south indian ocean
-
అభిలాష్‌ను కాపాడారు
న్యూఢిల్లీ: గోల్డెన్ గ్లోబ్ రేస్‌లో భాగంగా ఒంటరిగా ప్రపంచ యానం చేస్తూ హిందూమహా సముద్రంలో ప్రమాదానికి గురైన కేరళకు చెందిన నేవీ కమాండర్ అభిలాష్ టామీ(39)ను విజయవంతంగా రక్షించారు. ఆస్ట్రేలియాలోని పెర్త్‌కు 1,900 నాటికల్ మైళ్ల దూరంలో ప్రమాదంలో చిక్కుకున్న ఆయన్ను రక్షించేందుకు భారత్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. సోమవారం అభిలాష్ పడవ ‘తురయా’ వద్దకు చేరుకున్న ఫ్రెంచి మత్స్యకార పడవ ‘ఒసిరిస్’ సిబ్బంది ఆయన్ను రక్షించింది. ఈ విషయం తెలిసి తాము టెన్షన్ నుంచి బయటపడ్డామని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ‘ఆయన ప్రస్తుతం క్షేమంగా ఉన్నారు. ఒసిరిస్లో దగ్గర్లోని ఇల్ ఆమ్స్టర్డాం దీవికి, అక్కడి నుంచి ‘ఐఎన్ఎస్ సాత్పురా’లో మారిషస్ తీసుకువచ్చి, అవసరమైన వైద్య చికిత్సలు చేయిస్తాం’ అని మంత్రి ట్విటర్లో పేర్కొన్నారు. -
ఎం హెచ్ 370 - ఇన్నాళ్లకి దర్యాప్తుకు ఆదేశించిన మలేషియా
మలేషియన్ విమానం తప్పుదారి పట్టగానే దాని కోసం వెతకడంలో ఆలస్యం ఎందుకు జరిగింది? దారి మారగానే ఆ విమానం ఎటువెళ్తుందో ఎందుకు గమనించలేదు? దీనికి బాధ్యులెవరు? పౌర విమానయాన రంగం తప్పు ఎంత? మిలటరీ విభాగం తప్పు ఎంత? ఇప్పుడు మలేషియా ప్రభుత్వం ఈ విషయంపై దర్యాప్తుకు ఆదేశించింది. సంఘటన వెనువెంటనే అధికారులు, వివిధ విభాగాలు స్పందించిన తీరుపై దర్యాప్తు మొదలైంది. అయితే దర్యాప్తునకు ఆదేశించినట్టు ప్రభుత్వం ధ్రువీకరించడం లేదు. ఏ విభాగం దర్యాప్తు చేస్తుంది, దర్యాప్తు దళానికి నాయకుడెవరు అన్న విషయంపై కూడా ఇప్పటి వరకూ స్పష్టత లేదు. మలేషియన్ విపక్ష పార్టీలు కూడా ప్రభుత్వ వ్యవహార శైలిపై విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే బ్లాక్ బాక్స్ దొరికితే తప్ప దర్యాప్తునకు అర్ధం లేదని నిపుణులు అంటున్నారు. 239 మంది ప్రయాణిస్తున్న మలేషియన్ ఎయిర్ లైన్స్ కి చెందిన బోయింగ్ 777 గత మార్చి 8 న దక్షిణ హిందూ మహాసముద్రంలో కుప్పకూలిపోయింది. అయితే విమానం శకలాలు ఇప్పటి వరకూ దొరకలేదు. ఇంకో వైపు మలేషియన్ విమానం కోపైలట్ విమానం కుప్పకూలడానికి కొన్ని నిమిషాల ముందు ఒక అర్జంట్ ఫోన్ కాల్ తన సెల్ నుంచి చేశాడని, అయితే సెల్ కనెక్టివిటీ లభ్యత లేకపోవడం వల్ల కాల్ కనెక్ట్ కాలేదని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విమానంలో ఏదో అసాధారణ పరిస్థితి ఉందని గమనించి, ఆయన ఫోన్ చేయడానికి ప్రయత్నించారా అన్నది తేలడం లేదు. ఈ దర్యాప్తులో ఈ విషయాలన్నీ వెలుగులోకి రావాలంటే బ్లాక్ బాక్స్ దొరకడం చాలా అవసరం అంటున్నారు నిపుణులు. -
