breaking news
Special Medicines
-
సారీ..మా వద్ద మందుల్లేవు..!
సాక్షి, హైదరాబాద్ : బోడుప్పల్‌కు చెందిన ఈఎస్ఐ లబ్ధిదారుడు రమేశ్ కొంతకాలంగా కిడ్నీ వైఫల్యంతో బాధపడుతున్నారు. ఆయన ఈఎస్ఐ కార్డుపై డయాలసిస్ చేయించుకుంటున్నప్పటికీ...నెలకు 2 ‘ఐరన్ సుక్రోస్ 5ఎంజీ ఇంజక్షన్స్‌తో పాటు పన్నెండు ‘4కే బ్లడ్ ఇంజక్షన్లు’అవసరం. కానీ గత 2 నెలలుగా ఆయనకు ఆ మందులు అందడం లేదు. దీంతో ఆయన వాటిని ప్రైవేటుగా కొనుగోలు చేస్తున్నారు. వీటి కోసం నెలకు రూ.25 వేలకుపైగా ఖర్చు చేస్తున్నారు. అసలే ఆయనది ప్రైవేటు సంస్థలో చిరుద్యోగం.. చాలీచాలని జీతం..ఆపై మందుల కొనుగోలుకు అప్పులు చేయాల్సి వస్తోంది. ఇది ఒక్క రమేశ్ ఎదుర్కొంటున్న సమస్య కాదు...ఈఎస్ఐ పరిధిలో ఉన్న వెయ్యి మందికిపైగా కిడ్నీబాధితులు ఇదే సమస్యతో అవస్థలు పడుతున్నారు. రోగులకు మందులు సరఫరా చేయాల్సిన ఈఎస్ఐ తనకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండటంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. రెండు నెలల నుంచి సరఫరా కానీ మందులు వివిధ ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల్లో పని చేస్తున్న రూ.25 వేల లోపు వేతనం ఉన్న చిరుద్యోగులంతా ఈఎస్ఐ పరిధిలోకి వస్తారు. ప్రతీనెలా వీరంతా ఈఎస్ఐ ఖాతాలో తమ వాటాను జమ చేస్తుంటారు. ఏవైనా ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు వారికి ఈఎస్ఐ కార్డుపై ఉచితంగా వైద్యసేవలు అందాలి. వీరికి సనత్‌నగర్, నాచారం ఈఎస్ఐ ఆస్పత్రుల్లో చికిత్సలు అందిస్తుంటారు. వీటిలో ఆయా చికిత్సలు అందుబాటులో లేక పోతే వారిని ప్రైవేటు ఆస్పత్రులకు సిఫార్సు చేస్తుంటారు. లబ్ధిదారుల్లో వెయ్యి మందికిపైగా కిడ్నీ బాధితులు ఉండగా, మరో వెయ్యి మంది వరకు కాలేయ, కేన్సర్ సంబంధ బాధితులు ఉన్నారు. సాధారణ రోగుల మందులతో పోలిస్తే వీరి మందులు చాలా ఖరీదు. వీటిని కొనుగోలు చేయడం భారం. దీంతో ఆయా మందులను కూడా ఈఎస్ఐ సరఫరా చేస్తుం ది. దీనికోసం సనత్‌నగర్ ఈఎస్ఐలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసింది. బాధితులకు స్థానికంగా ఉన్న డిస్పెన్సరీల్లో మందులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. దీంతో వారంతా తమ పరిధిలోని డిస్పెన్సరీలకు వెళ్లినప్పటికీ..గత 2 నెలల నుంచి మందులు ఇవ్వడం లేదు. తాము ఇండెంట్ పెడుతున్నా మందుల సరఫరా చేయడంలేదని వారి సమాధానం. దీంతో వీటిని రోగులే సమకూర్చుకుంటున్నారు. వీటి ఖరీదు ఎక్కువగా ఉండటం, వాటిని కొనుగోలు చేసే స్థోమత కార్మికులకు లేక పోవటంతో బాధితుల ఆరోగ్యం మరింత దెబ్బతిని కొందరు మృత్యువాతపడుతున్నారు. ఆరోగ్యశ్రీ రోగులది అదే దుస్థితి.. ఈఎస్ఐ లబ్ధిదారుల పరిస్థితి ఇలా ఉంటే..ఆరోగ్యశ్రీ లబ్ధిదారుల పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది. మూత్రపిండాల వైఫల్యం, కాలేయం పనితీరు దెబ్బ తినడం, కేన్సర్ సహా హృద్రోగ సమస్యలతో బాధపడుతూ ఆరోగ్యశ్రీ కార్డుపై చికిత్స కోసం ప్రతిష్టాత్మాక నిమ్స్, ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్న రోగులకు తీరా ఆయా ఆస్పత్రుల్లో చేదు అనుభవమే ఎదురవుతోంది. చికిత్సలు జరుగుతున్నప్పటికీ..