breaking news
Siddharthajain collector
-
కలెక్టర్ చెవిలో పట్టు పూలు
సెరికల్చర్ శాఖలో బది‘లీల’లు భారీ అవినీతికి తెరలేపిన ఓ ఉన్నతాధికారి చిత్తూరు: జిల్లా సెరికల్చర్ శాఖలోని ఓ ఉన్నతాధికారి కలెక్టర్ సిద్ధార్థజైన్ చెవిలో పూలు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ శాఖ ఉద్యోగుల బదిలీల్లో భారీ అవినీతికి పాల్పడినట్టు తెలిసింది. ఈ సందర్భంగా పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారిందని అత్యంత విశ్వసనీయ సమాచారం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక్కో శాఖలో 20 శాతానికి మించి బదిలీలు జరపకూడదు. అయితే ఆ శాఖలో మాత్రం ఏకంగా 40 శాతం మందిని బదిలీ చేసినట్లు తెలియవచ్చింది. ఈ మేరకు వీరికి కొన్ని రోజుల క్రితం జరిగిన కౌన్సెలింగ్‌లో ఉత్తర్వులు కూడా జారీచేశారు. ఈ బదిలీలపై గురువారం ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు పలమనేరు సెరికల్చర్ ఏడీ కార్యాలయంలో సమావేశం కూడా ఏర్పాటుచేశారు. ఈ సమావేశానికి హాజరైన ఉద్యోగులకు బదిలీ ప్రక్రియను వివరిస్తూ... కలెక్టర్ ప్రత్యేక అనుమతితో కొంత ఎక్కువ శాతం బదిలీలు చేశామని.. దీనిపై ఎవరికీ అనుమానం వద్దని వారికి ధైర్యం చెప్పారు. మొత్తం 65 మందిని బదిలీ చేశామని, వారికి కేటాయించిన ప్రాంతాల వారీగా ఆయా ఏడీవోలకు రిపోర్ట్ చేస్తారని, బదిలీపై వచ్చిన వారిని చేర్చుకొని వర్క్ అలాట్మెంట్ మాత్రం ముందు పని చేసిన ప్రాంతాల్లోనే ఇవ్వాలని సూచించారు. ఇది ప్రమాదకరమని కొంతమంది ఏడీవోలు అనుమానం వ్యక్తం చేయగా... ‘కలెక్టర్‌కు తెలిస్తే కదా’ అని జిల్లా సెరికల్చర్ అధికారి వారికి బదులిచ్చారు. ఉదాహరణకు.. ఓ మహిళా సీనియర్ అసిస్టెంట్ మదనపల్లె సెరికల్చర్ ఆఫీసులో పని చేస్తోంది. ఈమెను తిరుపతికి బదిలీ చేశారు. ఆమె తిరుపతి సెరికల్చర్ ఏడీ ఆఫీసులో రిపోర్టు చేస్తుంది. తిరుపతి ఏడీ మాత్రం ఆమెకు మదనపల్లెలోనే వర్క్‌అలాట్‌మెంట్ చేస్తారు. ఓటెక్నికల్ ఆఫీసర్ కొలమాసపల్లెలో పని చేస్తున్నారు. ఆయన్ను మదనపల్లెకి ట్రాన్స్ఫర్ చేశారు. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం మదనపల్లె ఏడీ ఆఫీసులో జాయిన్ అవుతారు. మదనపల్లె ఏడీ ఆ టెక్నికల్ ఆఫీసర్‌కు కొలమాసపల్లిలోనే వర్క్ అలాట్మెంట్ చేస్తారు. ఇదీ పట్టు పరిశ్రమ శాఖలో నెలగా జరుగుతున్న బది‘లీల’ల భాగోతం. ఈ తతంగంతో ఆ ఉన్నతాధికారి ఏకంగా జిల్లా కలెక్టర్ చెవిలో పట్టుపూలు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. -
పోలింగ్‌కు సర్వం సిద్ధం
ఏలూరు, న్యూస్‌లైన్ : ఏలూరు నగరపాలక సంస్థ, 7 ముని సిపాలిటీలు, ఒక నగర పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఆదివారం నిర్వహించే పోలింగ్ కోసం విసృ్తత ఏర్పాట్లు చేసినట్టు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిద్ధార్థజైన్ చెప్పారు. కలెక్టరేట్లో శుక్రవారం సాయంత్రం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మునిసిపల్ ఎన్నికలలో మొత్తం 5,72,115 మంది ఓటుహక్కు వినియోగించుకోవాల్సి ఉందని చెప్పారు. జిల్లావ్యాప్తంగా 539 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ ప్రక్రియ నిర్వహించేందుకు 608 ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను సిద్ధం చేశామన్నారు. 