breaking news
Spray drugs
-
పూత రాలి.. కాయ కుళ్లి
కొల్లాపూర్ /జగిత్యాల అగ్రికల్చర్ ఈ ఏడాది మామిడి పూత చూసి రైతులెంతో మురిసిపోయారు. కానీ వాతావరణంలో తలెత్తిన మార్పులు, తెగుళ్ల కారణంగా పంట దిగుబడులు గణనీయంగా తగ్గిపోయాయి. దీంతో రైతుల ఆశలు అడియాసలు కాగా, కౌలు రైతుల పరిస్థితి మరింత అగమ్యగోచరంగా మారింది. దిగుబడి సగానికి సగం తగ్గిపోగా, మార్కెట్లో సరైన ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోయారు. వాతావరణ మార్పులు, తెగుళ్లు డిసెంబర్లో చలి తీవ్రత, తేమ శాతం పెరగడం, అకాల వర్షం కారణంగా పూత పెద్దమొత్తంలో రాలిపోయింది. అదే నెలలో రెండో దశ పూతలు వచ్చాయి. వీటికి బూడిద తెగులు సోకి రాలిపోయాయి. అక్కడక్కడా పంటలో పూత నిలబడినా, గాలిలో తేమశాతం ఎక్కువగా ఉండటంతో తేనె మంచు పురుగు ఆశించింది. ఈ పురు గులు గుంపులు, గుంపులుగా మామిడి పూత, పిందెపై చేరి, వాటి నుంచి రసాన్ని పీల్చాయి. దీంతో, పూత, పిందె రాలి మాడిపోయాయి. కొన్నిచోట్ల పూత, పిందెలపై నల్లని మసి ఏర్పడింది. ఈ పురుగు వల్ల దాదాపు 20 నుంచి 100 శాతం వరకు నష్టం ఏర్పడుతుంది. మరోవైపు బంక తెగులు సోకి కాయలు నేలరాలాయి. మితిమీరి పురుగు మందుల పిచికారీ తేనె మంచు పురుగు కట్టడికి రైతులు విపరీతంగా రసాయన మందులు పిచికారీ చేశారు. ఇప్పటికే ఒక్కో రైతు ఒక్క ఎకరానికి దాదాపు రూ.20వేల వరకు ఖర్చు చేశారు. రెండుమూడు నుంచి ఏడుసార్ల వరకూ మందులు పిచికారీ చేసిన రైతులు ఉన్నారు. ధరలు సైతం నేలచూపులే ఏటా సీజన్ ప్రారంభంలో మామిడి కాయల ధర టన్నుకు రూ.1.20 లక్షల నుంచి రూ.1.60 లక్షల వరకు పలికేది. కానీ, ఈసారి ఫిబ్రవరి రెండో వారంలో టన్ను ధర రూ.1.20 లక్షల వరకు పలికింది. నెలాఖరులో టన్ను ధర రూ.80 వేలకు పడిపోయి.. ప్రస్తుతం రూ.50–60 వేల వరకు పలుకుతోంది. వ్యాపారుల సిండికేట్‌తోనూ ధరలు తగ్గాయి. కొల్లాపూర్, పెద్దకొత్తపల్లిలో హైదరాబాద్, ముంబయికి చెందిన వ్యాపారులు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి నెలాఖరులో రూ.60– 75 వేల వరకు టన్ను మామిడి కాయలను కొనుగోలు చేసి.. ఇప్పుడు తగ్గించేశారు. జగిత్యాల మామిడి మార్కెట్లో మొన్నటి వరకు కిలో రూ.65 వరకు ఉన్న బంగినపల్లి రకం ధర ప్రస్తుతం రూ.45–55 మధ్య పలుకుతోంది. దశేరి రకం కిలో రూ.75 వరకు పలకగా, ప్రస్తుతం రూ.50–65 మధ్య పలుకుతోంది. హిమాయత్ రకం కిలో రూ.130 వరకు పలకగా, ఇప్పుడు రూ.100గా