ముతక అన్నం మసక వెలుతురు
vip రిపోర్టర్ ఎస్. మధుసూదనరావు
డిప్యూటీ డెరైక్టర్, సాంఘిక సంక్షేమశాఖ
తూర్పుగోదావరి
చెట్టుకు కాయలు భారం కాకపోవచ్చేమో కానీ.. అనేక పేద కుటుంబాలకు పిల్లకాయల చదువు భారమే. అందుకే వారు బిడ్డలు దూరమైనా భరించి.. వారికి చదువు చేరువవుతుందని సాంఘిక సంక్షేమశాఖ వసతిగృహాల్లో చేరుస్తారు. ఆ వసతి గృహాల్లో ఎన్నో సమస్యలు తిష్ట వేస్తున్నాయి. కాకినాడలో కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలో ఉన్న గాంధీనగర్ మల్లయ్య అగ్రహారంలోని వసతిగృహం కూడా వాటిలో ఒకటి. బడుగు కుటుంబాలకు చెందిన 97 మంది విద్యార్థులు ఉంటున్న ఈ హాస్టల్ ఒక అద్దె భవనంలో నడుస్తోంది. ఇరుకుగా, పగలే మసక చీకటి పరుచున్నట్టుండే గదులు, ఇంకా ఎన్నో సమస్యలు.. వాటిని వెలుగులోకి తెచ్చేందుకు ‘సాక్షి’ సంకల్పించింది. తోటలో ఎక్కడ ఏ లోపం ఉందో బయటి వారి కన్నా తోటమాలికి తెలిస్తేనే చక్కదిద్దడం తేలికవుతుంది. అందుకే ‘సాక్షి’ తన సంకల్పాన్ని సాకారం చేసే బాధ్యతను సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డెరైక్టర్ ఎస్.మధుసూదనరావుకే అప్పగించింది. ‘వీఐపీ రిపోర్టర్’గా ఆయనతో ఆ హాస్టల్ స్థితిగతులను ఆరా తీయించింది. రిపోర్టర్‌గా డీడీ ఆ కర్తవ్యాన్ని ఉత్సాహంగా, నిబద్ధతతో నిర్వర్తించారు. వసతిగృహంలోని చిన్నారులను ఆప్యాయంగా పలకరించారు. వారు చెప్పింది సావధానంగా విన్నారు. అనంతరం డీడీగా ఆ సమస్యల పరిష్కారానికి శాయశక్తులా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ప్రతి సమస్యనూ పరిష్కరిస్తా..
‘వీఐపీ రిపోర్టర్’గా ‘సాక్షి’ అప్పగించిన బాధ్యతను పూర్తి చేసిన అనంతరం డీడీ మధుసూదనరావు విద్యార్థులతో ఏమన్నారంటే.. ‘సరిపడా వెలుతురు లేదని, సొంత భవనం కావాలని, ఫ్యాన్లు తిరగడం లేదని, బియ్యంలో రాళ్ళు వస్తున్నాయని, బాత్రూమ్లు బాగోలేవని.. ఇలా పలు సమస్యలు చెప్పారు. వాటిని వెంటనే పరిష్కరిస్తాం. మీరు చెప్పిన ప్రతి విషయాన్ని సీరియస్‌గా తీసుకుని పరిస్థితిని చక్కదిద్దుతాను. తలకు దిండ్లు ప్రభుత్వం సమకూర్చడం లేదు. అయినా వాటిని సైతం ఇచ్చేలా ఉన్నతాధికారులకు తెలియపరుస్తాను. కాకినాడలో ఎకరం స్థలం కోసం అన్వేషిస్తాం. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళతాను. రూ.80 లక్షలతో వసతిగృహం నిర్మితమయ్యేలా చూస్తాను. సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడానికి కృషి చేస్తాను’
డిప్యూటీ డెరైక్టర్ మధుసూదనరావు : బాబూ! నీపేరేంటి...ఎలా ఉన్నావ్?
విద్యార్ధి: సర్ గుడ్ ఈవినింగ్, నా పేరు ఉడాల విమలరాజు. బాగున్నాను సర్.
డీడీ : రాజూ! మధ్యాహ్నం స్నాక్స్ ఇచ్చారా.?
రాజు: బిస్కట్స్ ఇచ్చారు సర్!
డీడీ: మధ్యాహ్న భోజనం ఎలా ఉంటోంది? మెనూలో, వసతిగృహంలో సమస్యలున్నాయా?
రాజు: అన్నంలో రాళ్ళు వస్తున్నాయి. అన్నం కాస్త ముతకగా ఉంటుంది. మెనూ రోజూ సరిగానే ఇస్తున్నారు సర్.
డీడీ: ఈ సమస్యను వార్డెన్ దృష్టికి తేలేదా?
విద్యార్థులు: తెచ్చాం సర్..మార్పిస్తాం అన్నారు.
డీడీ: నిన్న వసతిగృహంలో మెనూఏంటి?
విద్యార్థులు : చికెన్ పెట్టారు సార్.. బాగుంది.
డిడీ: హలో! స్మార్ట్‌బాయ్ నీపేరు?
