breaking news
Runa Rizvi
-
మళ్ళీ.. పెళ్ళికొడుకాయెనే..!
ప్రముఖ వాద్య కళాకారుడు ‘డ్రమ్స్’ శివమణి ఇప్పుడు మళ్ళీ పెళ్ళికొడుకు అవుతున్నారు. ప్రముఖ గజల్ గాయని రూనా రిజ్వీని ఆయన వివాహం చేసుకోనున్నారు. ముంబయ్‌లో వచ్చేవారం ఈ వివాహ వేడుక జరగనుంది. ‘‘ఇది నా జీవితాన్ని మారుస్తున్న సంఘటన. రునాను చాలాకాలంగా ప్రేమిస్తున్నాను. ఈ నవంబర్ 10న కొంతమంది ఆంతరంగికుల మధ్య, పూర్తిగా ప్రైవేట్ కార్యక్రమంగా మా పెళ్ళి జరగనుంది’’ అని శివమణి వెల్లడించారు. ‘‘వివాహానికి సంబంధించిన ఇతర వివరాలు పూర్తిగా వ్యక్తిగతమైనవి’’ అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న శివమణి, ‘‘రునాను తన ‘సంగీతం’గా అభివర్ణిస్తున్నారు. ‘‘నా సొంత సంగీతాన్ని పెళ్ళాడబోతున్నందుకు ఎంతో ఉద్విగ్నంగా ఉన్నాను’’ అని ఆయన వ్యాఖ్యానించారు. రూనా రిజ్వీ పేరున్న హిందీ చలనచిత్ర గాయని. దక్షిణాదిలో కూడా కొన్ని సినిమాలకు పాటలు పాడారు. గతంలో ఏ.ఆర్. రెహమాన్, జాకీర్ హుస్సేన్, కున్నక్కుడి వైద్యనాథన్ తదితరులతో కలసి ప్రయోగాత్మక కర్ణాటక సంగీత ఆల్బమ్‌కు రూపకల్పన చేయడం ద్వారా శివమణి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ పైన ‘డ్రమ్స్’ వాద్యకళాకారుడిగా దేశవిదేశాలు తిరిగి, ప్రపంచ ప్రసిద్ధ సంగీతజ్ఞులతో కలసి కార్యక్రమాలు చేశారు. రూనా, శివమణి కొన్నేళ్ళుగా కలసి పనిచేస్తున్నారు. సంగీత కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆ సాన్నిహిత్యం ప్రేమగా, ఇప్పుడు పెళ్ళిగా పరిణమిస్తోంది. ‘‘వాళ్ళిద్దరికీ సంగీతమంటే ప్రేమ. అదే వారిని ఒక్కటి చేసింది’’ అని సన్నిహిత వర్గాలు తెలిపాయి. నిజానికి, శివమణికి గతంలో పెళ్ళయింది. మొదటి భార్య క్రషానీ ద్వారా ఆయనకు ఇద్దరు సంతానం. ఇటీవలే తమిళ చిత్రం ‘అరిమా నంబీ’ ద్వారా ఆయన సంగీత దర్శకుడిగా తొలి అడుగు వేశారు. రానున్న తమిళ చిత్రాలు ‘కనిదన్’, ‘అమాలీ తుమాలీ’ చిత్రాలకు కూడా ఆయన సంగీతం అందిస్తున్నారు. మొన్న సంగీత దర్శకత్వం, ఇప్పుడు కొత్తగా పెళ్ళితో మొత్తం మీద ఈ ఏడాది శివమణి జీవితంలో మరపురానిదనే చెప్పుకోవచ్చు. -
రిజ్విని పెళ్లాడనున్న డ్రమ్స్ శివమణి
డ్రమ్స్ శివమణి తన ప్రియురాలు రిజ్విని పెళ్లాడనున్నారు. వీరి వివాహం ఈ నెల 10న ముంబయిలో జరగనుంది. డ్రమ్స్ శివమణి గురించి పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు. డ్రమ్స్ కళాకారుడిగా దేశ, విదేశాల్లో ఖ్యాతి గడించిన వ్యక్తి డ్రమ్స్మణి. ప్రముఖ సంగీత దర్శకుడు ఎఆర్ రెహ్మాన్‌కు మంచి మిత్రుడు. ఆయనతో కలసి పలు సంగీత కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రెహ్మాన్ సంగీతాన్ని అందించిన పలు చిత్రాలకు డ్రమ్స్ వాయించారు. పలువురు సంగీత దర్శకుల వద్ద పని చేశారు. ఇటీవల అరిమానంబి చిత్రంతో సంగీత దర్శకుడిగా అవతారమెత్తారు. ప్రస్తుతం కణిదన్ అనే చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. డ్రమ్స్ శివమణి తన చిరకాల ప్రియురాలు ప్రముఖ గాయని రుణా రిజ్విని పెళ్లాడనున్నారు. ఈమె ప్రముఖ గజల్ గాయకుడు రాజ్‌కుమార్, ఇంద్రాణి రిజ్విల కూతురు. గాయనిగా హిందీలో మంచి పాపులర్ అయ్యారు. డ్రమ్స్ శివమణి సంగీతాన్ని అందించిన అరిమానంబి చిత్రంలో తమిళరంగానికి పరిచయమయ్యారు. వీరి వివాహం జరగనున్న విషయాన్ని డ్రమ్స్ శివమణి నిర్ధారించారు. ఈ నెల 10వ తేదీన ముంబయిలో పెళ్లి జరగనుందని తెలిపారు. సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్‌తో కలసి పని చేస్తున్న సమయంలోనే వీరి మధ్య పరిచయం ప్రేమగా మారిందని అదిప్పుడు పెళ్లికి దారి తీసిందని శివమణి సన్నిహిత వర్గాలంటున్నాయి. డ్రమ్స్ శివమణికిది రెండో వివాహం కావడం గమనార్హం. ఈయన ఇది వరకే క్రిషాణిని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కూతురు కూడా ఉంది.