breaking news
Shanthakumari
-
బతుకంతా తెలంగాణకిచ్చిన మహనీయుడు
అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు / సకిలించు ఆంధ్రుడా! చావవెందుకురా!? అన్ని భాషలు నేర్చుకో. కానీ నీ మాతృభాషను మాత్రం తప్పకుండా నేర్చుకోమని చెప్పిన కాళోజీ నారా యణరావు తెలుగు వారికి ఎన్నో విధాల ఆదర్శనీయుడు. కాళోజీ రంగా రావు, రమాబాయమ్మల రెండవ కుమారుడైన ఆయన అసలు పేరు ‘రఘువీర్ నారాయణ్ లక్ష్మీ కాంత్ శ్రీనివాస రామరాజ్.’ కర్ణాటక రాష్ట్రంలోని ‘రట్టహళ్లి’ గ్రామంలో 9 సెప్టెంబర్ 1914న జన్మించారు. ‘కాళన్న’గా తెలుగు ప్రజలకు సుపరిచితులు. కాళోజీ రాజకీయ, సాంఘిక చైతన్యాల సమాహారం. తెలంగాణ జీవిత చలనశీలి. నిజాం నిరంకుశ పాలనపై కలం ఎక్కుపెట్టిన ప్రజాకవి. స్వాతంత్య్ర సమరయోధుడు. పుట్టుక చావులు కాకుండా బతుకంతా తెలంగాణకిచ్చిన మహనీయుడు. జీవితమంతా పోరాటాల్లో మమేకమైన కాళోజీ ‘కాళన్న’గా పరిణామం చెందడం ఒక చారిత్రక ఘట్టం. కాళోజీ తెలంగాణ భాష, యాసలను తరతరాలకు తెలిసే విధంగా రచనలు చేశారు. రాజకీయ వ్యంగ్య కవిత్వం రాయడంలో దిట్ట. తన కవితల ద్వారా పేదలు, తెలంగాణ ప్రజల ఆవేదన, ఆగ్రహాన్ని ప్రపంచానికి చాటిచెప్పారు. ఆయన రాసిన ‘నా గొడవ’ సంకలనంలో సమకాలీన సామాజిక సమస్యలపై నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా, కటువుగా స్పందిస్తూ పాలకులపై అక్షరాయుధాలను సంధించి, ప్రజాకవిగా నిలిచారు. కవిత్వంతో ప్రజలను నిద్రలేపారు. మనిషితనం పట్ల ప్రేమ కలిగిన కాళోజీకి తెలంగాణ యాసపై విపరీతమైన అభిమానం. ఆయన ధిక్కార కవిత్వమంతా తెలంగాణ మాండలికంలోనే సాగింది. కాళోజీ తన భాషాసోయిని తెలుగు ప్రాంతాలన్నింటికి కూడా వ్యాపింపజేసిన వ్యవహారదక్షుడు. ‘బడి పలుకుల భాష కాదు, పలుకుబడుల భాష గావాలె’ అని వ్యావహారిక భాషను అందలమెక్కించిన భాషావాది. శతాబ్దపు జీవన ప్రయా ణంలో ప్రతి నిమిషం పోరాటాన్ని శ్వాసించి, కవిత్వీ కరించిన వ్యక్తి. ‘నేను ప్రస్తుతాన్ని/ నిన్నటి స్వప్నాన్ని/ రేపటి జ్ఞాపకాన్ని’ అని చెప్తూ... ఒక్కమాటలో తన వస్తుతత్వాన్ని చెప్తాడు. అలాగే ‘నవ యుగంబున నాజీ నగ్న నృత్య మింకెన్నాళ్ళు... / హింస పాపమని ఎంచు దేశమున హిట్లరిత్వ మింకెన్నాళ్లు...’ అంటూ తన ధిక్కార స్వరాన్ని వినిపించిన యోధుడు. ‘అన్నపు రాశులు ఒకచోట, ఆకలి చావులు ఒకచోట’ అంటూ బడుగు బలహీన వర్గాలకు బాసటగా... భూస్వామ్య వాదాన్ని తిరస్కరించిన ప్రజావాది. వ్యక్తిత్వం, కవిత్వం వేర్వేరు కాని మనీషి కాళోజీ. సాహిత్య ప్రవేశానికి ముందు కాళోజీ గొప్ప కథకుడు కావాలనో, కవిని అనిపించుకోవాలనో అనుకోలేదు. కాళోజీ కవిత కాలం ప్రవహిస్తున్న వ్యథ. ఒక్క