breaking news
Son shoots father
-
బిడ్డ వేదనను చూడ లేక.. విషపు ఇంజెక్షన్ ఇచ్చి..
సాక్షి, చెన్నై: కేన్సర్‌తో తన కుమారుడు అనుభవిస్తున్న నరకయాతనను చూడలేక ఓ తండ్రి కారుణ్య హత్యకు పాల్పడ్డాడు. బంధువు సాయంతో తన కుమారుడికి విషం ఇంజెక్షన్ ఇచ్చి హతమార్చాడు. సేలంలో సోమవారం ఈ ఘటన వెలుగు చూసింది. సేలం జిల్లా ఎడపాడి సమీపంలోని కొంగనాపురం కరుసవల్లి గ్రామానికి చెందిన పెరియ స్వామి లారీ డ్రైవర్. ఆయనకు వన్నతమిళ్(14) కుమారుడు ఉన్నాడు. గత ఏడాది వన్న తమిళ్ కూడి వైపు కాలిలో ఓ కణితి బయట పడింది. వైద్యులు దీన్ని కేన్సర్ గడ్డగా తేల్చారు. దీనికి కోయంబత్తూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కొద్ది రోజుల పాటు చికిత్స అందించారు. ఆ తదుపరి తరచూ చికిత్సకు తీసుకెళ్తూ వస్తున్నారు. వైద్య ఖర్చులు భారం కావడమే కాకుండా, కేన్సర్ క్రమంగా శరీరం అంతా వ్యాపించడం, ఆ కణితి భాగం చీము పట్టడంతో వన్నతమిళ్ పడుతున్న నరకాన్ని చూసి ఆ తండ్రి తట్టుకోలేక పోయాడు. ఆ వేదన నుంచి కుమారుడికి విముక్తి కల్గించేందుకు నిర్ణయించారు. ఓ ల్యాబ్‌లో పనిచేస్తున్న సమీప బంధువు ప్రభు సాయం తీసుకున్నాడు. విషం ఇంజెక్షన్ ద్వారా కారుణ్య హత్యకు సిద్ధం అయ్యారు. ముందుగా నిర్ణయించుకున్న మేరకు ఆదివారం రాత్రి ఆ టీకాను ఆ బాలుడికి వేశారు. నిద్రలోనే ఆ బాలుడు మరణించాడు. సోమవారం ఉదయాన్నే కేన్సర్ కారణంగా మరణించినట్టు ఇరుగు పొరుగు వారిని నమ్మించారు. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేపట్టారు. అయితే, పోలీసులకు ఆ బాలుడిని కారుణ హత్య చేసినట్టుగా గుర్తు తెలియని వ్యక్తులు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు బాలుడి మృత దేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఆ బాలుడి తండ్రి, బంధువును అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. -
తన భార్యను వేధిస్తున్నాడని..
కాన్పూర్: తన భార్యను వేధిస్తున్నాడని తండ్రిపై కొడుకు తుపాకీతో కాల్పులు జరిపిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఫరూఖాబాద్ జిల్లాలో కలకలం రేపింది. శంషాబాద్ పోలీసు స్టేషన్ లోని పరిధిలోని ఇదంపూర్ తామరాయ్ ప్రాంతంలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. నిరంతరం తన భార్యను లైంగికంగా వేధిస్తున్నాడన్న ఆగ్రహంతో అమిత్(28) తన తండ్రి రతిరామ్(50)పై కాల్పులు జరిపాడని పోలీసులు తెలిపారు. మద్యం మత్తులో కోడలి పట్ల రతిరామ్ అసభ్యంగా ప్రవర్తించడంతో అమిత్ నాటు తుపాకీతో కాల్పులు జరిపినట్టు వెల్లడించారు. తీవ్రంగా గాయపడిన రతిరామ్ ను ఖయామ్ గంజ్ కమ్యునిటీ ఆస్పత్రికి తరలించారు. తర్వాత అతడిని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. అమిత్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అమిత్ తమ్ముడు అనుజ్ ఫిర్యాదు మేరకు శంషాబాద్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేశారు. అమిత్ ను జైలుకు తరలించారు.