కొనసాగుతోంది. ఉమ్మడి మహబూబ్‌నగర్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం 57,344 ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. వీటిలో 70 శాతం మేర తోటలు కాపు కాసేవి ఉన్నాయి. సాగు చేస్తున్న తోటల లెక్కల ప్రకారం ఈ ఏడాది 1,38,848 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అధికారుల అంచనా. అందులో 50 శాతం కూడా వచ్చే పరిస్థితి లేదు. జగిత్యాల జిల్లా : జగిత్యాల జిల్లాలో 40వేల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. ఇప్పటికే దాదాపు 70శాతం మామిడి తోటల్లో పురుగు ఆశించి 100శాతం పంటనష్టం జరిగింది. మామిడికాయ ఇప్పుడిప్పుడే మార్కెట్‌కు వస్తోంది. దిగుబడి నాలుగైదు టన్నులకే పరిమితమైంది. పూతకు ముందే తోటలు లీజుకు తీసుకున్నవారు ప్రస్తుతం ఆ తోటలను చూసి తమ అడ్వాన్సులు తిరిగి ఇవ్వమంటూ రైతులను కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లా: బోధన్‌రూరల్(బోధన్): నిజామాబాద్ జిల్లా సాలూర మండలంలోని మందర్న, హున్స గ్రామాలు మామిడి తోటల సాగులో ప్రత్యేక గుర్తింపు పొందాయి. ఇక్కడ 80 నుంచి 100 ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. పూత రాలిపోయి దిగుబడిపై తీవ్ర ప్రభావం పడింది. ఆదుకోవాలి.. నేను 40 ఎకరాల తోటలను రూ.42 లక్షలకు కౌలుకు తీసుకున్నా. సొంత తోటలు కూడా ఉన్నాయి. సాగు పనులకు రూ.15 లక్షలకు పైగా ఖర్చు చేశా. ఇప్పటి వరకు 20 టన్నుల కాయలు మాత్రమే అమ్మాను. సాగు, కౌలు కోసం ఖర్చు చేసిన డబ్బులు ఇంకా రాలేదు. రెండో విడత పూత కొంత మేరకు నిలబడింది. ఆ కాయలు వచ్చే నెలలో కోతకు వస్తాయి. వాటి మీదే ఆశలు పెట్టుకున్నా. – పెద్దూరి లక్ష్మయ్య, మామిడి రైతు, కొల్లాపూర్ రెండు సార్లు మందులు కొట్టాను పూత ప్రారంభానికి ముందు, పూత వచి్చన తర్వాత మందులు పిచికారీ చేశాను. ఎకరానికి రూ.30వేల వరకు ఖర్చు చేశాను. అయినా పూత సరిగ్గా నిలువ లేదు. పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదు. – కాటిపెల్లి శ్రీపాల్‌రెడ్డి, వెంకట్రావుపేట, మేడిపల్లి పూత నిలబడలేదు వాతావరణంలో మార్పులు, తెగుళ్ల కారణంగా ఈసారి మామిడి దిగుబడి బాగా తగ్గింది. పంటనష్టం వివరాలు ఇంకా అంచనా వేయలేదు. పూతలు బాగానే వచి్చనా, తేనెమంచు పురుగు, నల్లి, బూడిద తెగుళ్ల కారణంగా పూత నిలవలేదు. – లక్ష్మణ్, ఉద్యానశాఖ అధికారి, కొల్లాపూర్ -
మందు పిచికారీ చేస్తున్నారా..? జాగ్రత్త..
