breaking news
Settop box
-
జియో బ్రాడ్‌బ్యాండ్‌తో సెట్‌టాప్ బాక్స్ ఉచితం!
న్యూఢిల్లీ: డీటీహెచ్, కేబుల్ టీవీ కస్టమర్లను ఆకర్షించే దిశగా టెలికం దిగ్గజం రిలయన్స్ జియో ప్రతి బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌పై ఉచితంగా సెట్‌టాప్ బాక్స్ కూడా అందించనున్నట్లు తెలుస్తోంది. ‘జియోఫైబర్ కస్టమర్లందరికీ కాంప్లిమెంటరీ సెట్‌టాప్ బాక్స్ కూడా లభిస్తుంది‘ అని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అలాగే, పేరొందిన ఎంటర్టైన్మెంట్ మొబైల్ యాప్స్‌లోని వీడియో కంటెంట్, సినిమాలు మొదలైనవన్నీ కూడా జియోఫైబర్ కస్టమర్లకు అందుబాటులో ఉంటాయి. వీటి సబ్స్క్రిప్షన్ ఫీజు కూడా కలిపే బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ చార్జీలు ఉంటాయి. ప్రత్యేకంగా కంటెంట్‌కు చెల్లించనక్కర్లేదు. ఇక సెట్‌టాప్‌కు కెమెరాను అమర్చుకుంటే టీవీ ద్వారా వీడియో కాలింగ్ సేవలు కూడా పొందవచ్చని సమాచారం. నేటి నుంచి (సెప్టెంబర్ 5) ఆప్టికల్ ఫైబర్ ఆధారిత జియోఫైబర్ సర్వీసులను జియో ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. జియోఫైబర్ కస్టమర్లకు ల్యాండ్‌లైన్ నుంచి జీవితాంతం ఉచిత వాయిస్ కాల్స్, సెకనుకు 100 మెగాబిట్ నుంచి 1 గిగాబిట్ దాకా స్పీడ్‌తో బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందనున్నాయి. దీని చార్జీలు నెలకు రూ. 700 నుంచి ప్రారంభమవుతాయి. వార్షిక ప్లాన్ తీసుకున్న వారికి ఉచితంగా హెచ్డీ టీవీ సెట్ కూడా అందిస్తామంటూ రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ ముకేశ్ అంబానీ గతంలో వెల్లడించారు. మొత్తం మీద జియోఫైబర్ రాకతో చాలామటుకు డైరెక్ట్ టు హోమ్ సేవలందించే సంస్థల వ్యాపారాలకు గట్టి దెబ్బే తగిలే అవకాశాలు ఉన్నాయని పరిశమ్రవర్గాలు భావిస్తున్నాయి. దీన్ని తట్టుకునేందుకు ఆయా సంస్థలు ఇప్పటికే వివిధ ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి. జీ5, హుక్ వంటి పలు వీడియో స్ట్రీమింగ్ మొబైల్ యాప్స్ కంటెంట్ అందుబాటులోకి తెస్తూ భారతీ ఎయిర్టెల్ కొత్తగా రూ. 3,999కి సెట్ టాప్ బాక్స్‌ను ఆవిష్కరించింది. తొలి ఏడాది తర్వాత రూ. 999 వార్షిక ఫీజుతో సబ్‌స్క్రిప్షన్‌ను కొనసాగించవచ్చు. -
బుల్లితెర కష్టాలు
సాక్షి, హన్మకొండ: కేబుల్ టీవీ డిజిటలైజేషన్ ప్రక్రియ మరోసారి తెరపైకి వచ్చింది. జులై 31 అర్ధరాత్రి నుంచి అనలాగ్ ప్రసారాలు నిలిపేస్తామని కేంద్రం మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. దీంతో జులై 31 నుంచి సెట్‌టాప్ బాక్సులు అమర్చుకోని వారికి కేబుల్ టీవీ ప్రసారాలు నిలిచిపోనున్నాయి. మళ్లీ బుల్లితెరపై సీరియళ్లు, సినిమాలు స్పోర్ట్స్ సందడి చేయాలంటే డిజిటల్ ప్రసారాలు అందించే సెట్‌టాప్ బాక్సు అమర్చుకోవాల్సిందే. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 2016 జులై 31 నుంచి అనలాగ్ పద్ధతిలో ఉన్న కేబుల్ టీవీ ప్రసారాలు నిలిచిపోనున్నాయి. దీని ప్రభావంతో తెలంగాణలో 186, ఆం«ధ్రప్రదేశ్‌లో 180 పట్టణాల్లో కేబుల్ టీవీ ప్రసారాలు డోలాయమానంలో పడ్డాయి. కేబుల్ టీవీ వ్యవస్థను డిజిటలైజ్ ప్రక్రియ మూడోదశలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, 2011 జనాభా లెక్కల ప్రకారం జనాభా ఎక్కువగా ఉన్న మేజర్ పంచాయతీలు, టౌన్‌షిప్‌లలో కేబుల్ టీవీ ప్రసారాలను 2015 డిసెంబరు 31లోగా డిజిటలైజ్ చేయాలంటూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబం«ధించి మూడో దశలో ఉన్న పట్టణాలు, ప్రాంతాలు, అక్కడున్న కేబుల్ కనెక్షన్ల వివరాలతో రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ 2015 ఏప్రిల్‌లో సమాచారం అందించింది. అయితే డిమాండ్‌కు సరిపడా సెట్‌టాప్ బాక్సులు అందుబాటులో లేకపోవడంతో నిర్ధేశించిన గడువులోగా డిజిటలైజేషన్ ప్రక్రియ సాధ్యం కాలేదు. ఫలితంగా కేంద్రం 2016 జులై 31 వరకు గడువు పొడిగించింది. అరకొర ప్రకటనలే జారీ.. కేబుల్ టీవీ డిజిటలైజేషన్ గురించి అరకొర ప్రకటనలు ఇవ్వడం తప్ప కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎటువంటి ప్రయత్నం జరగలేదు. వినియోగదారులకు అవగాహన కల్పించడం, మాస్టర్ సిస్టమ్ ఆపరేటర్ల (ఎంఎస్ఓ)లపై ఒత్తిడి తీసుకురావడంలో విఫలమయ్యాయి. దీంతో కేబుల్ టీవీ డిజిటలైజేషన్ ప్రక్రియ ఏళ్లతరబడి మందకొడిగానే సాగుతోంది. గతేడాది వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో పదిశాతం వరకు కేబుల్ కనెక్షన్లు సెట్‌టాప్ బాక్సులు అమర్చుకున్నాయి. ఈ ఏడాది తొలి అర్ధభాగంలో అదనంగా మరో ఇరవై శాతం కనెక్షన్లకు సెట్‌టాప్ బాక్సులు అమర్చారు. మొత్తంగా ఇరు రాష్ట్రాల్లో కలిపి ప్రస్తుతం 30 శాతం కనెక్షన్లకే సెట్‌టాప్ బాక్సులు అమర్చినట్లు సమాచారం. ఇక ఈ వారం రోజుల్లో మిగిలిన 70 శాతం కనెక్షన్లకు సెట్‌టాప్ బాక్సులు అమర్చడం కష్టమే. అనలాగ్ కేబుల్ ప్రసారాలు నిలిచిపోతే వినియోగదారుల నుంచి సెట్‌టాప్ బాక్సులకు తీవ్రమైన డిమాండ్ వస్తుంది. ప్రస్తుతం డిమాండ్‌కు తగిన స్థాయిలో మార్కెట్లో సెట్‌టాప్ బాక్సులు లభించడం కష్టమే. దీంతో మరోసారి గడువు పెంచేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి.