రుణమాఫీలో అవకతవకలు
{పభుత్వ సర్వేలో బట్టబయలు
బోగస్ రైతులను తొలగించేందుకు ప్రయత్నాలు
అందుకు బాధ్యులైన బ్యాంకులపైనా చర్యలు
సొమ్ము రికవరీకి సర్కారు కసరత్తు
హైదరాబాద్: రైతులకు మొదటి విడత విడుదల చేసిన రుణమాఫీ సొమ్ములో అనేక అక్రమాలు జరిగినట్లు ప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది. బోగస్ పాసు పుస్తకాలు, బినామీ పేర్లతో అక్రమాలు జరిగినట్లు స్పష్టమైన సమాచారం అందిందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. రుణమాఫీలో అవకతవకలపై జిల్లాల్లో ర్యాండమ్ సర్వేకు ఆర్థికశాఖ ఆదేశించిన సంగతి తెలిసిందే. దాదాపు 10 శాతం ఖాతాలను సర్వే చేసినట్లు తెలిసింది. సర్వే అనంత రం నివేదిక సమర్పించారు. అనేక అక్రమాలు జరిగినట్లు నివేదికలో నిర్ధారించారు. అయితే ఎంత మొత్తంలో అక్రమాలు జరిగాయన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదని తెలిసింది. దీనిపై సర్కారు కసరత్తు చేస్తోంది.
బ్యాంకులు, రైతులపై చర్యలు
రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది రూ. లక్షలోపు పంట రుణాలకు రుణమాఫీ ప్రకటించింది. ఆ ప్రకారం రూ. 17 వేల కోట్ల రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించి, 35.82 లక్షల రైతు ఖాతాలను గుర్తించింది. మొదటి విడతగా గత ఏడాది రూ. 4,230 కోట్లను రుణమాఫీ కింద జిల్లాల్లోని బ్యాంకులకు అందజేసింది. బ్యాంకులు ఇప్పటివరకు రూ. 4,086.22 కోట్లను రైతుల ఖాతాల్లో మాఫీ అయినట్లు జమచేశాయి. సర్కారు రెండో విడతకింద ఈ ఏడాది రూ. 4,083 కోట్లు రెండు దఫాలుగా అందజేసింది. మొదటి విడతలో అనేక జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ అనేక అక్రమాలు జరిగాయని సర్కారు భావించింది. దీనిపై నిర్వహించిన ర్యాండమ్ సర్వేలో అక్రమాలు బట్టబయలయ్యాయి. అయితే అక్రమాలకు ప్రధాన కారణం బ్యాంకులేనని చెబుతున్నారు. బ్యాంకు రికార్డుల ఆధారంగానే ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి రైతు రుణమాఫీ లబ్ధిదారుల జాబితా రూపొందించిందని, కాబట్టి బ్యాంకు అధికారులే అక్రమాలకు బాధ్యులని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.
అందువల్ల సంబంధిత బ్యాంకు అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అంటున్నారు. మరోవైపు బోగస్ రైతులకూ నోటీసులు జారీచేస్తారా లేదా చూడాల్సి ఉంటుందంటున్నారు. అలా నోటీసులిస్తే సర్కారుకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుందని, కాబట్టి ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. ఎలాగైనా అక్రమంగా వెళ్లిన సొమ్మును రికవరీ చేయాల్సిందేనని సర్కారు కృతనిశ్చయంతో ఉంది. మరోవైపు బోగస్ రైతులనూ రుణమాఫీ జాబితాల్లోంచి తొలగిస్తారని అంటున్నారు.