breaking news
satyam sankaramanchi
-
వడ్డించడమే పండగ..
పూర్ణయ్యని బావగాడంటారు అందరూ. బావగాడు లేకపోతే సరదా లేదు, సంబరమూ లేదు. పెళ్ళి గాని, పేరంటం గాని, వంట హంగంతా బావగాడే. వంటవాళ్ళని కూర్చోనిచ్చేవాడు కాదు, నించోనిచ్చేవాడు కాదు. పరుగులు పెట్టించేవాడు. ఇక తినేవాళ్ళకి భోజనం మీద తప్ప వేరే ధ్యాస రానిచ్చేవాడు కాదు. ఒకసారి వన సంతర్పణం పెట్టుకున్నారు. జనం అంతా మామిడి తోపులో చేరారు. చాపలు పరిచి పిచ్చాపాటీ మాట్లాడుకునే వారు కొందరు. పేకాటలో మునిగిన వారు కొందరు. గాడిపొయ్యి తవ్వించాడో లేదో బావగాడు జనం మధ్యకు పరుగెత్తుకొచ్చాడు. ‘‘అందరూ వినండర్రా’’ అని పెద్దగా గావుకేక పెట్టి మాటలు మానిపించాడు, పేకాట మూయించాడు. ‘‘వంటకాలు ఇలా తయారు చేయిస్తున్నాను’’ అంటూ లిస్టు చదివాడు. ‘‘వంకాయ మెంతికారం పెట్టిన కూర అరటికాయ నిమ్మకాయ పిండిన కూర పెసరపప్పుతో చుక్కకూర వాక్కాయ కొబ్బరి పచ్చడి పొట్లకాయ పెరుగు పచ్చడి అల్లం, ధనియాల చారు మసాలా పప్పుచారు అయ్యా! జీడిపప్పు, పచ్చకర్పూరాలతో పాయసం మామిడి కోరుతో పులిహోర గుమ్మడి వడియాలు, వూరమిరపకాయలు. అందరికీ సమ్మతమేనా?’’ అని అరిచాడు. సమ్మతమేమిటి నామొహం – అప్పటికప్పుడు అందరి నోళ్ళలో నీరూరించి, ఇంకా వంటలు కాకముందే భోజనం మీద అందరికీ మమకారం పెంచాడు. జిహ్వ గిలగిల లాడుతుండగా అందరి కడుపుల్లో ఆకలి అగ్నిలా లేచింది. అంతటితో ఆగాడు కాదు బావగాడు. మరో అరగంటలో వంకాయలు కడిగించి బుట్టలో వేయించి అందరి దగ్గరకూ ప్రదర్శనకు పట్టుకొచ్చాడు. ‘‘చూశారా! లేత వంకాయలు నవనవలాడుతున్నాయి. మెంతికారం పెట్టి మరీ వండిస్తున్నాను. దగ్గరుండి కోయించుకు వచ్చాను.’’ అని అందరికీ చూపించి వెళ్ళి పోయాడు. ఆ తరవాత జనానికి వేరే ఆలోచనలు పోయినాయి కావు. వంకాయ గురించే చర్చలు. వంకాయ ఎన్ని రకాలుగా కూరలు చేయొచ్చు. కాయ కాయ పళంగా వండితే రుచా? తరిగి వండితే రుచా? అసలు రుచి వంకాయలో వుందా? వంకాయ తొడిమలో వుందా? ఇలా చర్చలు సాగాయి. మరో అరగంటకి– నిగనిగలాడే వాక్కాయల బుట్టతో, లేత చుక్కకూర మోపుతో వచ్చి అందర్నీ పలకరించాడు. ‘‘వాక్కాయ దివ్యమైన పులుపు చూడండి,’’ అని తలా ఓ కాయ పంచాడు. ‘‘చుక్కకూర కందిపప్పుతో కంటే పెసరపప్పుతో మహా చక్కగా మేళవిస్తుంది,’’ అని అందరికీ మళ్ళీ జ్ఞాపకం చేశాడు. మళ్ళీ జనం అంతా వంట కబుర్లలో పడ్డారు. బావగాడు ఇలా ప్రదర్శన లిస్తుంటే ఆకలి