breaking news
South Karnataka
-
ఎట్టకేలకు 105 ఏళ్ల తల్లిని కలిసిన 85 ఏళ్ల కుమార్తె
కొన్ని సంఘటనలు అత్యంత విచిత్రంగా అబ్బురపరిచే విధంగా ఉంటాయి. సాధారణంగా తప్పిపోయిన కొన్నేళ్లకు అనుకోని విధంగా కలిసిన ఉదంతాలను చూసుంటాం. కానీ ఇలా ఇన్నేళ్లు ఒకరినొకరు చూసుకోకుండా ఉన్న అరుదైన ఘటనను చూసి ఉండరు. మహా అయితే ఐదు, ఆరేళ్లు దూరం ఉండొచ్చు కానీ ఈ తల్లి కూతుళ్లు ఎన్నేళ్లు ఒకరికొకరు సంబంధం లేకుండా బతికారో తెలిస్తే విస్తుపోతారు. ఈ అరుదైన ఘటన దక్షిణ కన్నడలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..105 ఏళ్ల సీతమ్మకు 11 మంది సంతానం. వారిలో పెద్ద కుమార్తె సుశీల తన అమ్మను కలుసుకోలేకపోతుంది. అది ఏకంగా ఎన్నేళ్లు వరకు అంటే..దాదాపుగా 20 ఏళ్ల పైగానే తల్లిని కలవలేకపోతుంది. ప్రధాన కారణం తన తల్లి సీతమ్మ దక్షిణ కన్నడ జిల్లాలోని బెళ్తంగడి తాలూకా సమీపంలోని మక్కీ అనే గ్రామంలో నివశిస్తోంది. అయితే ఆమె ఇంటికి వెళ్లే ప్రదేశం అటవీ మార్గం, పైగా అటు వైపు సరైన రహదారి లేకపోవడం, అందులోనూ కొండ దిగువున ఉండే ఆ గ్రామానికి వెళ్లాలంటే వాగు దాటాల్సిందే. ఆ నేపథ్యంలోనే సుశీల తన తల్లిని చాలా ఏళ్లపాటు కలుసుకోలేకపోతుంది. కాలం గడుస్తున్న కొద్దీ వారి దగ్గర ఒకరికి సంబంధిచి ఒకరికి పాత జ్ఞాపకాలే తప్ప రాకపోకలు లేక అమ్మను చూసుకునే భాగ్యం లేక తల్లిడిల్లిపోయింది సుశీలమ్మ. ఇక్కడ సుశీలమ్మ వయసు కూడా 85 ఏళ్ల కావడంతో వయసు రీత్యా వచ్చే సమస్యల వల్ల ఆ అమ్మ కూతుళ్ల మధ్య రాకపోకలు దశాబ్దంగా నిలిచిపోయాయి. మనవళ్ల చొరవతో.. నెరవేరిన చిరకాల కోరిక!తమ అమ్మమ్మ చిరకాల కోరికను నెరవేర్చాలని నిశ్చయించుకున్నారు సుశీల మనవళ్లు. వారి చొరవతో సుశీల మక్కికి చేరుకునే అటవీ మార్గం గుండా జీపులో ప్రయాణించింది అయితే జీపు నేరుగా ఇంటి వరకు వెళ్లలేకపోయింది. చేసేది లేక అటవీ మార్గం గుండా సుశీలమ్మను ఓ చిన్నపిల్లను పట్టుకున్నట్లుగా పొదివి పట్టుకుని తీసుకెళ్లారు ఆమె మనవళ్లు. ఆ కష్టమైన ప్రయాణం తదనంతరం ఎట్టకేలకు తల్లిని కలుసుకుని సంభ్రమాశ్చర్యాలకు లోనైంది సుశీల. రెండు దశాబ్దాల తర్వాత తన తల్లి సీతమ్మను కలుసుకున్న ఆనందంతో ఉబ్బితబ్బిబైంది సులశీలమ్మ. తాము ఎన్నాళ్ల నుంచో అమ్మమ్మను తన అమ్మ దగ్గరకు తీసుకెళ్లాలని చాలాసార్లు అనుకున్నాం కానీ, ఆమెకు వయసురీత్యా ఉన్న సమస్యల వల్లే ఇన్నేళ్లూ అది వీలు కాలేదని, చివరకు ఇన్నళ్ల తర్వాత తన అమ్మమ్మ, ముత్తవ్వను కలవగలిగిందని ఆనందంగా చెబుతున్నారు సుశీలమ్మ మనవళ్లు. ఇదీ చదవండి: ఈజిప్ట్ పిరమిడ్ల వద్ద వివాహం చేసుకున్న భారత సంతతి జంట! -
జనం మెచ్చిన రైతుబిడ్డ
