పోలీసులకు లొంగిపోయిన ‘ఉన్నం’
వైఎస్సార్ సీపీ నేత శ్రీశైలవాసు హత్య కేసులో ప్రధాన నిందితుడు
ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే హత్య
వీటిపై ఆధారాలు లేవు.. రాజకీయ ప్రమేయం లేదు.
డీఎస్పీ రాధేష్ మురళి
నందిగామ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బొగ్గవరపు శ్రీశైలవాసు హత్య కేసులో ప్రధాన నిందితుడు ఉన్నం హనుమంతరావు మంగళవారం రాత్రి పోలీసులకు లొంగిపోయినట్లు నందిగామ డీఎస్పీ రాధేష్ మురళి తెలిపారు. ఈ కేసులో హనుమంతరావుతో సహా నలుగురిపై కేసు నమోదైన విషయం తెలిసిందే. స్థానిక పోలీస్స్టేషన్లో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ ఈ వివరాలు తెలియజేశారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. హనుమంతరావు మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో సొంతకారులో నందిగామ సీఐ కార్యాలయానికి వచ్చి లొంగిపోయాడు. ఇసుక, మద్యం, మిర్చి వ్యాపారాల్లో పెట్టుబడులు పెడితే రూపాయికి మూడు రూపాయలు ఇస్తానని హనుమంతరావుకు శ్రీశైలవాసు 2007లో చెప్పాడు. దీంతో హనుమంతరావు తన సొంత సొమ్ము రూ.48.50 లక్షలు, స్నేహితుల వద్ద నుంచి తెచ్చిన రూ.62.50 లక్షలు మొత్తం రూ.1.11 కోట్లు వాసు వ్యాపారాల్లో పెట్టుబడికి ఇచ్చాడు. ఈ మొత్తం లో అసలు రూ.67.35 లక్షలు వాసు తిరిగి ఇచ్చాడు.
అసలులో మిగిలిన రూ. 43.65 లక్షలు తనకు రావాల్సి ఉందని హనుమంతరావు పోలీసుల విచారణలో చెప్పాడు. పెట్టుబడులకు సంబంధించి మొదట్లో వాసు చెప్పిన దాని ప్రకారం 2007 నుంచి 2013 వరకు అతడు ఇంకా రూ.7 కోట్లు ఇవ్వాల్సి ఉందని హను మంతరావు ఊహించుకున్నాడు. ఈ మొత్తం గురించి వాసును పలుమార్లు అడిగాడు. తాను ఇంకా సొమ్ము ఇవ్వాల్సిన పనిలేదని, అంతా ఇచ్చేశానని వాసు చెప్పేవారని అతడు తెలిపాడు. స్నేహితుల వద్ద తెచ్చిన సొమ్ము తిరిగి ఇవ్వాలని వారంతా ఒత్తిడి చేస్తుండటంతో గట్టిగా ప్రశ్నించానని హనుమంతరావు విచారణలో చెప్పాడు. డబ్బు ఇవ్వకపోగా చంపుతానని వాసు బెదిరించడం తో గత్యంతరం లేక మిగతా ముగ్గురి సాయం తీసుకుని ఆయాజ్తో హత్య చేయించినట్లు అతడు అంగీకరించాడు. వాసు వ్యాపారాల్లో హనుమంతరావు పెట్టుబడులు పెట్టినట్లు ఆధారాలు లేవు. ఈ లావాదేవీలు మౌఖిక ఒప్పం దాతోనే జరిగాయని హనుమంతరావు చెప్పినట్లు డీఎస్పీ తెలి పారు.
పోలీసుల వైఫల్యం
వాసు హత్య జరిగి 26 రోజులు దాటినా ప్రధాన నింధితుడు హనుమంతరావును పోలీసులు గుర్తించి పట్టుకోవటంలో విఫలమయ్యారు. హత్య అనంతరం అతడు ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, గోవా తదితర ప్రాంతాల్లో తిరిగాడు. తానే స్వయంగా నందిగామ సీఐ కార్యాలయానికి వచ్చి లొంగిపోయేంత వరకు పోలీసులు అతడి ఆచూకీని కనిపెట్టలేక పోయారు. సెల్ఫోన్లు, కంప్యూటర్లు వంటివి ఉపయోగించకపోవడంతో అతడి ఆచూకీ గుర్తించలేకపోయామని డీఎస్పీ మీడియాకు చెప్పడం గమనార్హం.
స్నేహితులకు సొమ్ము తిరిగి ఇవ్వలేకే...
నిందితుడు హనుమంతరావు జల్సాలకు అలవాటు పడి జులాయిగా తిరిగేవాడని, ఎక్కువశాతం అబద్ధాలు చెప్పే మనస్తత్వం కలిగిన వాడని డీఎస్పీ రాధేష్ మురళి పేర్కొన్నారు. స్నేహితుల వద్ద తెచ్చిన సొమ్ము తిరిగి ఇవ్వలేకపోవడంతో వారికి సమాధానం చెప్పలేక ఈ నేరానికి కుట్ర పన్నాడని ఆయన తెలిపారు. ఈ కేసులో ఎటువంటి రాజకీయ ప్రమేయం లేదని విచారణలో తేలిందన్నారు. హనుమంతరావు లొంగుబాటుతో ఈ కేసులో నిందితులందరినీ అరెస్టు చేసినట్లు ఆయన చెప్పారు. సమావేశంలో సీఐ రాంకుమార్, ఎస్ఐలు ఏసుబాబు, తులసీ రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.