రెపరెప పెరుగుతోంది. ఇక అక్కడ గాడిపొయ్యి దగ్గర వంటవాళ్ళని పరుగులు తీయిస్తున్నాడు. పాయసంలో ఎత్తుకు ఎత్తు జీడిపప్పు వెయ్యమని పురమాయిస్తున్నాడు. ఓ పక్క పులిహోర తిరగమాత వెయ్యగానే రయ్యిన జనం దగ్గరికి పరిగెత్తుకు వొచ్చి, ‘‘ఆ వాసన చూశారా? పులిహోర తిరగమోత సన్న బియ్యంతో చేయిస్తున్నాను,’’ అని మాయమయ్యాడు. మళ్ళీ జనానికి ఆకలి ఉవ్వెత్తున లేచింది. ఆకలి నిలువెత్తయింది. తాటి ప్రమాణమైంది. శరీరం అంతా ఆకలే అయి కూర్చుంది. జనం అంతా ఎప్పుడు వడ్డిస్తారా అని ఆవురావురు మంటున్నారు. ఎట్టకేలకు గంట కొట్టాడు బావగాడు. ‘‘లేత అరిటాకులు, శుభ్రంగా కడుక్కోండి’’ అని వరుసల మధ్య కొచ్చి హెచ్చరించాడు.‘‘సుబ్బయ్యన్నయ్యకు ఒక ఆకు వేస్తావేం? రెండు ఆకులు కలిపి వేయించు’’ అంటున్నాడు. వడ్డనలు మొదలయ్యాయి.నేతి జారీ పుచ్చుకొని పేరు పేరునా అందర్నీ అడిగి వడ్డిస్తున్నాడు. ‘‘వంకాయ అలా వదిలేయకూడదు. నిమ్మకాయ పిండిన అరటికాయ కూరలో కరివేపాకు రుచి తమకు తెలియనిది కాదు,’’ అంటూ మళ్ళీ కూర వడ్డింపించి ఆకలి పెంచుతున్నాడు. జనం ఆబగా తింటున్నారు. ‘‘చుక్కకూర పప్పులో వూరమిరపకాయలు మిళాయించండి.’’ ‘‘పప్పుచారులో గుమ్మడి వడియాలు కలిపి చూడండి.’’ ‘‘వాక్కాయ పచ్చడిలో పెరుగు పచ్చడి నంచుకోవచ్చు. తప్పు లేదు.’’ ‘‘ఇంకా విస్తట్లో మిగిల్చావేం. పూర్తి చేసి పాయసానికి ఖాళీగా ఉంచుకో.’’ ‘‘అప్పుడే మంచినీళ్ళు తాగకు. మీగడ పెరుగుంది.’’ ఇలా ఎగసన తోస్తుంటే ఎవరాగగలరు? జనం కలబడి భోంచేశారు. జన్మలో ఇంత దివ్యమైన వంట ఎరగమన్నారు. విస్తళ్ళ ముందు నుండి లేవడమే కష్టమయింది. అందరికీ తాంబూలాలు ఇచ్చిన తరవాత వంటవాళ్ళని కూర్చోబెట్టాడు బావగాడు. ‘‘కష్టపడి వండారు, తినకపోతే ఎలా?’’ అని కొసరి కొసరి వడ్డించాడు. వాళ్ళ భోజనాలు కూడా అయిన తరువాత అందరికంటే ఆఖరున గాడిపొయ్యి పక్కన ఒక చిన్న ఆకు వేసుకొని తను కూర్చున్నాడు. అప్పటికి కూరలు మిగల్లేదు. ఓ గంటె పప్పు, కాస్తంత పచ్చడి, గుప్పెడు పులిహోర మిగిలితే అవే వడ్డింపించుకొని వంట రుచిని మళ్ళీ మళ్ళీ మెచ్చుకుంటూ అందరి భోజనం తనే చేస్తున్నాను అన్నంత హాయిగా భోంచేశాడు. తనకేం మిగల్లేదనే బాధ లేదు. నలుగురూ హాయిగా, తృప్తిగా, రుచిగా తిన్నారన్న సంతోషమే బావగాడి తాంబూలపు పెదాలపైని చిరునవ్వు. సత్యం శంకరమంచి కథ ‘తృప్తి’ ఇది. అమరావతి కథలు సంకలనంలోంచి. ‘అమ్మ చెప్పిన కథలు అయ్యకే చెబుదునా’ అనుకుంటాడు సత్యం శంకరమంచి(1937–1987) తన కథల అంకితంలో. అమరావతి కథలు 1978లో తొలిసారి పుస్తకంగా వచ్చాయి. అంతకుమునుపు ‘ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రిక’లో ధారావాహికగా ప్రచురితమైనాయి. ‘అమరావతి కీ కథాయే’ పేరిట వీటిని దర్శకుడు శ్యామ్ బెనెగల్ దూరదర్శన్ హిందీలో దూరదర్శన్ కోసం తెరకెక్కించారు. -
రెండు గంగలు
‘‘కథ చెప్పు తాతయ్య’’ అని వేధిస్తున్నారు శాస్త్రిగారి మనమలు చుట్టూ చేరి. ‘‘ఏం కథ చెప్పనురా?’’ అని ఆలోచిస్తున్నట్టు బోసినోరు విప్పి పైకి చూశాడు ఎనభై ఏళ్లు పైబడుతున్న శాస్త్రిగారు. ‘‘ఏదో వొహటి’’ అంటూ నిద్రకి ఓ పక్క ఆవులిస్తూ చేతులు పట్టుకు గుంజుతున్నారు పిల్లలు. ‘‘సరే’’ అంటూ... మొదలుపెట్టాడు శాస్త్రిగారు. ‘‘ఒక రోజున’’ ఊ కొడ్తున్న చిన్న పిల్లలతో పాటు పట్నం కాలేజీలో చదువుతున్న శాస్త్రిగారి పెద్ద మనవడు కూడా చదువుతున్న పుస్తకం మూసి వింటున్నాడు. ‘‘చాలా సంవత్సరాల క్రితం.. నాకు పెళ్లయిన కొత్తలో..’’ ‘‘అంటే నేను పుట్టిన తర్వాతేనా?’’ అన్నాడు ఆఖరి మనవడు. ‘‘ఇహ్’’ అని నోరంతా విప్పి నవ్వి వాణ్ని వొళ్లోకి తీసుకుని మళ్లీ మొదలెట్టాడు శాస్త్రిగారు. ‘‘పెద్దింటమ్మ గుడి దగ్గర చేనికెళ్లి వస్తున్నాను. అటూ ఇటూ పొలాలు, కనుచూపు మేర భూమంతా పచ్చటి కంబళీ పరిచినట్టుంది. నేలతల్లి చిలకాకుపచ్చ చీర వొళ్లంతా చుట్టుకున్నట్టు పొలాలు. పొలం చుట్టూ తిరిగి, గట్ల పక్కన కుంటలో కాసిన్నీళ్లు తాగి అట్లా డొంకలో కొచ్చాను. మావిళ్ల చేను దాటానో లేదో చిటపట చినుకులు ప్రారంభమైనాయి. తలెత్తి పైకి చూస్తే సూర్యుడెక్కడికో పారిపోయాడు. నల్ల మేఘాలు గుంపులు గుంపులుగా పరుగెత్తుతున్నాయి. ఆకాశమంతా నల్ల మేఘాలే. నల్ల చీర కట్టుకున్న ఆడదాని మొల్లో బాకులాగా ఆ నల్ల మేఘాల మధ్య ఓ మెరుపు, తూర్పు వైకుంఠపురం కొండమీద ఓ గర్జింపు వాన పెద్దదైంది. వలవల కురుస్తోంది వాన! జలజల కురుస్తోంది వాన! నేను గొడుగు తెచ్చుకోకపోతిని. పూర్తిగా తడిసిపోయాను. అయినా గొడుగులూ గోనె గుడ్డలూ ఏవిటి? అల్లంత ఆకాశగంగ పనిగట్టుకొచ్చి ఈ నేల తల్లిని చల్లగా కౌగలించుకుంటుంటే - ఈ మనిషన్నవాడెవడు గొడుగడ్డం పెట్టుకోటానికి? ఉన్నట్టుండి మబ్బులు పెద్దపెట్టున ఉరిమాయి. వర్షరాణి తీవ్రవేగంతో రథం నడిపిస్తుంటే రయ్యిన పరుగెత్తే రథ చక్రాల ధ్వనిలా ఉంది ఆ ఉరుము. ఆ ఉరుము అలా దూరమవుతూంటే అదిలించినప్పుడు