breaking news
seizeed
-
కేసు గుట్కాయ స్వాహా..!
సాక్షి, విశాఖపట్నం: ఇటీవల స్వాధీనం చేసుకున్న కోట్ల రూపాయల విలువైన నిషేధిత గుట్కా, ఖైనీ విడుదలకు తెరవెనుక ఖాకీలు తోడ్పాటు అందించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం భారీగా ముడుపులు చేతులు మారాయనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. నిషేధిత గుట్కా, ఖైనీ స్వాధీనం... అనంతరం చేపట్టాల్సిన ప్రక్రియ విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు వివాదాస్పదమవుతోంది. వివరాల్లోకెళ్తే... ఈ ఏడాది ఫిబ్రవరి 9న ఒడిశా నుంచి విశాఖకు వస్తున్న లారీని అడవివరం ప్రాంతంలో స్పెషల్ ఎన్ఫోర్సుమెంట్ ఆఫ్ బ్యూరో అధికారులు అనుమానంతో ఆపి తనిఖీలు చేశారు. అందులో నకిలీ గుట్కా ఖైనీలతోపాటు రూ.10 లక్షలు విలువ గల నకిలీ మద్యం కూడా దొరికింది. పట్టబడిన 10,050 మద్యం బాటిళ్ల విలువ రూ.10.05 లక్షలు, 20 లక్షల గుట్కా, ఖైనీ ప్యాకెట్ల విలువ రూ.2.07 కోట్లుగా నిర్ధారించారు. అయితే అందులోని అక్రమ మద్యం ఎస్ఈబీ అధికారులే సీజ్ చేశారు. మిగతా సుమారు రూ.2 కోట్లు విలువ చేసే గుట్కా, ఖైనీ ప్యాకెట్లను గోపాలపట్నం పోలీసులకు అప్పగించారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో లారీలో సరకు లభ్యమైతే వేరే వాహనం నంబర్ ప్లేట్ మార్చి కేసు నమోదు చేశారన్న ఆరోపణలు అప్పట్లోనే వినిపించాయి. మరోవైపు ఎస్ఈబీ సిబ్బందైతే రూ.40 వేలు ఇస్తే పట్టుకున్న వాహనాన్ని వదిలేస్తామని ఆఫర్ కూడా ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. బయటకు వస్తే చాలా ప్రమాదం ఎస్ఈబీ అధికారులు స్వాధీనం చేసుకున్న సరకు బయటకు తీసుకొచ్చేందుకు సంబంధిత వ్యక్తులు అనేక ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. వీరికి పోలీసులు కూడా సహకరించినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. అసలే రసాయనాలు, కెమికల్స్‌తో తయారు చేసిన గుట్కా, ఖైనీలు.. ఆపై మూడు నెలలకు పైగా నిల్వ ఉన్న వాటిని బయటకు తీసుకొచ్చి మార్కెట్లో విక్రయిస్తే ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదముంది. ప్రస్తుతం మార్కెట్లో విక్రయిస్తున్న గుట్కా, ఖైనీలు అధికశాతం నకిలీవే. కొందరు పోలీసుల తీరుతో చెడ్డపేరు రాష్ట్రంలో నిషేధం ఉన్నప్పటికీ నగరంలో స్వేచ్ఛగా గుట్కా, ఖైనీ అమ్మకాలు జరుగుతున్నాయి. పొరుగు రాష్ట్రమైన ఒడిశా నుంచి విశాఖ నగరానికి అక్రమ మార్గంలో సరకు తరలిస్తున్నారు. అధికారులతో కొందరు బడాబాబులు కుమ్మక్కై సరకు అమ్మకాలు చేస్తున్నారు. లారీల్లో, రైళ్లలో ఏదో ఒక రకంగా సరకు నగరానికి తీసుకొచ్చి దుకాణాలకు చేరవేసి విక్రయిస్తున్నారు. అయితే వీటి నియంత్రణకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, టాస్క్‌ఫోర్స్ పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతూ గుట్కా మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్నారు. నగరంలో కొంత మంది పోలీసులు ముఠా సభ్యులతో చేతులు కలుపుతుండడంతో భారీ స్థాయిలో సరకు సీజ్ చేస్తున్నా ఆశించిన ప్రయోజనం నెరవేరడం లేదు. ఎస్ఈబీ, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది శ్రమించి నిషేధిత గుట్కా, ఖైనీలను పట్టుకొని పోలీసులకు అప్పగిస్తుంటే.. అక్కడ మాఫియా సభ్యులు పోలీసులకు ముడుపులు చెల్లించి తమకు అనుకూలంగా కేసును మలచుకొని సరకు