కీలక ప్రభుత్వ రికార్డుల భారీ చోరీ!
గత రెండు దశాబ్దాల కాలంగా 500 మిలియన్ పేజీల కీలకమైన ప్రభుత్వ రికార్డులు భారీ చోరీకి గురయ్యాయి. ఈ చోరీకి పాల్పడింది నేషనల్ సెక్యురిటీ అడ్మినిస్ట్రేషన్(ఎన్ఎస్ఏ) మాజీ కాంట్రాక్టరేనని అమెరికా న్యాయవాదులు గురువారం తేల్చారు. మాజీ ఎన్ఎస్ఏ కాంట్రాక్టర్ హెరాల్డ్ 'హాల్' మార్టిన్ IIIను ఆగస్టు 27న మేరిల్యాండ్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గురువారం ఈ కాంట్రాక్టర్ పాల్పడిన కుట్రపూరిత చర్యలను కోర్టు, ప్రజలకు బహిర్గతం చేసింది. గూఢాచార్య చట్టం కింద అతనిపై కేసు నమోదుచేసినట్టు పేర్కొంది. మార్టిన్‌ను ఎట్టి పరిస్థితుల్లో బయటికి విడుదల చేయకూడదని ప్రభుత్వం న్యాయవాదులను అభ్యర్థిస్తోంది. ఎన్ఎస్ఏ కాంట్రాక్టర్ ఎడ్వర్డ్ స్నోడెన్ పనిచేసిన బూజ్ అలెన్ హామిల్టన్ సంస్థ తరుఫునే ఇతను కూడా పనిచేస్తున్నట్టు పేర్కొంది.
1996 నుంచి మార్టిన్ ప్రభుత్వ రికార్డులు చోరీ చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ప్రభుత్వ ఏజెన్సీల తరుఫున పనిచేస్తూ ఈ చోరీకి పాల్పడినట్టు తేలింది. ఈ సమాచారాన్ని ఇంగ్లీష్ భాషల వారికే కాక రష్యా వారితో కూడా పంచుకున్నట్టు న్యాయవాదులు తెలిపారు. చోరీ చేసిన సమాచారాన్ని ఎన్‌క్రిప్ట్ చేసి పెట్టుకున్నాడని, క్లౌడ్ స్టోరేజ్ యాప్స్‌ను అతని మొబైల్ డివైజ్‌లో ఇన్స్టాల్ చేసుకున్నట్టు న్యాయవాదులు పేర్కొన్నారు.
సైబర్ స్పేస్‌లో డిజిటల్ ఇన్ఫర్మేషన్ను దొంగలించడంపై ఇతనికి జ్ఞానం, శిక్షణ రెండూ తెలివితేటలు పుష్కలంగా ఉన్నాయని, అందుకే తేలికగా సమాచారాన్ని అపహరించి ట్రాన్స్ఫర్ చేసుకోగలిగాడని వెల్లడించారు. కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసే అవసరం లేని అధునాతనమైన సాప్ట్వేర్ ఉపకరణం అతని దగ్గరుందని, దీంతో గుర్తుతెలియని ఇంటర్నెట్ యాక్సస్‌ను పొందవచ్చన్నారు. దాదాపు 50వేల గిగా బైట్స్ సమాచారాన్ని మార్టిన్ దొంగతనం చేశాడని, ఒక్కో గిగాబైట్ సమాచారం ఫోటోలు, టెక్ట్స్‌తో 10వేల పేజీల వరకు ఉంటుందని తెలిపారు.