breaking news
Soil illegal danda
-
ఆ నాయకుడి అండతో అక్రమ వ్యాపారానికి తెరలేపారు!
అక్రమాల్లో ఆరితేరిన కొందరు... దొరికింది దొరికినంత దోచుకునే పనిలో పడ్డారు. ‘కబ్జాకు కాదేది అనర్హం’ అన్న చందంగా కుంటలు, మట్టి గుట్టలను సైతం వదలకుండా వాటిని గుల్ల చేస్తున్నారు. కనిపించిన కుంటలు.. మట్టిగుట్టల వద్ద యంత్రాలు పెట్టి మరీ అందులో నుంచి మట్టిని తోడేస్తున్నారు. ఆ మట్టిని ఇళ్ల నిర్మాణాలు, వెంచర్ల ఏర్పాటుకు తరలిస్తూ జేబులు నింపుకొంటున్నారు. కుంటలు పెద్ద పెద్ద గుంతలుగా ఏర్పడుతున్నా.. మట్టిగుట్టలు కళ్లముందే కరిగిపోతోన్నా రెవెన్యూ అధికారులు మాత్రం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాక్షి, మహబూబ్‌నగర్: భూత్పూర్ మండలంలో జోరుగా సాగుతోన్న ఈ మట్టిదందా అక్రమార్కులపై కాసుల వర్షం కురిపిస్తోంది. ఐదేళ్ల కాలంలో నాలుగు మట్టిగుట్టలను దశల వారీగా తవ్వి అక్రమార్కులు మట్టిని భారీ మొత్తంలో తరలించారు. అధికారుల కంటపడకుండా గుట్టు చప్పుడుగా రాత్రి వేళల్లో, సెలవు దినాల్లో గుట్టలను తవ్వి మట్టిని తరలిస్తున్నారు. మండలంలోని అమిస్తాపూర్, శేరిపల్లి (హెచ్), కొత్త మొల్గర గ్రామాలపై కన్నేసిన అక్రమార్కులు వాటి పరిధిలో ఉన్న మట్టిగుట్టలు, కుంటల నుంచి మట్టిని తోడేస్తున్నారు. అమిస్తాపూర్‌లోని సర్వే నంబరు 527లో 80.30ఎకరాల విస్తీర్ణంలో ఉన్న నల్లగుట్ట నుంచి దాదాపు 25ఎకరాలల్లో మట్టిని తరలించారు. బోడేను చెరువుకు ఆనుకొని సర్వే నంబరు 29లో 9.20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న యేనే గుట్ట నుంచి దాదాపు మూడెకరాలకు పైగా మట్టిని తరలించారు. హస్నాపూర్ శివారులోని చిన్న గుట్టల నుంచి మట్టి పెద్ద ఎత్తున అక్రమంగా రవాణా అయింది. కొత్త మొల్గర గ్రామ పరిధిలో సర్వేనంబర్ 80లో 145 ఎకరాల్లో మూర్తయ్య గుట్ట ఉంది. ఇందులో పలు చోట్ల కింద బండ.. పైన మట్టి ఉంది. అయితే.. ఈ గుట్ట నుంచి రాళ్లు తీసేందుకు మైనింగ్ అధికారులు అనుమతి తీసుకున్న వ్యాపారులు అందులో క్రషర్ ఏర్పాటు చేశారు. అందులో కొందరు పనిలో పనిగా రాళ్లపై నుంచి తీసిన మట్టిని విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా తవ్విన మట్టిని ఇళ్ల నిర్మాణం, వెంచర్ల ఏర్పాటుకు మట్టిని తరలిస్తున్నారు. అయితే.. నల్లగుట్ట నుంచి తవ్విన మట్టిని అమిస్తాపూర్, పాలకొండ పరిసర ప్రాంతాలకు ట్రాక్టర్ల ద్వారా తరలిస్తారు. మూర్తయ్య గుట్ట నుంచి తీసిన మట్టిని భూత్పూర్, కొత్త మొల్గరకు ట్రాక్టర్ల ద్వారా మహబూబ్‌నగర్‌కు టిప్పర్ల ద్వారా తరలిస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్ మట్టికి రూ.300 నుంచి రూ.400 వరకు... టిప్పర్‌కు (మహబూబ్‌నగర్) రూ.2,500 నుంచి రూ.3వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇలా సమయం దొరికినప్పుడల్లా ఒకేసారి వందలాది ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా మట్టిని తరలిస్తున్నారు. చక్రం తిప్పుతోన్న ప్రభుత్వ ఉద్యోగి? మండలంలో మట్టి అక్రమ రవాణాలో మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రంలో పని చేసే ఓ ప్రభుత్వ ఉద్యోగి కీలక పాత్ర పోషిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఓ సామాజిక వర్గానికి చెందిన అతను తన వర్గానికి చెందిన మరో ప్రజాప్రతినిధి అండదండతో అక్రమ వ్యాపారానికి తెరలేపారు. అక్రమార్కుడికి ప్రజాప్రతినిధి అండ ఉండడంతో అతని జోలికి వెళ్లేందుకు అధికారులు సైతం జంకుతున్నారనే ప్రచారం జరుగుతోంది. మట్టి అక్రమ తరలింపు గురించి ఎవరైనా ఫిర్యాదు చేస్తే సదరు అక్రమార్కుడి అనుచరులు నుంచి బెదిరిస్తున్నట్లు తప్పవని రెవెన్యూ వర్గాల్లోనే గుసగుసలు వినిపిస్తున్నా యి. అయితే.. ఇతనితో పాటు మరో ఇద్దరు వ్యాపారులు మట్టిని అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం. వీరికి రెవెన్యూ అధికారుల అండదండలున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఉన్నతాధికారులు ఈ విషయంపై ఎలా స్పందిస్తారు? ఏళ్ల నుంచి కొనసాగుతోన్న మట్టి అక్రమ తరలింపునకు ఎలా అడ్డుకట్ట వేస్తారో వేచి చూడాలి. -
తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత..!
