దేవగుడిలో 90 శాతం రీపోలింగ్
జమ్మలమడుగు,న్యూస్‌లైన్: నియోజకవర్గంలోని దేవగుడిలో జరిగిన రీపోలింగ్‌లో 90శాతం ఓటింగ్‌నమోదైంది. ఈనెల 7వతేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జరిగిన సంఘటనలను ఆధారంగా చేసుకుని రీపోలింగ్ నిర్వహించాలని టీడీపీ నాయకులు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయని స్థానిక అధికారులు తెలిపినా దేవగుడి గ్రామంలోని 80,81,82 పోలింగ్‌కేంద్రాల్లో రీపోలింగ్‌కు ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. దీంతో మంగళవారం ఉదయం దేవగుడిలోని మూడు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించారు. మూడు పోలింగ్‌కేంద్రాల్లో 2982 మంది ఓటర్లు ఉండగా 2682 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. గతంలో దాదాపు 93శాతం వరకు పోలింగ్జరిగింది.
భారీ బందోబస్తు..
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణరెడ్డి సొంత గ్రామమైన దేవగుడిలో రీపోలింగ్ జరుగుతుండటంతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎస్పీ ఆశోక్‌కుమార్ ఉదయంనుంచి సాయంత్రం వరకు మకాం వేసి పోలింగ్‌ను స్వయంగా పర్యవేక్షించారు. ఐఏఎస్ కేడర్‌కు చెందిన సెంట్రల్, రాష్ర్ట పరిశీలకులు ఆర్కే మిశ్రా, హరీంద్ర వీర్‌సింగ్, ఆర్ఓ రఘునాథరెడ్డి కూడా పోలింగ్‌ను పర్యవేక్షించారు. ముగ్గురు డీఎస్పీలు, నలుగురు సీఐలు, 10 మంది ఎస్‌ఐలతోపాటు 200 మందిపోలీసులు బందోబస్తు నిర్వహించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణరెడ్డి, ఎంపీ అభ్యర్థి వైఎస్ఆవినాష్రెడ్డి ఆదేవిధంగా టీడీపీ అభ్యర్థి పి.రామసుబ్బారెడ్డి, ఎంపీ అభ్యర్థి శ్రీనివాసుల రెడ్డి పోలింగ్ సరళిని పరశీలించారు.
నల్లబ్యాడ్జీలతో నిరసన
గ్రామంలో ఎటువంటి ఆవాంఛనీయ సంఘటనలు జరుగకున్నా రీపోలింగ్ నిర్వహించినందుకు నిరసనగా ఓటర్లు నల్లబ్యాడ్జీలు ధరించి ఓటింగ్‌లో పాల్గొన్నారు. గ్రామంలో చిచ్చుపెట్టడానికి టీడీపీ నాయకులు ప్రయత్నించారని ఈ సందర్భంగా ఓటర్లు పేర్కొన్నారు.