మాటలో చెప్పాలంటే కాళోజీది కమ్యూనికేటివ్ కవిత్వం. తన గొడవ తెలంగాణ గొడవ. మౌలికంగా మనిషి గొడవ. జీవితం, కవిత్వం, రాజకీయాలు అన్నింటిలోనూ కాళోజీ ప్రజాస్వామికవాది. ఇంకా చెప్పాలంటే తీవ్ర ప్రజాస్వామిక వాది. కేవలం పౌర హక్కులకే కాదు, సమాజంలో ఏ దారుణం జరిగినా ఖండించటంలో ఆయన ముందుండేవారు. ‘దోపిడీ చేసే ప్రాంతేతరులను / దూరందాకా తన్ని తరుముతం / ప్రాంతం వారే దోపిడీ చేస్తే / ప్రాణంతోనే పాతర వేస్తం’ అని దళారుల అణచివేత, దోపిడీలను, వాళ్ళతో మిలాఖతయిన ప్రాంతం వారిని నిర్ద్వంద్వంగా ఖండించారు. కలం సిరాను ‘న భూతో న భవిష్యతి’గా వర్ణించిన విశిష్ట కవి కాళోజీ నారాయణరావుకు శత సహస్ర వందన చందన ములతో తెలంగాణ సాహిత్య కళాపీఠం ‘కాళన్న యాదిలో...’ కవితా సంకలనాన్ని 226 మంది కవులతో పుస్తకం తెచ్చింది. అనేక దేశాల్లో వివిధ రంగాలలో... కృషి చేస్తున్న 12 మంది ప్రముఖులైన తెలుగు వారిని గుర్తించి ‘ప్రజాకవి కాళోజీ జాతీయ పురస్కారాలు అందించింది. నేడు ఆ మహాను భావుని జయంతి సందర్భంగా ఘనమైన నివాళి. దాసరి (జంగిటి) శాంతకుమారి వ్యాసకర్త వ్యవస్థాపక అధ్యక్షులు, తెలంగాణ సాహిత్య కళాపీఠం ‘ మొబైల్: 96524 83644 (నేడు కాళోజీ జయంతి) -
కాట్రావత్ శాంతకుమారి: తండా నుంచి థాయ్‌లాండ్‌కు
నాలుగోసారీ ఆడపిల్ల పుట్టింది. భారమవుతుందేమో అమ్మాలనుకుంటే అయిదొందలకు బేరమూ కుదిరింది. మళ్లీ వద్దనుకున్నారు అమ్మానాన్న. ఎంత కష్టమైనా తామే సాకాలనుకున్నారు. ఐదో క్లాసు నుంచే కూలిపనులకెళ్లింది. మిల్లులో కూలిపనుల కోసం సంచుల్లో తవుడు ఎత్తిన ఆ చేయి... ఇప్పుడు అంతర్జాతీయ ఆటస్థలాల్లో వాలీబాల్ ఎత్తుతోంది. బంతిని బాదినంత తేలిగ్గా బీదరికాన్నీ బాదడానికి ప్రయత్నిస్తోంది. నెట్ అవతలికి బంతిని పంపినట్టుగా తన నైపుణ్యాలను దేశం బయటా చూపుతోంది. ఎక్కడో గిరిజనతండాల్లో పుట్టిన ఆ యువతి అంతర్జాతీయ స్థాయిలో సత్తా చూపడానికి ఇప్పుడు మరోసారి సమాయత్తమవుతోంది. ఆల్ ద బెస్ట్... శాంతకుమారి. ఉమ్మడి పాలమూరులోని ప్రస్తుత వనపర్తి జిల్లా చిట్యాల మండలం తూర్పుతండాకు చెందిన క్రీడా ఆణిముత్యం కాట్రావత్ శాంతకుమారి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత వాలీబాల్ క్రీడలో మహిళల కేటగిరిలో జాతీయ జూనియర్ జట్టుకు ఎంపికైన మొట్టమొదటి బాలిక ఆమె. ఈ నెల ఆరు నుంచి 13వ తేదీ వరకు థాయిలాండ్‌లో జరిగిన 14వ ఏషియన్ వాలీబాల్ చాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొని ఇటీవలే రాష్ట్రానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆమె ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఒక్కపూట తిండికీ కష్టమే.. మా అమ్మ పేరు భామిని, నాన్న అమృనాయక్, మేము మొత్తం ఆరుగురు సంతానం. నాకు ముగ్గురు అక్కలు, ఇద్దరు తమ్ముళ్లు. ఇద్దరు అక్కల పెళ్లిళ్లు అయ్యాయి. మూడో అక్క మంజుల ఇంటర్ సెకండియర్, తమ్ముళ్లు కుమార్ తొమ్మిది, రాహుల్ ఏడో తరగతి చదువుతున్నారు. మా అమ్మానాన్న అందరినీ సమానంగా చూస్తారు. పెద్ద కుటుంబం కావడం.. అమ్మానాన్నలకు ఉపాధి దొరక్కపోవడంతో ఒక్క పూట తిండి కూడా కష్టమయ్యేది. మేమందరం ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లోనే చదువుతున్నాం. కరోనాకు ముందు వరకు అమ్మానాన్న ముంబాయికి వలస వెళ్లారు. కరోనా కాలంలో తిరిగి వచ్చాక ఉపాధి దొరకడం కష్టమైంది. ప్రస్తుతం హైదరాబాద్ షేక్‌పేట (నాలా)లో మేస్త్రీ వద్ద పనిచేస్తున్నారు. వారు కష్టం చేసి సంపాదించిన దాంతోపాటు అప్పులు చేసి ఇద్దరు అక్కల పెళ్లిళ్లు చేశారు. మిల్లులో కూలి పనులకు వెళ్లా.. నేను ఒకటి నుంచి నాలుగో తరగతి వరకు చిట్యాల ప్రైమరీ స్కూల్లో చదువుకున్నా. ఐదు నుంచి పదో తరగతి వరకు మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్‌లోని తెలంగాణ రాష్ట్ర గురుకుల పాఠశాల, జూనియర్ కాలేజీ (బాలికలు)లో చదువుతున్నా. నేను ఐదో తరగతి నుంచి మా అక్కలతో కలిసి సెలవు దినాల్లో కూలి పనులకు వెళ్లేదాన్ని. రైస్‌మిల్లులో సంచులు కుట్టడం, తవుడు ఎత్తడం వంటి పనులు చేశాను. పీడీ మేడం చొరవతో ... నాకు చిన్నప్పటి నుంచి ఆటలంటే ఇష్టం. ఎవరైనా ఆటలాడుతుంటే అక్కడే ఉండిపోయేదాన్ని. గురుకుల పాఠశాలకు వచ్చిన తర్వాత మా సీనియర్స్ ఖో ఖో అడుతుంటే.. ఒక్కొక్కరి ఆటను దగ్గరుండి గమనించేదాన్ని. ఒకరోజు మా పీడీ మేడమ్ అరుణారెడ్డి వచ్చి ‘ఏం చూస్తావ్.. నీవు ఆడవా’ అని అడిగారు. ఆ తర్వాత నుంచి మేడమ్‌తో మంచి చనువు ఏర్పడింది. మెల్లమెల్లగా నా దృష్టిని వాలీబాల్ వైపు మళ్లించారామె. ఉదయం ఐదు నుంచి ప్రాక్టీస్ మొదలుపెట్టేవారు. ఓటమితో మొదలు.. 2016లో మండల స్థాయి పోటీల్లో పాల్గొన్నాను. మా జట్టు ఓడిపోయింది. ఆ తర్వాత ఆటపై మరింత దృష్టి సారించా. మహబూబ్‌నగర్‌లో అండర్ 14 విభాగంలో జరిగిన ఎస్జీఎఫ్ ఎంపికల్లో జిల్లా జట్టుకు ఎంపికయ్యా. ఆ తర్వాత భద్రాచలంలో అసోసియేషన్ మీట్ జరిగింది. ఇందులో సెలెక్ట్ కాలేకపోయా. నాలో నిరుత్సాహం అలుముకుంది. అక్కడి నుంచే మేడంకి ఫోన్ చేశా. ఇక నేను వాలీబాల్ ఆడనని! కానీ.. ఆమె నాకు ఎక్కడలేని ధైర్యాన్ని నూరిపోశారు. ఆమె సూచనతో ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టా. అప్పటి నుంచి నేను మానసికంగా బలంగా తయారయ్యా. మెళకువలు నేర్చుకున్నా. అనంతరం సబ్ జూనియర్స్ విభాగంలో రాష్ట్ర, జాతీయస్థాయి