breaking news
Replacement of positions
-
టీజీటీ పోస్టులకు 4,078 మంది ఎంపిక
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గురుకులాల్లోని ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(టీజీటీ) పోస్టులకు ఇప్పటివరకు 4,078 మందిని ఎంపిక చేసినట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. మొత్తంగా 10 సబ్జెక్టుల్లో 4,362 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయగా, 9 సబ్జెక్టులకు సంబంధించిన 4,078 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు పేర్కొంది. ఒక్క సైన్స్ సబ్జెక్టులో 284 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయలేదని పేర్కొంది. తాజాగా సోమవారం టీజీటీ ఇంగ్లిష్, హిందీ సబ్జెక్టుల పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు వెల్లడించింది. ఫలితాలను తమ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. ఇందులో 752 టీజీటీ ఇంగ్లిష్ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేశామని, మరో 37 మంది వికలాంగుల ఫలితాలను మెడికల్ రిపోర్టులు వచ్చాక ప్రకటిస్తామని పేర్కొంది. అలాగే ఒక పోస్టుకు సంబంధించి కోర్టు కేసు ఉన్నందున పెండింగ్లో పెట్టినట్లు తెలిపింది. టీజీటీ హిందీ పోస్టులకు 354 మందిని ఎంపిక చేసినట్లు వెల్లడించింది. అందులో 20 మంది వికలాంగులకు సంబంధించిన ఫలితాలను వారి మెడికల్ రిపోర్టులు వచ్చాక ప్రకటిస్తామని వివరించింది. నెల రోజుల వ్యవధిలోనే.. నెల రోజుల వ్యవధిలోనే 5,405 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసి, ఫలితాలను వెల్లడించినట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి వాణీప్రసాద్ తెలిపారు. అందులో టీజీటీ పోస్టులకు 4,078 మందిని, ఏఈఈ పోస్టులకు 132 మందిని, ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్ పోస్టులకు నలుగురిని, గ్రేడ్–2 అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టులకు 851 మందిని, ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు 340 మందిని ఎంపిక చేసి, ఫలితాలను ప్రకటించినట్లు వెల్లడించారు. ఇప్పటివరకు టీఎస్పీఎస్సీ 30,490 పోస్టుల భర్తీకి 83 నోటిఫికేషన్లను జారీ చేసిందని, అందులో 11,023 పోస్టులను భర్తీ చేసిందని, మరో 19,024 పోస్టుల భర్తీ, ఫలితాల వెల్లడి వివిధ దశల్లో ఉంటుందన్నారు. 1న స్టాఫ్ నర్సు ఫైనల్ కీ.. స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్ష ఫైనల్ కీని మే 1న వెబ్సైట్లో ఉంచనున్నట్లు వాణీప్రసాద్ తెలిపారు. వివరాలను వెబ్సైట్లో పొందవచ్చన్నారు. ఫైనల్ కీపై అభ్యంతరాలు స్వీకరించబోమని వెల్లడించారు. -
ఖాళీల భర్తీ ఎప్పుడో
రెండేళ్లయినా భర్తీ లేదు ఉప ఎన్నికల కోసం నిరీక్షణ నూజివీడు: పంచాయతీలలో వివిధ కారణాలతో ఖాళీ అయిన పదవుల భర్తీ ప్రశ్నార్ధకరంగా తయారైంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకునే ఇక్కడ ఎన్నికలను కూడా సరైన సమయానికి నిర్వహించుకోలేని దౌర్భాగ్య పరిస్థితులలో ప్రభుత్వం ఉండటం పట్ల ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి చనిపోయినా, పదవి నుంచి వైదొలగినా తిరిగి ఆరునెలలోగా ఉప ఎన్నిక నిర్వహించాలి. అప్పుడే ప్రజాస్వామ్యానికి బలం పెరుగడటంతో పాటు స్థానిక సంస్థలకు కూడా అధిక ప్రాధాన్యతనిచ్చినట్లవుతుంది. ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నం చేయడం లేదు. పంచాయతీ ఎన్నికలు 2013వ సంవత్సరం జులై నెలలో జరిగాయి. ఆ తరువాత కొన్నిచోట్ల సర్పంచులు తమ పదవులకు రాజీనామా చేయడం, మరికొన్ని చోట్ల చనిపోవడం, వార్డు సభ్యులు కూడా రాజీనామా చేయడం, చనిపోవడం జరిగింది. ఇవి జరిగి రెండేళ్లవుతున్నా పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు గాని, ప్రభుత్వం గాని పట్టించుకోకుండా స్థానిక సంస్థలను గాలికొదిలేసింది. 33వార్డు సభ్యులు, 4 సర్పంచి పదవులు ఖాళీ నూజివీడు డివిజన్లోని 14మండలాల్లో కలిపి 33 వార్డుసభ్యుల పదవులు, నాలుగు సర్పంచి పదవులు, ఆరు ఉపసర్పంచి పదవులు ఖాళీగా ఉన్నాయి. బాపులపాడు మండలం రేమల్లె, గంపలగూడెం మండలం వినగడప, గన్నవరం మండలం బూతిమిల్లిపాడు, ఉంగుటూరు మండలం ఉంగుటూరు సర్పంచి పదవులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో ఉంగుటూరు సర్పంచి రాజీనామా చేయగా, మిగిలిన పంచాయతీల సర్పంచిలు చనిపోవడంతో ఖాళీ అయ్యాయి. ఏ కొండూరు మండలం చీమలపాడు, ఆగిరిపల్లి మండలం గొల్లగూడెం, బాపులపాడు మండలం రంగన్నగూడెం, గంపలగూడెం మండలం కొనిజర్ల, గాదెవారిగూడెం, ఉంగుటూరు మండలం పెదఅవుటపల్లి పంచాయతీల ఉపసర్పంచిల పదవులు ఖాళీగా ఉన్నాయి. వార్డు సభ్యుల పదవులకు సంబంధించి ఏ కొండూరు, ఆగిరిపల్లి, చాట్రాయి, గన్నవరం, ముసునూరు, పమిడిముక్కల మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున, బాపులపాడు మండలంలో 3, గంపలగూడెంలో 6, నూజివీడులో 4, తిరువూరులో 5, ఉంగుటూరులో 3, విస్సన్నపేటలో 3, ఉయ్యూరులో 2 చొప్పున ఖాళీగా ఉన్నాయి. ఈ పదవులు దాదాపు రెండేళ్లుగా ఉన్నా ఎన్నికలు నిర్వహించకపోవడం దారుణమని పలు రాజకీయ పార్టీల నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. బాపులపాడు మండలం రేమల్లె సర్పంచి 2015 ఫిబ్రవరి 7వ తేదీన మరణించారు. గంపలగూడెం మండలం వినగడప సర్పంచి 2015 ఆగస్టు 8వ తేదీన, గన్నవరం మండలం బూతిమిల్లిపాడు సర్పంచి 2014 మే 29న చనిపోయారు. ఇలా సంవత్సరాలు గడుస్తున్నా ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేయడం గమనర్హం. ఇప్పటికైనా ఎన్నికలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.