విద్యార్థి: (నవ్వుతూ) మురళీధర్ సర్ !
డీడీ: మురళీధర్! ఏం చదువుతున్నావ్? ఇక్కడి వాతావరణం ఎలా ఉంది?
మురళీధర్: 9వ తరగతి చదువుతున్నా..హాస్టల్ బాగానే ఉంది సార్.
డీడీ: మీకు నిద్రపోయేందుకు కార్పెట్, బెడ్‌షీట్ ఇచ్చారా? దిండు లేదని అన్పించలేదా?
మురళీధర్: ఇచ్చారు సార్.! దిండు బదులు పుస్తకాలు పెట్టుకుంటున్నాం.
డీడీ: ఇక్కడ లైటింగ్ బాగుంటుందా, గదిలో ఫ్యాన్లు, మరుగుదొడ్లు అన్నీ సవ్యంగా ఉన్నాయా ఫ్రెండ్స్?
వెంకటేష్: ఫ్యాన్లు తిరగడం లేదు, లైటింగ్ లేదు సార్
డీడీ: మరి వార్డెన్‌కి చెప్పలేదా?
మణికంఠ: చె ప్పాం సార్ సరిచేయిస్తానన్నారు..వారం రోజులైంది.
డీడీ: (మరొక గదిలోకి అడుగుపెడుతూ) హాయ్ స్టూడెంట్స్ హౌ ఆర్ యూ?
విద్యార్థులు: ఫైన్ సర్! వాట్ ఎబౌట్ యు సర్?
డీడీ: ఫైన్, థాంక్యూ. నేనెవరో తెలుసా మీకు?
విద్యార్థులు: తెలుసు సార్! మీరు మా డీడీగారు.
డీడీ: ఇప్పుడు మీ సమస్యలు తెలుసుకోడానికి వచ్చిన ‘సాక్షి’ రిపోర్టర్ని.
ఒక విద్యార్థి : బాత్రూంకి గడియలు లేవు సార్!
డీడీ : బాబూ.. నీపేరు? ఏంచదువుతున్నావ్?
విద్యార్ధి: సతీష్ కుమార్ . మాది కొడవలి.
డీడీ: ఎన్నాళ్ళుగా ఉంటున్నావ్ ఇక్కడ? హాస్టల్ మీద నీ అభిప్రాయం!
సతీష్‌కుమార్: రెండేళ్ళుగా ఉంటున్నాను సర్. అంతా బాగానే చూస్తున్నారు.
డీడీ: (మరో గదిలోకి అడుగుపెడుతూ) దోమ తెరలు ఇచ్చారుగా వాడుతున్నారా స్టూడెంట్స్?
విద్యార్థులు: వాడుతున్నాం సార్.
డీడీ: బాబూ నీపేరేంటి? ఏం చదువుతున్నావ్? ఇక్కడ పరిస్థితుల గురించి చెప్పు.
విద్యార్థి: నాపేరు మణికంఠ సార్.. 8వతరగతి చదువుతున్నా..
డీడీ: కాస్మోటిక్స్(సబ్బు ఇతర వస్తువులు) అందాయా నీకు?
మణికంఠ: ఆగస్టు తర్వాత లేవు సర్.
డీడీ: అవునా? మీ వార్డెన్ ప్రొవైడ్ చేశారుగా.. నీకు అందలేదా?
మణికంఠ: అందలేదు సార్!
డీడీ: వార్డెన్ మిమ్మల్ని ఎలా చూస్తున్నారు.. ఎవరైనా చెప్తారా?
రమేష్: (మైకు తీసుకుని) బుధవారం వార్డెన్ రారు సార్. మిగిలిన అన్ని రోజులూ ఉంటారు.
డీడీ: ఆదివారం మీరంతా ఏం చేస్తారు?
రమేష్: మేం చర్చికి వెళతాం సార్. కొందరు గుడికి వెళతారు.
డీడీ: గుడ్..మీకు టీవీ ఉందా? వాడుతున్నారా?
రమేష్: వాడుతున్నాం సార్.
డీడీ: ఏం చూస్తారు?
రమేష్: న్యూస్, పిక్చర్స్ చూస్తాం సార్.
డీడీ: మీరు స్వచ్ఛభారత్‌లో పాల్గొన్నారా?
దుర్గాప్రసాద్: పాల్గొన్నాం సార్. మా పాఠశాలలో స్వచ్ఛభారత్ దళం ఏర్పాటు చేశారు. అందులో నేను సభ్యున్ని సార్.
డీడీ: గుడ్..ఆ కార్యక్రమాన్ని దేశంలో ఎవరు ప్రారంభించారు. దాని ఉద్దేశం ఏంటి?
దుర్గాప్రసాద్: మన ప్రధాని నరేంద్ర మోదీ సార్..మన శుభ్రత..పరిసరాల శుభ్రతే దీని ముఖ్య ఉద్దేశం సార్.
డీడీ: బాబూ.. నీపేరేంటి? ఏం చదువుతున్నావ్?
విద్యార్థి: నాపేరు ప్రసాద్ సర్.. నేను 9వతరగతి చదువుతున్నాను.