ఎంపికల్లో ప్రతిభ కనబరిచా. చెన్నైలో జరిగిన జాతీయ స్థాయి వాలీబాల్ పోటీల్లో సెమీఫైనల్ వరకు వెళ్లాం. అలా టెన్నిస్, వాలీబాల్, బీచ్ వాలీబాల్‌తోపాటు రగ్బీ క్రీడలో సైతం రాణించా. అయితే కోవిడ్ విజృంభణతో రెండేళ్లుగా ఆటల పోటీలకు అవాంతరాలు ఏర్పడ్డాయి. ఆ సమయంలో మా మేడమ్ ప్రత్యేకంగా ఫిట్‌నెస్‌పై ఆన్లైన్ ద్వారా క్లాస్ తీసుకునే వారు. వాలీబాల్ ఆట నుంచి నా దృష్టి మరలకుండా శిక్షణ ఇచ్చేవారు. పాస్‌పోర్టు ఇతరత్రా ఖర్చులు కూడా ఆమే భరించారు. మా పీడీ మేడమ్ చొరవ, ప్రిన్సిపల్ కృష్ణమూర్తి, ఉపాధ్యాయుల ప్రోద్బలంతోనే నేను ఈ స్థాయి వరకు వచ్చాను. నేను వారిని ఎన్నటికీ మరిచిపోలేను. ఏషియన్ పోటీలకు ప్రాతినిధ్యం మరువలేను.. ప్రస్తుతం నేను ఎస్సెస్సీ సప్లిమెంటరీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాను. వార్షిక పరీక్షల సమయంలోనే జాతీయ స్థాయి ఎంపికలు జరిగాయి. ఏప్రిల్ 6న భువనేశ్వర్‌లో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 225 మందికి ట్రయల్స్ నిర్వహించారు. ఇందులో 32 మందిని ఎంపిక చేశారు. ఆ తర్వాత ఇందులో నుంచి 20 మందిని ఎంపిక చేసి జూన్ రెండో తేదీ వరకు శిక్షణ ఇచ్చారు. అనంతరం ఇందులో నుంచి 12 మందిని ఎంపిక చేశారు. ప్రధాన జట్టు ఆరుగురిలో నేను ఒకరిగా నిలవడం.. మనదేశం తరఫున అంతర్జాతీయ పోటీలకు ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడం నా జన్మలో మరచిపోలేని సంఘటన. థాయిలాండ్ లో 14వ ఏషియన్ జూనియర్ వాలీబాల్ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొనడం నాలో మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. పూల్–బీలో పటిష్ట జట్లు అయిన జపాన్, చైనాతోపాటు భారత్ ఉంది. మేము గెలిచింది ఒక మ్యాచ్‌లోనే అయినా... వివిధ జట్ల క్రీడాకారిణుల ఆటను దగ్గరుండి చూశాను. ఆటను మరింత మెరుగుపరుచుకుని జాతీయ స్థాయి సీనియర్స్ జట్టుకు ఎంపిక కావడమే తొలి లక్ష్యంగా పెట్టుకున్నా. ఐపీఎస్ సాధించడమే నా ఆశయం’’ అన్నారు శాంతకుమారి. క్రమశిక్షణ, పోరాట పటిమతోనే.. బాలానగర్‌లోని తెలంగాణ రాష్ట్ర గురుకుల పాఠశాల, జూనియర్ కాలేజీ (బాలికలు) విద్యార్థినులు మొదటి నుంచి చదువుతోపాటు ఆటల్లోనూ ముందున్నారు. రగ్బీలో రాష్ట్ర స్థాయిలో మా స్కూల్ నుంచి ప్రాతినిధ్యం వహించారు. జట్టు గోల్డ్‌మెడల్ గెలుచుకుంది. కాట్రావత్ శాంతకుమారికి క్రీడలంటే చాలా ఇష్టం. వాలీబాల్‌లో ఆమె రాణిస్తుందనే నమ్మకంతో ఆ క్రీడవైపు మళ్లించా. ఎలాంటి ఆధునిక వసతులు లేని చోటు నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదగడం గర్వకారణం. క్రమశిక్షణ, పోరాట పటిమతోనే ఆమె ఈ స్థాయికి వచ్చింది. – ఎం.