breaking news
ro water
-
వాటర్ ఫిల్టర్ నీరు వృథా కాకూడదంటే..ఇలా చేయండి!
ఇప్పుడు ఇంచుమించు ప్రతి ఇంటిలోనూ ఆర్వోల ను వినియోగించడం పెరిగిపోయింది. ఆర్వో వాటర్ ఆరోగ్యానికి మంచో చెడో అనే విషయాన్ని పక్కన పెడితే... వీటి వినియోగంలో గ్లాసు నీటి శుద్ధికి నాలుగు గ్లాసుల నీరు వృథా అవుతుంది. భూగర్భ జలాలు పుష్కలంగా ఉన్నప్పుడు ఫరవాలేదు కానీ అవి అడుగంటిపోయి ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుక్కునే వారికి ఆర్వోల వినియోగంలో అయ్యే నీటి వృథా ఒక ఇంజినీర్‌కు మంచి ఐడియానిచ్చింది. అది నీటి వృథాకు చెక్ చెప్పింది. ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాదు వంటి మహానగచాలలో రోజువారీ అవసరాల కోసం నీటిని కొనుక్కోవటం గతంలో వేసవికాలానికి మాత్రమే పరిమితమయ్యేది. కానీ ఇప్పుడు ఏడాదిలో రెండు మూడు నెలలు మినహా అన్ని కాలాలు అదే దుస్థితి. ఆర్వోలు వినియోగించడం అనివార్యం అయిపోయింది. ఇదీ చదవండి: Summer Care సన్‌స్క్రీన్ వాడాలా? వద్దా?బెంగళూరు నివాసి ప్రభాత్ విజయన్ ఈ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారాన్ని కనుక్కోవాలని నిర్ణయించుకున్నాడు. హోరామావులో నివసిస్తున్న 45 ఏళ్ల ఈ టెక్ మేనేజర్ తన ఇంట్లో ఉపయోగిస్తున్న వాటర్ ప్యూరిఫయర్ ద్వారా గ్లాసు శుభ్రమైన నీటికి నాలుగింతల నీరు వృథా కావడాన్ని గమనించాడు. ఈ వృథా నీరు ఎలాంటి ఉపయోగమూ లేకుండా నేలలో కలిసిపోవడం అతన్ని తీవ్రంగా బాధించింది. వెంటనే దీనికి ఓ పరిష్కారం కనుక్కోవాలనుకున్నాడు. ఒక డ్రమ్ము, స్క్రూడైవర్ ఆయుధాలుగా వెంటనే ఆ ఆలోచనను కార్యాచరణలో పెట్టాడు. చదవండి: నా డ్రీమ్స్.. కరియర్ : ఇపుడు కొత్తగా, ప్రతీక్షణం ఆస్వాదిస్తున్నానీరు సమృద్ధిగా ఉండే కేరళలోని అలెప్పీకి చెందిన ప్రభాత్, ప్రతి చుక్కకు డబ్బు చెల్లించాల్సిన రోజు ఒకటి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. కానీ 2014లో బెంగళూరుకు వెళ్లాక పరిస్థితి మారి΄ోయింది. అతనుండే అపార్ట్మెంట్లో రోజువారీ అవసరాల కోసం కచ్చితంగా ట్యాంకర్లపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. ఒక్కో ట్యాంకర్ ధర రూ.1,000. అదే సమయంలో వాటర్ ప్యూరిఫయర్ ద్వారా పెద్దమొత్తంలో నీరు వృథా అవుతుండటం అతని దృష్టికి వచ్చింది. ఈ పరికరం ద్వారా ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువని అనిపించింది. ఈ ప్రక్రియలో ఉపయోగించే రివర్స్ ఆస్మాసిస్ గురించి అధ్యయనం చేశాడు. ఈ విధానంలో ప్రతి లీటరు నీటికి నాలుగురెట్ల నీరు వృథా కావడం తప్పనిసరని అర్థం చేసుకున్నాడు. నీటి కొరత, అర్ట్ మెంటు వాసుల ఆందోళన, ఈ సమస్యతో స్వయంగా తాననుభవిస్తున్న కష్టం... ఇవన్నీ ప్రభాత్‌ను పరిష్కారం దిశగా ప్రేరేపించాయి. అందుకే ప్యూరిఫయర్ లో వృథా అవుతున్న నీటిని తిరిగి వినియోగించుకోవడానికి ఒక సెటప్‌ను రూపొందించాడు. రివర్స్ ఆస్మాసిస్ (ఆర్. ఓ.) అంటే...రివర్స్ ఆస్మాసిస్ అనేది నీటి శుద్ధీకరణలో ఒక పద్ధతి. నీటిలోని మలినాలు, క్లోరిన్, లవణాలు, ధూ«ళి ఇతర కలుషితాలను సెమీ–పెర్మెబుల్ పొరతో ఫిల్టర్ చేస్తారు.