breaking news
Sanjay Rawat
-
శివసేనను బానిసగా చూశారు
ముంబై: మహారాష్ట్రలో బీజేపీ, శివసేన ప్రభుత్వ హయాంలో తమ పార్టీని బానిసగా చూశారని శివసేన ఎంపీ సంజయ్ రావుత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2014 నుంచి 2019 వరకు బీజేపీ అధికారంలో ఉండగా శివసేన పార్టీని రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నాలు జరిగాయని ఆయన ఆరోపించారు. శనివారం ఉత్తర మహారాష్ట్రలోని జల్గావ్లో శివసేన కార్యకర్తలతో ఎంపీ సంజయ్ మాట్లాడారు. శివ సైనికులకు ఏం చేయలేకపోయినా, రాష్ట్ర నాయకత్వం ఇపుడు శివసేన చేతిలో ఉందని గర్వంగా చెప్పగలమని అన్నారు. ఈ భావనతోనే మహావికాస్ ఆఘాడీ ప్రభుత్వం ఏర్పడిందని వ్యాఖ్యానించారు. మునుపటి ప్రభుత్వంలో శివసేనకు ద్వితీయ హోదా ఉందని, బానిసలా చూశారని రావుత్ అభిప్రాయపడ్డారు. అధికారాన్ని దుర్వినియోగం చేయడం ద్వారా తమ పార్టీని ముగించే ప్రయత్నాలు కూడా జరిగాయని ఆరోపించారు. తమ మద్దతు కారణంగానే అధికార హోదా అనుభవించారని ఎంపీ వ్యాఖ్యానించారు. ఆ అజిత్ నేడు కీలక ప్రతినిధి.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే ప్రధాని నరేంద్రమోదీని ఢిల్లీలో విడిగా కలుసుకున్న సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రంలో రాజకీయ ఊహాగానాలకు తెరదీయడంతో రావుత్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. 2019లో శివసేన బీజేపీ కూటమి ముఖ్యమంత్రి పీఠం వివాదంలో విడిపోయాయి. అనంతరం శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌లు మహావికాస్ ఆఘాడీ ఏర్పాటుచేసి ప్రభుత్వంలో భాగస్వామ్యమయ్యాయి. మహారాష్ట్రలో శివసేనకు ముఖ్యమంత్రి పదవి ఉండాలని అనుకుంటూ ఉండేవాడినని సంజయ్ తెలిపారు. ఇక అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరిగిన పరిణామాలను గుర్తుచేసుకున్న రావుత్.. దేవేంద్ర ఫడ్నవిస్ ఆధ్వర్యంలో బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి వెళ్లిన ఎన్సీపీ సీనియర్ నేత అజిత్‌పవార్ ఇపుడు మహావికాస్ ఆఘాడీలో కీలక ప్రతినిధి అని అన్నారు. ఫడ్నవిస్ నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వం కేవలం 80 గంటలు మాత్రమే కొనసాగిందని రావుత్ ఎద్దేవాచేశారు. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చని, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఇప్పుడు ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేతో కలసి సన్నిహితంగా పనిచేస్తున్నాని అన్నారు. సీఎం పదవి పంచుకోబోం.. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో ఐదేళ్లూ శివసేనకే ముఖ్యమంత్రి పీఠం ఉంటుందని సంజయ్ రావుత్ వ్యాఖ్యానించారు. అది చర్చించనవసరం కూడా లేదని అన్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల తరువాత కాంగ్రెస్ రాష్ట్రంలో అతిపెద్ద పార్టీ అవుతుందని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోల్ చేసిన వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీంతో సోషల్ మీడియాలో వీడియో వైరల్ వీడియో ఉందని, ఇందులో పటోల్ ముఖ్యమంత్రి కావాలని నెటిజన్లు ఆకాంక్షించారు. దీంతో నాసిక్‌లో విలేకరులతో మాట్లాడిన రావుత్.. ముఖ్యమంత్రి పదవిని పంచుకోవడం లేదన్నారు. పదవిని ఆశించడటం లో ఎలాంటి తప్పు లేదని వ్యాఖ్యానించారు. అన్ని పార్టీలలో అనేక మంది యోగ్యులు ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్‌లో దేశాన్ని నడిపించే సామర్థ్యం ఉన్న నాయకులు చాలామంది ఉన్నారని అన్నారు. మహా వికాస్ అఘాడీ సైద్ధాంతికంగా మూడు వేరువేరు పార్టీల కూటమి అన్నారు. ఒక ప్రభుత్వాన్ని నడపడానికి కలిసి వచ్చామని, ఇపుడు రాజకీయంగా ఒక్కటయ్యామని చెప్పారు. మూడు పార్టీలకు తమ పార్టీలను విస్తరించడానికి, బలోపేతం చేయడానికి హక్కు ఉందని రావుత్ తెలిపారు. మోదీపై పోరాటంలో తప్పేంటి? ఎన్నికల వ్యూహకర్రత ప్రశాంత్ కిషోర్ ఇటీవల ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌తో అయిన భేటీపై అడిగిన ప్రశ్నకు.. కిషోర్ ఇంతకు ముందు పలువురు రాజకీయ నాయకులను కలిశారని, నరేంద్ర మోదీ కోసం కూడా పనిచేశారని చెప్పారు. 2024లో నరేంద్రమోదీపై పోరాటం చేయడానికి అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి వస్తే, అందులో తప్పేంటని ఎంపీ ప్రశ్నించారు. ఇక 2024లో మోదీ తిరిగి ఎన్నికవుతారని దేవేంద్ర ఫడ్నవిస్ చేసిన వ్యాఖ్యలపై రావుత్ స్పందిస్తూ, ‘‘అది జరగదని మేం ఎప్పుడు చెప్పాం. ఫడ్నవీస్ తన పార్టీ వైఖరిని తెలియజేస్తున్నారు. మోదీ బీజేపీ అగ్ర నాయకుడు. ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి మోదీకి వ్యతిరేకంగా బలీయమైన పోరాటం చేయటానికి వస్తే తప్పేంటి అన్నారు. రాజకీయాల్లో ఏం జరుగుతుందో చెప్పలేమని, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ, అమిత్‌షాలు ఓడిపోయారు కానీ బీజేపీ కాదని పేర్కొన్నారు. -
కంగనా క్షమాపణ చెప్పాలి: శివసేన
ముంబై: ముంబై, మహారాష్ట్రలను అవమానిస్తూ వ్యాఖ్యలు చేసిన నటి కంగనా రనౌత్ ముందుగా క్షమాపణ చెపితే, తాను క్షమాపణ చెప్పే విషయం ఆలోచిస్తానని శివసేనకు చెందిన ఎంపీ సంజయ్ రావత్ అన్నారు. ఇటీవల కంగనా రనౌత్ పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో ముంబైని పోలుస్తూ చేసిన వ్యాఖ్యానాలతో అధికార శివసేన నేతలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. అహ్మదాబాద్‌ను పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌తో పోల్చగల ధైర్యం కంగనా రనౌత్‌కు ఉందా అని రావత్ ప్రశ్నించారు. కంగనా ట్వీట్‌పై ఆయన మీడియాతో ‘‘ఎవరైనా ఇక్కడ నివసిస్తూ, ఇక్కడ పనిచేస్తూ, ముంబై, మహారాష్ట్ర, మరాఠా ప్రజల గురించి చెడుగా మాట్లాడితే, అటువంటి వారే మొదట క్షమాపణ చెప్పాలి. అప్పుడే నేను క్షమాపణ చెప్పే విషయాన్ని ఆలోచిస్తాను’’అని అన్నారు. -
