బ్యాంకు లాకర్లు భారమేనా..?
♦ వార్షికంగా అద్దె; ఇవ్వటానికీ లక్ష షరతులు
♦ ఎఫ్డీలు చేసినవారికే ఇస్తున్న బ్యాంకులు
♦ ఇంతా చేసి లాకర్లలో వస్తువులు పోతే బాధ్యత లేదట!
♦ వాటిలో ఏ వస్తువులున్నాయో తెలియకపోవటమే కారణం
♦ మరి అలాంటపుడు ఈ లాకర్లకు ప్రత్యామ్నాయాలే బెటర్ కదా!
♦ ఇంట్లోనే తక్కువ ఖర్చుతో, అధిక భద్రత గల సేఫ్ వోల్ట్లు
♦ వీటికి బీమా చేయించుకుంటే భద్రత, రక్షణ కూడా...
బ్యాంకు లాకర్లలో ఉంచిన వస్తువులు చోరీకి లేదా దోపిడీకి గురైతే ప్రభుత్వరంగ బ్యాంకులకు ఏ మాత్రం బాధ్యత లేదన్న వాస్తవం తాజాగా వెలుగు చూసింది. కుష్‌కల్రా అనే న్యాయవాది సమాచార హక్కు చట్టం కింద లాకర్ల భద్రత, బ్యాంకుల బాధ్యతపై సమాచారం కోసం దరఖాస్తు చేయగా... 19 ప్రభుత్వ రంగ బ్యాంకులు స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాయి. ‘‘ఏదైనా యుద్ధం లేదా అల్లర్లు, దొంగతనం లేదా దోపిడీ చర్యల కారణంగా సేఫ్ డిపాజిట్ వోల్ట్‌లలో (లాకర్లలో) ఉంచిన వస్తువుల్ని కోల్పోయినా, నష్టపోయినా బ్యాంకు అందుకు బాధ్యత వహించదు’’ అని అవన్నీ స్పష్టం చేశాయి. బ్యాంకు– ఖాతాదారుడి మధ్యనుండే బంధం, ఇంటి యజమాని, కిరాయిదారుని మధ్య బంధం లాంటిదేనని... వారి వస్తువులకు వారే బాధ్యత వహించుకోవాలని తేల్చేశాయి. ఈ రకంగా చూస్తే బ్యాంకు లాకర్లలో భద్రత ఏ మాత్రం లేదన్న విషయం స్పష్టంగానే అర్థమవుతోంది కదా!! మరేం చెయ్యాలి?
భద్రతకు సంబంధించి కొత్త కొత్త టెక్నాలజీలు అందుబాటులోకి వస్తున్నాయి. బయోమెట్రిక్ ద్వారానే లాకర్లు తెరుచుకునే సౌకర్యాలు చాలా బ్యాంకులు అమలు చేస్తున్నాయి కూడా. ఎన్ని టెక్నాలజీలు వచ్చినా కొన్ని చోట్ల లాకర్ల దోపిడీలు, దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక అగ్నిప్రమాదాలు, భూకంపాలు, వరదల వంటి ప్రకృతి విపత్తుల వల్ల నష్ట భయం ఎలానూ ఉంటుంది. వీటికి బ్యాంకు నిర్లక్ష్యం తోడయిందంటే ఖాతాదారుడు భారీగా నష్టపోవాలి. లాకర్లలోని కంటెంట్ విషయంలో బ్యాంకులకు బాధ్యత లేదని రిజర్వ్ బ్యాంకు మార్గదర్శకాలు కూడా స్పష్టం చేస్తున్నాయి. అంటే లాకర్లలో ఉన్నవి పోతే బ్యాంకులు పరిహారం చెల్లించవు. ఎందుకంటే లాకర్లలో ఖాతాదారులు ఏం దాచిపెట్టారనే విషయం వాటికి తెలియదు కనక. నగదు, ఆస్తుల పత్రాలు, ఆభరణాలు ఏవైనా కావచ్చు. కేవలం లాకర్ల భద్రతా చర్యలకు మాత్రమే బ్యాంకులు పరిమితమవుతాయి.
లాకర్ నిజంగా ఉపయోగమేనా?