విడుదల చేసుకుంటున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఉద్దేశపూర్వకంగా ప్రక్రియ నిలిపివేత మత్తు పదార్థాలు, గుట్కా, ఖైనీ పట్టుబడిన వెంటనే పంచనామా చేసి ఫుడ్ ఇన్స్పెక్టర్ పరిశీలించి ఇచ్చిన రిపోర్టుని కోర్టుకు అందజేయాలి. కోర్టు తీర్పు ఆధారంగా ఈ హానికరమైన గుట్కా, ఖైనీ ప్యాకెట్లను దహనం చేయాలి. కానీ పోలీసులు అలా చేయలేదు. స్వాధీనం చేసుకున్న సరకు ఎస్ఈబీ అధికారులు అప్పగించిన తర్వాత గోపాలపట్నం పోలీసులు ఓ గొడౌన్లో భద్రపరిచారు. అనంతరం నిందితులను రిమాండ్‌కు తరలించారు. అక్కడితో తమ పని అయిపోయిందన్నట్లు ఊరుకున్నారు. సుమారు రెండున్నర నెలల (80 రోజులు)పాటు ఆ ప్రక్రియ ఏమీ పూర్తి చేయకుండా స్వాధీనం చేసుకున్న సరకును గొడౌన్‌లోనే నిల్వ ఉంచారు. ఇంతలో సరకు తరలిస్తూ పట్టుబడిన నిందితులు బెయిల్‌పై బయటకు వచ్చి కోర్టును ఆశ్రయించారు. తమ సరకు విడిపించుకునేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే నిందితులు కోర్టును ఆశ్రయించే వరకు పోలీసులు ఉద్దేశపూర్వక నిర్లిప్తత ప్రదర్శించారని, అందుకు భారీగా ముడుపులు ముట్టాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. న్యాయస్థానం ఆదేశాలు పాటిస్తాం ఎస్ఈబీ పోలీసులు గుట్కా, ఖైనీ స్వాధీనం చేసుకుని మాకు అప్పగించారు. అనంతరం తాము సీజ్ చేశాం. గుట్కా, ఖైనీ సరకు తిరిగి ఇచ్చేయమని కోర్టు నుంచి సంబంధిత సరఫరాదారులు ఆర్డర్ తెచ్చుకుంటే విడుదల చేయకతప్పదు. ఈ కేసులో కూడా న్యాయస్థానం నుంచి ఆర్డర్ తెచ్చుకున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి దీనిపై నిర్ణయం తీసుకుంటాం. – మళ్ల అప్పారావు, గోపాలపట్నం సీఐ గోపాలపట్నం పోలీసులకు అప్పగించాం గత ఫిబ్రవరి నెలలో అడవివరం జంక్షన్లో లారీ తనిఖీ చేయగా సుమారు రూ.2కోట్ల విలువైన గుట్కా, ఖైనీ పట్టుబడింది. కేసు నమోదుచేసి గోపాలపట్నం పోలీసులకు సరకు అప్పగించాం. అనంతరం నిందితులు బెయిల్ తెచ్చుకుని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానం తీర్పు ఆధారంగా తాము నడుచుకుంటాం. – శ్రీనాథుడు, ఏఈఎస్, ఎస్ఈబీ (చదవండి: ఉన్మాదికి ఉరి.. సరైన తీర్పు) -
పాక్ కుట్రను తిప్పి కొట్టిన భారత్
శ్రీనగర్: భారత్‌లో పేలుళ్లే లక్ష్యంగా పాక్ పన్నిన కుట్రల్ని భారత ఆర్మీ భగ్నం చేసింది. నియంత్రణ రేఖ వెంబడి కశ్మీర్‌లోని కెరాన్ సెక్టార్‌కు భారీ ఎత్తున ఆయుధాలు తరలించడానికి చేసిన ప్రయత్నాలను ఆర్మీ తిప్పికొట్టినట్టు సైనిక అధికారి ఒకరు వెల్లడించారు. కెరాన్ సెక్టార్లో నాలుగు ఏకే74 రైఫిళ్లు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. కిషన్‌గంగ నది మీదుగా ఒక తాడు సాయంతో ఇద్దరు, ముగ్గురు దుండగులు ఒక పెద్ద ట్యూబులో ఆయుధాలను ఉంచి తరలిస్తుండగా జవాన్లు గుర్తించారు. వెంటనే రంగంలోకి దిగి రైఫిల్స్, 8 మ్యాగజైన్స్‌తో పాటుగా రెండు పెద్ద సంచుల నిండా ఉన్న ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతమంతా అణువణువునా గాలిస్తున్నట్టుగా లెఫ్ట్‌నెంట్ జనరల్ బీఎస్ రాజు వెల్లడించారు. ‘అప్రమత్తంగా ఉంటూ పాక్ చేసిన ఏ పనినైనా తిప్పి కొడతాం’అని చెప్పారు. కెరాన్, టాంగ్ధర్, జమ్మూ, పంజాబ్ సెక్టార్లలో కశ్మీరీ యువతని ఉగ్రవాదం వైపు మళ్లించడానికి పాక్ నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఉందని ఆ కమాండర్ తెలిపారు. కాగా, కశ్మీర్లో