breaking news
shares buy back offer
-
బజాజ్ ఆటో: భారీ బై బ్యాక్‌కు గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: ద్విచక్ర, త్రిచక్ర వాహన రంగ దేశీ దిగ్గజం బజాజ్ ఆటో బోర్డు సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్) ప్రతిపాదనకు తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో షేరుకి రూ. 4,600 ధర మించకుండా 9.61 శాతం ఈక్విటీని బైబ్యాక్ చేయనుంది. ఇందుకు రూ. 2,500 కోట్లవరకూ వెచ్చించనుంది. సోమవారం సమావేశమైన బోర్డు ఇందుకు అనుమతించినట్లు బజాజ్ ఆటో వెల్లడించింది. వెరసి ఓపెన్ మార్కెట్ ద్వారా ప్రమోటర్లు, ప్రమోటర్ గ్రూప్‌ను మినహాయించి వాటాదారుల నుంచి రూ. 10 ముఖ విలువగల ఈక్విటీ షేర్లను తిరిగి కొనుగోలు చేయనుంది. కంపెనీ ఈక్విటీలో 9.61 శాతం వాటాకు సమానమైన షేర్లను బైబ్యాక్ చేయనున్నట్లు రెగ్యులేటరీకి బజాజ్ ఆటో సమాచారమిచ్చింది. కాగా మార్చి 31, 2022తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీకి చెందిన రూ. 19,090 కోట్ల మిగులు నగదు, ఇతరాలతో పోల్చినప్పుడు బైబ్యాక్ పరిమాణం తక్కువగా ఉందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. దీంతో మంగళవారం నాటిమార్కెట్లో కంపెనీ షేరు స్వల్ప లాభాలకు పరిమితమైంది. -
డాక్టర్ రెడ్డీస్ షేర్ల బైబ్యాక్ పూర్తి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ (డీఆర్ఎల్) షేర్ల బైబ్యాక్ ఆఫర్ కింద 51 లక్షల షేర్లను కొనుగోలు చేసింది. సగటున షేరు ఒక్కింటికి రూ. 3,090.92 చొప్పున కొనుగోలు చేశామని, ఇందుకోసం మొత్తం రూ. 1,569 కోట్లు వెచ్చించినట్లు వెల్లడించింది. దీంతో బైబ్యాక్ ముగిసినట్లయిందని పేర్కొంది. షేరు ఒక్కింటికి రూ. 3,500కు మించకుండా రూ. 1,569.4 కోట్లు వెచ్చించి ఓపెన్ మార్కెట్ ద్వారా షేర్ల బైబ్యాక్ చేపట్టాలన్న ప్రతిపాదనను ఈ ఏడాది ఫిబ్రవరిలో డీఆర్ఎల్ బోర్డు ఆమోదించింది. అమెరికా ఔషధ రంగ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) నుంచి సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో డీఆర్ఎల్ షేర్ల బైబ్యాక్ చేపట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. తాజా పరిణామాల దరిమిలా మంగళవారం కంపెనీ షేరు ధర 0.81 శాతం పెరిగి రూ. 3,266.81 వద్ద ముగిసింది.