'ఆ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాల్సిందే'
- ఫిరాయించడం రాజకీయ అవినీతే! - అనర్హత వేటు వేయడానికి పరిష్కార మార్గం చూడాలి - 'సాక్షి’ తో శివసేన సీనియర్ ఎంపీ సంజయ్ రావత్ న్యూఢిల్లీ: ఒక పార్టీ నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులు అధికార పార్టీలోకి ఫిరాయించడం హేయమని, రాజకీయ అవినీతేనని శివసేన సీనియర్ ఎంపీ సంజయ్ రావత్ వ్యాఖ్యానించారు. తెలుగు రాష్ట్రాల్లో ఫిరాయింపు ఎమ్మెలేలు రాజీనామా చేయాల్సిందేనని సంజయ్ రావత్ అభిప్రాయపడ్డారు. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ ఫిరాయింపులపై సంజయ్ రావత్ బుధవారం 'సాక్షి' తో మాట్లాడారు. ఒక పార్టీ ఎన్నికల గుర్తుపై పోటీ చేసి గెలిచిన వారు వేరే పార్టీలో చేరాలనుకుంటే ముందుగా గెలిచిన పదవులకు రాజీనామా చేయాలి. తర్వాత, వేరే పార్టీలో చేరి తిరిగి పోటీ చేసి గెలవాలి అని ఆయన పేర్కొన్నారు. సాధారణంగా ఒక పార్టీ ఎన్నికల గుర్తుపై పోటీ చేస్తే ఆపార్టీ విధానాలు, సిద్ధాంతాలు, పార్టీకి ఉన్న ప్రజాదరణ వల్లే అభ్యర్థులు గెలుస్తారన్నారు. అలా గెలిచిన వారు పార్టీ మారి వేరే పార్టీలో ఎలా కొనసాగుతారని, అది ఖచ్చితంగా రాజకీయ అవినీతేనని సంజయ్ రావత్ చెప్పారు. మహారాష్ట్ర ఘటనను ఉదాహరణగా చెప్తూ.. మహారాష్ట్రలో జరిగిన సంఘటనను వివరిస్తూ వేరే పార్టీకి చెందిన ఇరువురు ఎమ్మెల్యేలు శివసేనలో చేరాలనుకుంటే వారిని పదవులకు రాజీనామా చేయమని శివసేన నాయకత్వం సూచించిందని, దాంతో వారు రాజీనామా చేసి తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో శివసేన తరఫున పోటీ చేసి గెలిచారని సంజయ్ రావత్ చెప్పారు. ప్రస్తుతం అమలులో ఉన్న ఫిరాయింపుల నిరోధక చట్టం నామమాత్రంగానే మిగిలి ఉందని, ఆ చట్టం శుద్ధ దండగ అని అభిప్రాయపడ్డారు. ఒక పార్టీ నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఒక్కరు వేరే పార్టీ లో చేరినా, ఒక గ్రూపుగా వేరే పార్టీ చేరినా అది ఫిరాయింపుగానే పరిగణించాల్సిన అవసరం ఉందన్నారు. ఫిరాయింపుల కేసుల్లో స్పీకర్‌దే తుది నిర్ణయమని ఫిరాయింపుల నిరోధక చట్టంలో పేర్కొన్నారని, అందువల్ల కొన్ని సందర్భాలలో సమస్యలు తలెత్తున్నాయన్నారు. ఫిరాయింపుల కేసుల్లో అనర్హత వేటు వేయడానికి అఖిలపక్ష కమిటీ ఏర్పాటుచేసే అంశాన్ని పరిశీలించాల్సి ఉందని, అయితే కొన్ని రాష్ట్రాల్లో అందువల్ల కూడా సమస్యలు తలెత్తే అవకాశాలు లేకపోలేదన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి అనువుగా ఫిరాయింపులపై ప్రతి రాజకీయ పార్టీ స్వచ్ఛందంగా ఖచ్చితమైన విధానాలను అవలంబించాల్సి ఉందని, శివసేన అదే విధానాన్ని పాటిస్తోందని సంజయ్ రావత్ వివరించారు.