breaking news
Special screenings
-
ఆ చిత్రానికి అద్వానీ ఫిదా
సాక్షి, న్యూఢిల్లీ : మిస్టర్ ఫర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్‌కు ఊహించని ప్రశంస దక్కింది. ఆయన కొత్త చిత్రం సీక్రెట్ సూపర్ స్టార్ అద్భుతమని రాజకీయ దిగ్గజం ఎల్కే అద్వానీ కితాబిచ్చారు. ఈ చిత్రం రిలీజ్‌కు సిద్ధమౌతున్న నేపథ్యంలో పలు నగరాల్లో ప్రముఖుల కోసం అమీర్ ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఢిల్లీలో ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనకు అద్వానీ, ఆయన కూతురు, పలువురు రాజకీయ నేతలు హాజరయ్యారు. చిత్రం పూర్తయిన థియేటర్ చప్పట్లతో మారుమోగిపోగా.. తర్వాత చాలా సేపు అద్వానీ అమీర్‌తో చర్చించటం మీడియా కంటపడింది. దీనిపై అమీర్ స్పందిస్తూ... సినిమా అద్భుతంగా తెరకెక్కించారని అద్వానీ ప్రశంసించినట్లు చెప్పారు. కాగా, దంగల్ ఫేమ్ జైరా వసీమ్ ప్రధాన పాత్రలో అద్వైత్ చావ్లా దర్శకత్వంలో సీక్రెట్ సూపర్ స్టార్ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రానికి నిర్మాతగానే కాదు.. ఓ కీలకపాత్రలో అమీర్ నటిస్తుండటం విశేషం. ఓ ముస్లిం అమ్మాయి తన ఉనికి బయటపడకుండా.. తనలోని టాలెంట్‌ను ప్రదర్శించటమే ఈ చిత్ర నేపథ్యంగా తెలుస్తోంది. అక్టోబర్ 19న సీక్రెట్ సూపర్ స్టార్ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. -
‘ప్రీమియర్ షో’ దోపిడీని అరికట్టండి
కవాడిగూడ: సినిమా అభిమానులు దోపిడీకి గురికాకుండా ఉండాలంటే ప్రీమియర్ షోలు, ప్రత్యేక ప్రదర్శనలు రద్దు చేయాలని తెలంగాణ రాష్ట్ర సినిమా అభిమానుల ఐక్య వేదిక ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కొత్త సినిమాల విడుదల సందర్భంగా స్వచ్ఛంద సంస్థలు, ట్రస్టుల పేరుతో ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతులు పొంది నిబంధనలకు విరుద్ధంగా సినిమా ప్రేక్షకులను, అభిమానులను నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు దోచుకుంటున్నారని, సినిమా విడుదలైన వారంలో జరిగే బ్లాక్ మార్కెట్ దందాను అరికట్టాలని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో వేదిక అధ్యక్షులు పూర్ణచందర్రావు, సలహాదారు జీఎల్ నర్సింహారావు మాట్లాడుతూ నిజానికి ప్రీమియర్, ప్రత్యేక షోల ప్రదర్శనల్లో సాధారణ థియేటర్లలో వసూలు చేసే టికెట్ల ధరలనే ప్రత్యేక షోలు వేసేటప్పుడు తీసుకోవాలన్నారు. అలా కాకుండా అభిమానుల సెంటిమెంట్ బలహీనతను అడ్డం పెట్టుకొని నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఒక్కో షో టిక్కెట్ ధరను రూ. 2 నుంచి 3 వేల వరకూ వసూలు చేస్తున్నారని విమర్శించారు. ఈ రకమైన చర్యలు సినిమాటోగ్రఫీ చట్టంలోని సెక్షన్ 9 (ఎ) ప్రకారం నేరమన్నారు. సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమా ప్రీమియర్ షో పేరిట లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. సమస్యలు వస్తే జనంలోకి వస్తాను, ప్రభుత్వాన్ని నిలదీస్తాను, ప్రతిస్పందిస్తాను అని చెప్పిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఈ దోపిడీ కన్పించడం లేదా అంటూ ప్రశ్నించారు. సమావేశంలో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకులు రాహుల్, సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకులు బొట్టు బాబు తదితరులు పాల్గొన్నారు.