breaking news
Samagara kutumba sarve
-
సర్వే..‘ఘన’ గణ
సాక్షి, సిటీబ్యూరో: సమగ్ర కుటుంబ సర్వే-2014లో భాగంగా గ్రేటర్ నగరం కొత్త దృశ్యాన్ని ఆవిష్కరించింది. గతంలో మున్నెన్నడూ లేని విధంగా.. ఏ ప్రభుత్వ కార్యక్రమానికీ సహకరించని విధంగా ప్రజలు ఈ కార్యక్రమానికి స్పందించారు. విధులు మానుకొని ఇళ్లవద్దే వేచి చూస్తూ ఎన్యూమరేటర్ల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశారు. రాత్రి 10 గం టల వరకు కూడా సర్వే జరిగినప్పటికీ.. ఇంకా చాలామంది నుంచి ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. గతంలోని కర్ఫ్యూలను, బంద్‌లను మరిపిస్తూ నగరం బోసిపోయింది. గ్రేటర్లో 2011 జనాభా లెక్కల మేరకు 15.24 లక్షల కుటుంబాలుండగా.. ప్రస్తుతమది 20.24 లక్షలకు చేరి ఉండవచ్చునని అంచనా వేసిన అధికారులు అందుకనుగుణంగా ఏర్పాట్లు చేసినప్పటికీ.. చాలా ప్రాంతాలకు ఎన్యూమరేటర్లు వెళ్లలేకపోయారు. వెళ్లినప్రాంతాల్లో వారికప్పగించిన కుటుంబాల కంటే లెక్కకుమిక్కిలిగా కుటుంబాలు కనిపించడంతో శక్తికి మించి పనిచేశారు. పెరిగిన రద్దీతో మరోవైపు ఒకే చోట కూర్చొని సర్వే ఫారాలు నింపారు. రాత్రి 10.30 గంటల వరకు 15.35 లక్షల కుటుంబాల సర్వే జరిగినట్లు ఒక అధికారి తెలిపారు. బుధవారం కానీ.. పూర్తి సమాచారం తెలిసే పరిస్థితి లేదు. మిగిలిపోయిన ప్రక్రియను బుధవారం ముగించాల్సిందిగా చీఫ్ సెక్రటరీ సూచించారు. ఎవరెంతగా శ్రమించినా ప్రజాస్పందన ముందు నిందలపాలు కాక తప్పలేదు. ఫారాలు అందలేదని.. ఎన్యూమరేటర్లు రాలేదనే ఫిర్యాదుల వరద ఆగలేదు. సర్వే ముగిశాక అసిస్టెంట్ ఎన్యూమరేటర్లుగా పాల్గొన్నవారికి చాలాచోట్ల రెమ్యునరేషన్ అందలేదంటూ ఘర్షణలు.. గందరగోళాలు చోటుచేసుకున్నాయి.నిర్బంధాలు జరిగాయి. పోలీసులు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. రెమ్యునరేషన్ ఇవ్వకపోవడంతో కొందరు సర్వే ఫారాలు నోడల్అధికారులకు అందజేయకుండా ఇళ్లకు తీసుకువెళ్లారు. ఒకే రోజు సర్వే కావడంతో తమ వివరాలు నమోదు కాావేమోననే అందోళన పలువురిలో కనిపించింది. జీహెచ్ఎంసీ చేసిన ప్రీవిజిటల్లు.. శిక్షణలు తగిన ఫలితాన్నిచ్చినప్పటికీ ఊహించని స్పందనతో చేసిన ఏర్పాట్లు సరిపోలేదు.దీంతో పలు ప్రాంతాల్లో ప్రజలు అధికారుల తీరుపై మండిపడ్డారు. తగిన ఏర్పాట్లు చేయలేదని విమర్శల వర్షం గుప్పించారు. సర్వే జరగని ఇళ్లు.. తాళాలు వేసిన ఇళ్లకు సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వానికి నివేదించి.. తదుపరి ఆదేశాల మేరకు వ్యవహరిస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ చెప్పారు. కుటుంబాల సంఖ్యకు సరిపోని సిబ్బంది సమగ్ర కుటుంబ సర్వేలో తమ వివరాలు అందించేందుకు ప్రజలు తమకు తాముగా ముందుకొచ్చినా.. అందరి వివరాలూ సేకరించేందుకు సిబ్బంది సరిపోలేదు. లెక్కకుమిక్కిలిగా ఉన్న కుటుంబాలు.. జనాభాకు సరిపడా లేని ఎన్యూమరేటర్లతో ఇబ్బందులు ఎదురయ్యాయి. తమ వివరాలు తీసుకోవాలంటూ రాత్రి పొద్దుపోయేంతదాకా ప్రజల నుంచి ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. జీహెచ్ఎంసీలో సవాల్‌గా స్వీకరించిన సమగ్ర కుటుంబ సర్వే విజయవంతమైందని కమిషనర్ సోమేశ్‌కుమార్ పేర్కొన్నారు. 