నీటి వృథా నుంచి-పునర్వియోగం దిశగా... ∙ప్రభాత్ 50–లీటర్ డ్రమ్మును తన ఇంటిలో ఒక మూలన రెండు చదరపుటడుగుల స్థలంలో ఉంచారు. స్క్రూడ్రైవర్‌తో డ్రమ్ మూతకు ఒక చిన్న రంధ్రం చేసి డిశ్చార్జ్ పైపును చొప్పించాడు. దీన్ని ప్యూరిఫయర్‌కు అనుసంధానించడం ద్వారా డ్రమ్‌లోకి వచ్చి చేరిన నీటిని పాత్రల శుభ్రం, టాయిలెట్ క్లీనింగ్, ఇల్లు తుడవడం, గార్డెనింగ్‌కు ఉపయోగించడం మొదలుపెట్టాడు. సింపుల్‌గా.... ఎలాంటి పెట్టుబడి అవసరం లేకుండా ఇప్పుడతను స్మార్ట్‌గా వృథా నీటిని రీయూజ్ చేస్తున్నాడు. ‘‘ప్రస్తుతం నేను రూ పొందించిన ఈ వ్యవస్థతో నెలకు కేవలం మా ఇంటినుంచే ఆరు పూర్తి నీటి ట్యాంకర్లకు సమానమైన నీటిని ఆదాచేస్తున్నాం. ఆ ఖర్చును మిగుల్చుకున్నాం. ఇప్పుడు ఇది మా కుటుంబ జీవన విధానంగా మారింది’’ అని సంతోషంగా చెప్పాడు. బాగుంది కదూ... మనం కూడా ఇలా స్మార్ట్‌గా ఆలోచిస్తే నీటి వృథాకు చెక్ చెప్పవచ్చు. -
ఆర్ఓ నీటిపై ఆసక్తికర విషయాలు.. టీడీఎస్ 500 ఎం.జీ దాటితే!
మనకు, ప్రకృతి అందించిన సహజ సంపద నీరు. భూమి మీద నీరు లేనిదే మానవులకు, పశు పక్ష్యాదులకు, ఇతర జీవరాశులకు మనుగడే లేదు. మనం ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు నీటితో మమేకమై ఉంటాం. మానవ అవసరాలకు గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు తలసరిన 55 లీటర్లు (55 లీటర్స్ పర్ కాపిటా పర్ డే), పట్టణ ప్రాంతాల ప్రజలకు రోజుకు తలసరిన 135 లీటర్లు సరిపోతాయని వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు భావిస్తున్నాయి. కానీ, ప్రతి సంవత్సరం లక్షల మంది గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలు నీటి ద్వారా వ్యాపించే డయేరియా, టైఫాయిడ్ మొదలైన వ్యాధులకు గురవుతున్నారు. దీని వల్ల ఎన్నో లక్షల పనిదినాలు వృథా అవుతున్నాయి. యూనిసెఫ్ ఇండియా ప్రకారం.. ప్రతి సంవత్సరం మన దేశంలో సుమారు 60 కోట్ల అమెరికన్ డాలర్ల ఆర్థిక నష్టం వాటిల్లుతోంది. ‘సురక్షితమైన నీరు’ అంటే రసాయనాలు, బ్యాక్టీరియా రహితమైన నీరు. రసాయన రహిత నీరు అంటే.. ఫ్లోరైడ్, ఆర్సెనిక్, లవణీయత వంటి నీటిలో కరిగే లవణాలు (టోటల్ డిసాల్వ్డ్ సాల్ట్స్– టి.డి.ఎస్.) అనుమతించదగిన పరిమితిలో కలిగి ఉన్న నీరు. బ్యాక్టీరియా రహిత నీరు అంటే.. ఈ–కొలి, సాల్మొనెల్లా టైఫి మొదలైన సూక్ష్మక్రిములు లేని నీరు. సురక్షితమైన నీటి గురించి కరపత్రాలు, కళా జాతాలు, లఘు చిత్రాల ప్రదర్శన, పోస్టర్లతో కూడిన అవగాహన కార్యక్రమాల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. తద్వారా ప్రజల్లో సురక్షితమైన నీరు తాగడం గురించిన అవగాహన పెరిగింది. అంతేకాకుండా, ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, దాతృత్వ సంఘాలు, కార్పొరేట్ సామాజిక బాధ్యత (సి.ఎస్.ఆర్.) మొదలైనవన్నీ సురక్షితమైన నీటిని ప్రజలకు అందించడంలో భాగంగా ఆర్.ఓ. (రివర్స్ ఆస్మోసిస్) ప్లాంట్స్‌ను విరివిగా నెలకొల్పాయి. ఇటువంటి ప్లాంట్లలో చాలా చోట్ల, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో నీటి నాణ్యతను పరీక్షించాయి. తద్వారా ప్రజలు నీటిని కొనే స్థాయికి చేరుకుంటున్నారు. దీని పర్యవసానంగా ‘వాటర్ మార్కెట్లు’ వచ్చాయి. టిడిఎస్ 500 ఎం.