సమస్య...కష్టం అనుకుంటే కష్టమే మిగులుతుంది. సమస్య....ఒక బడి అనుకుంటే పాఠం వినబడుతుంది. పరిష్కారం పది విధాలుగా కనిపిస్తుంది. పదిహేను సంవత్సరాల నేహా భట్ ఎకో–ఫ్రెండ్లీ అగ్రి స్ప్రేయర్‌కు రూపకల్పన చేసి శభాష్ అనిపించుకుంది... ఒక్కసారి పంట వేస్తే దీర్ఘకాలం దిగుబడి ఇచ్చే వక్కతోటను సాగు చేసే రైతులు కర్ణాటక రాష్ట్రం లో ఎక్కువగానే ఉన్నారు. అయితే పంటసంరక్షణలో భాగంగా ‘బోర్డో’లాంటి రసాయనాలను స్ప్రే చేస్తున్నప్పుడు కళ్లు మండడంతో పాటు చర్మ, శ్వాససంబంధమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు చాలామంది రైతులు. ‘పెరికో’ అనే నిక్‌నేమ్‌తో పిలుచుకునే ‘బోర్డో’ వల్ల శరీరం నీలిరంగులోకి మారుతుంది. చనిపోయిన రైతులు కూడా ఉన్నారు. ఈ సమస్యకు ఎకో–ఫ్రెండ్లీ అగ్రిస్ప్రేయర్తో పరిష్కారం కనిపెట్టింది దక్షిణ కర్ణాటకలోని పుట్టూరుకు చెందిన నేహాభట్. నేహా తాత నుంచి తండ్రి వరకు ‘స్ప్రే’ పుణ్యమా అని ఆరోగ్యపరంగా సమస్యలను ఎదుర్కున్నవారే. సమస్య గురించి తెలుసుగానీ పరిష్కారం మాత్రం కనిపించలేదు పదమూడు సంవత్సరాల నేహాకు. రెండు సంవత్సరాల తరువాత ఒక కార్యక్రమంలో పాల్గొనే అవకాశం వచ్చింది. 14 నుంచి 19 సంవత్సరాల వయసు మధ్య ఉన్న విద్యార్థుల కోసం నాలుగు రాష్ట్రాల్లో ఎన్ ఎక్స్ప్లోర్స్(గ్లోబల్ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ ప్రోగ్రాం) నిర్వహించే కార్యక్రమం అది. మన దైనందిన జీవిత సమస్యలకు సృజనాత్మకమైన పరిష్కార మార్గాలు అన్వేషించడం ఈ కార్యక్రమ లక్ష్యం. అదృష్టవశాత్తు దీనిలో నేహాభట్కు పాల్గొనే అవకాశం వచ్చింది. ఎకో ఫ్రెండ్లీ అగ్రి స్ప్రేయర్ ‘సమస్య గురించి తెలిసినా పరిష్కారం తోచని పరిస్థితిలో ఎన్ఎక్స్ప్లోర్స్ ఒక దారి చూపింది’ అంటుంది పదిహేను సంవత్సరాల నేహా. ఎప్పటి నుంచో వాడుకలో ఉన్న గాటర్ పంప్‌కు మూడు స్ప్రేయర్ ఔట్లెట్లను అమర్చడంలాంటి మార్పులతో ఆధునీకరించి సరికొత్త ఆటోమేటెడ్ అగ్రి స్ప్రేయర్‌కు రూపకల్పన చేసింది. దీనికి పెద్దగా నిర్వహణ ఖర్చు అవసరం లేదు. తక్కువ ఇంధనంతో నడపవచ్చు. శబ్దసమస్య ఉండదు. టైమ్ వృథా కాదు. ఈ యంత్రాన్ని ఉపయోగించడంలో మానవప్రమేయాన్ని తగ్గించడం వల్ల ఆరోగ్య సమస్యలు ఎదురుకావు. దీన్ని ఒకసారి ఛార్జ్ చేస్తే అయిదు గంటల పాటు పని చేస్తుంది. ఈ అగ్రిస్ప్రేయర్ను మరింత ఆధునీకరించి పూర్తిగా సౌరశక్తితో పనిచేసే దిశగా ప్రయోగాలు చేస్తుంది నేహా భట్. ఈ స్ప్రేయర్‌కు రూపకల్పన చేసే ప్రయత్నంలో తండ్రి, రైతులు, ఉపాధ్యాయుల నుంచి విలువైన సలహాలు తీసుకుంది. వారందరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది. ఎకోఫ్రెండ్లీ అగ్రి స్ప్రేయర్‌కు జాతీయస్థాయిలో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రీయల్ రిసెర్చ్ (సీఎస్ఐఆర్) అవార్డ్ అందుకుంది. ‘ప్రతి రైతు ఆటోమేటెడ్ అగ్రిస్ప్రేయర్ ఉపయోగించాలి అనేది నా కోరిక’ అంటోంది నేహా. రసాయన వ్యర్థాలు, భారలోహాలతో కూడిన నీరు పొలాల్లో పారకుండా ఒక మార్గాన్ని కనిపెట్టింది నేహా. స్థానికంగా ఎక్కువగా కనిపించే ఒక రకం మొక్కను పొలం గట్లలో నాటుతారు. ఆ మొక్క విషకారకాలను పీల్చుకొని నీటిని శుద్ధి చేస్తుంది. చక్కని కంఠంతో పాటలు పాడే నేహా బొమ్మలు గీస్తుంది. రకరకాల ఆటలు ఆడుతుంది. పుస్తకాలు చదువుతుంది. సైన్స్ ఆమె అనురక్తి, పాషన్. సామాన్యులు ఎదుర్కొనే సమస్యలకు శాస్త్రీయ పరిష్కారాలు కనిపెట్టాలనేది ఆమె కల. కల అంటూ కంటే ఫలితం చేరువ కావడం ఎంతసేపని! -