శనివారం జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. కుల్గామ్ జిల్లాలోని చింగామ్‌లో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో భద్రతాబలగాలు సోదాలు చేపట్టాయి. నక్కి ఉన్న ఉగ్రవాదులు భద్రతా బలగాలపైకి కాల్పులు జరపగా, భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లోఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. దదూరా ప్రాంతంలో ఇదే రీతిలో జరిగిన మరో ఎన్కౌంటర్లో కూడా ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. -
రూ 175 కోట్ల విలువైన హెరాయిన్ సీజ్
గాంధీనగర్ : గుజరాత్‌లోని కచ్ తీరంలో ఫిషింగ్ బోట్లో రూ 175 కోట్ల విలువైన హెరాయిన్ చేరవేస్తూ ఐదుగురు పాకిస్తానీలు పట్టుబడ్డారు. ఇండియన్ కోస్ట్ గార్డ్‌తో కలిసి ఏటీఎస్ చేపట్టిన జాయింట్ ఆపరేషన్‌లో వీరిని అదుపులోకి తీసుకున్నారు. కొందరు పాకిస్తాన్ డ్రగ్ స్మగ్లర్లు హెరాయిన్ స్మగ్లింగ్ చేస్తున్నారనే సమాచారం అందడంతో ఈ సంయుక్త ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్‌లో భాగంగా అయిదుగురు పాకిస్తాన్ జాతీయులు ప్రయాణిస్తున్న ఫిషింగ్ బోటు నుంచి 35 ప్యాకెట్ల హెరాయిన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు దీర్ఘకాలంగా డ్రగ్ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నట్టు భావిస్తున్నారు. వీరి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు అధికారులు నిందితులను ప్రశ్నిస్తున్నారు. అరెస్టయిన పాకిస్తానీలను కరాచీ వాసులైన అనీస్, ఇస్మాయిల్ మహ్మద్ కచ్చి, అష్రాఫ్ ఉస్మాన్, కరీం అబ్ధుల్లా, అబుబకర్ ఆష్రఫ్ సుమ్రాలుగా గుర్తించారు. -
ఆ నౌకలో రూ 600 కోట్ల విలువైన డ్రగ్స్..
ముంబై : గుజరాత్ తీరంలో రూ 600 కోట్ల విలువైన డ్రగ్స్‌ను తరలిస్తున్న పాకిస్తాన్‌కు నౌకను భారత తీరప్రాంత గస్తీ దళం సీజ్ చేసింది. కోస్ట్ గార్డ్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ సంయుక్త ఆపరేషన్‌లో 100 కిలోల హెరాయిన్‌ను రవాణా చేస్తున్న ఈ ఫిషింగ్ నౌక పట్టుబడింది. ఈ నౌక నుంచి 194 నార్కోటిక్ పదార్ధాలున్న ప్యాకెట్లను భారత కోస్ట్ గార్డ్ స్వాధీనం చేసుకుందని అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. పాకిస్తానీ నౌక అల్ మదీనాను సీజ్ చేసి, సిబ్బందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు కోస్ట్ గార్డ్ ప్రతినిధి తెలిపారు. అల్ మదీనా పేరుతో పాక్ నౌకను కరాచీలో రిజిస్టర్ చేసినట్టు అధికారులు గుర్తించారు. తదుపరి దర్యాప్తు కోసం పట్టుబడిన సిబ్బందితో సహా నౌకను జకువ హార్బర్‌కు తరలించారు. -
రూ.4.20 లక్షల విలువైన గుట్కా స్వాధీనం
కైకలూరు: ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడుల్లో రూ.4.20 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు బయటపడ్డాయి. కృష్ణా జిల్లా కైకలూరు మండలంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. కైకలూరు పట్టణం దానె గూడెం ప్రాంతంలో కాశీ విశ్వనాథం అనే వ్యక్తి ఇంటిపై దాడి చేసి రూ.4 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను పట్టుకున్నారు. అదేవిధంగా మండలంలోని ఆటపాకలో నాయుడు అనే వ్యక్తి ఇంటిపై సోదాలు జరిపి రూ.20 వేల విలువైన గుట్కాలను పట్టుకున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ అధికారి వైటీ నాయుడు తెలిపారు.