breaking news
September 28
-
International Safe Abortion Day: ఈ దేహం నాది ఈ గర్భసంచి నాది
ఒక శిశువు గర్భసంచిలో ఊపిరి పోసుకుంటుంది. ఆ గర్భసంచి మీద హక్కు ఎవరిది? ఒక శిశువు ప్రసవ వేదనను ఇచ్చి భూమ్మీదకు వస్తుంది. ఆ ప్రసవవేదన కలిగించే నొప్పి ఎవరిది? ఒక శిశువు కళ్లు విప్పిన వెంటనే పాలకై ఎద దగ్గర నోరు తెరుస్తుంది. పాలు కుడిపే ఆ ఎద ఎవరిది? దేహం ఎవరిదో వారిది. స్త్రీది. మహిళది. యువతిది. వివాహితది. అవివాహితది. ఆమె వితంతువు కావచ్చు. డైవోర్సీ కావచ్చు. ఆమె ఎవరైనా బిడ్డకు జన్మనిచ్చేది ఆమెనే. మరి ఆమె శరీరం మీద హక్కు ఆమెకు ఉందా? ఎప్పుడు కనాలో ఎప్పుడు వద్దనుకోవాలో నిర్ణయించుకుంటోందా? అవాంఛిత గర్భం వస్తే ‘ఈ గర్భం నాకు వద్దు’ అని గట్టిగా చెప్పి తొలగించుకుంటోందా? ఎన్నో అడ్డంకులు నిన్న మొన్న వరకూ ఉన్నాయి. ఇవాళ ఆ సకల ఇబ్బందులను, అడ్డంకులను, చట్టపరమైన చికాకులను, సాంఘికపరమైన మూసను సుప్రీంకోర్టు బద్దలు కొట్టింది. స్త్రీల తరఫున చాలా స్వాగతించదగిన తీర్పు ఇచ్చింది. దేశ మహిళా చరిత్రలో ఇదొక ముఖ్య ఘట్టం. ఈ సందర్భంగా భిన్న రంగాల, నేపథ్యాల మహిళల ప్రతిస్పందనను ఇక్కడ అందిస్తున్నాం... ‘దేశంలో ప్రతి మహిళకు ఆమె వివాహిత అయినా అవివాహిత అయినా గర్భస్రావం చేసుకునే హక్కు ఉంది’ అని గురువారం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ‘అంతర్జాతీయ సురక్షిత గర్భస్రావ దినోత్సవం’ – సెప్టెంబర్ 28 కాగా ఆ మరుసటి రోజే ఈ తీర్పు రావడం కాకతాళీయమే అయినా సందర్భం, ఆ సందర్భానికి ఈ తీర్పు వన్నె తెచ్చింది. విస్తృతంగా అధ్యయనం చేయాలి ఈ తీర్పు నిజంగా సంచలనమే. అయితే తీర్పుతోపాటు తదుపరి చట్టాల రూపకల్పనకు ముందు మరింతగా అధ్యయనం చేయాలి. ఈ తీర్పులో ఉన్న క్లాజ్‌ను అడ్డుపెట్టుకుని దుర్వినియోగం చేసుకునే వాళ్లు పెరిగే ప్రమాదం లేకపోలేదు. అది కూడా వివాహిత మహిళల విషయంలోనే. సాధారణంగా తొలి బిడ్డ విషయంలో జెండర్ పట్ల కొంచెం పట్టువిడుపులతో ఉంటారు. మొదటి బిడ్డ ఆడబిడ్డ అయితే... రెండవ బిడ్డ మగపిల్లవాడయితే బావుణ్ను అనే భావజాలం మన సమాజాన్ని ఇంకా వదల్లేదు. రెండవ బిడ్డ విషయంలో రహస్యంగా లింగనిర్ధారణ చేసుకుని ఆ తర్వాత ‘భర్తతో సఖ్యత లేని కారణంగా గర్భాన్ని వద్దనుకుంటున్నట్లు చెప్పి అబార్షన్ చేయించుకోమని భర్తలే భార్యల మీద ఒత్తిడి తీసుకువచ్చే’ ప్రమాదం ఉంది. లింగనిర్ధారణ ఇరవై వారాలకు తెలుస్తుంది. ఆడ–మగ నిష్పత్తిని సరిదిద్దడానికి చేస్తున్న ప్రయత్నాలకు విఘాతం కలిగే ప్రమాదాన్ని చట్టబద్ధం చేసినట్లవుతుంది. అలాగే అవివాహితుల విషయంలో కూడా... థైరాయిడ్ సమస్యలు ఎక్కువగా ఉన్న ప్రస్తుత తరుణంలో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ చాలామందిలో ఉంటున్నాయి. అలాంటప్పుడు గర్భం దాల్చినట్లు