రేగోడ్(మెదక్): నల్ల మట్టి కాసుల వర్షం కురిపిస్తోంది.. తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత అన్నట్టుగా పరిస్థితి తయారైంది. అక్రమార్కులు చెరువును కొల్లగొడుతూ నల్లమట్టిని జిల్లా దాటిస్తున్నా పట్టించుకునే అధికారులు కరువయ్యారు. ఈ తతంగం సోమవారం వెలుగుచూసింది. మండలంలోని కొత్వాన్‌పల్లి చెరువు మరమ్మతు కోసం రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకంలో సుమారు రూ. 46 లక్షలు మంజూరు చేసింది. పూడిక తీతలో భాగంగా చెరువులో మట్టిని తీస్తున్నారు. నిబంధనల ప్రకారం ఏ గ్రామంలోని చెరువు మట్టిని ఆ ఊరి రైతులే తీసుకెళ్లాలి. ఇతర వ్యక్తులు ఎవరూ మట్టిని తీసుకోకూడదు. కానీ ఇక్కడ ఏకంగా మెదక్ జిల్లా కొత్వాన్‌పల్లి చెరువు నుంచి సంగారెడ్డి జిల్లా రుద్రారం గ్రామ శివారులోకి టిప్పర్లలో నల్లమట్టిని యథేచ్ఛగా తరలిస్తున్నా అడిగేనాథడు లేకుండా పోయారు. నల్లమట్టికి డిమాండ్ ఉండటంతో ఇదే అదనుగా భావించిన కొందరికి వరంగా మారింది. టిప్పర్లను లీజ్‌కు తీసుకుని వ్యాపారం చేస్తున్నట్లు తెలుస్తోంది. నల్ల మట్టి మాయలో పడిన కొందరు చెరువును తోడేస్తున్నారు. నల్లమట్టిని తరలిస్తూ జేబులు నింపుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. చెరువును తవ్వేస్తున్నా.. అధికారులది ప్రేక్షక పాత్రా..? లేక వారికి తెలియకుండానే దందా జరుగుతోందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. నల్లమట్టిని ఏకంగా జిల్లానే దాట వేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఈ తతంగంపై విచారణ జరిపించాలని పలువురు పేర్కొంటున్నారు. -
దోపిడే దోపిడీ
తూప్రాన్ : మండలంలో మట్టి అక్రమ దందా జోరుగా సాగుతోంది. సీఎం ఇలాకాలోనే యథేచ్ఛగా మట్టి తవ్వకాలు జరుగుతున్నా అడిగే వారే లేకుండా పోయారు. మండలంలోని కూచారం, ముప్పిరెడ్డిపల్లి గ్రామాల్లో మట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. కూచారం రైల్వే స్టేషన్ సమీపంలోని చెరువు నుంచి, కాళ్లకల్ గ్రామ సమీపంలోని కొండాపూర్ గ్రామంలో తవ్వకాలు జరుపుతూ పరిశ్రమలకు మట్టిని విక్రయిస్తూ జేబులు నింపుకుంటున్నారు. పట్టపగలే తవ్వకాలు జరుగుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. రెవెన్యూ అధికారుల అండదండలు ఉండడంతోనే అక్రమార్కులు రెచ్చిపోతున్నట్టు తెలుస్తోంది. పత్రికల్లో వరుస కథనాలు ప్రచురితమవుతున్నా అధికారులు స్పందించకపోవడంపై జనం భగ్గుమంటున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు స్పందించి అక్రమార్కులకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు. చర్యలు తప్పవు వాల్టా చట్టానికి వ్యతిరేకంగా మట్టిని తరలిస్తే చర్యలు తప్పవు. ప్రభుత్వ అనుమతులు పొందిన తర్వాతే తవ్వకాలు జరపాలి. అక్రమంగా మట్టి తరలిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. తమ సిబ్బందిని సంఘటన స్థలానికి పంపి వాహనాలు సీజ్ చేస్తాం. - ముత్యంరెడ్డి, సిద్దిపేట ఆర్డీఓ అనుమతులు తప్పనిసరి.. చెరువులు, కుంటల్లో అనుమతులు లేకుండా తవ్వకాలు జరిపితే చర్యలు తప్పవు. వాల్టా నిబంధనల ప్రకారం అక్రమార్కులపై చర్యలు తీసుకుంటాం. అక్రమంగా మట్టిని తరలిస్తే ఎంతటివారైన ఉపేక్షించే ది లేదు. - శ్రీకాంత్, ఇరిగేషన్ ఏఈ