breaking news
Shailaja Dwivedi
-
‘నేను అందమైన అదృష్టవంతురాలిని’
సాక్షి, న్యూఢిల్లీ : భర్త సహోద్యోగి, ఆర్మీ మేజర్ నిఖిల్ హండా చేతిలో దారుణ హత్యకు గురైన శైలజ ద్వివేది 2017లో మిసెస్ ఇండియా ఎర్త్ పోటిల్లో అమృత్సర్ తరుపున పాల్గొంది. పోటిల్లో ఫైనలిస్ట్‌గా నిలిచింది. తన మనసుకు నచ్చినట్లే తన జీవితాన్ని గడుపుతాను అని చెప్పేంత తెగువ గల మహిళ శైలజ ద్వివేది. గత సంవత్సరం ఒక ప్రముఖ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన గురించి, తన కుటుంబం గురించే కాక మన దేశంలో మహిళల భద్రత ఎలా ఉంది వంటి పలు అంశాల గురించి తన అభిప్రాయలను తెలియజేశారు. శైలజ ద్వివేది అభిప్రాయాలు ఆమె మాటల్లోనే... ‘‘చిన్నప్పటి నుంచి నా దేశం తరపున ఏదో ఒక పోటీలో పాల్గొనాలనే కోరిక నాలో చాలా బలంగా ఉండేది. రోజువారి జీవితంలో మహిళలు కుటుంబం కోసమే తప్ప తమ కోసం తాము జీవించటం లేదు. ఇక్కడ వారు ఒక విషయాన్ని మర్చిపోతున్నారు. ఆడవారికి కూడా ఒక జీవితం ఉంటుంది. వారికంటూ కొన్ని కలలు, ఆశలు, ఆశయాలు ఉంటాయి. కుటుంబంతో పాటు వాటిని కూడా నెరవేర్చుకోవాలి. నా మనసుకు నచ్చి నేను ఈ మిసెస్ ఇండియా పోటీల్లో పాల్గొంటున్నాను తప్ప నేనేంటో తెలియజేయాలనో, ఇంకేదో సాధించాలనే ఉద్దేశంతో మాత్రం కాదు’ కుటుంబం అంటే ఇలా ఉండాలి... ప్రేమించే భర్త, అల్లరి చేసే పిల్లలు వారి మధ్య ఒకరి మీద ఒకరికి ప్రేమ, గౌరవాలతో కూడిన ఒక అనుబంధం ఉంటే అదే అసలు సిసలు కుటుంబం. అటువంటి కుటుంబంలోని వారంతా కలిసి పనిచేసుకుంటూ, తమ అభిప్రాయలను ఒకరితో ఒకరు పంచుకుంటూ సంతోషంగా ఉంటారు. అటువంటి కుటుంబం ఎప్పుడు సంతోషంగా ఉంటుంది. నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే అందమైన వ్యక్తినే నేను వివాహం చేసుకున్నాను మహిళల భద్రత... మహిళల భద్రత పట్ల మన దేశంలో ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలతో పాటు మరిన్ని కఠిన చట్టాలు తేవాల్సిన అవసరం ఉంది. దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్న అత్యాచారాలు, వేధింపులు, యాసిడ్ దాడులు, గృహహింస వేధింపులు చూస్తుంటే మనం ఇంతటి భయంకర సమాజంలో బతుకుతున్నామా అనిపిస్తుంది. ఖాళీ సమయాల్లో హిందీ సినిమాలు చూడ్డటం, పాటలు వినటం తనకు ఇష్టం. బాగా కబుర్లు చెప్పెవారంటే నాకు చాలా ఇష్టం. నాకు ఆత్మవిశ్వాసం ఎక్కువ. అందం, అదృష్టం కలిసిన అమ్మాయిని నేను’’. చదువులోనూ చురుకే... అందం మాత్రమే కాక చదువులోనూ ముందే ఉండేవారు శైలజ. ఒక్కసారి ఆమె విద్యాభ్యాసాన్ని పరిశీలిస్తే ట్రావేల్ అండ్ టూరిజమ్‌లో డిగ్రీ, ఆర్బన్ ప్లానింగ్‌లో ఎంటెక్, జియోగ్రఫీలో మాస్టర్స్ చేశారు. అంటే సాంప్రదాయ బద్దంగా డిగ్రీలో తీసుకున్న సబెక్ట్నే పీజీలో చదవకుండా నూతన అంశాలను ఎంచుకుంటూ కొత్తదనం అంటే ఎంత ఇష్టమే చెప్పకనే చెప్పారు. పెళ్లి చేసుకోవడానికి నిరాకరించారన్న అక్కసుతో ఆమెను నిఖిల్ హండా అతి దారుణంగా గొంతు కోసి మరి చంపాడు. -
