సీనియర్ సిటిజన్‌కు సినీ నిర్మాత టోకరా.. కేసు నమోదు
బంజారాహిల్స్: పదేళ్ల పాటు లీజుకు తీసుకుని భవనాన్ని 99 ఏళ్ల లీజు అంటూ ఫోర్జరీ పత్రాలను సృష్టించి మోసం చేయడంతో పాటు వృద్ధురాలిని బెదిరింపులకు గురిచేస్తున్న వ్యవహారంలో సినీ నిర్మాత, రౌడీషీటర్ షేక్ బషీద్‌తో పాటు అతని భార్యపై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–10లో నివాసం ఉంటున్న లక్ష్మీశ్వరి (85) కుమారుడు తిరుమల వెంకటేష్ అమెరికాలో ఉంటారు. అతడికి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్–25లో భవనం ఉంది. దానికి జీపీఏ హోల్డర్‌గా ఉన్న తల్లి లక్ష్మీశ్వరి వద్ద నుంచి 2013లో సినీ నిర్మాత షేక్ బషీద్, అతని భార్య షేక్ కరీమున్నీసా లీజుకు తీసుకున్నారు.పదేళ్ల పాటు లీజుకు ఇచ్చినట్లు ఒప్పందం కుదుర్చుకున్నారు. 2023లో లీజు గడువు ముగియడంతో ఖాళీ చేయాలంటూ యజమానులు చెప్పగా, తమకు 99 ఏళ్ల పాటు లీజు ఉందంటూ పత్రాలు చూపించారు. 2012 నుంచి 2112 దాకా ఇంటిని ఖాళీ చేసే ప్రసక్తే లేదంటూ షేక్బషీద్ చెప్పడంతో లక్ష్మీశ్వరి షాక్‌కు గురయ్యారు. అప్పటి నుంచి అద్దె చెల్లించకపోవడంతో పాటు బెదిరింపులకు దిగుతున్నారు. ప్రభుత్వాలు తప్ప ప్రైవేటు వ్యక్తులు ఎవరూ 99 ఏళ్లకు ఇంటిని లీజు ఇవ్వరని, తప్పుడు పత్రాలతో తన ఇంటిని కాజేసే కుట్ర చేస్తున్నారంటూ బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు షేక్బషీద్తో పాటు అతని భార్య కరీమున్నీసాలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.