జనం మెచ్చిన రైతుబిడ్డ

Neha bhat Developed Eco Friendly Agriculture Sprayer - Sakshi

యంగ్‌ టాలెంట్‌

సమస్య...కష్టం అనుకుంటే కష్టమే మిగులుతుంది. సమస్య....ఒక బడి అనుకుంటే పాఠం వినబడుతుంది. పరిష్కారం పది విధాలుగా కనిపిస్తుంది. పదిహేను సంవత్సరాల నేహా భట్‌ ఎకో–ఫ్రెండ్లీ అగ్రి స్ప్రేయర్‌కు రూపకల్పన చేసి శభాష్‌ అనిపించుకుంది...

ఒక్కసారి పంట వేస్తే దీర్ఘకాలం దిగుబడి ఇచ్చే వక్కతోటను సాగు చేసే రైతులు కర్ణాటక రాష్ట్రం లో ఎక్కువగానే ఉన్నారు. అయితే పంటసంరక్షణలో భాగంగా ‘బోర్డో’లాంటి రసాయనాలను స్ప్రే చేస్తున్నప్పుడు కళ్లు మండడంతో పాటు చర్మ, శ్వాససంబంధమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు చాలామంది రైతులు. ‘పెరికో’ అనే నిక్‌నేమ్‌తో పిలుచుకునే ‘బోర్డో’ వల్ల శరీరం నీలిరంగులోకి మారుతుంది. చనిపోయిన రైతులు కూడా ఉన్నారు. ఈ సమస్యకు ఎకో–ఫ్రెండ్లీ అగ్రిస్ప్రేయర్‌తో పరిష్కారం కనిపెట్టింది దక్షిణ కర్ణాటకలోని పుట్టూరుకు చెందిన  నేహాభట్‌.

నేహా తాత నుంచి తండ్రి వరకు ‘స్ప్రే’ పుణ్యమా అని ఆరోగ్యపరంగా సమస్యలను ఎదుర్కున్నవారే. సమస్య గురించి తెలుసుగానీ పరిష్కారం మాత్రం కనిపించలేదు పదమూడు సంవత్సరాల నేహాకు. రెండు సంవత్సరాల తరువాత ఒక కార్యక్రమంలో పాల్గొనే అవకాశం వచ్చింది. 14 నుంచి 19 సంవత్సరాల వయసు మధ్య ఉన్న విద్యార్థుల కోసం నాలుగు రాష్ట్రాల్లో ఎన్‌ ఎక్స్‌ప్లోర్స్‌(గ్లోబల్‌ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్‌ అండ్‌ మ్యాథమెటిక్స్‌ ప్రోగ్రాం) నిర్వహించే కార్యక్రమం అది. మన దైనందిన జీవిత సమస్యలకు సృజనాత్మకమైన పరిష్కార మార్గాలు అన్వేషించడం ఈ కార్యక్రమ లక్ష్యం. అదృష్టవశాత్తు దీనిలో నేహాభట్‌కు పాల్గొనే అవకాశం వచ్చింది.


ఎకో ఫ్రెండ్లీ అగ్రి స్ప్రేయర్‌ 

‘సమస్య గురించి తెలిసినా పరిష్కారం తోచని పరిస్థితిలో ఎన్‌ఎక్స్‌ప్లోర్స్‌ ఒక దారి చూపింది’ అంటుంది పదిహేను సంవత్సరాల నేహా. ఎప్పటి నుంచో వాడుకలో ఉన్న గాటర్‌ పంప్‌కు మూడు స్ప్రేయర్‌ ఔట్‌లెట్‌లను అమర్చడంలాంటి మార్పులతో ఆధునీకరించి సరికొత్త ఆటోమేటెడ్‌ అగ్రి స్ప్రేయర్‌కు రూపకల్పన చేసింది. దీనికి పెద్దగా నిర్వహణ ఖర్చు అవసరం లేదు. తక్కువ ఇంధనంతో నడపవచ్చు. శబ్దసమస్య ఉండదు. టైమ్‌ వృథా కాదు. ఈ యంత్రాన్ని ఉపయోగించడంలో మానవప్రమేయాన్ని తగ్గించడం వల్ల ఆరోగ్య సమస్యలు ఎదురుకావు.

 దీన్ని ఒకసారి ఛార్జ్‌ చేస్తే అయిదు గంటల పాటు పని చేస్తుంది. ఈ అగ్రిస్ప్రేయర్‌ను మరింత ఆధునీకరించి పూర్తిగా సౌరశక్తితో పనిచేసే దిశగా ప్రయోగాలు చేస్తుంది నేహా భట్‌. ఈ స్ప్రేయర్‌కు రూపకల్పన చేసే ప్రయత్నంలో తండ్రి, రైతులు, ఉపాధ్యాయుల నుంచి విలువైన సలహాలు తీసుకుంది. వారందరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది. ఎకోఫ్రెండ్లీ అగ్రి స్ప్రేయర్‌కు జాతీయస్థాయిలో కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రీయల్‌ రిసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌) అవార్డ్‌ అందుకుంది. ‘ప్రతి రైతు ఆటోమేటెడ్‌ అగ్రిస్ప్రేయర్‌ ఉపయోగించాలి అనేది నా కోరిక’ అంటోంది నేహా.

రసాయన వ్యర్థాలు, భారలోహాలతో కూడిన నీరు పొలాల్లో పారకుండా ఒక మార్గాన్ని కనిపెట్టింది నేహా. స్థానికంగా ఎక్కువగా కనిపించే ఒక రకం మొక్కను పొలం గట్లలో నాటుతారు. ఆ మొక్క విషకారకాలను పీల్చుకొని నీటిని శుద్ధి చేస్తుంది. చక్కని కంఠంతో పాటలు పాడే నేహా బొమ్మలు గీస్తుంది. రకరకాల ఆటలు ఆడుతుంది. పుస్తకాలు చదువుతుంది. సైన్స్‌ ఆమె అనురక్తి, పాషన్‌. సామాన్యులు ఎదుర్కొనే సమస్యలకు శాస్త్రీయ పరిష్కారాలు కనిపెట్టాలనేది ఆమె కల. కల అంటూ కంటే ఫలితం చేరువ కావడం ఎంతసేపని!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top