వారికి ఉచితంగా అందాల్సిన మందులు మాత్రం ఇవ్వడం లేదు. అదేమంటే వీటి ఖరీదు ఎక్కువగా ఉందని, అందుకే వీటిని ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని సిబ్బంది స్పష్టం చేస్తున్నారు. ఆర్థిక స్థోమత ఉన్న రోగులు వీటిని సమకూర్చుకోగలిగినప్పటికీ..నిరుపేదలు మందులకు నోచుకోవడం లేదు. శస్త్రచికిత్సల అనంతర వైద్యం కోసం వస్తున్న రోగులకు మందులు అంద డం లేదు.అసలే పేదరికం ఆపై ఈ ఖరీదైన మందు లు కొనుగోలు చేసే స్థోమత లేక అనేక మంది ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నా పట్టించుకున్నవారు లేని దుస్థితి నెలకొంది. అటు ఈఎస్ఐ, మరో వైపు ప్రభుత్వ ఆరోగ్యశాఖ దీనిపై దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. -
సుస్తీమే సవాల్
ఏలూరు (సెంట్రల్) : ప్రజలు రోగాల బారిన పడటం మామూలే. కానీ.. ఆస్పత్రులే అనారోగ్యం పాలైతే..? జిల్లాలోని ఎంప్లాయూస్ స్టేట్ ఇన్సూరెన్స్ (ఈఎస్ఐ) డిస్పెన్సరీల పరిస్థితి అలాగే ఉంది. కార్మికుల ఆరోగ్యం కాపాడేందుకు ఏర్పాటు చేసిన కార్మికరాజ్య బీమా ఆస్పత్రులు (డిస్పెన్సరీలు) జబ్బుబారిన పడ్డాయి. రుగ్మతలతో ఏళ్ల తరబడి ఈసురోమని నడుస్తున్న ఈఎస్ఐ డిస్పెన్సరీలు రాష్ట్ర విభజన తర్వాత మరిన్ని కొత్త జబ్బులతో క్షీణదశకు చేరుకుంటున్నాయి. చివరకు కార్మికులకు రోత పుట్టించే దుస్థితికి దిగజారాయి. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో గల ఏ డిస్పెన్సరీ ఇందుకు మినహాయింపు కాదు. ఏమీ లేవు జిల్లాలోని ఈఎస్ఐ డిస్పెన్సరీలలో మందులు లేవు. వైద్యులు లేరు. వైద్య పరికరాలు సైతం లేవు. కనీస వసతులు లేవు. కానీ.. ప్రతి డిస్పెన్సరీ పరిధిలో రోగులు మాత్రం దండిగా ఉన్నారు. తలనొప్పి, దగ్గు, జ్వరం వంటి సాధారణ రుగ్మతలను తగ్గించే మందులు తప్ప ముఖ్యమైన మందులు అన్ని డిస్పెన్సరీల్లోనూ నిండుకున్నారుు. స్పెషల్ డ్రగ్స్‌గా పిలిచే ప్రత్యేక మందులైతే ఎక్కడా అందుబాటులో లేవు. మధుమేహం బాధితులకు ఇచ్చే ఇన్సులిన్, టాబ్లెట్స్, బీపీ మాత్రలు, ఉబ్బసం రోగులకు ఇచ్చే ఇన్హేలర్స్ వంటి ప్రత్యేక మందుల కొరతతో కార్మికులు పడుతున్న వెతలు వర్ణనాతీతంగా ఉన్నారుు. ‘సారీ.. గుణదల వెళ్లండి’ రెక్కాడితే కానీ డొక్కాడని కార్మికులు రోగాల బారిన పడితే అంతే సంగతులు. వారికి ఆ రోగం వల్ల వచ్చే బాధకన్నా వివిధ పత్రాలు, సంతకాలు, మందుల కోసం ఈఎస్ఐ డిస్పెన్సరీల చుట్టూ తిరిగే బాధే ఎక్కువగా ఉంటోంది. స్పెషల్ మెడిసిన్స్ అందుబాటులో లేని కారణంగా ఈఎస్ఐ ఆస్పత్రులకు వచ్చే రోగులను తొలుత గుణదల ఆస్పత్రికి పంపుతున్నారు. అక్కడి నుంచి జబ్బును బట్టి స్పెషలిస్టులు ఉన్న ఆస్పత్రులకు పంపుతున్నారు. అక్కడ వైద్యం చేయించుకున్న తర్వాత క్రమం తప్పకుండా వాడాల్సిన ఇన్సులిన్, టాబ్లెట్లు వగైరా మందులన్నీ అక్కడి నుంచే తెచ్చుకోమని చెబుతున్నారు. దీనివల్ల కార్మికులు తరచూ అక్కడకు వెళ్లి రావడానికి భారీగా ఖర్చవుతోంది. సమయం వృథా కావడంతోపాటు సకాలంలో వైద్యం అందడం లేదు. ఏ మందులూ లేనప్పుడు తాము మాత్రం డిస్పెన్సరీల్లో కూర్చోవడం ఎందుకనుకుంటున్నారో ఏమో కానీ... ఎక్కడ చూసినా వైద్యుల కుర్చీలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. వైద్యుల కోసం చూసీచూసీ కొత్త జబ్బులొచ్చేలా ఉన్నాయని రోగులు వాపోతున్నారు.