సిములేటర్ ఫైళ్లు మాయం!
గల్లంతైన మలేసియా విమాన పైలట్ పరికరంలో డేటా తొలగింపు
సిములేటర్‌లో భారత విమానాశ్రయాల రన్వేలు
కౌలాలంపూర్/బీజింగ్/న్యూఢిల్లీ: మలేసియా బోయింగ్ విమానం ఎంహెచ్370 అదృశ్యంపై చిక్కుముడి వీడడం లేదు. బుధవారం 12వ రోజూ దాని ఆచూకీ లభించలేదు. మలేసియా అధికారులు మిస్టరీ ఛేదించడానికి అన్ని కోణాల్లోనూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బోయింగ్‌ను నడిపిన పైలట్ జహరీ అహ్మద్‌షా(53) ఇంట్లోంచి స్వాధీనం చేసుకున్న విమాన నేవిగేషన్ సిములేటర్(మార్గనిర్దేశక అనుకరణ పరికరం)లోని కొన్ని ఫైళ్లను తొలగించినట్లు వారు కనుగొన్నారు. మిస్టరీ ఛేదించడానికి ఈ ఫైళ్ల సమాచారం కీలకం కానుందని భావిస్తున్నారు. సిములేటర్లోని కొంత సమాచారాన్ని గత నెల 3న తొలగించారని, దాన్ని పునరుద్ధరించేందుకు సైబర్, ఫోరెన్సిక్ నిపుణులు ప్రయత్నిస్తున్నారని మలేసియా రక్షణ, రవాణా మంత్రి హిషాముద్దీన్ హుస్సేన్ బుధవారం తెలిపారు. జహరీ, విమానంలోని ప్రయాణికులు దోషులుగా తేలేవరకు నిర్దోషులేనన్నారు. రష్యా, ఉక్రెయిన్ సహా ఇతర దేశాల ప్రయాణికుల నేపథ్యాన్ని పరిశీలించామని, అయితే అనుమానించాల్సిందేమీ బయటపడలేదని అన్నారు. సిములేటర్ డేటా తొలంగింపుపై పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ ఖాలిద్ బకర్ మరిన్ని వివరాలు తెలిపారు. జహారీ తన ఇంట్లోనే చేత్తో తయారు చేసిన ఈ సిములేటర్లోని అన్ని గేమ్ లాగ్స్(గేమ్స్ వినియోగ సమాచారం)ను ఫిబ్రవరి 3న తొలగించారన్నారు. సిములేటర్‌లో ఫ్లైట్ సిములేటర్ ఎక్స్, 9, ఎక్స్ ఫ్లైట్ సిములేటర్ అనే మూడు గేమ్స్ ఉండేవని తెలిపారు. ఏఎస్యూఎస్ డెరైక్ట్ సీయూఐఐ, ర్యాంపేజ్ 4 ఎక్స్ట్రీమ్ మదర్‌బోర్డు, ఆరు ఫ్లాట్ స్క్రీన్ మానిటర్లు వంటి అసెంబుల్డ్ కంప్యూటర్ హార్డ్‌వేర్‌తో ఈ సిములేటర్‌ను తయారు చేసినట్లు వెల్లడించారు.
సిములేటర్‌లో ఐదు రన్వేలు: జహరీ సిములేటర్‌లో ఐదు విమానాశ్రయాలకు చెందిన వెయ్యి మీటర్లకుపైగా దూరమున్న రన్‌వేల చిత్రాలను అప్లోడ్ చేసినట్లు అధికారులు గుర్తించారని వార్తలు వచ్చాయి. ఈ విమానాశ్రయాల్లో మూడు భారత్, శ్రీలంకల్లోనివి. మిగతావి మాల్దీవుల రాజధాని మాలి, హిందూ మహాసముద్రంలోని అమెరికాకు చెందిన డీ గో గార్షియా దీవిలోనివి.
తక్కువ ఎత్తులో ఎగిరిన విమానం..
ఎంహెచ్ 370 అదృశ్యమైన ఈ నెల 8న ఉదయం 6.15 గంటలకు తమ ప్రాంతంలో తక్కువ ఎత్తులో ఎగురుతున్న విమానాన్ని చూశామని మాల్దీవుల్లోని మారుమూల ద్వీపమైన కుడా హుబధూ వాసులు చెప్పారు. మలేసియా ఎయిర్‌లైన్స్ విమానాల మాదిరే ఇదీ తెల్లరంగులో, ఎరుపు చారలతో ఉందని, ఉత్తరం నుంచి ఈశాన్యదిశగా మాల్దీవుల్లోని అద్దూ ద్వీపంవైపు భీకర శబ్దం చేసుకుంటూ వెళ్లిందన్నారు. అయితే మలేసియా మంత్రి హుస్సేన్ దీన్ని తోసిపుచ్చారు. గల్లంతైన విమానానికి సంబంధించి మొదటి విడత బీమాను చెల్లించామని జర్మనీకి చెందిన అలియంజ్ బీమా కంపెనీ తెలిపింది.
అండమాన్ దీవులపై..: హైదరాబాద్ ఐటీ నిపుణుడు
మలేసియా విమానం గల్లంతైన ఈ నెల 8న అండమాన్ దీవుల మీదుగా పెద్ద విమానం వెళ్లినట్లు శాటిలైట్ చిత్రంలో కనిపించిందని హైదరాబాద్‌కు చెందిన అనూప్ మాధవ్ యెగ్గిన (29) అనే ఐటీ నిపుణుడు చెప్పారు. తక్కువ ఎత్తులో వె ళ్లిన ఈ విమానం అదృశ్యమైన మలేసియా విమానమేనని భావిస్తున్నానన్నారు.