breaking news
Shiva Prakash Verma
-
కట్టలు తెగిన కన్నీళ్లు
చైతన్యపురి,మియాపూర్, చిలకలగూడ: ‘చిన్నప్పట్నుంచి ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నాం..టూర్‌కెళ్లొస్తానని వెళ్లిన కొడుకు కనీసం ముఖం కూడా గుర్తుపట్టలేనంతగా నిర్జీవంగా వచ్చాడు. ఇలాంటి దుఖం పగవారికి కూడా రావొద్దు’ అని హిమాచల్‌ప్రదేశ్ బియాస్ నదీ ప్రవాహంలో గల్లంతై మృతిచెందిన తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. గురువారం లభించిన మాచర్ల అఖిల్, ఆశీష్మంథా, శివప్రకాశ్వర్మల మృతదేహాలు శుక్రవారం అధికారులు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు తీసుకరాగా.. అక్కడ్నుంచి వారి కుటుంబసభ్యులు ఇళ్లకు తరలించారు. వచ్చీరాగానే కుమారుల మృతదేహాలు చూసి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు భోరు న విలపిం చారు. వారిని ఓదార్చడం ఎవరితరం కాలేదు. పలువురు రాజకీయప్రముఖులు, కార్పొరేటర్లు, ప్రజాసంఘాల నాయకులు, తోటి స్నేహితులు తరలివచ్చి మృతదేహాల వద్ద నివాళులర్పించారు. శుక్రవారం సాయంత్రం బంధుమిత్రులు, స్నేహితులు, కాలనీవాసుల అశ్రునయనాల మధ్య ఈ ముగ్గురి అంత్యక్రియలు పూర్తయ్యాయి. మాచర్ల అఖిల్ దిల్సుఖ్నగర్ పీఅండ్‌టీ కాలనీకి చెందిన మాచర్ల అఖిల్ మృతదేహాన్ని చూసి అఖిల్ తల్లిదండ్రులు సుదర్శన్, సబిత, సోదరుడు విశాల్, బంధువులు పెద్దపెట్టున రోదించారు. కనీసం ముఖం కూడా కనిపించని స్థితిలో ఉండడంతో తట్టుకోలేకపోయారు. ‘అక్కడికెందుకు పోయావురా’ అంటూ తల్లి ఏడవడం అందరిని కలిచివేసింది. శివప్రకాశ్ వర్మ మియాపూర్‌లోని బ్లోసమ్ అపార్ట్మెంట్ కు చెందిన శివప్రకాశ్‌వర్మ మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు రవివర్మ, సుబ్బలక్ష్మి, సోదరుడు ధీరజ్వర్మ, స్నేహితులు కన్నీరుమున్నీరయ్యారు. స్టడీటూర్‌కు వెళ్లిన తమ కుమారుడు మరో రెండేళ్లలో చేతికందివస్తాడనుకున్నాం కానీ, ఇలా అర్థాంతరంగా తనువుచాలించి నిర్జీవంగా వస్తాడని అనుకోలేదని తల్లి సుబ్బలక్ష్మి రోదన అందరి హృదయాలను కదిలించింది. అనంతరం బంధువులు, స్నేహితులు అశ్రునయనాల మధ్య ఈఎస్ఐ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. అశీష్ మంథా బియాస్ నది దుర్ఘటనలో గల్లంతై మృతిచెందిన అశీష్ మం థా మృతదేహాన్ని చిలకలగూడ శ్రీనివాసనగర్‌లోని ఇంటికి తీసుకొచ్చారు.చలాకీగా టాటా చెబుతూ వెళ్లిన కన్నకొడుకు విగతజీవిగా రావడంతో తల్లి సత్యవాణి కన్నీటిపర్యంతమయ్యారు. ఉబ్బిపోయిన మృతదేహాన్ని చూసి మరింత కడుపుకోతకు గురవుతారని భావించిన బంధువులు బాక్స్‌ను విప్పలేదు. దీంతో ‘కడసారి చూపుకు కూడా నోచుకోలేదా నాయనా’ అంటూ రోదించిన తల్లి సత్యవాణిని ఆపడం ఎవరితరం కాలేదు. భర్త పోయిన విషాదం నుంచి తేరుకోకముందే తనయుడు అశీష్ ప్రమాదవశాత్తు మృతిచెందడంతో తల్లి సత్యవాణి..నేనెందుకు బతకాలి అంటూ బిగ్గరగా ఏడ్చింది. అనంతరం అశీష్ మృతదేహానికి బన్సీలాల్‌పేట శ్మశానవాటిలో అంత్యక్రియలు నిర్వహించారు. -
అదే వేదన ఆతృత
మియాపూర్: హిమాచల్‌ప్రదేశ్ బియాస్ నది వరద ప్రమాదంలో గల్లంతైన విద్యార్థుల తల్లిదండ్రుల వేదన అంతాఇంతా కాదు. ఘటన జరిగి 12 రోజులు దాటినా ఇంకా కొన్ని మృతదేహాలు లభ్యంకాకపోవడంతో వారి సంబంధీకులు తల్లడిల్లిపోతున్నారు. రిస్క్యూటీమ్, భారత రక్షకదళం, ఐటీబీపీ సంయుక్తంగా చేస్తున్న యత్నాలు ఫలించి గురువారం ఒక మృతదేహం లభ్యమైంది. అది నగరానికి చెందిన శివప్రకాశ్వర్మదిగా గుర్తించి వెంటనే విషయాన్ని వారి తల్లిదండ్రులకు తెలియజేయడంతో మియాపూర్ హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. 12 రోజులుగా మృతదేహం లభించకపోవడంతో తమ కుమారుడు ఎక్కడోచోట క్షేమంగా ఉంటాడని భావించిన కుటుంబసభ్యులకు.. నిర్జీవంగా దొరకడంతో కన్నీరుమున్నీరయ్యారు. బాచుపల్లిలోని కాలేజీ నుంచి స్టడీటూర్కెళ్లిన తమ కుమారుడు అర్ధాంతరంగా ఇలా వస్తాడని అనుకోలేదని, చేతికంది వస్తాడని భావించిన తమకు గర్భశోకం మిగిల్చాడని తల్లిదండ్రులు గుండెల విసేలా రోదిస్తున్నారు. నేడు మృతదేహం తరలింపు హిమాచల్‌ప్రదేశ్ బియాస్‌నదిలో లభ్యమైన శివప్రకాశ్‌వర్మ మృతదేహాన్ని శుక్రవారం హెచ్ఎంటీ స్వర్ణపురికాలనీలోని బ్లోసమ్ అపార్ట్‌మెంట్‌కు తీసుకరానున్నారు. విషయం తెలుసుకున్న వీరి సంబంధీకులు అపార్ట్‌మెంట్‌కు తరలివస్తున్నారు. మాచర్ల అఖిల్ మృతదేహం కూడా.. చైతన్యపురి: బియాస్ నదిలో గల్లంతైన దిల్సుఖ్నగర్ పీఅండ్‌టీ కాలనీకి చెందిన మాచర్ల అఖిల్ మృతదేహం గురువారం లభ్యమైంది. అఖిల్ మృతదేహం లభ్యమైందని అధికారుల నుంచి ఫోన్ రావటంతో తల్లిదండ్రులు సుదర్శన్, సవితలు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. శుక్రవారం మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రయానికి అఖిల్ పార్థీవ దేహం చేరుకుంటుందని కుటుంబసభ్యులు తెలిపారు.