సందేహం కలిగి పరీక్ష చేయించుకునేటప్పటికే మూడు నెలలు దాటి ఉంటుంది. ఇక సహజీవనాలలో అన్‌సేఫ్ సెక్స్ తర్వాత అబార్షన్ పిల్ వేసుకోవడం కూడా చాలా మామూలుగా చేస్తున్నారు. గతంలో అది కూడా డాక్టర్ పర్యవేక్షణలోనే ఉండేది. ఇప్పుడు మెడికల్ షాపులో దొరుకుతోంది. ఆ టాబ్లెట్ వేసుకుంటే కొందరికి విపరీతంగా బ్లీడింగ్ అవుతుంది. స్పృహ కోల్పోయే పరిస్థితుల్లో డాక్టర్ దగ్గరకు వస్తుంటారు. ఇందులో మహిళల ఆరోగ్యం, సామాజిక ఆరోగ్యం కూడా కలగలిసి ఉంది. అందుకే చట్టాన్ని రూపొందించేటప్పుడు మరింత విస్తృతంగా అధ్యయనం చేసి పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. – డాక్టర్ పి.కృష్ణ ప్రశాంతి, చైర్పర్సన్, ఏపీఐ, ఆంధ్రప్రదేశ్ వ్యక్తిగత గౌరవానికి ప్రాధాన్యత సుప్రీంకోర్టు తాజా తీర్పుతో స్త్రీకి సంపూర్ణ స్వాతంత్య్రం వచ్చినట్లయింది. ఈ తీర్పు హర్షణీయం. అవాంఛిత గర్భాన్ని సురక్షితంగా తొలగించుకునే హక్కు కల్పించడం ద్వారా సుప్రీంకోర్టు మహిళల వ్యక్తిగత గౌరవానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చి అత్యాచారం, సహజీవనం వల్ల ఏర్పడిన అవాంఛిత గర్భాన్ని అయిష్టంగా మోయాల్సిన అవసరం స్త్రీకి ఉండకూడదు. మహిళలకు రక్షణ లేని సమాజంలో బడి, గుడి, రైలు పెట్టె, ఇతర వాహనాలు... అన్నీ ఆమె మీద లైంగిక దాడికి వేదికలవుతున్న నేపథ్యంలో ఇలాంటి చట్టం రావడం మంచిదే. అవాంఛిత గర్భాన్ని తొలగించుకోవడం ద్వారా ఆమె భవిష్యత్తు సాఫీగా సాగుతుంది. కెరీర్లో కార్యసాధికారత సాధించడానికి ఎదురయ్యే అడ్డంకులను తొలగిస్తోంది ఈ చట్టం. – చాకలకొండ శారద, రాష్ట్ర ఉపాధ్యక్షులు, అశ్లీల ప్రతిఘటన వేదిక, ఆంధ్రప్రదేశ్ ‘ఆమె’ అనుమతి అవసరం! ఇది ఆహ్వానించదగిన తీర్పు. సమాజంలో అనాథలను తగ్గించడానికి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అబార్షన్ చట్టం లేకపోవడం అనాథల సంఖ్య పెరగడానికి కారణమయ్యేది. పిల్లల స్వేచ్ఛ, హక్కుల పరిరక్షణకు ఈ చట్టం దోహదం చేస్తుంది. ఒక ప్రాణిని భూమ్మీదకు తేవాలంటే స్త్రీ–పురుషులిద్దరి అంగీకారం, సంసిద్ధత అవసరం. పుట్టిన బిడ్డను బాధ్యతగా పెంచడానికి సిద్ధమైన తర్వాత మాత్రమే పిల్లల్ని కనాలి. అవాంఛిత గర్భంతో పుట్టిన పిల్లలు వీధిన పడతారు. ఇంట్లో ఉన్నా కూడా నిరాదరణకు గురవుతూ పెరుగుతుంటారు. ఇన్ని అనర్థాలకు అడ్డుకట్ట వేయడానికి ఈ చట్టం ఉపయోగపడుతుంది. అలాగే మన చట్టాల్లో శృంగారజీవితానికి వయో పరిమితి తగ్గుతూ వివాహ వయస్సు పరిమితి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కూడా ఈ నిర్ణయం సహేతుకమైనదే. చాలామంది పెళ్లయిన ఐదారు నెలల్లో విడిపోతుంటారు. విడిపోవాలనే నిర్ణయం తీసుకునేటప్పటికే ఆమె గర్భం దాల్చి ఉంటే... ఆ గర్భాన్ని కొనసాగించాలా వద్దా అనేది ఆమె ఇష్టమే అయి ఉండాలి. అలాగే సహజీవనాల్లో