తిరుచానూరు బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణం
తిరుచానూరు, న్యూస్‌లైన్: చిత్తూరు జిల్లా తిరుచానూరులో కొలువైన శ్రీవేంకటేశ్వర స్వామివారి పట్టపుదేవి శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఉదయం ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజుల పాటు ఉదయం, రాత్రి వేళల్లో అమ్మవారు వివిధ వాహనాల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇస్తారు. శుక్రవారం వేకువజామున 2గంటలకు సుప్రభాతంతో మేల్కొలిపి నిత్య కైంకర్యాలు, అభిషేకం ఏకాంతంగా నిర్వహించారు.
అమ్మవారిని సర్వాంగసుందరంగా అలంకరించి సన్నిధి ముఖమండపంలో కొలువుదీర్చారు. ధ్వజస్తంభానికి శాస్త్రోక్తంగా తిరుమంజనం నిర్వహించారు. అంతకు ముందు ధ్వజపటాన్ని ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు. తొలిరోజు శుక్రవారం రాత్రి అమ్మవారు చిన్నశేష వాహనంపై తిరువీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు.