breaking news
Somnath mahadev
-
ఇక అన్యమతస్థులను నేరుగా అనుమతించరు!
-
ఇక అన్యమతస్థులను నేరుగా అనుమతించరు!
అహ్మదాబాద్: సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ట్రస్టీగా కొనసాగుతున్న భారత పశ్చిమ కోస్తా తీరంలోవున్న చారిత్రక సోమనాథ్ మహాదేవ్ ఆలయంలోనికి ఇక హిందూయేతర మతస్థులను నేరుగా అనుమతించరు. దేశంలోని 12 ఆది జ్యోతిర్లింగాల్లో మొదటి లింగేశ్వరాలయంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయాన్ని ఇతర మతస్థులు సందర్శించాలంటే ముందుగా ఆలయం జనరల్ మేనేజర్ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు ఆలయం ప్రవేశ ద్వారం వద్ద శ్రీ సోమ్నాథ్ ట్రస్టు బోర్డు పేరిట ఓ నోటీసు ప్రత్యక్షమైంది. మోదీ ట్రస్టీగా ఉన్న ఈ ఆలయం ట్రస్టీ చైర్మన్గా గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కేషూభాయ్ పటేల్ కొనసాగుతున్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక హిందుత్వ శక్తుల ఒత్తిడి మేరకు హిందూ ఆలయాల్లో ఇలాంటి ఆంక్షలు చోటుచేసుకుంటున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పూరి జగన్నాథ ఆలయాన్ని ఇతర మతస్థుల సందర్శనపై ఆంక్షలున్నప్పుడు సోమ్నాథ్ ఆలయంలో ఆంక్షలు ఉంటే తప్పేమిటని ఆలయం జనరల్ మేనేజర్ విజయ్సింహ్ చావడా వాదిస్తున్నారు. బీజేపీ అలనాటి అగ్రనేత ఎల్కే అద్వానీ 1991లో ఈ ఆలయం నుంచే ఆయోధ్య రథయాత్రను ప్రారంభించారు. అది బాబ్రీ మసీదు విధ్వంసానికి, దేశంలో మత కల్లోలాకు దారితీసిన విషయం తెల్సిందే. మొహమ్మద్ ఘజనీ సోమ్నాథ్ ఆలయంపై 17 సార్లు దండయాత్ర జరిపినట్లు చారిత్రక ఆధారాలున్న నేపథ్యంలో అద్వానీ తన రథయాత్ర ఆందోళనకు ఈ ఆలయాన్ని ఎంపిక చేసుకున్నారు.