6 నెలల్లో 3500 ఫోన్ కాల్స్.. పొసెసివ్‌నెస్ వల్లే
సాక్షి, న్యూఢిల్లీ : సహోద్యోగి భార్యను హత్య చేసిన కేసులో నిందితుడు, ఆర్మీ మేజర్ నిఖిల్ హండాను ఆదివారం ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నిఖిల్‌ను సోమవారం కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు.. ఈ కేసులో కీలక సాక్ష్యాధారాలు, వివరాలు రాబట్టేందుకు అతడిని తమ కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోరారు. విచారణ అనంతరం పలు కీలక విషయాలు వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం... సహోద్యోగి, మేజర్ అమిత్ ద్వివేది భార్య శైలజను వివాహం చేసుకోవాలని భావించిన నిఖిల్.. శైలజను కలవడానికి ముందు రోజే తన భార్యతో గొడవ పడ్డాడు. అనంతరం ఢిల్లీకి వచ్చి శైలజను తన హోండా సిటీ కారులో ఎక్కించుకుని తీసుకెళ్లాడు. తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా ఆమెను కోరాడు. అందుకు శైలజ నిరాకరించడంతో పదునైన ఆయుధంతో ఆమె గొంతు కోసి హత్య చేశాడు. తర్వాత ఆమె మరణాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు మృతదేహాన్ని తన కారులో తీసుకెళ్లి రోడ్డుపై పడేశాడు. ఆ తర్వాత మీరట్‌కు వెళ్లిన అనంతరం కారును పూర్తిగా శుభ్రం చేశాడు. శైలజ, తన ఫోన్లలో ఉన్న కొన్ని అప్లికేషన్లను డెలిట్ చేశాడు. అంతేకాకుండా తన ఫోన్‌ను పూర్తిగా ధ్వంసం చేసి, ఇంటి సమీపంలో ఉన్న ఓ చెత్త డబ్బాలో పడేశాడు. తర్వాత తన స్నేహితుడికి ఫోన్ చేసి శైలజను చంపేసినట్టు చెప్పాడు. అయితే ఆమెతో తనకు అంతగా చనువు లేదని తెలిపాడు. అయితే నిఖిల్ కారును పరిశీలించిన ఫోరెన్సిక్ నిపుణులు రక్తపు మరకలు, వేలి ముద్రలు, ముందు సీటు భాగంలో ఇరుక్కున్న తల వెంట్రుకలు గుర్తించారు. అవి శైలజకు సంబంధించినవిగా తేల్చారు. నిఖిల్ ఫోన్ డేటాను పరిశీలించినన పోలీసులు గడిచిన ఆరు నెలల్లో 3500 సార్లు శైలజకు ఫోన్ చేసినట్లుగా గుర్తించారు. శైలజ, నిఖిల్ ఫోన్లలో తొలగించిన యాప్స్‌ను తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తునట్లు పోలీసులు తెలిపారు. ఈ అంశాలన్నీ పరిశీలిస్తుంటే శైలజ విషయంలో పొసెసివ్నెస్తోనే నిఖిల్ ఉన్మాదిగా మారినట్టు తెలుస్తోందని పోలీసు ఉన్నతాధికారి పేర్కొన్నారు. అయితే శైలజను హత్య చేసేందుకు ఉపయోగించిన ఆయుధం మాత్రం ఇంకా లభించలేదని ఆయన తెలిపారు.