‘కేఆర్ఎస్’ ఇక శత్రుదుర్బేధ్యం
సాక్షి, బెంగళూరు : దక్షిణ కర్ణాటకలోని చాలా భాగాలకు సాగు, తాగునీరు అందించే కృష్ణరాజసాగర డ్యాం (కేఆర్ఎస్) ఇక శత్రుదుర్బేధ్యం కానుంది. ఈ కట్టడానికి ప్రత్యేక శిక్షణ పొందిన అధికారులతో పహారా పాటు నిఘా కోసం అత్యాధునిక సీసీ కెమరాలు వినియోగించనున్నారు. రాష్ట్రంలో ఇటీవల ఉగ్రవాదుల కార్యకలాపాలు పెరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగానికి ముష్కరులు రాష్ట్రంలోని చారిత్రాత్మక కట్టడాలతో పాటు ముఖ్యమైన ఆనకట్టలపై కూడా దృష్టి పెట్టినట్లు సమాచారం అందింది. ఈ క్రమంలో కృష్ణసాగర డ్యాం భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టినిసారించింది. అందులో భాగంగా డ్యాం ముఖ్యమైన భాగాలతో పాటు కాలువలపై కూడా 360 డిగ్రీల కోణంలో తిరిగి ఇరవై నాలుగు గంటలూ పనిచేసే 60 సీసీ కెమరాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ కెమరాల్లో ఉన్న అత్యాధుని సాంకేతిక పరిజ్ఞానం వల్ల రాత్రివేళలో కూడా డ్యాం చుట్టపక్కల ఉన్న మనిషిని స్పష్టంగా వీడియో తీయడానికి వీలవుతుంది. అంతేకాకుండా సీసీ కెమరాల ఫుటేజీలను కనీసం మూడేళ్లపాటు భద్రపరిచే ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం బెంగళూరులో ఓ రహస్య ప్రాంతంలోని భూ గృహంలో డాటాబేస్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఆనకట్ట ఉత్తర దక్షిణ ప్రాంతాల్లోని ప్రవేశ ద్వారాల వద్ద అత్యాధునిక ‘బూమ్ బ్యారియర’్లను ఏర్పాటు చేయనున్నారు. ఇవి భద్రతా సిబ్బంది ‘కనుపాప’ల ఆధారంగా పనిచేస్తాయి. అంతేకాకుండా వీటి తయారీలో వాడే ప్రత్యేక లోహాల వల్ల గంటకు సుమారు వందకిలోమీటర్ల వేగంతో వ చ్చి ఢీ కొట్టినా విరిగిపోవు. దేశంలోనే కాక అంతర్జాతీయంగా కూడా ఉత్తమ రక్షణ దళాలుగా పేరొందిన ‘నేషనల్ సెక్యూరిటీ గార్’్డ (ఎన్ఎస్జీ)తో ఇక్కడి భద్రతా సిబ్బందికి కఠిన శిక్షణ ఇప్పించనున్నారు. ఇలా ప్రతి విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ వ హించనున్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఏర్పాటుకు సుమారు రూ.5 కోట్లు ఖర్చవుతుందని, మానవ వనరుల శిక్షణ కోసం మరో అరకోటిదాకా వెచ్చించాల్సి ఉంటుందని ప్రభుత్వం ప్రాథమిక అంచనాకు వచ్చింది. ఈమేరకు రూపొందించిన నివేదికను కేంద్రప్రభుత్వ అనుమతి కోసం పంపినట్లు విధానసౌధ వర్గాలు చెబుతున్నాయి. కేంద్రం కూడా ఇందుకు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది.