ఆ రథానికి పూన్చిన గుర్రం సకిలింపులా ఉంది. అల్లంతలో మబ్బుల్లో గొప్ప మెరుపు. అది వర్షరాణి కిరీటంలా ఉంది. కిరీటమే కళ్లు మిరుమిట్లు గొల్పితే ఆ రాణి ఎలా ఉంటుందో అలంకారాలు చూడ్డానికే ఈ కళ్లు మూసుకుపోతుంటే ఇంక ఆకారాలెలా కన్పిస్తాయి? డొంకలో బురద బురదయిపోయి కాలు సాగటంలేదు. చెప్పులు విడిచి చేతపట్టాను’’. ‘‘వరెవరె! అప్పుడనిపించిందిరా! గంగమ్మ ఈ భూమినంతటినీ చల్లబరుస్తుంటే, నేనూ చల్లబడక ఈ పాత చెప్పులడ్డం పెట్టుకున్నానా’’ అని. ఇప్పుడు వర్షం నా మీద కురుస్తోంది. నాలోంచి కురుస్తోంది. జల్లు జల్లుగా కురుస్తోంది. భళ్లుభళ్లున కురుస్తోంది. వర్షపు చల్లదనం శిరసు నుంచి పాదాలదాక పాకి శరీరంలోని సర్వాణువుల్ని కడిగేస్తోంది. ఆ చల్లదనం నరనరాల్లోకి పరుగులెత్తి వెచ్చగా ఉంది. అది ఎన్ని స్నానాలపెట్టు! ఎన్ని మునకలు దానికి దీటు! వర్షమంతా నా మీదే పడాలనిపించింది. నన్ను ముంచెయ్యాలనిపించింది. ఆ సమయంలో నేను నడవటం మానేసి, వొరేయ్! ఆ డొంక మధ్యలో నిటారుగా నుంచున్నారా! అటుపక్క చూస్తే పొలాల మీద వాన. మంచి శనగ చేను మీద వాన పడుతుంటే పైరు పైరంతా ఆనందంగా వూగుతోంది. దనియాల చేను మీద వాన పడుతుంటే ఆ మేరంతా కొత్తిమెర వాసన, వాన సుగంధం కలిసిపోయిన గాలి. వానకి జొన్నచేను నృత్యం చేస్తోంది. మొక్కజొన్న కండెలుబ్బి పోతున్నాయి. సజ్జ కంకులు పొంగుతున్నాయి. వరి ఉన్నట్టుండి పెరుగుతోంది. కందికాయలు, పిల్లి పెసర్లు కువకువలాడ్తున్నాయి. వేరుశనగ చేను విచ్చుకుని వేళ్లలోకి దింపుకుంటోంది వర్షధారల్ని. అలా నేల నేలంతా, పైరు పైరంతా వర్షానికి పరిపరి విధాలుగా పులకలెత్తుతోంది. పొలాల మీద వాన కొంచెం తగ్గుముఖం పట్టినట్లనిపించింది. కుడిపక్కకి తిరిగి చూస్తే కృష్ణ మీద వర్షం జోరుగా ఉందనిపించి, కృష్ణ వొడ్డుకు బయల్దేరాను. అలా ఎందుకనిపించిందీ అని అడక్కు. రంగావఝులవారి చేనుదాటి అలా కృష్ణ వొడ్డుకి వస్తినిగదా - వరె వరె వరె! అదీ వర్షం. అంత గొప్ప ప్రవాహంలో సంతత ధారగా వానపడిపోతోంది. నీళ్లలో నీళ్లు! ధారలో ధార! ప్రవాహంలో ప్రవాహం! వాన చినుకులు కృష్ణలో పడుతుంటే పెద్దక్క ప్రేమగా హత్తుకుంటే వొళ్లు జలదరించినట్టు, ఆ ప్రవాహం మీద ఓ జలదరింపు, ఓ పులకరింపు. సిగ్గుతో నవ్వినప్పుడు బుగ్గమీద సొట్టలా చినుకు పడ్డ చోట చిన్నగుంట. అంతలో ఆ గుంట మాయం. మళ్లీ చినుకు, మళ్లీ గుంట. మళ్లీ మళ్లీ చినుకులు. అంతలో