breaking news
Sara Netanyahu
-
ప్రధాని భార్యపై ఫ్రాడ్ కేసు!
ఇజ్రాయల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు భార్య సరా నెతన్యాహు చిక్కుల్లో పడ్డారు. ఆమెపై ఫ్రాడ్ కేసు నమోదు చేయాలని భావిస్తున్నట్టు తాజాగా ఇజ్రాయెల్ టాప్ ప్రాసిక్యూటర్ వెల్లడించారు. క్యాటరింగ్ కోసం ప్రభుత్వ నిధులు 3.59 లక్షల షెకెల్స్ (రూ. 63.94లక్షలు) అక్రమంగా ఖర్చు చేసినట్టు ఆమె ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే, ఈ ఆరోపణలను ప్రధాని బెంజమిన్ కొట్టిపారేస్తున్నారు. తన భార్యపై అసంబద్ధమైన ఆరోపణలు చేస్తున్నారని వాదిస్తున్నారు. ఇజ్రాయెల్ న్యాయశాఖ మాత్రం ఈ విషయంలో బెంజమిన్ భార్యపై అభియోగాలు నమోదుచేసే అవకాశముందని సంకేతాలు ఇచ్చింది. ఈ వ్యవహారంపై ఇప్పటికే సుదీర్ఘంగా విచారణ జరిగిన నేపథ్యంలో త్వరలోనే సరా నెతన్యాహుపై ఫ్రాడ్ కేసు నమోదుచేయవచ్చునని మీడియా ఊహాగానాలు చేస్తోంది. సెప్టెంబర్ 2010, మార్చి 2013 మధ్యకాలంలో ప్రధాని నివాసంలో ఇచ్చిన విందుల కోసం విచ్చలవిడిగా ఖర్చుచేసినట్టు సరా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రధాని నివాసంలో ప్రభుత్వం నియమించిన చెఫ్ ఉన్నప్పటికీ, ప్రైవేటు చెఫ్‌లతో వంటకాలు చేయించి ఆమె విందులు ఇచ్చారని, ప్రైవేటు చెఫ్‌లకు ప్రభుత్వ నిధుల కేటాయింపు చట్టవిరుద్ధమని న్యాయనిపుణులు చెప్తున్నారు. ప్రైవేట రెస్టారెంట్ల నుంచి ఆహారం తెప్పించడం, ప్రైవేటు చెఫ్‌లకు చెల్లింపులు చేయడం కోసం అక్రమంగా 359,000 షెకెల్స్‌ను ఖర్చుచేసినట్టు ప్రభుత్వ అటార్నీ జనరల్ స్పష్టం చేశారు. అయితే, తమ కుటుంబాన్ని రాజకీయంగా వేధించడం కోసమే ఈ ఆరోపణలు చేస్తున్నారని నెతన్యాహు అంటున్నారు. -
ఇజ్రాయెల్ ప్రధాని సతీమణికి కష్టాలు!
జెరుసలేం: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భార్య చిక్కుల్లో పడనున్నారు. అక్రమంగా భారీ మొత్తంలో ప్రభుత్వ సొమ్ము వెనుకేసుకున్నారనే పేరిట ఆమె ఆరోపణలు ఎదుర్కోనున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన నిధులను వ్యక్తిగత ఖర్చులకు ఉపయోగించుకోవడమే కాకుండా అక్రమంగా దాదాపు లక్ష డాలర్లను వెనుకేసుకున్నారనే పేరిట నెతన్యాహు భార్య సారా విచారణ ఎదుర్కోనున్నారు. ఈ మేరకు ఇజ్రాయెల్ న్యాయ శాఖ ఒక ప్రకటన చేసింది. అటార్నీ జనరల్ సారా నెతన్యాహు చేసిన తప్పిదాలకు సంబంధించిన విచారణను చూస్తున్నారని ఈ మేరకు ఆ శాఖ ప్రకటించింది. వ్యక్తిగత డైనింగ్ కార్యకలాపాలకు, క్యాటరింగ్ వంటి సర్వీసులకు ప్రభుత్వ ఖజానాను ఖర్చు చేశారని, విశ్వాస ఘాతుకానికి పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. అయితే, ఇవన్నీ వాస్తవాలు కావని త్వరలోనే సారా నిరూపించుకుంటారని ప్రధాని నెతన్యాహుకు చెందిన ఫేస్బుక్ పేజీలో వివరణలాంటి పోస్టింగ్ రిప్లైగా పెట్టారు. అయితే, ఈ అంశం రాజకీయపరమైన ప్రభావాన్ని ఏ మేరకు చూపుతుందనేది తెలియాల్సి ఉంది.