breaking news
Shivaay movie
-
సినిమా రివ్యూ: శివాయ్
టైటిల్: శివాయ్ జానర్: యాక్షన్ థ్రిల్లర్ దర్శకుడు, నిర్మాత, కథ: అజయ్ దేవ్ గన్ నటీనటులు: అజయ్ దేవ్ గన్, ఎరికా కార్, సయేషా సైగల్ తదితరులు రచయిత: సందీప్ శ్రీవాస్తవ, రాబిన్ భట్ సంగీతం: మిథూన్ సినిమాటోగ్రఫీ: ఆసిమ్ బజాజ్ విడుదల: 28 అక్టోబర్, 2016 నిడివి: 173 నిమిషాలు బడ్జెట్: 105 కోట్లు భారీ బడ్జెట్ సినిమాలు రెండింటిని ఒకే రోజు విడుదల చేయొద్దన్న నిర్మాతల ఒరవడికి భిన్నంగా బాలీవుడ్లో నేడు(శుక్రవారం) రెండు భారీ సినిమాలు విడుదలయ్యాయి. ఒకటి క్రేజీ కాంబినేషన్‌తో ఉత్సుకత రగిలించడమేకాక, వివాదాలకూ కేంద్రబిందువైన 'ఏ దిల్ హై ముష్కిల్', రెండు అజయ్ దేవ్ గన్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన 'శివాయ్'. అత్యంత సాహసోపేతంగా రూపొందించి, అంతే సాహసంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన 'శివాయ్'.. అనుకున్నట్లే 'ముష్కిల్'కు చెమటలు పట్టించిందా? కథ: శివాయ్ ఓ పర్వతారోహకుడు. శివుడిలాగే హిమాలయాలే ప్రాణంగా జీవిస్తూ, అంతులేని సాహసాలు చేస్తూఉంటాడు. పర్యాటకులకు శిక్షకుడిగానూ వ్యవహరిస్తాడు. అలా పర్వతారోహణకు వచ్చి ప్రమాదానికి గురైన విదేశీ విద్యార్థిని ఓల్గా (పోలాండ్ నటి ఎరికా కార్)ను శివాయ్ కాపాడతాడు. ఆ క్రమంలో వారిమధ్య ప్రేమ చిగురిస్తుంది. ఓల్గా నెల తప్పుతుంది. కానీ ఇదంతా ఆమెకు ఇష్టం ఉండదు. శివాయ్ ని వదిలేసి స్వదేశానికి వెళ్లిపోతుంది. కట్ చేస్తే.. ఎనిమిదేళ్లు గడుస్తాయి. ఈ లోగా ఓల్గా కని, వదిలేసిన పాపాయి పెద్దవుతుంది. హిమాలయాలతోపాటు ఇప్పుడా పాపాయి కూడా శివాయ్ కి పంచప్రాణాలు. అయితే కూతురు తల్లిని చూడాలనుకోవడంతో ఓల్గా కోసం తప్పనిసరిగా హిమాలయాలను వదిలి బయటికి వస్తాడు శివాయ్. కూతురితో కలిసి బల్గేరియా(ఓల్గా ఊరికి) వెళతాడు. అక్కడ పిల్లల్ని మాయం చేసే రష్యన్ మాఫియా.. శివాయ్ కూతుర్ని కిడ్నాప్ చేస్తుంది. కూతుర్ని కనిపెట్టే క్రమంలో శివాయ్ కి సయేషా సైగల్(తెలుగు అఖిల్ హీరోయిన్) సహకరిస్తుంది. కిడ్నాపర్ల చెరనుంచి శివాయ్ తన కూతురుని ఎలా కాపాడుకున్నాడు, చివరికి భార్య(ఓల్గా)ను కలుసుకున్నాడా? అతనితో కలిసి జీవించడానికి ఆమె అంగీకరించిందా? అనేవి ముగింపు సన్నివేశాలు అంతా అజయ్ మయం: ఇది యాక్షన్ సినిమా అని నిరూపించడానికి అవసరానికి మించిన సీన్లు, అంతులేని ఫైట్లు జొప్పించినట్లు అనిపిస్తుంది. తండ్రీకూతుళ్ల అనుబంధమే ప్రధానాంశంగా నడిచే ఈ సినిమాలో ఆయా సీన్లు మాత్రం పేవలంగా కనిపిస్తాయి. 'శివాయ్' కి అసలు ప్రాణం.. ఆసిమ్ బజాజ్ సినిమాటోగ్రఫీ. గ్రాఫిక్స్ తోడ్పాటునిచ్చినప్పటికీ హిమాలయాల్లో ఆయన తీసిన సన్నివేశాలు అద్భుతంగా అనిపిస్తాయి. బాలీవుడ్ యాక్షన్ సినిమాల స్థాయిని ఒకమెట్టు పైకి ఎక్కించిన శివాయ్.. కథ, కథనంలో ఇంకాస్త శ్రద్ధ తీసుకుని ఉంటే కచ్చితంగా ముష్కిల్ కి చుక్కలు చూపించిఉండేది. -
‘మా సినిమాలో ఆమె నటించలేదు’
ముంబై: బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ తాజా సినిమా ‘శివాయ్’లో పాకిస్థాన్ నటి సాబా ఖామర్ లేదని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాలో సాబా నటించినట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో ‘శివాయ్’ తరపు అధికార ప్రతినిధి వివరణయిచ్చారు. సాబా ఖామర్, మరేతర పాకిస్థాన్ నటులు తమ సినిమాలో లేరని ఒక ప్రకటనలో తెలిపారు. పాకిస్థాన్ నటులు ఉన్న సినిమాలు విడుదల కాకుండా అడ్డుకుంటామని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన(ఎమ్మన్నెస్) హెచ్చరించిన నేపథ్యంలో ఈ ప్రకటన విడుదల చేశారు. పాకిస్థాన్ నటులు భారత సినిమాల్లో నటించకుండా అడ్డుకోవాలని ఇండియన్ మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ పిలుపు ఇచ్చింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ నటులు ఉన్న సినిమాల విడుదలను వాయిదా వేస్తున్నారు. అజయ్ దేవగన్ స్వీయదర్శకత్వంలో నిర్మించిన ‘శివాయ్’ అక్టోబర్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ‘అఖిల్’ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన సయేషా సైగల్ అజయ్ దేవగన్ సరసన నటించింది. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా కోసం అతడు చాలా సాహసాలు చేశాడు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.