breaking news
Satavahana express
-
శాతవాహన ఎక్స్‌ప్రెస్: పెద్ద శబ్దం.. బోగీలపై వ్యాపించిన మంటలు
మధిర/ఖమ్మం మామిళ్లగూడెం: సికింద్రాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న శాతవాహన (12714) ఎక్స్‌ప్రెస్ రైలుపై మధిర రైల్వే స్టేషన్ సమీపాన బ్రాకెట్ ఇన్సులేటర్లు తెగిపడ్డాయి. దీంతో పెద్ద శబ్దం రావడమే కాక మంటలు వచ్చాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనలకు గురై హాహాకారాలు చేశారు. మధిర రైల్వేస్టేషన్‌కు పది అడుగుల దూరాన రైలు నిలిచిపోగానే ప్రయాణికులు కిందకు దిగి పరుగులు తీశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో సాయంత్రం 4:30 గంటలకు బయలుదేరిన శాతవాహన ఎక్స్‌ప్రెస్.. రాత్రి 9.30 గంటలకు కిలోమీటర్ నంబర్ 528/26 వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది. ట్రాక్ పక్కన ఉండే స్తంభాల నుంచి రైళ్లు నడిచేలా ఏర్పాటుచేసిన విద్యుత్ తీగలకు అనుసంధానంగా బ్రాకెట్ ఇన్సులేటర్లు ఉంటాయి. ప్రమాదవశాత్తు ఈ ఇన్సులేటర్లు తెగిపడటంతో బోగీలపై మంటలు వచ్చినట్లు చెబుతున్నారు. విద్యుత్ తీగలు కూడా తెగిపోయినా రైలుకు పక్కన పడ్డాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వెంటనే రైలు ఆగింది. ఒకవేళ విద్యుత్ తీగలు తెగి బోగీలపై పడి ఉంటే, విద్యుత్ సరఫరా ఉన్నందున పెనుప్రమాదం జరిగేదని చెబుతున్నారు. ఈ క్రమంలో వచ్చిన భారీ శబ్దాలతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రైలు ఆగగానే లగేజీ, పిల్లలతో కలిసి కిందకు దిగి పరుగులు పెడుతూ మధిర స్టేషన్‌కు చేరుకున్నారు. ఈ విషయమై టీవీల్లో స్క్రోలింగ్ మొదలుకావడంతో వారికి బంధువులు ఫోన్ చేసి క్షేమ సమాచారాలను ఆరా తీయడం కనిపించింది. నిలిచిన రైళ్లు: శాతవాహన ఎక్స్‌ప్రెస్ ఇంజన్ ఓవర్ హెడ్ ఎలక్ట్రికల్ (ఓహెచ్ఈ) వైర్లలో సాంకేతిక లోపం తలెత్తినట్లు అధికారులు గుర్తించారు. ఓ పక్క సరఫరా నిలిచిపోయి శాతవాహన మధిరలో ఆగగా, మిగతా రైళ్లను కూడా ముందు జాగ్రత్తలో భాగంగా అటూ, ఇటు స్టేషన్లలో ఆపేశారు. ఖమ్మం రైల్వేస్టేషన్లో సికింద్రాబాద్ – తిరుపతి ప్రత్యేక రైలు, మధిర సమీపాన జీటీ, గోదావరి రైళ్లు, డోర్నకల్, పాపటపల్లి స్టేషన్లలో పద్మావతి, చారి్మనార్ రైళ్లను అధికారులు నిలిపివేశారు. రైల్వే ఉద్యోగులు మధిర వెళ్లి శాతవాహన ఎక్స్‌ప్రెస్ ఓహెచ్‌ఈకి రెండుగంటల పాటు శ్రమించి మరమ్మతులు చేశారు. 11.30 గంటల తర్వాత నిలిచిపోయిన రైళ్లన్నీ ఒక్కొక్కటిగా ముందుకు కదిలాయి. పెద్ద శబ్దం వచ్చింది.. సికింద్రాబాద్ నుంచి శాతవాహన ఎక్స్‌ప్రెస్‌లో విజయవాడకు బయలుదేరా. మధిర స్టేషన్ సమీపిస్తున్న సమయంలో పెద్ద శబ్దం వచ్చింది. ఆ తర్వాత బోగీలపైన మంటలు వస్తున్నాయని ప్రయాణికులు కేకలు వేశారు. దీంతో నేను కూడా భయపడ్డా. దేవుడి దయ వల్ల పెద్ద ప్రమాదం జరగలేదు. – ప్రశాంత్ కుమార్, ప్రయాణికుడు ప్రాణం పోయిందనుకున్నా.. అప్పుడే నిద్ర పోతున్నా. బోగీలపై ఏదో రాడ్డు దూసుకుపోతున్న శబ్దం వచి్చంది. ఆ శబ్దానికి ఉలిక్కిపడి లేచా. ఆ తర్వాత బోగీలపై మంటలు కూడా వచ్చాయి. ప్రాణం పోయిందనే అనుకున్నా. రైలు ఆగగానే అందరం కిందకు దిగి పరుగులు తీశాం. – వి.