breaking news
siddepeta distirict
-
విద్యార్థుల తల్లిదండ్రులకు హరీశ్‌రావు లేఖ
విద్యార్థి మనస్సు చదువుపై లగ్నం చేసేందుకు ఇంటి వాతావరణం కీలక భూమిక పోషిస్తుంది. దీనికోసం తల్లిదండ్రులు పిల్లలను ఇబ్బందులు పెట్టకుండా ఉండాలి. వారి ముందు ఇంటి సమస్యలు చెప్పడం, తగవులాడుకోవడం చేయకూడదు. ప్రధానంగా విద్యార్థులపై టీవీల ప్రభావం అధికంగా ఉంటుంది. ఈ నెల రోజులు కీలకమైనవి. ఈ నెల రోజులు ఇంట్లో టీవీ ఆఫ్ చేయడం మంచిది. విద్యార్థులను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపించాలి. వారికి చదువే తప్ప ఇతర ధ్యాస లేకుండా చూడాలి. సాక్షి, సిద్దిపేట: జిల్లా ఇప్పటికే అన్ని రంగాల్లో ముందు వరుసలో నిలిచింది. విద్యారంగంలోనూ ముందు వరుసలో ఉండాలంటే.. దానికి కొలమానం పదవ తరగతి ఫలితాలు. పది ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవాలని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు వినూత్న రీతిలో గత ఏడాది చేసిన ప్రయత్నం సత్ఫలితాలు ఇచ్చింది. పదవ తరగతి ఫలితాల్లో రాష్ట్రంలో 13వ స్థానంలో ఉన్న జిల్లాను మూడవ స్థానంలోకి తీసుకురాగలిగారు. ఈ సారి జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలన్న ధ్యేయంతో హరీశ్‌రావు, విద్యాశాఖ అధికారులు ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే జిల్లా విద్యా శాఖ అధికారి, మండల విద్యాశాఖ అధికారులతోపాటు, అన్ని విభాగాలకు చెందిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో పలుసార్లు సమీక్షలు నిర్వహించారు. ‘నాకు కావాల్సింది నూటికి నూరు శాతం ఫలితాలు.. దీనికోసం మీరు ఏమడిగినా.. ఇస్తాం.. మంచి ఫలితాలు సాధిస్తే నజరానాలు కూడా ఇస్తాం’ అని ప్రకటించారు. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు 10/10 జీపీఏ సాధిస్తే వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి రూ. 25వేల చొప్పున నజరానా ఇస్తానని ఆయన ప్రకటించారు. ఇంతటితో ఆగకుండా.. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి పిల్లల భవిష్యత్తు, పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించేందుకు తల్లిదండ్రుల బాధ్యతలను గుర్తు చేస్తూ సిద్దిపేట నియోజకవర్గంలోని తల్లిదండ్రులకు హరీశ్‌రావు తానే లేఖను రాస్తూ.. ముందుకు వెళ్లడం గమనార్హం. నేను నేరుగా కలవలేక.. లేఖ రాస్తున్నానంటూ విద్యార్థుల తల్లిదండ్రులకు ఉత్తరాలు రాస్తున్నారు. లేఖ సారాంశం.. పదవ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులకు మంత్రి రాసిన లేఖలో పలు అంశాలను పేర్కొన్నారు. జిల్లాలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారి ఉన్నతికి చేపట్టాల్సిన చర్యలను లేఖలో పేర్కొన్నారు. ప్రధానంగా విద్యార్థి మనస్సు చదువుపై లగ్నం చేసేందుకు ఇంటి వాతావరణం కీలక భూమిక పోషిస్తుంది. దీనికోసం తల్లిదండ్రులు పిల్లలను ఇబ్బందులు పెట్టకుండా ఉండాలి. వారి ముందు ఇంటి సమస్యలు చెప్పడం, తగవులాడుకోవడం చేయకూడదు. ప్రధానంగా విద్యార్థులపై టీవీల ప్రభావం అధికంగా ఉంటుంది. ఈ నెల రోజులు కీలకమైనవి. ఈ నెల రోజులు ఇంట్లో టీవీ ఆఫ్ చేయడం మంచిది. విద్యార్థులను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపించాలి. వారికి