2011 జనాభా లెక్కల మేరకు గ్రేటర్లో 15.24 లక్షల కుటుంబాలు ఉండగా, రాత్రి 8 గంటల వరకు 15.5 లక్షల కుటుంబాల సర్వే పూర్తయిందన్నారు. ఎన్నో బృందాలు రాత్రి 9.30 గంటల వరకూ సర్వే నిర్వహించినందున బుధవారం కానీ పూర్తి వివరాలు అందే పరిస్థితి లేదని చెప్పారు. పూర్తి సహకారమందించిన నగర ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులు, సిబ్బందికి కమిషనర్ కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా మిగిలినపోయిన ఇళ్లతో పాటు తాళాలు వేసి ఉన్న ఇళ్ల వివరాలను ప్రభుత్వానికి నివేదిస్తామని, ప్రభుత్వ ఆదేశాల మేరకు వారి విషయంలో వ్యవహరిస్తామని కమిషనర్ స్పష్టం చేశారు. సర్వేలో భాగంగా ఇంకా మిగిలిపోయిన పనులేవైనా ఉంటే బుధవారం పూర్తి చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచించారన్నారు. -
కర్ఫ్యూలా...
హన్మకొండ సిటీ : సమగ్ర కుటుంబ సర్వేతో మంగళవారం రైల్వే, ఆర్టీసీ బస్స్టేషన్లు, రహదారులు, ప్రధాన కూడళ్లు నిర్మానుష్యంగా మారాయి. ఆర్టీసీ వరంగల్ రీజియన్‌లోని తొమ్మిది డిపోల్లో 945 బస్సులు రోడ్డెక్కలేదు. కార్మికులందరూ కుటుంబ సర్వేలో పాల్గొనడానికి ఇంటి వద్దనే ఉండిపోవడంతో అవి డిపోల్లోనే ఉన్నాయి. మధ్యాహ్నం లోపు సర్వే పూర్తి చేసుకున్న ఆర్టీసీ కార్మికులు విధులకు హాజరు కావడానికి రావడంతో సాయంత్రం 5 గంటల తర్వాత ఒక్కో బస్సు డిపోల నుంచి బయటకు వెళ్లింది. ఈ లోపు సర్వే పూర్తి చేసుకున్న ప్రయాణికులు తక్కువ సంఖ్యలో తిరుగుముఖం పట్టారు. దీంతో అధికారులు సాయంత్రం బస్సులను అడపాదడపా నడిపించారు. హన్మకొండ జిల్లా బస్‌స్టేషన్ నుంచి హైదరాబాద్ రూట్లో ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా బస్సులు నడిపారు. మిగతా రూట్లలో నైట్‌హాల్ట్ బస్సులను పునరుద్ధరించారు. కాగా, బుధవారం తిరుగు ప్రయాణం చేసేవారికి ఇబ్బందు లు తలెత్తకుండా ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టారు. హైదరాబాద్ రూట్లో రెగ్యులర్‌గా నడిచే 242 షెడ్యూల్డ్ పోనూ ప్రయూణికుల సంఖ్యను బట్టి అదనపు బస్సులను నడిపించేం దుకు ఏర్పాట్లు చేసినట్లు ఆర్టీసీ వరంగల్ రీజి నల్ మేనేజర్ ఇ.యాదగిరి తెలిపారు. డిప్యూటీ సీటీఎం భవానీ ప్రసాద్, డిపో మేనేజర్లు అబ్రహం, సుగుణాకర్, సురేష్‌తోపాటు మరికొంద రు సూపర్వైజర్లు హన్మకొండ బస్‌స్టేషన్‌లో ఉండి పరిస్థితిని గమినించుకుంటూ ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటారని చెప్పారు. మిగతా రూట్లలో కూడా ప్రయాణికుల అవసరాలను బట్టి బస్సులను సమకూర్చనున్నట్లు వెల్లడించారు.