గర్భాన్ని నివారించుకునే జాగ్రత్తలు తీసుకోకపోవడం వంటి పరిస్థితుల్లో స్త్రీ గర్భం దాల్చగానే మగవాళ్లు ముఖం చాటేసే సందర్భాలే ఎక్కువ. అలాంటి పరిస్థితులకు కూడా ఈ తీర్పు సరైన పరిష్కారమే అవుతుంది. శృంగారానికి ‘ఆమె’ అనుమతి ఎలా అవసరమో, గర్భాన్ని కొనసాగించుకుని బిడ్డను కనాలా లేక తొలగించుకోవాలా అనేది కూడా ఆమె అనుమతితోనే జరగాలి. – సంధ్య, నేషనల్ కన్వీనర్, పీఓడబ్లు్య పురోగతితో కూడిన తీర్పు ఫెమినిస్ట్‌లు, మహిళా సమస్యలపై పనిచేసేవారందరూ ఈ తీర్పును స్వాగతిస్తారు. ప్రధానంగా అబార్షన్ చుట్టూ ఉన్న చాలా కోణాలను ఈ తీర్పులో కవర్ చేసింది. ఒక విషయం కాదు పెళ్లి, పెళ్లికి ముందు, అత్యాచార సంఘటనలలోనూ.. అన్ని సమస్యలను చర్చించింది. అమెరికన్ సొసైటీ మన కంటే చాలా ముందంజలో ఉందంటాం. అయితే, అక్కడ కూడా అబార్షన్‌కి సంబంధించిన హక్కులు అంతగా లేవు. ఆ నేపథ్యంలో చూస్తే ఇది మన దగ్గర పురోగతితో కూడిన తీర్పు. మహిళలకు అబార్షన్ చేయించుకోవడం మీద ఎంత వరకు నిర్ణయాధికారం ఉంటుందో మనకు తెలుసు. పురుషాధిక్య సమాజంలో నిర్ణయాధికారం ఎక్కువగా మగవాడి చేతుల్లో ఉంటుంది. దానిని అరికట్టడానికి చట్టప్రకారం సురక్షితమైన అబార్షన్ అనే క్లాజు మహిళలకు వర్తిస్తుంది. ఇది కూడా మహిళల స్వయం నిర్ణయంతో జరుగుతుందా లేదా.. అనేది ఇంకొంచెం స్పష్టత వస్తే బాగుండు అనిపించింది. కాకపోతే, ఇది లైంగిక స్వేచ్ఛకు సంబంధించి చాలా పెద్ద ముందడుగే అని చెప్పవచ్చు. సమాజపు ఒత్తిడి నుంచి స్త్రీల మీద ఉండే పెద్ద బరువును తగ్గించిందని చెప్పవచ్చు. – కె.ఎన్ మల్లీశ్వరి, రచయిత ఉద్దేశ్యం మంచిదే! ఇండియాలో 1971లో మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్‌ను ప్రవేశపెట్టారు. ఆ తర్వాత యాభై ఏళ్లుగా వివిధ పరిస్థితుల్లో దీనిని చట్టబద్ధం చేస్తూ వచ్చారు. ఒకప్పుడు బిడ్డ పుడితే కాపురం సెట్ అవుతుంది అనుకునే సంఘటనలు ఉన్నాయి. నాకు ఆడపిల్ల ఇష్టం లేదు, మగపిల్లవాడు కావాలి.. అని అబార్షన్లు చేయించేవారు. ఇలా రకరకాల కారణాల వల్ల మహిళ తనకు ఇష్టం లేకపోయినా ఒత్తిడితో కూడిన బరువును మోసేది. ఈ రోజుల్లో అమ్మాయిలు చాలా తెలివిగా వారి గురించి వారు ఆలోచించుకునే స్థితికి వచ్చేశారు. ఏ స్త్రీ అయినా ప్రేమతో తన బిడ్డను కని, పెంచాలనుకుంటుంది. ‘భరించలేను’ అనే స్థితి ఉంటే తప్ప అబార్షన్ అనే ఆలోచన చేయదు. మనసుకు ఈ బాధ్యతను తీసుకోలేను అనుకున్నప్పుడు బిడ్డను కనాలా, వద్దా? అనే స్వేచ్ఛ స్త్రీకి ఉండటం అవసరం. దానినే సుప్రీం కోర్టు తీర్పుగా చెప్పింది. ఇది చాలా ఆహ్వానించదగింది. – రాజేశ్వరి, అడ్వొకేట్ లైంగిక జీవన హక్కులను బలపరిచే తీర్పు వివాహానికి ఆవల మహిళలకు ఏర్పడే సంబంధాల వల్ల వచ్చే గర్భాన్ని విచ్ఛిత్తి చేసుకొనే అవకాశం లేదని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేస్తూ చారిత్రాత్మక తీర్పుని వెలువరించింది. అవివాహిత స్త్రీలకు అబార్షన్ హక్కుని నిరాకరించడం రాజ్యాంగ విరుద్ధం అని, అబార్షన్ చట్టం చేసిన నాటి సామాజిక పరిస్థితులు, విలువలూ మారాయనీ, అవివాహితలకు అబార్షన్ హక్కుని నిరాకరించడం ఆర్టికల్ 14కి విరుద్ధం అని బెంచ్ అభిప్రాయపడడం స్త్రీల పునరుత్పత్తి హక్కుల గుర్తింపులో ఖచ్చితంగా ఒక ముందడుగే. అవివాహితుల అబార్షన్ హక్కును రాజ్యం నియంత్రించజాలదనీ, స్త్రీలలో పెరిగే పిండాన్ని తొలగించుకొనే హక్కు వారి శరీరం పై వారికి గల హక్కులలో భాగంగా చూడాలనీ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రకమైంది. ఇది వివాహం బయట స్త్రీల లైంగిక జీవన హక్కులను బలపరిచే తీర్పు. – కత్తి పద్మ, మహిళా హక్కుల కార్యకర్త చట్టబద్ధం కావడం ప్రాణాలను నిలబెడుతుంది సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గర్భిణి దశలో భర్తను కోల్పోయిన మహిళలు, గర్భిణిగా ఉండి విడాకులు పొందిన వాళ్లు సదరు వైవాహిక బంధం తాలూకు గర్భాన్ని కొనసాగించి తీరాల్సిన అవసరం ఉండదు. ఆమెకు ఇష్టం అయితే కొనసాగించవచ్చు. బిడ్డను పెంచలేని స్థితిలో ఉన్న మహిళలకు కూడా ఈ తీర్పు ఉపయుక్తమవుతుంది. అలాగే చట్టం ఆమోదించని రోజుల్లో ఒక అవివాహిత గర్భవిచ్ఛిత్తి చేయించుకోవాలంటే, చట్టవిరుద్ధమైన అబార్షన్ చేయడానికి డాక్టర్లు ఆమోదించేవారు కాదు. దాంతో వాళ్లు అరకొర పరిజ్ఞానం ఉన్న వైద్య సహాయకులతో అబార్షన్ చేయించుకోవడం, ప్రాణాల మీదకు తెచ్చుకోవడం జరిగేది. ఇప్పుడు అలాంటి ప్రమాదాలు ఉండవు. – నిశ్చల సిద్ధారెడ్డి, గవర్నమెంట్ ప్లీడర్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్వాగతించాల్సిందే! ఈ రోజుల్లో రిలేషన్స్ విషయంలో వస్తున్న మార్పులను దృష్టిలో పెట్టుకొని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించాల్సిందే. గర్భం విషయంలో మహిళ మాత్రమే నిర్ణయం తీసుకోగల స్వేచ్ఛ ఉండాలి. స్వతంత్రంగా ఎదుగుతున్న మహిళకు తనకు నచ్చిన నిర్ణయం తీసుకునే హక్కు ఉంది. ఇది అవసరం కూడా. కుటుంబం, స్నేహితులు, కొలీగ్స్.. సమాజంలో ఎవరైనా సరే, ఆమెను తప్పు పట్టడం సరైనది కాదు. ఎవరు సమస్యను ఎదుర్కొంటున్నారో వారు మాత్రమే నిర్ణయం తీసుకోగల స్వేచ్ఛ ఉండాలి. – డాక్టర్ ఝిలమ్ ఛట్రాజ్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఆర్బివిఆర్ఆర్ ఉమెన్స్ కాలేజీ స్వార్థానికి వాడకూడదు.. పెళ్లయినా, అవివాహితైనా బిడ్డను కనాలా, వద్దా అనే నిర్ణయించుకునే హక్కు పూర్తిగా స్త్రీకి ఉండాలి. ఇందులో పెద్దల జోక్యం కూడా ఉండకూడదు. పెళ్లి, ఆర్థిక భద్రత అంశాలను పరిగణనలోకి తీసుకొని అన్ని జాగ్రత్తలతో గర్భం దాల్చిన స్త్రీలను నేను చూశాను. అయితే, తమ స్వార్థ ప్రయోజనాల కోసం దీనిని ఆయుధంగా ఉపయోగించకూడదు. – పూనమ్ కౌర్, నటి దుర్వినియోగం కాకూడదు పరిస్థితిని బట్టి నిర్ణయం ఉంటుంది. అయితే, చట్టంలో ఉంది కదా అని అవకాశాన్ని దుర్వినియోగం చేయకూడదు. కుటుంబం, ఆరోగ్యంపైన తీవ్ర ప్రభావం చూపే ఘటన కాబట్టి అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అవగాహనతో తమ భావి జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి తప్ప ఈజీగా తీసుకోకూడదు, అలాగని ఓకే చేయకూడదు. – వాణి, గృహిణి -
మార్కెట్లోకి మళ్లీ గెలాక్సీ నోట్7
సియోల్ :బ్యాటరీ పేలుళ్ల ఘటనలతో ఇటు శాంసంగ్ కంపెనీకి అటు వినియోగదారులకు వణుకుపుట్టించిన గెలాక్సీ నోట్ 7 అమ్మకాలు పునఃప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 28 నుంచి దక్షిణ కొరియాలో మళ్లీ అమ్మకాలు చేపట్టనున్నట్టు స్మార్ట్ఫోన్ల దిగ్గజం శాంసంగ్ ప్రకటించింది. లాంచ్ అయిన కొద్ది రోజులకే హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన గెలాక్సీ నోట్7 ఫోన్లు, పేలుళ్ల ఘటనలతో తన పాపులారిటీని, మార్కెట్‌ను రెండింటిని చేజార్చుకున్నాయి. ప్రస్తుతం ఆ నష్టాన్ని పూరించుకోవడానికి శాంసంగ్ తీవ్ర ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే సరికొత్త, సురక్షితమైన బ్యాటరీలతో గెలాక్సీ నోట్7 అమ్మకాలను తిరిగి ప్రారంభించనున్నట్టు శాంసంగ్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. స్వదేశంలో సెప్టెంబర్ 28 నుంచి ఈ అమ్మకాలు ప్రారంభిస్తామని తెలిపిన కంపెనీ ప్రతినిధి అమెరికా సహా మిగతా దేశాల్లో ఆయా మార్కెట్ల పరిస్థితులకు అనుగుణంగా ఈ డివైజ్ అమ్మకాలను చేపడతామని తెలిపారు. అక్టోబర్ మొదట్లో ఆస్ట్రేలియాలో చేపడతామన్నారు. ఇప్పటివరకు ఉన్న సామ్సంగ్ ఫోన్లలోని తెలుపు రంగు బ్యాటరీ ఇండికేటర్ కాకుండా.. కొత్త నోట్7 ఫోన్లలో ఆకుపచ్చ రంగు బ్యాటరీ ఇండికేటర్ ఉంటుందని సామ్సంగ్ తెలిపింది. కొత్త గెలాక్సీ నోట్ 7 ఫోన్ భద్రమైందో కాదో తెలుసుకునేందుకు రీటేల్ బాక్స్‌పై లేబుల్ ఉంటుందని సంస్థ పేర్కొంది. స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో రారాజుగా వెలిగిన శాంసంగ్‌కు గెలాక్సీ నోట్7 కోలుకోలేని దెబ్బతగిలించింది. ఒక్కసారిగా పేలుడు వార్తలు రావడంతో అంతర్జాతీయ విమానాల్లో ఈ ఫోన్ల నిషేధం, రీకాల్ వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. సెప్టెంబర్ 2న కంపెనీ దక్షిణ కొరియా, అమెరికా వంటి 10 దేశాల నుంచి ఈ ఫోన్లను రీకాల్ చేస్తున్నట్టు అధికారికంగా అధికారికంగా ప్రకటించింది. చార్జీ చేసేటప్పుడు, కాల్ ఆన్షర్ చేసేటప్పుడు పేలుళ్లు సంభవిస్తున్నాయని ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా గెలాక్సీ నోట్7కు రీప్లేస్‌మెంట్‌గా సురక్షితమైన బ్యాటరీతో మరోఫోన్ను అందించనున్నట్టు తెలిపింది.