చదువే తప్ప ఇతర ధ్యాస లేకుండా చూడాలి. కష్టమైనా ఇంట్లో పనులు మీరే చేసుకోవాలి. పిల్లలకు చదువుకునేందుకు అత్యధిక సమయం కేటాయించే వాతావరణం నెలకొల్పాలి. ప్రతీ రోజు విద్యార్థి ప్రగతిని అంచనా వేయడం.. వారిని మానసికంగా సిద్ధం చేసేలా తల్లిదండ్రులు మాట్లాడాలి. ఉపాధ్యాయులతో మాట్లాడి విద్యార్థి చదువు గురించి ఆరా తీయాలి. ప్రధానంగా ఫిబ్రవరి, మార్చి నెలలో వివాహాలు, ఇతర శుభకార్యాలు ఉన్నాయి. అయితే విద్యార్థులను సాధ్యమైనంతవరకు సెలవులు పెట్టి రోజుల తరబడి వెళ్లకుండా చూడాలి. అవసరమైతే వెళ్లకపోవడం, తప్పనిసరి అయితే వెళ్లి వెంటనే వచ్చేలా చూడాలి. ఇలా చేయడంతో విద్యార్థికి చదువుపై ఆసక్తి పెరుగుతుంది. దీంతో ఉత్తమ ఫలితాలు సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రత్యేక తరగతులకు పంపించండి.. విద్యార్థులు ఇంతకాలం చదివిన విషయాలను తర్జుమా చేసుకోవడం, వెనుకబడిన అంశాలను నేర్చుకునేందుకు ఉదయం పాఠశాల సమయానికి ముందుగా ఒక గంట, సాయంత్రం పాఠశాల సమయం పూర్తయిన తర్వాత మరో గంటసేపు విద్యార్థులను చదివించే కార్యక్రమాలు చేస్తున్నారు. వీటికి పిల్లలను తప్పకుండా హాజరయ్యేవిధంగా చూడండి..’ అని విద్యార్థుల తల్లిదండ్రులకు హరీశ్‌రావు రాసిన లేఖలో పేర్కొన్నారు. దీనికి విద్యార్థులకు సాయంత్రం అల్పాహారం అందించేందుకు ప్రత్యేక నిధులు విడుదల చేసి, హెచ్ఎంల అకౌంట్లలో వేశామనే విషయాన్ని కూడా గుర్తు చేశారు. ఇన్ని చేస్తున్నా.. నా, మన ఆలోచన అంతా మంచి ఫలితాల సాధన కోసమే.. దానికి మేం, మీరు, ఉపాధ్యాయులు, అధికారులు అందరం సమష్టిగా శ్రమిద్దాం.. రాష్ట్రంలోనే ప్రథమంగా నిలుద్దాం.. మంత్రి విద్యార్థులకు, తల్లిదండ్రులకు రాసిన లేఖతో వారిలో ఉత్తేజం, బాధ్యత కూడా పెరుగుతుందని పలువురు విద్యావేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు హరీశ్‌రావు పేరున పంపిన లేఖ -
నిరసనలు ఉధృతం చేస్తాం
ప్రభుత్వానికి అఖిలపక్షం హెచ్చరిక కోహెడ: కరీంనగర్ జిల్లాలో హుస్నాబాద్ – కోహెడ మండలాలను కొనసాగించాలని సోమవారం మండలంలోని కూరెల్లలో అఖిల పక్షం నాయకులు కళ్ల, చెవులు, నోరు మూసుకొని ప్రభుత్వానికి నిరసన తెలిపారు. ఈ సందర్బంగా అఖిల పక్షం నాయకులు మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలను పక్కన పెట్టి సిద్దిపేటలో రెండు మండలాలను కలిపేందుకు ఎమ్మెల్యే సతీశ్‌కుమార్, ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల అభిప్రాయలు గౌరవించి కరీంనగర్‌లోనే కోహెడ, హుస్నాబాద్ మండలాలను ఉంచాలని డిమాండ్ చేశారు. 21 గ్రామాలలో 16 గ్రామాలు కరీంనగర్ జిల్లాలో ఉంటామని తీర్మానాలు చేశారని గుర్తు చేశారు. 16 గ్రామాలలో రోజుకు ఒక్క పద్దతిలో ప్రభుత్వానికి నిరసన తెలుపుతామన్నారు. కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ సభ్యుడు బండారి బాలరాజు, మాజీ సర్పంచ్ తాళ్లపల్లి ఎల్లయ్యగౌడ్, వలుస సుభాష్, అఖిల పక్షం నాయకులు ఖమ్మం వెంకటేశం, గవ్వ వంశీధర్‌రెడ్డి, చెపూరి తిరుపతి, గాజుల వెంకటేశ్వర్లు, బందెల బాలకిషన్, పిల్లి నర్సయ్య, రాజశేఖర్‌చారి, జాగిరి కుమార్, బండి రవి, కిషన్, వెంకన్న పాల్గొన్నారు.