సరే! లాకర్ భద్రమా? కాదా? అనే చర్చకన్నా ముందు చూడాల్సింది అసలు లాకర్ దొరుకుతుందా? అని. ఎందుకంటే బ్యాంకుల్లో లాకర్ల సంఖ్య తక్కువ ఉండటం... వాటిని కావాలనుకునే ఖాతాదారులు అధికంగా ఉండటంతో వాటికున్న డిమాండ్ అంతా ఇంతా కాదు. కొన్ని బ్యాంకులైతే భారీగా డిపాజిట్లు చేసినవారికే లాకర్లు ఇస్తున్నాయి. మరికొన్ని బ్యాంకులు అధిక నెట్‌వర్త్ కలిగిన వారికే కేటాయిస్తున్నాయి. ఇలా చూసినపుడు బ్యాంకులో లాకర్ పొందటమనేది సులువేమీ కాదు. లాకర్ కావాలంటే మరొకరు లాకర్ స్వాధీనం చేసే వరకు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. కొన్ని బ్యాంకులు అధిక మొత్తాన్ని దీర్ఘకాలానికి ఎఫ్డీ చేస్తేనే లాకర్ అద్దెకిస్తామని లింకు పెడుతున్నాయి. దీనికితోడు వార్షికంగా వేలాది రూపాయలు లాకర్ల ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని బ్యాంకుల్లో ఫీజు వార్షికంగా రూ.3,000 నుంచి 40,000 వరకూ ఉంది. ఇంతా చేసి అందులో ఉన్న వాటికి నష్టం జరిగితే తమకు బాధ్యత లేదనేది బ్యాంకుల మాట.
లాకర్ కాకుండా ఇంకేమున్నాయి..?
ఒకప్పుడు బ్యాంకు లాకర్లంటే భద్రతకు మారుపేరన్నట్టుగా ఉండేవి. వీటికి ప్రత్యామ్నాయాలు కూడా లేవు. నేడు భద్రత పరంగా, నిబంధనల పరంగా బ్యాంకు లాకర్లు కూడా సేఫ్ కాదని అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయాల్ని పరిశీలించొచ్చు. ఎక్కడో బ్యాంకులో దాచుకునే బదులు ఇంట్లోనే భద్రంగా దాచుకునేందుకూ ఇపుడు పలు మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. కొన్ని కంపెనీలు సేఫ్ వోల్ట్‌లను సప్లయ్ చేస్తున్నాయి. వీటిని ఏ తరహా గోడల్లో (సింగిల్, డబుల్) అయినా ఏర్పాటు చేసుకునేందుకు అనువుగా ఉంటాయి. మూడువైపులా రక్షణ కూడా ఉంటుంది. ఇంటి ఫ్లోరింగ్లోనూ ఇమిడిపోతాయి. దొంగలు పడ్డా గుర్తించలేని విధంగా ఉంటాయి. అంతర్జాతీయ గుర్తింపు పత్రాలతో వీటిని కంపెనీలు అందిస్తున్నాయి. మీ అవసరాలకు సరిపోయే వోల్ట్ను ఎంచుకోవచ్చు. ఎలక్ట్రానిక్ సేఫ్ వోల్ట్లు అయితే చిన్నగా ఉంటాయి. కొంత మేర నగదు, ఆభరణాలు, పలు పత్రాలను ఉంచుకోవడానికి ఇవి సరిపోతాయి. అగ్ని ప్రమాద నిరోధక వోల్ట్లు ఎలక్ట్రానిక్ వోల్ట్‌లతో పోలిస్తే భారీగా, పెద్దగా ఉంటాయి.
కొంచెం పెట్టుబడి అవసరం
దోపిడీ దొంగలు ప్రయత్నించినా తెరచుకోని వోల్ట్లు కూడా ఉన్నాయి. కాకపోతే వీటికి రూ.8,000 నుంచి రూ.10,000 వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే, ఒక్కసారి ఖర్చు చేస్తే జీవిత కాలం పాటు మళ్లీ వీటిపై ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. బ్యాంకుల మాదిరిగా ఫీజుల భారం ఉండదు. పైగా ఆభరణాలు, పత్రాల కోసం బ్యాంకుల వరకూ వెళ్లి రావాల్సిన శ్రమ కూడా తప్పుతుంది. సులభంగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లోనే వాటిని తీసుకోవడం, అవసరం పూర్తయిన తర్వాత తిరిగి భద్రంగా వోల్ట్లో పెట్టేసుకోవచ్చు.
బీమాతో అదనపు భద్రత
ఎక్కడ ఉంచినా విలువైన వాటికి బీమా తీసుకోవడం నేటి కాలంలో ఎంతో అవసరం. ఎన్నో కంపెనీలు ఈ తరహా బీమా రక్షణను తక్కువ ప్రీమియానికే అందిస్తున్నాయి. హౌస్‌హోల్డ్ పాలసీ తీసుకుంటే ఆభరణాలు, పత్రాలతోపాటు, విలువైన ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వస్తువులకు, ఇంటికీ రక్షణ లభిస్తుంది. దొంగతనం జరిగినా, అగ్ని ప్రమాదం కారణంగా నష్టం ఏర్పడినా పరిహారం పొందొచ్చు.
– సాక్షి, బిజినెస్ విభాగం