శ్రీనివాస్, ప్రయాణికుడు ఇది కూడా చదవండి: మీడియా ఎదుటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేని నిలదీసిన కూతురు.. ఏడ్చేసిన ముత్తిరెడ్డి -
శాతవాహన ఎక్స్‌ప్రెస్‌లో పేలిన సెల్‌ఫోన్
కాజీపేటరూరల్: సికింద్రాబాద్ నుంచి విజయవాడ వెళ్లే శాతవాహన ఎక్స్‌ప్రెస్‌లో ఆదివారం రాత్రి ఒక ప్రయాణికుడి సెల్‌ఫోన్ పేలింది. దీంతో బోగీలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు తీవ్ర భయాందోళన చెందారు. కాజీపేట రైల్వే పోలీస్ అధికారుల కథనం ప్రకారం.. వినోద్‌సింగ్ అనే ప్రయాణికుడు శాతవాహన ఎక్స్‌ప్రెస్‌లోని చైర్‌కార్ సీ-2 కోచ్‌లో సీట్ నంబర్ 55-56 వద్ద ప్రయాణిస్తున్నాడు. రైలు కాజీపేట జంక్షన్ యార్డు దాటుతున్న క్రమంలో చార్జింగ్ పెట్టిన అతడి సెల్‌ఫోన్ ఒక్కసారిగా పేలింది. దీంతో పొగలు వ్యాపించగా ఒక్కసారిగా ప్రయాణికులు భయాందోళన చెందారు. రైలులో ఏదో జరిగిందని ఉలిక్కి పడ్డారు. వెంటనే బోగీలో ఉన్న టిక్కెట్ కండక్టర్ రైలు చైయిన్ లాగి ఆపారు. సెల్‌ఫోన్ చార్జింగ్ పెట్టగా పేలిందని తెలుసుకున్నారు. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. రైల్వేఅధికారులు, పోలీసులు బోగీలోకి వెళ్లి తనిఖీ చేసి జరిగిన విషయం తెలుసుకొని రైలును విజయవాడకు పంపించారు. ఈ ఘటన కారణంగా శాతవాహన ఎక్స్‌ప్రెస్‌ను కాజీపేట యార్డులో 10 నిమిషాలపాటు అధికారులు నిలిపివేశారు. తర్వాత రైలు వరంగల్ రైల్వేస్టేషన్‌కు వెళ్లిన తర్వాత శాతవాహన ఎక్స్‌ప్రెస్ చైర్‌కార్ బోగీని తనిఖీ చేసి పంపించినట్లు అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ కంట్రోల్ రూంకు సమాచారం అందించినట్లు తెలిపారు. -
సాంకేతిక లోపంతో నిలిచిన 'శాతవాహన ఎక్స్‌ప్రెస్'
విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్న శాతవాహన ఎక్స్‌ప్రెస్‌లో గురువారం ఉదయం సాంకేతికలోపం ఏర్పడింది. దాంతో ఖమ్మం జిల్లాలోని మొటుపర్రు వద్ద ఆ ఎక్స్‌ప్రెస్ నిలిచిపోయింది. దీంతో విజయవాడ - వరంగల్ మధ్య పలు రైళ్లు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. శాతవాహన ఎక్స్‌ప్రెస్‌లోని ప్రయాణికులే కాకుండా పలు రైలు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే శాతవాహన ఎక్స్‌ప్రెస్‌లో ఏర్పడిన సాంకేతిక లోపాన్ని నివారించేందుకు దక్షిణ మధ్య రైల్వే సమాయత్తమైంది. శాతవాహనలో ఏర్పడిన సాంకేతిక లోపాన్ని సవరించేందుకు దక్షిణ మధ్య రైల్వే సాంకేతి బృందం హుటాహుటిన మోటుపర్రుకు పయనమైంది.