breaking news
slp in supreme court
-
చంద్రబాబూ మీకా అర్హత లేదు..
టీడీపీ ఆవిర్భావ దినోత్సవాల్లో పాల్గొనడంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ధ్వజం ♦ ఎన్టీఆర్ సిద్ధాంతాలకు సమాధి కట్టారు ♦ మీ కొడుకు ఎదగకుండా పోతాడని జూనియర్ ఎన్టీఆర్ను తరిమేశారు సాక్షి, న్యూఢిల్లీ: టీడీపీ ఆవిర్భావ దినోత్సవాల్లో ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పాల్గొనడాన్ని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తప్పుపట్టారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, పిల్లనిచ్చిన మామ అయిన ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తికి.. ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవాల్లో పాల్గొనే హక్కు ఉందా? అని ఆమె ప్రశ్నించారు. రోజా మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ‘1982 మార్చి 29న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించారు. తన సొంత రెక్కల కష్టంతో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. అయితే ఆయనకు ఏవిధంగా చంద్రబాబు వెన్నుపోటు పొడిచారో అందరికీ తెలిసిందే..’ అని రోజా అన్నారు. ‘అధికారంలోకి వచ్చేందుకు ఎన్టీఆర్ పేరును, ఆయన కుటుంబసభ్యులను చంద్రబాబు వాడుకుంటారు. అధికారంలోకి వచ్చాక వదిలేస్తారు. పురందేశ్వరి, బాలకృష్ణ, హరికృష్ణను ఏవిధంగా వాడుకుని ఆ తర్వాత పక్కన పెట్టారో తెలిసిందే. ఎన్టీఆర్ సిద్ధాంతాలకు, ఆశయాలకు చంద్రబాబు సమాధి కట్టారని రోజా విమర్శించారు. ఎవరైనా తెలుగుదేశం పార్టీలోకి రావాలనుకుంటే తమ పదవులకు ముందే రాజీనామా చేసి రావాలని పార్టీ మొదటి మహానాడు (1982)లోనే ఎన్టీఆర్ తీర్మానం చేశారని రోజా తెలిపారు. ఇప్పుడదే పార్టీని నడుపుతూ సిగ్గులేకుండా, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయకపోయినా సంతలో పశువులను కొన్నట్టు వారిని కొంటున్న చంద్రబాబుకు ఈరోజు టీడీపీ జెండా ఎగురవేసే అర్హత ఎక్కడిదని ప్రశ్నించారు. కొడుకు కోసం జూ.ఎన్టీఆర్ను తరిమేశారు జూనియర్ ఎన్టీఆర్ చరిష్మా ముందు తన కుమారుడు పప్పుసుద్దగా మిగిలిపోతాడని, ఎదగకుండా పోతాడనే భయంతో జూనియర్ ఎన్టీఆర్ను రాజకీయాల్లోంచి తరిమివేశారని, ఆయన సినిమాలు విడుదల కాకుండా చూస్తున్నారని రోజా విమర్శించారు. ఈరోజు ఉన్నది టీడీపీ కాదని, తెలుగు దొంగల పార్టీ అని ఆమె ఎద్దేవా చేశారు. నిన్నటివరకు ఎదురుచూసినా ప్రివిలేజ్ కమిటీ నుంచి పిలుపు రానందుకే సుప్రీంకోర్టుకు వచ్చానని రోజా తెలిపారు. సుప్రీంకోర్టులో రోజా పిటిషన్ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాను అసెంబ్లీకి హాజరయ్యేలా అవకాశం కల్పిస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై.. డివిజన్ బెంచ్ ఇచ్చిన స్టే ఉత్తర్వులను రద్దు చేయాలని ఆమె కోరారు. ఈ మేరకు మంగళవారం ఉదయం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. తాము స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేస్తున్నామని, ఇందుకు అనుమతించాలని రోజా తరఫు సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్.. ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. హైకోర్టు న్యాయమూర్తి తమకు అనుకూలంగా 22 పేజీలతో కూడిన ఉత్తర్వులు వెలువరించారని, ఏడాదిపాటు సస్పెండ్ చేయడం రాజ్యాంగ విరుద్ధమని కూడా వ్యాఖ్యానించారని పిటిషన్లో వివరించారు. దీనిపై శుక్రవారం (ఏప్రిల్ 1న) విచారణ జరుపుతామని ధర్మాసనం తెలిపింది. -
'జూనియర్ ఎన్టీఆర్ను తొక్కేస్తున్నారు'
ఎన్టీఆర్ను గానీ, ఆ పేరును గానీ ప్రజలు గుర్తుంచుకోవడం చంద్రబాబుకు ఏమాత్రం ఇష్టం లేదని, అందుకే జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు విడుదల కానివ్వకుండా, ఆడనివ్వకుండా ఇనుప పాదంతో తొక్కేస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. హైకోర్టు డివిజన్ బెంచి ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాలు చేసిన సందర్భంగా ఆమె కోర్టు వెలుపల మీడియాతో మాట్లాడారు. జూనియర్ ఎన్టీఆర్ను ఎన్నికల సమయంలో ప్రచారానికి వాడుకుని, ఆ తర్వాత టీడీపీలో కార్యకర్తగా కూడా ఉండనివ్వకుండా తరిమేశారని చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ చరిష్మా ముందు తన పప్పుసుద్ద కొడుకు లోకేశ్ ఎదగలేడన్న భయంతో.. ఎన్టీఆర్ను తొక్కేశారని విమర్శించారు. ఎన్టీఆర్ సిద్ధాంతాలన్నింటికీ చంద్రబాబు తూట్లు పొడిచారని ఆమె అన్నారు. అలాంటి వాళ్లకు టీడీపీ జెండా ఎగరేసే హక్కుందా అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ సమైక్యాంధ్రకు కట్టుబడి, కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా పోరాడితే, ఈయన మాత్రం కాంగ్రెస్తో జతకలిసి రాష్ట్రాన్ని విడదీశారని చెప్పారు. ఎన్టీఆర్ సంపూర్ణ మద్యనిషేధం విధిస్తే, చంద్రబాబు మాత్రం బెల్టుషాపులతో మద్యాన్ని పొంగిస్తూ ఆడపడుచుల జీవితాలు నాశనం చేస్తున్నారన్నారు. ఆయన సిద్ధాంతాలు, ఆశయాలకు సమాధి కట్టేశారని మండిపడ్డారు. ఎన్టీఆర్ మీద బాబుకు ఎంత కక్ష ఉందో స్పష్టంగా తెలుస్తుందంటూ పలు విషయాలు వివరించారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి పేరుతో మంచినీళ్లను చవగ్గా అందిస్తామన్నారని, కానీ అవి రాష్ట్రంలో నాలుగైదు చోట్ల కూడా లేవని చెప్పారు. అన్న క్యాంటీన్లు అంటూ ఆర్భాటంగా ప్రకటించి రెండేళ్లయినా.. ఇప్పటికీ ఒక్కటీ పెట్టలేదన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ వైద్యసేవ అని పేరు మార్చారని.. కానీ గత సంవత్సరం 350 కోట్లు, ఈ సంవత్సరం 450 కోట్ల బకాయిలతో ఆ పథకానికి తూట్లు పొడిచారని మండిపడ్డారు. ఎన్టీఆర్ పేరుమీద ఉన్న పథకాలన్నింటినీ నిర్వీర్యం చేశారని, అదే తన పేరు మీద ఉన్న చంద్రన్న కానుకకకు మాత్రం అడ్డదిడ్డంగా నిధులిస్తూ అందులో అంతులేని అవినీతికి పాల్పడుతున్నారని చెప్పారు. ఎన్టీఆర్ను ప్రజలు గుర్తుపెట్టుకోవడం బాబుకు ఇష్టంలేదని, ఆయన పేరు చూస్తేనే బాబుకు కక్ష అని చెప్పారు. ఎన్టీఆర్ అభిమానులు ఈ విషయాలను గుర్తించి ఇక ముందు కూడా ఈ చంద్రబాబు పార్టీలో కొనసాగుతారా.. లేదా ఆయన్ను తరిమేసి ఎన్టీఆర్ ఆశయాలను కాపాడతారో చూడాలని అన్నారు. ఇప్పుడున్నది తెలుగుదేశం పార్టీ కాదు.. తెలుగు దొంగల పార్టీ అని విమర్శించారు. ఈ గ్యాంగు తనను తొక్కేయాలని చూస్తోందన్నారు. చంద్రబాబు అడ్డదిడ్డంగా తన నాయకులను కాపాడుకోవడం కోసం కాల్మనీలో మహిళలు అన్యాయమైపోతున్నా పట్టించుకోవట్లేదని, ఇది 3 కోట్ల మహిళలకు సంబంధించిన విషయం కాబట్టి దీనిపై చర్చించాలని ప్రొటెస్ట్ చేశాం తప్ప ఎవరిమీదా తనకు వ్యక్తిగత ద్వేషం లేదని రోజా తెలిపారు. ఆరోజు అందరూ నిరసన వ్యక్తం చేస్తే.. ఒక్క తనమీద మాత్రమే చర్య తీసుకున్నారని గుర్తుచేశారు. తాను కామ సీఎం అనడం వల్ల సస్పెండ్ చేసినట్లు యనమల రామకృష్ణుడు చెప్పారని, కానీ నిజానికి ఐదు రోజుల పాటు పేపర్లన్నింటిలో ఇదే విషయం వచ్చిందని, దానిమీదే తాను వాయిదా తీర్మానం ఇచ్చి చర్చకు ఒత్తిడి చేశానని చెప్పారు. పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా మహిళల సంక్షేమం కోసం కట్టుబడ్డానని, రిషితేశ్వరి, వనజాక్షి, అంగన్వాడీల విషయాన్ని లేవనెత్తాను కాబట్టి అణిచేస్తున్నారని అన్నారు. చివరకు కోర్టు ఉత్తర్వులు ఇచ్చినా కూడా తనను అసెంబ్లీలోకి రానివ్వకుండా రాక్షసంగా అడ్డుకున్నారని చెప్పారు. తమకు నచ్చిన చానల్కే రికార్డింగ్ హక్కులు ఇచ్చి, తమకు నచ్చిన అంశాలనే ప్రసారం చేయిస్తున్నారంటే వాళ్ల దిగజారుడు రాజకీయాలు గమనించాలని అన్నారు. 18వ తేదీనాటి విషయం గురించి ఐదు రోజుల తర్వాత అనితను ఏడ్పించి విషయాన్ని డైవర్ట్ చేస్తున్నారని ఆమె తెలిపారు .డివిజన్ బెంచి ఉత్తర్వులను సవాలు చేస్తూ ఎస్ఎల్పీ దాఖలు చేస్తున్నానని, తీర్పు కాపీ అందడం ఆలస్యం కావడంతో ఇప్పటివరకు సుప్రీంకోర్టుకు రాలేకపోయానని అన్నారు. తనకు మరో అవకాశం ఇస్తున్నట్లు అసెంబ్లీలో చెప్పారే గానీ ఇంతవరకు ప్రివిలేజ్ కమిటీ నన్ను పిలిచిన పాపన పోలేదని ఆమె తెలిపారు. సోమవారం వరకు ఎదురుచూసినా ఆ కమిటీ నుంచి ఎలాంటి కాల్ రాలేదు కాబట్టి సుప్రీంకోర్టుకు వచ్చానని చెప్పారు. మహిళలను వ్యభిచార కూపం నుంచి బయటకు తీసుకురావడమే తన లక్ష్యమని ఆమె అన్నారు.