జి. కన్నా ఎక్కువైతేనే.. ఈ మధ్య కాలంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కొత్తగా నిర్మించే ఇళ్లల్లో డొమెస్టిక్ ఆర్. ఓ. ప్లాంట్లు కూడా పెడుతున్నారు. రివర్స్ ఆస్మోసిస్ అనేది మంచినీటిని అందించే సాంకేతిక ప్రక్రియ. లీటరు నీటిలో 500 మిల్లీ గ్రాముల పరిమితికి మించిన స్థాయిలో టి.డి.ఎస్. ఉన్న నీటిని మాత్రమే శుద్ధి చేసి, ఆ పరిమితికి మించి ఆ నీటిలో ఉన్న ఫ్లోరైడ్, ఆర్సెనిక్, ఐరన్, లవణీయతలను తొలగించాల్సి ఉంటుంది. ఆర్.ఓ. ఫిల్టరేషన్ సిస్టం ఇలా పనిచేస్తుంది.. కంటికి కనిపించని మలినాలను తొలగించడానికి ఒక ప్రత్యేకమైన పొర (మెంబ్రేన్ / ఫిల్టర్) ద్వారా పీడనం కలిగిస్తూ నీటిని శుద్ధి చేస్తుంది. అయితే ఈ పద్ధతిలో బాక్టీరియా, రసాయనాలతోపాటు మానవ శరీరానికి అవసరమైన కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సోడియం బై కార్బొనేట్ మొదలైన ఖనిజాలు కూడా పోతాయి. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కొన్ని తాగు నీటి వ్యాపార కంపెనీలు తిరిగి ఈ ఖనిజాలను ఆర్.ఓ. నీటిలో కలిపి విక్రయిస్తున్నాయి. ప్రస్తుతం దక్షిణ భారత దేశంలో చాలా మటుకు గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ఆర్.ఓ. వాటర్ సిస్టమ్స్ పనిచేస్తున్నాయి. ఈ నీటిని ప్రజలు కొని తాగుతున్నారు. 20 లీటర్ల క్యాన్‌ను రూ. 5 నుంచి 10 దాకా అమ్ముతున్నారు. గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు ముడి నీటిలో టి.డి.ఎస్. లీటరు నీటికి 500 మిల్లీ గ్రాముల కంటే ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో మాత్రమే ఈ ఆర్.ఓ. ప్లాంట్స్ పెట్టవలసి ఉంది. కానీ విచక్షణ రహితంగా వీటిని పెట్టడం వలన ప్రజల ఆరోగ్యానికి హాని కలిగే ప్రమాదం పొంచి ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని గ్రీన్ నేషనల్ ట్రిబ్యునల్ – నీటిలో టి.డి.ఎస్. స్థాయి లీటరు నీటికి 500 మిల్లీ గ్రాముల కంటే ఎక్కువగా ఉన్న చోట్ల మాత్రమే నీటి శుద్ధీకరణ ఆర్. ఓ. ప్లాంట్స్ నెలకొల్పడానికి అనుమతివ్వాలని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సి.పి.సి.బి.)ని కోరింది. వ్యర్థ జలాల పునర్వినియోగం ఎలా? ఆర్.ఓ. ద్వారా శుద్ధమైన నీటిని తయారు చేసే క్రమంలో కొంత నీరు వృథా అవుతుంది. ఎంత శాతం నీరు వృథా అవుతుందన్నది అక్కడి ముడి నీటిలో టి.డి.ఎస్. ఎంత ఉందన్న దానిపై ఆధారపడి ఉంటుంది. నీటి రికవరీ 60% కన్నా ఎక్కువ ఉండేలా చూడాలని కూడా గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించింది. అంటే.. వంద లీటర్ల సాధారణ నీటిని ఆర్.ఓ. యంత్రం ద్వారా శుద్ధి చేస్తే.. కనీసం 60 లీటర్లు మంచినీరు రావాలి. వ్యర్థ జలాలు 40 శాతానికి మించకుండా వెలువడేలా శుద్ధి యంత్రాల సామర్థ్యం ఉండేలా చూడమని ట్రిబ్యునల్ ఆదేశించింది. ఆర్.ఓ. శుద్ధి యంత్రాల ద్వారా వచ్చిన వృథా (రిజెక్టెడ్ వాటర్) నీటిని పాత్రలను, ఇంట్లో గచ్చును, వాహనాలను శుభ్రం చేయడానికి.. టాయిలెట్లలో ఫ్లషింగ్ కోసం, పచ్చదనాన్నిచ్చే మొక్కల పెంపకానికి ఉపయోగించాలని జి.