రాజధాని ఎంపికపై కేంద్రానికే సర్వాధికారాలు
సిటిజన్ ఫోరం ప్రతినిధులు
సాక్షి. హైదరాబాద్: రాజధాని ఎంపికపై కేంద్ర ప్రభుత్వానికే సర్వాధికారాలు ఉన్నా.. ఏపీ ప్రభుత్వం వాటిని పరిగణనలోకి తీసుకోకుండాఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటోందని సిటిజన్ ఫోరం ప్రతినిధులు దుయ్యబట్టారు. అన్ని విధాలా నష్టపోయిన రాయలసీమ వారితో చర్చించిన తర్వాతే రాజధానిపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఫోరం ప్రతినిధులు సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. కొందరికి మాత్రమే మేలు కలిగేలా ప్రభుత్వ పెద్దలు నిర్ణయాలు తీసుకుంటున్నారని అర్థమవుతోందని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పి. లక్ష్మణ్‌రెడ్డి అన్నారు.
రాజధాని ఎంపికపై శివరామకృష్ణన్ కమిటీ అనుబంధ నివేదిక ఇస్తే బాగుంటుందన్నారు. రాజధాని ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులన్నీ భూ సేకరణకే ఖర్చు చేస్తే భవన నిర్మాణాలకు నిధులు ఎక్కడి నుంచి తెస్తారని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కె. జయభారత్ రెడ్డి ప్రశ్నించారు. ఎవరితోనూ చర్చించకుండా ఏకపక్షంగా ముందుకెళ్లడం మంచిది కాదని ఐపీఎస్ మాజీ అధికారి సి.ఆంజనేయరెడ్డి సూచించారు.