మాయమయి మళ్లీ మళ్లీ గుంటలు. కృష్ణంతా చినుకులు. కృష్ణంతా పులకరింతలు. ఇసక మీద చినుకులు. రేణు రేణువుకీ చినుకులు. విసవిస, సరసర చినుకులు. రివ్వుమని, రయ్యిమని చినుకులు, ఊపులా చినుకులు. తాపులా చినుకులు. ఛళ్లుమని, ఫెళ్లుమని, దభిల్లుమని, పెఠిల్లుమని చినుకులు - చినుకులు - కృష్ణనిండా, నేలనిండా - చినుకులు చినుకులు - రెండు గంగలు కలిసిపోయినట్టు, నింగీ నేలా ఒకటే అన్నట్టు. ఈ జగత్తులో నీళ్లు తప్ప ఇంకేవీ లేనట్టు, అన్నిటికీ నీళ్లే ఆధారమన్నట్టు వాన, వర్షం, గంగమ్మ, కిష్టమ్మ, సంద్రం - అదేదో దానికి నువ్వే పేరైనా పెట్టుకో. అలా ఆ అఖండ జల ప్రపంచం మధ్య మతిపోయి నుంచున్నానా - పడవ్వాళ్లు నలుగురైదుగురు వచ్చి ‘‘శాస్తుల్లుగారు ఈడున్నారేటి?’’ అన్నారు. అప్పుడీ లోకంలో పడి నేనిక్కడే ఉంటానంటే ‘‘ఇదేవన్నా మతి భ్రమణవేమో’’ అనుకుంటారేమోనని వాళ్ల వెంట వూళ్లో కొచ్చాను. ‘‘వర్షం ఆగిపోయిందని చెప్పకు తాతయ్యా’’ అన్నాడు కాలేజీలో చదువుతున్న మనవడు. అప్పటికి మిగతా మనవలు నిద్రపోయారు. ‘‘లేదురా ఇంకా కురుస్తోంది. ఆగకుండా కురుస్తోంది. ఇల్లు దగ్గర పడుతున్న కొద్దీ కంగారెక్కువయింది. మీ నాయనమ్మా, కొత్తగా కాపరానికొచ్చిన చిన్నపిల్లయ్యె! అందులో పట్నంలో కచ్చేరీ గుమాస్తాగారి కూతురేమో, వర్షంలో తడిసి జలుబు చేసి ఎక్కడ ముక్కూడ గొట్టుకుంటుందో అని గబగబ నడిచాను. ఇంట్లోకొస్తే ముందు వరండాలో లేదు. మధ్య గదిలో లేదు. వంటింట్లో లేదు. ‘‘ ఓహోయ్!’’ అని కేకేస్తే బదులు లేదు. గబగబా దొడ్లోకొస్తే దొడ్డి చివర ఆరుబయట కృష్ణవైపు తిరిగి నుంచుని కన్పించింది. వర్షం కృష్ణలో కలుస్తుంటే, కృష్ణ వర్షంలో కలుస్తుంటే, వర్షంలో తను కలిసిపోయి, చేతులు విప్పార్చి తల మునకలుగా హాయిగా తడుస్తోంది’’. (‘అమరావతి కథలు’ నుంచి) కృష్ణా నది నుంచి వచ్చే మూడు కాలువలు తెనాలి నుంచి ప్రవహిస్తాయి. మూడును హిందీలో ‘తీన్’ అని, కాలువను ‘నాల్’ అని అంటారు. మూడు కాలువలు ఉన్నాయి కాబట్టి తీన్ నాల్ (తీన్నాల్) అయింది. ఆ తరువాత ఇది తెనాలిగా మారిందంటారు. కృష్ణా నదిపై నిర్మించిన ఆనకట్టల్లో నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ ప్రముఖమైనది. ఈ బహుళార్థసాధక ప్రాజెక్ట్ను మొదట ‘నందికొండ ప్రాజెక్ట్’ అని పిలిచేవారు. అయితే ఈ ప్రాంతానికి ఉన్న చారిత్రక ప్రాధాన్యత వలన ‘నాగార్జుసాగర్ ప్రాజెక్ట్’ అని పేరు పెట్టారు.