అరుణారెడ్డి, పీడీ, బాలానగర్ గురుకుల పాఠశాల, జూనియర్ కాలేజీ (బాలికలు) ఐదు వందలకు అమ్మాలనుకున్నాం! మాకు మొదటి ముగ్గురూ ఆడపిల్లలే. నాలుగో సంతానం కూడా ఆడ పిల్లే. అప్పుడే మా గుడిసెలు తగలబడ్డాయి. దీంతో నాలుగో కూతుర్ని అమ్మాలని మా పెద్దలు నిర్ణయానికి వచ్చారు. రూ.500కు గిరాకీ కూడా తీసుకొచ్చారు. కానీ మాకు మనసు ఒప్పలే. ఏ కష్టం చేసైనా సరే. మా బిడ్డల్ని మేమే సాకుతాం అని చెప్పినం. ఉన్న దాంట్లో తింటున్నం. సదివిస్తున్నం. పెళ్లిళ్లు చేసినం.. మా బిడ్డ గొప్ప క్రీడాకారిణిగా ఎదుగుతాంటే గర్వంగా ఉంది. – కె. భామిని, అమృనాయక్, శాంతకుమారి తల్లిదండ్రులు – కిషోర్ కుమార్, పెరుమాండ్ల, (సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్) ఫొటోలు: భాస్కరాచారి, (సాక్షి సీనియర్ ఫొటోగ్రాఫర్) -
చెన్నై ఆస్పత్రిలో నగరి చైర్‌పర్సన్‌కు వైద్యం
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్, ఎమ్మెల్యే రోజా ఫోన్లో పరామర్శ సాక్షి ప్రతినిధి, చెన్నై : తెలుగుదేశం పార్టీ నేతల దాడిలో తీవ్రంగా గాయపడిన వైఎస్సార్సీపీకి చెందిన చిత్తూరు జిల్లా నగరి మున్సిపల్ చైర్పర్సన్ కె.శాంతకుమారికి చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో మెరుగైన చికిత్స అందిస్తున్నారు. వైద్య పరీక్షల నివేదికలు వచ్చాక ఆమె ఆరోగ్య పరిస్థితిని వెల్లడిస్తామని వైద్యులు తెలిపారు. నగరిలో ఆదివారం రంజాన్ తోఫా కార్యక్రమానికి వెళ్లిన ఆమెపై టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడి సమక్షంలో ఆ పార్టీ నేతలు దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో వారు ఆమె కడుపుపై మోకాలితో తన్నడంతో స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించి, మెరుగైన చికిత్స కోసం సోమవారం చెన్నైకి తీసుకువచ్చారు. శాంతకుమారి భర్త, నగరి మాజీ మున్సిపల్ చైర్మన్ కేజే కుమార్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఏప్రిల్ 4వ తేదీన చెన్నై అపోలో ఆసుపత్రిలో ఆమె కడుపునకు ఆపరేషన్ చేశారన్నారు. ఆరు నెలల పాటు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచించిన తరుణంలో పుండు మానక ముందే ఎమ్మెల్సీ గాలి అనుచరులు అమృతరాజ్, అతని తమ్ముడు మైఖేల్‌రాజ్, బాల, మునికృష్ణారెడ్డి తదితరులు మోకాళ్లతో తన్నారన్నారు. గతంలో ఆపరేషన్ చేసిన వైద్యులే ఇపుడు శాంతకుమారికి పరీక్షలు నిర్వహించారని, రిపోర్ట్ వచ్చాకే పరిస్థితి ఏమిటనేది తెలుస్తుందన్నారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా.. శాంతకుమారిని ఫోన్లో పరామర్శించారని చెప్పారు.