విమానం కోసం వెతుకులాట ఏడాదైనా పట్టొచ్చు
దక్షిణ హిందూ మహాసముద్రం లో ఆస్ట్రేలియాకి వెయ్యి కి.మీ దూరంలో సముద్రం అడుగున రెండు మైళ్ల లోతున....కనిపించని మలేషియన్ విమానం కోసం, కనుమరుగైన 239 మంది ప్రయాణికుల కోసం ప్రపంచం ఇప్పుడు వెతుకుతోంది. విమానం ఇక్కడే కూలిందా అంటే ఎవరు చెప్పలేకపోతున్నారు. ఈ ప్రాంతంలో సముద్రం పైన తేలాడుతున్న ఎన్నో వస్తువులను పడవలు సేకరించాయి. కానీ అవేవీ విమాన శకలాలు కావు. సముద్ర గర్భాన్ని వడకట్టి, జల్లెడపట్టే శాస్త్రవేత్తలు చెబుతున్న దాని ప్రకారం ఈ ప్రాంతం వైశాల్యం దాదాపు 319 వేల చకిమీ. అంటే పోలండ్ దేశంతో సమానం. అదృష్ట వశాత్తూ ఈ ప్రాంతంలో సముద్రం అట్టడుగుభాగం చదునుగా, పెద్దగా ఎగుడు దిగుళ్లు లేకుండా ఉంటుంది. మధ్యలో ఒక ప్రాంతం మాత్రం కాస్త పగులు ఉన్నట్టుగా ఉంటుంది. దీన్ని డయామాంటినా ట్రెంచ్ అంటారు. అయితే సముద్రం అట్టడుగున చనిపోయిన ప్లాంక్టన్ జాతి ప్రాణులు ఒక కిలో మీటర్ వరకూ ఒక తివాచీలాగా పరుచుకుని ఉంటాయి. ఈ ట్రెంచ్, ప్లాంక్టన్ల వల్ల శకలాలను గుర్తించే పరికరాలకు అట్టడుగు నుంచి సిగ్నల్స్ అందడంలో ఇబ్బందిగా ఉంది. ఇంత సువిశాల ప్రాంతంలో కూలిన విమానపు బ్లాక్ బాక్స్ కోసం వెతకడం అంటే గడ్డివాములో సూది వెతకడం లాంటిదేనంటున్నారు నిపుణులు. అందుకే శాస్త్రవేత్తలు ఈ విమానం కోసం అన్వేషణ ఏడాదిపాటు కొనసాగినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. మొత్తం మీద ఎం హెచ్ 370 విమానం ఒక అద్భుత మిస్టరీగా మిగిలిపోయే అవకాశాలే ఎక్కువని వారంటున్నారు. -
వీడిన మలేషియా విమానం మిస్టరీ
-
వీడిన మలేషియా విమానం మిస్టరీ
కౌలాలంపూర్ : గత కొన్నిరోజులుగా ఉత్కంఠం రేపిన మలేషియన్ విమానం అదృశ్యం మిస్టరీ వీడింది. గాల్లో ప్రయాణించిన కొద్ది సేపటికే ఆ విమానం కూలినట్లు తాజాగా మలేషియన్ ప్రధాని నజీబ్ రజాక్ ప్రకటించారు. హిందూ మహా సముద్రానికి నైరుతి దిశగా 2500 కిలోమీటర్లు దూరంలో శకలాలు లభించడంతో విమానం కూలినట్లు నిర్దారించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన నజీబ్.. విమాన ఘటనకు సంబంధించిన వివరాలను రేపు ప్రకటిస్తామన్నారు. అత్యధునిక సాంకేతిక పరిజ్ఞానం కల్గిన బ్రిటన్ ఉపగ్రహం అందజేసిన ఛాయాచిత్రాల ఆధారంగా చర్యలు చేపట్టిన ఆస్ట్రేలియా ఆ విమాన శకలాలను కనుగొంది. దక్షిణ హిందూ మహాసముద్రంలో తాము ఓ చెక్క కార్గో ప్యాలెట్‌ను గుర్తించిన అనంతరం విమాన ఘటనపై తుది నిర్దారణకు వచ్చారు. ఉపగ్రహం గుర్తించిన శిథిలాల వద్దకు ఆస్ట్రేలియన్ షిప్ వెళ్లడంతో ఈ విషాదాంత ఉదంతానికి తెరపడింది. ఇప్పటి వరకూ మలేషియా విమానం అదృశ్యంపై రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తూనే ఉన్నాయి. 