breaking news
self-driving vehicles
-
డ్రైవర్ లేని రోబో ట్యాక్సీ
బీజింగ్: డ్రైవర్ అవసరం లేని ఎలక్ట్రిక్ రోబో ట్యాక్సీలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయా? అవుననే చెబుతోంది చైనా దిగ్గజ టెక్నాలజీ సంస్థ బైడూ. ‘అపోలో ఆర్టీ6’ పేరుతో సెల్ఫ్–డ్రైవింగ్ ట్యాక్సీని బైడూ ఆవిష్కరించింది. ఇది ‘అపోలో గో’ యాప్ ఆధారంగా పనిచేస్తుందని చెబుతోంది. తనంతట తానే నడుపుకొనే ఈ ట్యాక్సీ తయారీకి అయిన ఖర్చు రూ.29,54,635 (37 వేల డాలర్లు). ఇందులో స్టీరింగ్ చక్రం ఉండదు. అంటే వాహనం మరింత విశాలంగా మారుతుంది. ప్రయాణికులకు అదనపు స్థలం లభిస్తుంది. డ్రైవింగ్‌లో 20 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి వాహనాన్ని ఎలా నడిపిస్తోడో అదే తరహాలో ఈ సెల్ఫ్ డ్రైవింగ్ ట్యాక్సీ నడుస్తుందని బైడూ వెల్లడించింది. ఇందులో 38 రకాల సెన్సార్లు ఉంటాయి. యాప్ నుంచి అందే ఆదేశాల మేరకు నడుచుకుంటుంది. 2023 నాటికి మార్కెట్లోకి తీసుకొచ్చే ఆలోచన ఉందని బైడూ చెబుతోంది. కనీసం లక్ష క్యాబ్‌లను తీసుకొస్తామని అంటోంది. రోబో ట్యాక్సీ తయారీ గూగుల్‌కు చైనా ఇచ్చిన సమాధానమని బైడూ సీనియర్ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ వ్యాఖ్యానించారు. చైనాలో అపోలో గో యాప్‌ను ఇప్పటికే చాలామంది వాడుతున్నారు. ‘అపోలో ఆర్టీ6’లో అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి. డోర్లను చేత్తో తెరవాల్సిన అవసరం లేదు. బ్లూటూత్ కనెక్షన్ లేదా యాప్ ద్వారా తెరవొచ్చు. చుట్టుపక్కల పరిసరాలను అనుక్షణం గమనించడానికి సెల్ఫ్–డ్రైవింగ్ కార్లలో 2డీ కెమెరాలు, డెప్త్–సెన్సింగ్ లైట్ డిటెక్షన్, రేంజింగ్(లిడార్) యూనిట్లను ఏర్పాటు చేస్తారు. ఎదురుగా వచ్చే మనుషులు, సిగ్నళ్లు, ప్రమాదాలను కచ్చితంగా గుర్తించడానికి కృత్రిమ మేధ టెక్నాలజీని ఉపయోగిస్తారు. భవిష్యత్తులో సాధారణ ట్యాక్సీ ధరలో సగం ధరకే రోబో ట్యాక్సీని విక్రయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని బైడూ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ రాబిన్ లీ చెప్పారు. 2025 నాటికి 65 నగరాల్లో, 2030 నాటికి 100 నగరాల్లో రోబో ట్యాక్సీ సేవలను ప్రారంభించాలని బైడూ యోచిస్తోంది. సెర్చ్ ఇంజిన్, ఆన్లైన్ ప్రకటన సేవల్లో పేరుగాంచిన బైడూ సంస్థ ఇటీవలి కాలంలో సెల్ఫ్–డ్రైవింగ్ వాహనాలు, కృత్రిమ మేధ సాంకేతికతపై భారీగా పెట్టుబడులు పెడుతోంది. అమెరికాలో గూగుల్ అనుబంధ సంస్థ అల్ఫాబెట్స్ వేమో 2020లో అరిజోనాలో డ్రైవర్‌లెస్ ట్యాక్సీ సర్వీసులను ఆవిష్కరించింది. -
బ్రిటన్ కూడా ఆ కారును టెస్ట్ చేసేసిందట!
లండన్ : సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాలపై ఓ వైపు టెక్ దిగ్గజాలు, మరోవైపు స్థానిక ప్రభుత్వాలు పట్టుబిగ్గుస్తున్నాయి. స్థానికంగా తయారుచేసిన డ్రైవర్‌లెస్ వాహనాలను మొట్టమొదటిసారి బ్రిటన్ బహిరంగ ప్రదేశాల్లో విజయవంతంగా పరీక్షించింది. దక్షిణ బ్రిటన్‌లోని మిల్టన్ కీన్స్ పట్టణంలో ఈ వాహనాలను పరీక్షించినట్టు ఆక్స్బోటికా అనే కంపెనీ వెల్లడించింది. సాప్ట్‌వేర్‌తో నడిచే టెస్ట్ వెహికిల్ సెలీనియమ్ను ఆక్స్బోటికా కంపెనీ ఇంటిగ్రేటెడ్‌గా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో అభివృద్ధి చేశారు. కెమెరాల నుంచి లేడార్ సిస్టమ్‌తో తనకు తానుగా మార్గనిర్దేశం చేయబడుతూ సెలీనియం ప్రయాణించగలదని ఆక్స్బోటికా కంపెనీ తెలిపింది. మిల్టన్ కీన్స్ రైల్వే స్టేషన్లో, బిజినెస్ జిల్లాలో ఈ వాహనం విజయవంతంగా పరీక్షించామని కంపెనీ ఆనందం వ్యక్తంచేసింది. ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ క్యాటాపుల్ట్(టీఎస్సీ) 18 నెలల కృషి అనంతరం వీటిని అమలోకి తెచ్చినట్టు కంపెనీ పేర్కొంది. సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీస్‌ను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ వాహనాలను పరీక్షిస్తున్నామని తెలిపింది. బ్రిటీష్ ప్రభుత్వ ఇన్నోవేషన్ ఏజెన్సీ, ఇన్నోవేట్ యూకే స్థాపించిన టెన్ టెక్నాలజీ, ఇన్నోవేషన్ సెంటర్లలో టీఎస్సీ ఒకటి. సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాలను యూకే, ప్రపంచ రోడ్లపై పరుగులెత్తించడానికి ఇది ఓ మైలురాయి అని ఆక్స్బోటికా సీఈవో గ్రేమ్ స్మిత్ అన్నారు. భవిష్యత్తులో అర్బన్ ప్రాంతాల్లో కూడా స్థానిక ట్రాన్స్ఫోర్టేషన్కు ఈ వాహనాలను వాడేలా అభివృద్ధి చేయగలుగుతామని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు.