సమైక్యం డిమాండ్‌తో సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల సమ్మె షురూ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే ప్రధాన డిమాండ్‌తో సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు సోమవారం అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. ఉద్యోగుల హక్కులు, ప్రయోజనాల పరిరక్షణ, హైదరాబాద్‌లో వారి రక్షణకు ప్రభుత్వం స్పష్టమైన భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగబద్ధంగా ఎంపికైన ఉద్యోగులకు హక్కుల సాధన కోసం సమ్మె చేసే హక్కును అదే రాజ్యాంగం ప్రసాదించిందని, తాము నిర్దేశించుకున్న లక్ష్యం చేరేవరకూ సమ్మె విరమించబోమని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం అధ్యక్షుడు యు.మురళీకృష్ణ స్పష్టం చేశారు. అటెండర్ నుంచి అదనపు కార్యదర్శివరకూ సీమాంధ్ర ఉద్యోగులందరూ సమ్మెలో పాల్గొంటారని తెలిపారు.
తెలంగాణ ఉద్యోగులకు తాము వ్యతిరేకం కాదన్నారు. రాష్ట్ర విభజన వల్ల ప్రధానంగా నష్టపోయేది ఉద్యోగులేనని, అలాంటిది తమను సంప్రదించకుండా తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేసిన యూపీఏ ప్రభుత్వం తీరు గర్హనీయమని చెప్పారు. వెంటనే ప్రకటనను వెనక్కి తీసుకోవాలన్నదే తమ ప్రధాన డిమాండ్‌గా తెలిపారు. ‘జీతం కంటే జీవితం ముఖ్య’మనే నినాదంతో నిరవధిక సమ్మెకు నడుం బిగించామని, ప్రభుత్వం జీతాలు చెల్లించకున్నా, ఎస్మా చట్టాలు ప్రయోగించినా వెనకడుగు వేయబోమని ఫోరం కార్యదర్శి కేవీ కృష్ణయ్య చెప్పారు. 33 రోజులుగా శాంతియుతంగా నిరసనలు చేసినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో సమ్మెబాట పట్టామన్నారు. భవిష్యత్తు తరాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సీమాంధ్ర ఉద్యోగులంతా సమ్మెలో పాల్గొనాలని కోరారు. అవాస్తవ పునాదుల మీద తెలంగాణ ఉద్యమాన్ని నడుపుతున్న తెలంగాణ ఉద్యోగులు వాస్తవాలను చెప్పాలనుకుంటున్న తమ నోరు నొక్కేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యోగుల వాదనలో వాస్తవాలుంటే తమ నిరసనలు చూసి ఎందుకు భయపడుతున్నారో చెప్పాలన్నారు.
మార్మోగిన సచివాలయం
సమైక్య, తెలంగాణ వాదుల నిరసనలు, నినాదాలతో సచివాలయం సోమవారం మార్మోగింది. సీమాంధ్ర సచివాలయ ఉద్యోగులు భారీ ఎత్తున ర్యాలీ చేశారు. అదే సమయంలో తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని తెలంగాణ ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. ఇరువర్గాలూ పోటాపోటీ నినాదాలు చేశారు. హైదరాబాద్ అందరిదనీ, నగరంపై తెలుగు వారందరికీ హక్కు ఉందని సీమాంధ్ర ఉద్యోగులు నినదించారు. సచివాలయంలోని ఎల్ బ్లాక్ ఎదుట సీమాంధ్ర ఉద్యోగులు చేరి సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. తెలంగాణ ఉద్యోగులు కూడా అక్కడికి చేరుకుని ప్రతి నినాదాలు చేశారు. ఉద్యోగుల మధ్య ఘర్షణ తలెత్తకుండా పోలీసులు మధ్యలో నిల్చుని ఇరువర్గాలను నిలువరించారు.