ఎన్.టి. ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా, ఆర్.ఓ. సిస్టమ్స్ వెలువరించే తాగు నీటిలో టి.డి.ఎస్. లీటరుకు 150 ఎం.జి.కి తగ్గకుండా ఉండేలా చూడాలి. లేదా పరిమిత స్థాయిలో కాల్షియం, మెగ్నీషియం ఆ నీటిలో ఉండేలా చూడాలని కూడా ట్రిబ్యునల్ ఆదేశించింది. 7 రాష్ట్రాల్లో అధ్యయనం.. ఆసక్తికర అంశాలు ► జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ సంస్థ (ఎన్.ఐ.ఆర్.డి–పి.ఆర్.) 2016వ సంవత్సరంలో వివిధ రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఆర్.ఓ. నీటి శుద్ధి ప్లాంట్ల తీరుతెన్నులపై విస్తృతమైన అధ్యయనం చేసింది. ఇందులో చాలా ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ► అధ్యయనం జరిపిన రాష్ట్రాలు.. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్. ► ఈ ఏడు రాష్ట్రాలలో ఆర్.ఓ. సిస్టమ్స్ ఉన్న 21 గ్రామ పంచాయితీలను ఎన్నుకున్నారు. ∙ఈ గ్రామ పంచాయతీలలో ఆర్.ఓ. సిస్టమ్స్ పెట్టే ముందుగానే నీటిని పరీక్షించారు. అందులో 13 గ్రామ పంచాయతీలలో లీటరు నీటికి టి.డి.ఎస్. 500 ఎం.జి. కంటే ఎక్కువగా ఉంది. పంచాయితీ సర్పంచుల చొరవతో అక్కడ ఆర్.ఓ. సిస్టమ్స్ నెలకొల్పారు. ► మిగిలిన 8 గ్రామ పంచాయతీలలో టి.డి.ఎస్. 500 మి. గ్రా. కంటే తక్కువగా ఉన్నప్పటికీ, సర్పంచులే అత్యుత్సాహం చూపి ఆర్.ఓ. ప్లాంట్స్‌ను ఏర్పాటు చేయించారు. ► ఈ 21 గ్రామ పంచాయితీలలో ఆర్.ఓ. సిస్టమ్స్‌ను రాష్ట్ర ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ప్రైవేటు సంస్థలు ఆర్.ఓ. యూనిట్లను ఏర్పాటు చేశాయి. వీటి నిర్వహణను గ్రామ పంచాయతీలు లాభాపేక్ష లేకుండా చూస్తున్నాయి. ► అధ్యయనం జరిగిన 21 గ్రామ పంచాయతీలలో ఎనీటైమ్ వాటర్ (ఎ.టి.డబ్లు్య.) కార్డులను అందుబాటులోకి తెచ్చారు. ఈ విధంగా పోగైన డబ్బును ఆర్.ఓ. సిస్టమ్స్ నిర్వహణకు వినియోగిస్తున్నారు. గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు నేపథ్యంలో ప్రజల్లో ఆర్.ఓ. నీటి గురించి లోతైన అవగాహన కలిగించాల్సిన తక్షణ అవసరం ఉంది. -డా. పి. శివరాం, జాతీయ గ్రామీణ, పంచాయతీరాజ్ అభివృద్ధి సంస్థ, రాజేంద్రనగర్, హైదరాబాద్. polankis@gmail.com -
బ్లూ బర్డ్ నుంచి ఆర్ఓ వాటర్ ప్యూరిఫయర్లు
హైదరాబాద్: బ్లూ బర్డ్ కంపెనీ ఆర్ఓ వాటర్ ప్యూరిఫయర్లను హైదరాబాద్ మార్కెట్లోకి తెచ్చింది. పూర్తిగా హైదరాబాద్ నగర అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ వాటర్ ప్యూరిఫైయర్లను రూపొందించామని బ్లూ బర్డ్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. గృహ, వాణిజ్య అవసరాలనుకనుగుణంగా 15 రకాల మోడళ్లను అందిస్తున్నామని బ్లూ బర్డ్ ఎండీ, ఆదిత్య మిట్టల్ పేర్కొన్నారు. వీటి ధరలు రూ.16,000 నుంచి రూ.60,000 రేంజ్లో ఉన్నాయని తెలిపారు. అత్యున్నత నాణ్యత గల ఉత్పత్తులను, సేవలను వినియోగదారులకు అందించడమే తమ కంపెనీ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఈ వాటర్ ప్యూరిఫైర్లను అందిస్తున్నామని వివరించారు.