135 సమస్యాత్మక, 128 అతి సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను గుర్తించి అవసరమైన చర్యలు తీసుకున్నట్టు పేర్కొన్నారు. 193 పోలింగ్ కేంద్రాలలో వెబ్ కెమెరాలు ఏర్పాటు చేశామని, 121 పోలింగ్ కేంద్రాలలో మైక్రో అబ్జర్వర్లను నియమించామని, 34 కేంద్రాలలో వీడియో షూటిం గ్‌కు చర్యలు తీసుకున్నామని వెల్లడిం చారు. 595 మంది పోలింగ్ అధికారులను, మరో 595 మంది సహాయ పోలింగ్ అధికారుల, 1,785 మంది పోలింగ్ సిబ్బందిని వినియోగిస్తున్నట్లు తెలిపారు. ప్రచారం ఖర్చు రూ.93 లక్షలు అభ్యర్థులు ప్రచారం నిమిత్తం రూ.93 లక్షలు ఖర్చు చేసినట్టు ఇప్పటివరకూ లెక్కలు చూపారని కలెక్టర్ చెప్పారు. మద్యం నియంత్రణకు జిల్లా అంతటా ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో గట్టి నిఘా పెట్టామని పేర్కొన్నారు. పెయిడ్ న్యూస్, ఫ్రీ సర్టిఫికేషన్ కింద ఇంతవరకూ రూ.12 లక్షల ఖర్చును నమోదు చేశామన్నారు. పెయిడ్ న్యూస్‌కు సంబంధించి రెండు పార్టీలకు నోటీసులు జారీ చేశామన్నారు. పోలింగ్ రోజున అభ్యర్థి వాహనంలో తిరిగితే దానికి ప్రత్యేకంగా వాహన అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. నిర్భయంగా ఓటు వేయండి ఓటర్లకు స్వేచ్ఛాయుత వాతావరణం కల్పిస్తున్నామని.. ప్రతి ఓటరు తమ ఓటుహక్కును నిర్భయం గా వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. ఎన్నికల నిర్వహణలో ఉదాసీనత, నిర్లిప్తంగా వ్యవహరించే సిబ్బందిపై రాష్ట్ర ఎన్నికల సంఘం తీవ్రమైన చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ హెచ్చరించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల ప్రచారంలో, మద్దతు పలికే కార్యక్రమాల్లో పాల్గొంటే చర్యలు తప్పవన్నారు. భారీ పోలీసు బందోబస్తు పోలింగ్ ప్రక్రియను ప్రశాంతంగా జరిపించేందుకు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని సిద్ధార్థజైన్ తెలిపారు. 60 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 60 స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు, 19 షాడో టీములు ప్రస్తుతం పనిచేస్తున్నాయన్నారు. 10 మంది డీఎస్పీలు, 25 మంది సీఐలు, 94 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, 96 మంది ఏఎస్సైలు, 109 మంది హెడ్‌కానిస్టేబుల్స్, 1,230 మంది పోలీస్ కానిస్టేబుల్స్, 493 మంది హోంగార్డ్స్, 32 సెక్షన్ల సాయుధ బలగాలు ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉన్నాయని వివరించారు. 56 మొబైల్ పార్టీలు, 10 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, 25 స్ట్రైకింగ్ పోర్స్ బృందాలు పని చేస్తున్నాయన్నారు. ఓటరు స్లిప్పులు అందకపోతే... ఓటర్ల వివరాలతో కూడిన స్లిప్పులను సిబ్బంది శనివారం కూడా ఇంటింటికీ తీసుకెళ్లి పంపిణీ చేస్తారని తెలిపారు. ఎవరికైనా అందకపోతే సమీపంలోని పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల దూరంలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో వీటిని అందించే ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.