16 రోజుల క్రితం కౌలాంపూర్ నుంచి బీజింగ్ కు 239 మంది ప్రయాణికులతో బయలుదేరిన మలేషియన్ విమానం దక్షిణ చైనా సముద్రం మీదుగా మలుపు తీసుకుందని సైనిక రాడార్ సిగ్నళ్ల ద్వారా తెలిసింది. అదృశ్యం అయిపోవడానికి ముందు సముద్ర మట్టానికి కేవలం 12వేల అడుగుల ఎత్తున మాత్రమే అది పయనించిందని, విమానం ఆ మలుపు తీసుకోడానికి సుమారు రెండు నిమిషాల సమయం పట్టి ఉండొచ్చని భావిస్తున్నారు. అప్పుడే ప్రమాదం సంభవించి, పైలట్ లేదా కో పైలట్ ప్రమాద సంకేతాలు పంపి ఉండొచ్చని అంటున్నారు. ఈ క్రమంలోనే విమానం కూలిపోయి ఉంటుందని భావిస్తున్నారు. -
హిందూ మహాసముద్రంలో విమాన శకలాలు?
దక్షిణ హిందూ మహాసముద్రంలో మలేషియన్ విమానానికి సంబంధించిన శకలాల్లాంటి వస్తువులను చైనా విమానాలు గుర్తించాయి. దాంతో ఒక్కసారిగా మళ్లీ దాని గాలింపు చర్యలు ముమ్మరమయ్యాయి. తెల్లగా, నలుచదరంగా ఉన్న కొన్ని శకలాలను చైనాకు చెందిన ఇల్యుషిన్-76 గాలింపు విమానం గుర్తించింది. ఇవి బహుశా మలేషియా విమానం ఎంహెచ్ 370కి చెందినవేనని భావిస్తున్నారు. 95.1113 డిగ్రీల తూర్పు, 42.5453 దక్షిణంగా ఈ విమాన శకలాలు ఉన్నట్లు చైనాకు చెందిన ఐస్ బ్రేకర్ జుయెలాంగ్ నుంచి సమాచారం అందినట్లు చైనా అధికారిక వార్తా సంస్థ సిన్హువా తెలిపింది. ఎంహెచ్ 370 విమానం గాలింపు చర్యల్లో పది విమానాలు ఉన్నట్లు ఆస్ట్రేలియన్ మారిటైం సేఫ్టీ అథారిటీ తెలిపింది. (విమానం ఆచూకీపై మరిన్ని ఆధారాలు) ఉదయం 8.45, 9.20 గంటల సమయంలో రెండు చైనా సైనిక విమానాలు బయల్దేరాయి. విమాన శకలాలు ఇవేనంటూ ఫ్రాన్సు కొత్తగా ఉపగ్రహ ఛాయాచిత్రాలు అందించడంతో ఆ దిశగా కూడా ప్రయత్నాలు చేశారు. దక్షిణ హిందూ మహాసముద్రంలో తాము ఓ చెక్క కార్గో ప్యాలెట్‌ను గుర్తించినట్లు ఆస్ట్రేలియా చెప్పింది. (మలుపు తర్వాతే పడిపోయిన మలేషియా విమానం) దీంతో ఫ్రెంచి ఉపగ్రహం ఇచ్చినది ఈ విమానానికి సంబంధించిన సమాచారం కాదని స్పష్టమైంది. ప్రస్తుతం విమానం కోసం గాలిస్తున్న ప్రదేశానికి అది 850 కిలోమీటర్ల దూరంలో ఉందని ఆస్ట్రేలియా ఉప ప్రధాని వారెన్ ట్రస్ చెప్పారు. ఏ చిన్న సమాచారం దొరికినా వెంటనే అందులో నిజానిజాలను పూర్తిగా నిర్ధారించుకుంటున్నామని, దానివల్ల తమ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేస్తామని ఆయన అన్నారు.