‘ఐ యామ్ 20’...
ప్రఖ్యాత కెమెరామెన్, డెరైక్టర్, దివంగత ఎస్.ఎన్.ఎస్ శాస్త్రి ఫిలిమ్స్ డివిజన్ కోసం రూపొందించిన నాలుగు డాక్యుమెంటరీలను (ఐయామ్ 20- అండ్ ఐ మేక్ షార్ట్ ఫిలిమ్స్-బర్నింగ్ సన్-ఫ్లాష్ బ్యాక్) బుధవారం సాయంత్రం లామకాన్‌లో ప్రదర్శించారు. ఈ చిత్రాల డీవీడీలను ఆన్లైన్ ద్వారా (http://filmsdivision.org/shop)కొనుగోలు చేయవచ్చు. ఒకొక్కటి రూ.100. యూట్యూబ్‌లోనూ పాక్షికంగా చూడవచ్చు.
20-20 తెలీనిదెవ్వరికి? ‘ఐ యామ్ 20’? తెలుసుకోదగ్గ విశేషమే! 1967లో 20 ఏళ్లు నిండిన యువత ఆకాంక్షలను, అవగాహనలను ‘ఐ యామ్ 20’ ద్వారా చూపారు. స్వాతంత్య్రం వచ్చిన సంవత్సరంలో పుట్టిన వివిధ రాష్ట్రాల యువతీ యువకులు తమ గురించి-సమాజం గురించి ఏమనుకుంటున్నారు? కొన్ని ‘ఆణి ముత్యాలు’!
- నేను ఐఏఎస్ ఆఫీసర్నవుతాను. ఎ.సిలో కూర్చుంటాను. కాఫీలు తాగుతాను. రెండు సంతకాలు పెట్టేస్తాను. బస్...
- బస్సుల్లో సీట్లు లేవు. రైళ్లల్లో సీట్లు లేవు. మంచి మార్కులతో అడ్మిషన్ కోసం కాలేజీకి వెళితే సీట్లు లేవు. ఎంత కావాలి? అని డబ్బు తీయగానే, బొటాబొటి మార్కులొచ్చినా ‘వెంటనే జాయిన్కా’ అంటున్నారు. ఇది మారాలి.
- నాకు రెండు బక్క ఎడ్లున్నాయి. వ్యవసాయం చేసేందుకు ట్రాక్టర్ కావాలి.
- వర్క్‌షాప్‌లో పనిచేస్తున్నాను. ఐటిఐలో సీటొస్తే సరేసరి. లేకపోతే మిలట్రీకి పోతాను.
- రాష్ట్రపతి ఎవరో, ప్రధాని ఎవరో, ముఖ్యమంత్రి ఎవరో తెలీదు. పొలం పని తెలుసు.
- ప్రేమజోలికి పోను. పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటాను.
పెళ్లి-పెటాకులు వద్దు. ఇష్టం వచ్చినట్లు జీవిస్తా.
- నేను ఏ పనీ చేయను. డబ్బులు పారేస్తాను. కావాల్సినవి పొందుతాను.
- సత్యజిత్ రాయ్‌ని నేను స్వప్నిస్తాను. ఇండియాకు సమస్యలున్నాయి. అవకాశాలూ ఉన్నాయి. ఐ డూ సమ్ థింగ్ ఫర్ మై కంట్రీ!