ఆదిలాబాద్ అగ్రికల్చర్ : జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలతో పంటల్లో చీడపీడల బెడద ఎక్కువైంది. వీటి నివారణకు రైతులు మందులు పిచికారీ చేయడంలో బిజీ బిజీగా ఉన్నారు. చీడపీడల నుంచి పంటలను కాపాడుకోవాలనే ప్రయత్నంలో మందులు పిచికారీ చేస్తూ స్వీయ రక్షణకు విస్మరిస్తున్నారు. కనీస జాగ్రత్తలు పాటించకపోవడంతో ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇటీవల లోకేశ్వరం మండలం హవర్గా గ్రామానికి చెందిన యువ రైతు లస్మన్న రక్షణ చర్యలు లేకుండా మందు పిచికారీ చేస్తూ అస్వస్థతకు గురయ్యాడు. చికిత్స పొందుతూ చనిపోయాడు. శనివారం నార్నూర్ మండలం కొత్తపల్లి(హెచ్) ఝాడే రాజ్‌కుమార్(25) పత్తి పంటకు మందు పిచికారీ చేస్తూ అస్వస్థతకు గురై చనిపోయాడు. ఈ క్రమంలో మందు పిచికారీ చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏరువాక కోఆర్డినేటర్, శాస్త్రవేత్త రాజశేఖర్ వివరించారు. సూచనల మేరకే పిచికారీ చేయాలి.. పైరును ఆశించిన తెగుళ్లు, పురుగుల నిర్మూలనకు ఇష్టమొచ్చిన విధంగా పిచికారీ చేస్తే ఉపయోగం కన్నా నష్టమే అధికంగా ఉంటుంది. సూచనల మేరకు పిచికారీ చేయాలి. ఒక పంటకు పిచికారీ చేసిన మందు డబ్బాను మరో పంటకు ఇతర(కలుపు) మందును కలిపి పిచికారీ చేస్తే పంటలో ఏదైనా మార్పు, ఆకులు ముడుచుకుపోవడం కనిపిస్తే వెంటనే 20గ్రాముల యూరియా, 20గ్రాముల చక్కెర కలిపి పిచికారీ చేసి నివారించవచ్చు. మందులు అధికంగా వాడడం మూలంగా పంటకు మేలు చేసే సాలీడు, అక్షింతల పురుగులు, మిడతలు, తూనీగలు తదితర మిత్ర పురుగులు మృత్యువాత పడుతాయి. మిత్ర పురుగులు పొలంలో లేకుంటే పంటకు కీడు చేసే పురుగు పెరుగుతుంది. అవసరమైనవే.. పంటలకు పురుగు మందులు వాడడానికి వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు సూచించిన స్ప్రేలను జాగ్రత్తగా వాడాలి. పంటలో మొక్కల స్థాయిని బట్టి స్ప్రే డబ్బాలు ఉపయోగించాలి. పత్తిలో హ్యాండ్స్ప్రేయర్, పవర్ స్ప్రేయర్ల కంటే తైవాన్ స్ప్రేయర్ల ద్వారా మొక్కలకు నేరుగా మందు పిచికారీ చేసే వీలుంటుంది. అవగాహన అవసరం పంటలను ఆశించే చీడపీడల నివారణకు ఉపయోగించే పురుగు మందులపై రైతులు అవగాహన పెంచుకోవాలి. ముఖ్యంగా దుకాణాల్లో పురుగు మందులు నాలుగు రంగుల్లో నీలి, పసుపు రంగులతో కూడిన డబ్బాలుంటాయి. పుర్రె గుర్తుతో కూడిన ఎర్ర రంగు ఉంటే అత్యంత విషపూరితమని గుర్తించాలి. ఆకుపచ్చ రంగు చిహ్నంతో ఉంటే తక్కువ విషపూరితమని గ్రహించాలి. మందు ప్రభావానికి గురైతే.. పురుగుల మందు ప్రభావానికి గురైన వ్యక్తికి ముందు నోటిలోకి వేలు పెట్టి వాంతి చేయించాలి. మూర్ఛపోయిన సందర్భంలో మూతికి గాయం కాకుండా రెండు దవడల మధ్య గుడ్డను ఉంచాలి. శరీర ఉష్ణోగ్రతను తగ్గించేందుకు తడిబట్టతో నెమ్మదిగా తుడవాలి. ఉష్ణోగ్రత తగ్గితే దుప్పటి కప్పి వెచ్చగా ఉంచాలి. సకాలంలో ఆస్పత్రికి తీసుకవెళ్లాలి, అనారోగ్యానికి కారణమైన రసాయనాల వివరాలు డాక్టర్‌కు తెలపాలి.