలపై చర్చించి తగిన ప్రణాళికలు రూపొందించాలని నిర్ణయించింది. ఈ మేరకు శనివారం ఆస్పత్రి సెనినార్ హాలులో హెచ్ఓడీలతో సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు ఆస్పత్రి అధికారులు స్పష్టం చేశారు. -
ఓటు బడ్జెట్..!
ముంబై: రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రైతాంగానికి పెద్దపీట వేసింది. వ్యాపారులు, ఉద్యోగులకు కూడా పలు రాయితీలు ప్రకటించింది. 2014-15 సంవత్సరానికి సంబంధించి రూ. 4,103.3 కోట్ల లోటు బడ్జెట్‌ను విధానసభలో గురువారం ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రిత్వశాఖను కూడా నిర్వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రవేశపెట్టిన ఈ బడె ్జట్‌లో రూ. 1,80,320.5 కోట్ల ఆదాయాన్ని, రూ. 1,84,423.28 కోట్ల ఖర్చును చూపారు. వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తూ బడ్జెట్ కేటాయింపులు కొనసాగాయి. రైతుల ఆత్మహత్యను దృష్టిలో ఉంచుకొని వారికందించే కనీస సాయాన్ని ఈ ఏడాది రెట్టింపు చేసినట్లు మంత్రి అజిత్‌పవార్ తెలిపారు. ముఖ్యంగా కరువు ప్రభావిత ప్రాంతాల రైతులతోపాటు అకాల వర్షాలు, వడగండ్లతో పంట దెబ్బతిన్న రైతులకు ఇది ఎంతో ఊరటనిస్తుందన్నారు. 2014 జనవరి-జూన్ మధ్య కాలంలో నష్టపోయిన రైతుల విద్యుత్ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని ప్రకటించారు. అంతేకాక పంట రుణాలపై వడ్డీని కూడా చెల్లిస్తామని, రుణాల చెల్లింపు గడువును పెంచుతామన్నారు. రుణాల వసూలు కోసం ఎటువంటి బలవంత చర్యలకు దిగబోమని స్పష్టం చేశారు. వ్యాపారవర్గాలకూ ఊరట... వ్యాపారవర్గాలకు ఊరట కలిగించేలా గత ఏడాది ప్రవేశపెట్టిన స్థానిక సంస్థల పన్ను అమలు విషయంలో ఎటువంటి ఆమోదముద్ర వేయలేదు. వ్యాట్ టర్నోవర్ రిజిస్ట్రేషన్‌ను రూ. 5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచారు. అంతేకాక రిజిస్టర్ట్ ఆడిటర్‌తో వ్యాపార లావాదేవీలను మదిం పు చే సి సమర్పించే నివేదికను ఇకపై కోటి రూపాయల ఆదాయం దాటినవారు మాత్రమే సమర్పిం చాలి. గతంలో దీని పరిమితి రూ. 60 లక్షలు ఉండే ది. ఎల్బీటీ స్థానంలో మళ్లీ ఆక్ట్రాయ్‌ను అమలు చే సేందుకు చర్చలు జరుగుతున్నట్లు ఈ సందర్భంగా పవార్ చెప్పారు. నవీముంబై ఎయిర్‌పోర్టు భూసేకరణ కోసం కేంద్రం రూ. 14,574 కోట్లు ఇచ్చేందుకు ఆమోదముద్ర వేసిందని, మరింత సాయం కోసం కేంద్రంతో సంప్రదింపులు జరుపుతామన్నారు. శివాజీ స్మారకానికి రూ. 100 కోట్లు గుజరాత్లో నిర్మిస్తున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ స్మారకాన్ని మించిన రీతిలో రాష్ట్రంలో రాజ్‌భవన్ సమీపంలోని అరేబియా సముద్ర తీరంలో నిర్మించాలనుకుంటున్న శివాజీ స్మారకానికి రూ. 100 ఇవ్వాలనే ప్రతిపాదనలు చేశారు. ఈ సమావేశాల్లోనే మరాఠ రిజర్వేషన్ సాక్షి, ముంబై: మరాఠ రిజర్వేషన్‌ను ప్రస్తుత శాసన సభ సమావేశాల్లోనే అమలుచేసే అవకాశాలున్నాయని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ వెల్లడించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలపై ఢిల్లీలో సమీక్ష జరిపినట్లు తెలిపారు. సాధారణంగా ఒకే పార్టీ 10, 15 ఏళ్లపాటు అధికారంలో ఉంటే ఎంత మంచి పనులు చేసినా ప్రజలు మార్పు కోరుకుంటారని పేర్కొన్నారు. కేంద్రంలో ప్రభుత్వం మారడానికి ఇది కూడా ఒక కారణమని సూచన ప్రాయంగా అన్నారు. కొన్ని కీలక నిర్ణయాలు తొందరపాటుతో తీసుకోరాదని, ఇవి భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు సృష్టిస్తాయని అన్నారు. మరాఠ రిజర్వేషన్‌పై ప్రభుత్వం ఈ సమావేశంలోనే తుది నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని చవాన్ చెప్పారు. ఇదిలాఉండగా లోక్‌సభ ఎన్నికల్లో ఘోరంగా ఓటమిపాలైన కాంగ్రెస్ పార్టీ వచ్చే శాసన సభ ఎన్నికల్లో ఇదే పరిస్థితి పునరావృతం కాకుండా జాగ్రత్త పడుతోంది. అందుకు మరాఠ సమాజం రిజర్వేషన్ బిల్లును ఆమోదించి కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగా రాజుకున్న వాతావరణాన్ని శాంతపర్చాలని ప్రయత్నిస్తోంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు నుంచే మరాఠ సమాజంలోని పేద వర్గాలకు విద్యా, ఉద్యోగ రంగంలో కొంత రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ తెరపైకి వచ్చింది. ఎన్నికలు సమీపించడంతో ఒత్తిడి మరింత ఎక్కువైంది. కానీ అధికారంలో ఉన్న కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి ప్రభుత్వం దీన్ని పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో బీజేపీ లోక్‌సభ ఎన్నికల ప్రచార సభల్లో మరాఠ సమాజం రిజర్వేషన్ అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చింది. డీఎఫ్ కూటమి ప్రభుత్వం మరాఠ సమాజాన్ని మోసం చేసిందని ప్రచార సభల్లో తీవ్రంగా విమర్శించింది. ఫలితంగా లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, మిత్రపక్షమైన నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) లకు భారీ నష్టం వాటిల్లింది. దీంతో వచ్చే శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అనుకూలంగా వాతావరణం ఏర్పడవచ్చనే ధీమాతో మరాఠ రిజర్వేషన్ బిల్లును అమలులోకి తెచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.