breaking news
State Board of Technical Education
-
పాలిసెట్ దరఖాస్తుల గడువు పెంపు
సాక్షి, హైదరాబాద్: పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న పాలిసెట్–2020 దరఖాస్తుల గడువును ఈనెల 31వ తేదీ వరకు పొడిగించినట్లు రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణ మండలి (ఎస్బీటీఈటీ) కార్యదర్శి యూవీఎస్ఎన్ మూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని సూచించారు. అలాగే పాలిటెక్నిక్ ద్వితీయ సంవత్సరంలో ఐటీఐ పూర్తయిన విద్యార్థులు చేరేందుకు నిర్వహించే ల్యాటరల్ ఎంట్రీ ఇన్ పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష దరఖాస్తుల గడువును ఈనెల 31వ తేదీ వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. -
ప్రశాంతంగా పాలిసెట్-2015
రాష్ట్రవ్యాప్తంగా 94.58% హాజరు జూన్ 10లోగా ఫలితాలు.. 20 నుంచి కౌన్సెలింగ్.. జూలై 8 నుంచి తరగతులు సెట్ కోడ్‌ను విడుదల చేసిన డిప్యూటీ సీఎం కడియం సాక్షి, హైదరాబాద్: పాలిటెక్నిక్‌లలో ప్రవేశానికై స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆదివారం నిర్వహించిన పాలిసెట్-2015 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 248 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షకు మొత్తం 1,00,201 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా, 94,768 మంది (94.58 శాతం) హాజరైనట్లు పాలిసెట్-2015 కన్వీనర్ వెంకటేశ్వర్లు తెలిపారు. పరీక్ష ప్రశ్నాపత్రం కోడ్‌ను ఆదివారం ఉదయం 6గంటలకు టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ రంజీవ్ ఆచార్యతో కలిసి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సచివాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్‌లలో మొత్తం 60,920 సీట్లు ఉన్నాయన్నారు. పాలిసెట్ పరీక్ష ఫలితాలను జూన్ 10లోగా విడుదల చేసేందుకు అన్ని చర్యలు చేపట్టామన్నారు. జూన్ 20 నుంచి అడ్మిషన్ల కౌన్సెలింగ్ ప్రారంభించి.. జూలై 8 నుంచి పాలిటెక్నిక్ తరగతులు ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన పాలిసెట్ పరీక్షకు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వేలాదిమంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. కేంద్రప్రభుత్వ అధీనంలోని ఆరు పాలిటెక్నిక్‌లలో మాత్రమే కోస్తాంధ్ర, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల అభ్యర్థులకు 42:36:22 నిష్పత్తిలో సీట్ల కేటాయింపులు ఉన్నాయని కడియం పేర్కొన్నారు. ప్రశ్నాపత్రం కోడ్ పత్రాలు ఉన్న బాక్స్‌ను ఇంకా ముట్టకమునుపే ఒక టీవీ ఛానల్లో కోడ్‌ను విడుదల చేసినట్లు స్క్రోలింగ్ రావడంపై డిప్యూటీ సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం స్క్రోలింగ్‌ను తీసేయకుంటే తీవ్రమైన చర్యలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ఇదిలా ఉంటే.. ఆదివారం జరిగిన పాలిసెట్-2015 ప్రశ్నాపత్రంలోని లెక్కల(మ్యాథ్స్) ప్రశ్నల్లో చాలావరకు తప్పులున్నాయంటూ పరీక్షాకేంద్రాల వద్ద పలువురు విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు.