breaking news
Srirangasagar project
-
చివరి ఆయకట్టుకు నీళ్లిచ్చేలా.. మిషన్ ఎస్సారెస్పీ
సాక్షి, హైదరాబాద్: రానున్న ఖరీఫ్ సీజన్లో కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా వివిధ రిజర్వాయర్లకు నీటిని మళ్లించేందుకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో.. ఆలోగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ) కింద చేపట్టిన అన్ని రకాల పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా ఎస్సారెస్పీ కింది ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీళ్లందించేలా చూడాలని అధికారులను ఆదేశించింది. వర్షాలు కురిసే జూన్ నాటికి ఎస్సారెస్పీ పరిధిలో చివరి ఆయకట్టు వరకు నీళ్లిచ్చేందుకు ఉన్న అడ్డంకులు తొలగించేందుకు ఎమ్మెల్యేలు, ప్రాజెక్టు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించింది. ఈ నెల 10 నుంచి లోయర్ మానేర్ డ్యామ్ (ఎల్ఎండీ) దిగువన ఉన్న ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని అధికారులను ఆదేశించింది.కాగా, గురువారం నీటిపారుదల అధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహిచంనున్నారు. సీఎం ఆదేశాలతో కీలక భేటీ ఎస్సారెస్పీ ఆయకట్టు పునరుజ్జీవంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ఆయకట్టుకు నీళ్లిచ్చేలా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలో ఇంజనీర్లతో చర్చించి ఓ నిర్ణయానికి రావాలని ఆయకట్టు పరీవాహక ఎమ్మెల్యేలకు మంగళవారం ఆదేశించారు. కాళేశ్వరం ద్వారా జూన్, జూలై నుంచే 90 టీఎంసీలకు పైగా నీటిని ఎత్తిపోసే అవకాశాలున్నాయని.. ఈ నేపథ్యంలో ఎస్సారెస్పీ కింద ఉన్న 14.40లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటిని అందించేందుకు వ్యూహాలు సిద్ధం చేయాలని సూచించారు. ఎస్సారెస్పీ పరీవాహక ప్రాంత ఎమ్మెల్యేలు, నీటిపారుదల శాఖ అధికారు సమన్వయ భేటీ బుధవారం జలసౌధలో జరిగింది. ఈ భేటీకి మాజీ మంత్రులు ఈటల రాజేందర్, జగదీశ్ రెడ్డి, ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, రసమయి బాలకిషన్, వొడితెల సతీష్, సుంకే రవిశంకర్, నన్నపనేని నరేందర్, సోలిపేట రామలింగారెడ్డి, సీతక్క, ఆరూరి రమేష్, ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి, ఈఎన్సీలు మురళీధర్, నాగేంద్రరావు, అనిల్ కుమార్, సీఈ శంకర్ తదితరులు హాజరయ్యారు. రబీ సాగునీటి విడుదల, ఎస్సారెస్పీ కాల్వల ఆధునీకరణ పనులు, ఆయకట్టు లక్ష్యాల పురోగతిపై ఈ భేటీలో చర్చించారు. జూన్ చివరికి 100% పనులు: ఈటల ఎస్సారెస్పీ ద్వారా 14.40లక్షల ఎకరాలకు నీళ్లివ్వాల్సి ఉన్నా, గతంలో 5 లక్షల ఎకరాల కంటే ఎక్కువ నీళ్లు ఇవ్వలేదని మాజీ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఎస్సారెస్పీ కాల్వల ఆధునీకరణ చేపట్టి ప్రాజెక్టు పరిధిలోని చివరి ఆయకట్టు వరకు నీళ్లివ్వాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు. ఇదే సమయంలో ‘ప్రాజెక్టులో ఇప్పటికే తవ్విన కాల్వలకు 3వేల క్యూసెక్కుల సామర్థ్యం నుండి 6వేల క్యూసెక్కుల సామర్థ్యం వరకు నీటిని వదిలి పరీక్షించాం. ప్రస్తుతం జరుగుతున్న ఆధునీకరణ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సమావేశంలో చర్చించాం. డిస్ట్రిబ్యూషన్ కెనాల్స్‌ను బలోపేతం చేసుకోవాల్సి ఉంది. దీంతో పాటే చెరువులు, కుంటలు నింపాలని సీఎం చెప్పారు. ఇలా చేస్తే భూగర్భజలాలు, మత్స్య సంపద పెరుగుతుంది. ఈ ఏడాది జూన్ 30 నాటికి కేటాయించిన నిధుల్లో 100% ఖర్చు చేస్తాం. అవసరమైతే మరిన్ని నిధులు తెచ్చుకుంటాం’అని ఈటల పేర్కొన్నారు. కొన్ని చోట్ల భూసేకరణలో సమస్యలున్నాయని, వాటిపైన పూర్తి దృష్టిసారిస్తామన్నారు. ఈ ఎండాకాలంలో రైతాంగానికి నీళ్లు ఇచ్చేలా కృషి చేస్తున్నామని, ఫిబ్రవరి 10నుంచి లోయర్ మానేరు కింది పంటలకు ఒక తడి నీరు విడుదల చేస్తామని ప్రకటించారు. వర్షాకాలనికి గౌరవెళ్లి వరకు నీళ్లు తీసుకెళ్తామని, కాళేశ్వరం నీళ్లు వీటికి అనుసంధానం కాబోతున్నాయని తెలిపారు. కొనసాగుతున్న ఎల్ఎండీ పనులు! ఎస్సారెస్పీ పరిధిలో ఎల్ఎండీ ఎగువన 145వ కిలోమీటరు వరకు పనులు కేవలం 30–40% మాత్రమే పూర్తవగా, దిగువన 146వ కిలోమీటర్‌నుంచి 284కి.మీ వరకు కాల్వల ఆధునీకరణ పనులను రూ.400 కోట్లతో చేపట్టగా, ఇక్కడ 60% పనులు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. నీటి విడుదల కొనసాగుతు న్న దృష్ట్యా పనులు జూన్ నాటికి పూర్తి చేయా లని ఎమ్మెల్యేలు సూచించారు. డిస్ట్రిబ్యూటరీ పనులను రూ.230 కోట్ల పనులను జూన్ నాటికి పూర్తి చేసి ఆయకట్టుకు నీళ్లిచ్చేలా చూడాలని ఆదేశించారు. ప్రాజెక్టు స్టేజ్–1 కింద 9.62 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా 6 లక్షల ఎకరాల వరకు నీరందుతోంది. స్టేజ్ –1 కింద ఉన్న 4.80 లక్షల ఎకరాల ఆయకట్టులో గరిష్టంగా నీరందించేలా చూడాలని సూచించారు. మిడ్‌మానేరు కింద 80వేల ఎకరాలకు నీళ్లిచ్చేలా భూసేకరణ పూర్తి చేయాలని చెప్పారు. -
సాగునీటి కోసం రైతుల ఆందోళన
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువ ద్వారా సాగునీటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం రైతులు కన్నెర్ర జేశారు. కాకతీయ కాలువ పరీవాహక ప్రాంత నిజామాబాద్ జిల్లాలోని 14 గ్రామాలకు చెందిన రైతులు వారి కుటుంబాలతో ఎస్సారెస్పీ కార్యాలయ ముట్టడికి తరలి వచ్చారు. సుమారు 3 వేల మంది ఉదయం 11 గంటల నుంచి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వ హించారు. ప్రాజెక్ట్ అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో ఆగ్రహానికి గురైన రైతులు కార్యాలయంలోకి చొరబడ్డారు.ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి, కార్యాలయ బోర్డును తొలగించారు. ఏసీలను, తలుపులను ధ్వంసం చేశారు. వీరికి మహిళా రైతులు కూడా తోడవ్వడంతో ఎస్సారెస్పీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రెండు రోజుల్లో నీరు విడుదల చేస్తామని చెప్పి, నీరు ఎందుకు విడుదల చేయలేదని రైతులు ప్రశ్నించారు. గంటన్నర తర్వాత పోలీసులు రైతు ప్రతినిధులు, అధికారు లతో సమావేశం ఏర్పాటు చేయించినా ఎటూ తేల్చక పోవడంతో రైతులు ఎస్సారెస్పీ కార్యాలయం నుంచి జాతీయ రహదారి 44 వరకు కాలినడకన వెళ్లి, మెండోరా మండలం చాకీర్యాల్ చౌరస్తా వద్ద రాస్తా రోకో చేశారు. 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాత్రి 8.30 గంటల వరకు రాస్తారోకో జర గడంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్‌జామ్ అయింది. 2 బస్సుల అద్దాలను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. -
ఎస్సారెస్పీకి వరద ఉధృతి
సాయంత్రం వరకు 1.90 లక్షల క్యూసెక్కుల మేర ఇన్‌ఫ్లో ► 17.84 టీఎంసీలకు చేరిన నీటిమట్టం ► నిజాంసాగర్, కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టులకు ప్రవాహాలు సాక్షి, హైదరాబాద్/బాల్కొండ: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి భారీ ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. స్థానిక వర్షాలకు తోడు ఎగువ ప్రాజెక్టుల వరద నీరు కూడా తోడవ్వడంతో ఇన్‌ఫ్లో పెరుగుతోంది. సోమవారం ఉదయం 1.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరగా సాయంత్రానికి అది మరో 40 వేల క్యూసెక్కులకు పెరిగి 1.90 లక్షల క్యూసెక్కులకు చేరింది. అయితే సాయంత్రం తర్వాత వరద తగ్గుముఖం పట్టి, 95 వేల క్యూసెక్కులకు చేరిందని నీటి పారుదల వర్గాలు తెలిపాయి. ఇక భారీ ప్రవాహాలు వచ్చి చేరడంతో ప్రాజెక్టు నీటి మట్టం శరవేగంగా పెరుగుతోంది. ప్రాజెక్టు నీటిమట్టం ఆదివారం 9.66 టీఎంసీలు ఉండగా, సోమవారం సాయంత్రానికి 17.84 టీఎంసీలకు చేరింది. ఇక నిజాంసాగర్, కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టులకు స్థిరంగా ప్రవాహాలు కొనసాగుతున్నాయి. నిజాంసాగర్‌కు 3 వేల క్యూసెక్కులు, కడెంకు 2,400 క్యూసెక్కులు, ఎల్లంపల్లికి 6,110 క్యూసెక్కుల మేర ప్రవాహాలు వస్తుండటంతో ప్రాజెక్టుల మట్టాలు క్రమంగా పెరుగుతున్నాయి. కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల్లో జూరాలకు వస్తున్న 2,500 క్యూసెక్కుల ప్రవాహం మినహాయించి, మరెక్కడా ప్రవాహాలు లేవు. వేగంగా పెరుగుతున్న నీటి మట్టం.. శ్రీ రాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్ట్ నీటి మట్టం వేగంగా పెరుగుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా, సోమవారం సాయంత్రానికి 1,065 అడుగు లకు చేరింది. అయితే రాత్రికల్లా ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు క్రమంగా తగ్గుముఖం పట్టింది. రాత్రి 8 గంటల వరకు 1.5 లక్షల క్యూసెక్కులు వచ్చిన ఇన్‌ఫ్లో.. 9 గంటలకు 95 వేల క్యూసెక్కులకు పడిపోయింది. మొత్తంగా ఒక్క రోజు వ్యవధిలో 8.80 అడుగుల మట్టం పెరగ్గా.. 10 టీఎంసీల మేర వరద నీరు వచ్చి చేరింది. కాకతీయ కాలువ ద్వారా నీటి విడుదల.. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి జగిత్యాల, కరీంనగర్ జిల్లాల ప్రజల తాగు నీటి అవసరాల కోసం కాకతీయ కాలువ ద్వారా 500 క్యూసెక్కుల నీటిని సోమవారం ప్రాజెక్ట్ అధికారులు విడుదల చేశారు.