డీడీ: ఇక్కడ సమస్యలు ఏమైనా ఎదుర్కొంటున్నావా నీవు?
ప్రసాద్: పడుకోడానికి ప్లేస్ సరిపోవడం లేదు సార్.
డీడీ: గదిలో ఎంతమంది పడుకుంటున్నారు?
ప్రసాద్: 8నుంచి 10మంది పడుకుంటాం సర్..కరెంటు పోతే ఉక్కపోతతో ఇబ్బందిగా ఉంది సార్.
డీడీ: ఈ సమస్యను వార్డెన్ దృష్టికి తెచ్చారా?
ప్రసాద్: ఆ..తెచ్చాం సార్..చేయిస్తానన్నారు..!
డీడీ: ఇంకా సమస్యలు ఏమైనా ఉన్నాయా?
ప్రసాద్: మాకు చెప్పులు ఇవ్వలేదు సార్. స్విచ్ బోర్డులు సరిగా లేవు సార్. గదుల్లో వెలుతురు రాక చీకటిగా ఉంటోంది సార్.
డీడీ: మరి ఎలా చదువుకుంటున్నారు? ఇబ్బందిగా లేదూ..లైట్లు ఉన్నాయిగా?
ప్రసాద్ : చాలా ఇబ్బందిగా ఉంది సార్. లైట్లు ఉన్నా ఆ వెలుతురు సరిపోవడం లేదు.
డీడీ: మీ సమస్యలు వెంటనే పరిష్కరిస్తాను. డోంట్ వర్రీ. (ఇంకో విద్యార్థి దగ్గరికెళ్ళి) హలో బాగున్నావా.. నీపేరు?
విద్యార్థి: బాగున్నాను సార్. నాపేరు సాయి వెంకటేష్.
డీడీ: ఎన్నాళ్ళుగా ఉంటున్నావ్?
సాయి వెంకటేష్: రెండేళ్ళుగా ఉంటున్నా సార్.
డీడీ: ఇక్కడ ఎదుర్కొంటున్న సమస్యలు చెప్పు వెంకటేష్.
సాయివెంకటేష్: సర్..మాకు బాత్రూంలు సరిగా లేవు.ఆడుకోడానికి వసతి గృహానికి గ్రౌండ్ లేదు సార్. బయట వెలుతురున్నా గదుల్లో చీకటే సార్.
డీడీ: ఓకే..ఫ్రెండ్స్ మీ సమస్యలన్నింటినీ ‘సాక్షి’ ద్వారా ప్రజల ముందుంచుతాం. (డీడీ గదిలోంచి వరండాలోకి వెళ్ళి బాత్ రూమ్‌లను, ఆవరణలోని మొక్కలను పరిశీలించారు.)
డీడీ: విద్యార్థులూ.. ఈ మొక్కలు మీరే నాటారా?
విద్యార్థులు : మేమే వేశాం సార్.. బయట ఎంట్రన్స్‌లో ఇంకా ఎక్కువ వేశాం. రండి చూపిస్తాం.
(డీడీ ఉత్సాహంగా..మొక్కలు పరిశీలించి మొక్కల పేర్లను విద్యార్థులతో చెప్పించారు.
విద్యార్థులు: బెండకాయలు, చిక్కుడు కాయలు కాయించాం సర్. తోటకూర, గోంగూర పండించాం సార్.
డీడీ: (వార్డెన్‌ను ఉద్దేశించి) ఇక్కడ ఎప్పటి నుంచి పనిచేస్తున్నావు?
వార్డెన్ ప్రసాద్‌బాబు : మూడేళ్లుగా పనిచేస్తున్నాను సర్.
డీడీ: వసతి గృహంలో సమస్యలుంటే చెప్పండి!
వార్డెన్: కొత్త భవనం సొంతంగా ఏర్పాటు చేయాలి. పగటి పూట కూడా చీకటిగా ఉంటోంది. ఆటస్థలం లేక దగ్గర్లో ఉన్న పార్కుకు వెళుతున్నారు. కాస్మొటిక్ చార్జీలు పెంచాలి.
డీడీ: కాస్మొటిక్ చార్జీలు ఎప్పటి నుంచి రావడం లేదు?
వార్డెన్ : మూడు నెలలుగా రావడం లేదు.
డీడీ : బడ్జెట్ వచ్చింది కదా..
వార్డెన్ : ఆగస్టు వరకే వచ్చింది,. ఆ తరువాత రాలేదు సర్.
డీడీ : సరే ఏర్పాటు చేస్తాను.
డీడీ : విద్యార్థులంతా మాసిన దుస్తులతోనే కనిపిస్తున్నారేంటి?
వార్డెన్ : విద్యార్థులకు ఏకరూప దుస్తులే నాలుగు జతలు ఇచ్చారు. సివిల్ డ్రెస్ కూడా ఇస్తే బాగుంటుంది సర్!
ప్రజెంటేషన్ :లక్కింశెట్టి శ్రీనివాసరావు,
మల్లిపూడి శివసాయిప్రసాద్
ఫొటోలు :గరగ ప్రసాద్