breaking news
Renu Singh
-
అక్క కూడా అమ్మే
చిన్న చెల్లెలికి కిడ్నీ సమస్య వచ్చింది. పెద్దక్కకు ప్రాణం విలవిలలాడింది. తల్లి కిడ్నీ మేచ్ కాకపోయేసరికి నేను కూడా తల్లిలాంటిదాన్నే నా కిడ్నీ తీసుకోండి అంది. నువ్వు ఇవ్వాలంటే 20 కేజీలు బరువు తగ్గాలి అన్నారు డాక్టర్లు. 20 కేజీలంటే మాటలు కాదు. కాని చెల్లెలి కోసం శ్రమించింది. అక్టోబర్‌లో మొదలుపెట్టి జూలై నాటికి 20 కేజీలు తగ్గింది. చెల్లి కోసం ఇంకా ఏం చేయాలో చెప్పండి అంటోంది. అహ్మదాబాద్‌లో ప్రసిద్ధ కిడ్నీ పరిశోధక, చికిత్సా కేంద్రం– ఇన్స్టిట్యూట్ ఆఫ్ కిడ్నీ డిసీజెస్ అండ్ రీసెర్చ్ సెంటర్ (ఐ.కె.డి.ఆర్.సి) ఉంది. హాస్పిటల్లో ఉండే కిడ్నీ పేషెంట్లను అటెండ్ చేయడానికి వచ్చే వారి కోసం ఆ సెంటర్ బయట చిన్న చిన్న లాడ్జీలు ఉంటాయి. ఒక సింగిల్ రూమ్‌లు దొరుకుతాయి. అలాంటి ఒక సింగల్రూమ్లో 40 ఏళ్ల రేణు సింగ్ ఏడెనిమిది నెలలుగా ఉంటోంది. చెల్లెలి కోసం. చెల్లెలు హాస్పిటల్లో. అక్కడ బయట లాడ్జి గదిలో. వారిద్దరూ ఆ పరిస్థితి నుంచి బయటపడాలంటే చెల్లెలికి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ జరగాలి. కాని అది వాయిదా పడుతూనే ఉంది. మూడేళ్ల క్రితం రేణు సింగ్ ముంబైలో భర్తతో కుమారుడితో ఉంటుంది. ఆమె చెల్లెలు రాణి సింగ్ (32) పెళ్లి చేసుకుని ఉత్తర ప్రదేశ్‌లో ఆజమ్‌ఘర్‌లో స్థిరపడింది. ఆమెకు మూడేళ్లుగా కిడ్నీ సమస్యలు మొదలయ్యాయి. భర్తతో కలిసి వారణాసిలో, ఆ తర్వాత లక్నోలో వైద్యం చేయించుకుంది. కాని వారానికి రెండుసార్లు డయాలసిస్ చేసుకుని స్థితికి చేరుకోవడంతో డాక్టర్లు అహ్మాదాబాద్‌లోని కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌కు వెళ్లి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ వెంటనే చేయించుకోవలసిందిగా సూచించారు. తల్లి కిడ్నీ ఇవ్వడానికి ముందుకొచ్చింది. వారు అక్టోబర్ 2019లో అహ్మదాబాద్ చేరుకున్నాక డాక్టర్లు తల్లి కిడ్నీని పరీక్షలు చేసి ఆమె ఆరోగ్య, వయసు రీత్యా కిడ్నీ ఇవ్వడానికి సరిపోదు అని నిర్థారించారు. ఈ విషయం రేణుకు తెలిసింది. చెల్లెలిని కాపాడుకోవాలంటే తాను కిడ్నీ ఇవ్వాల్సిందే అని గ్రహించింది. రేణు సింగ్ (ఎడమ నుంచి రెండో వ్యక్తి), రాణి సింగ్ (చివరి వ్యక్తి). తండ్రి మరొక చెల్లితో. కూతురు ఒకింటి కోడలే కిడ్నీ ఇవ్వడం మగవారికి కొంత సులువేమో కాని స్త్రీలకు అంత సులువు కాదు ఈ దేశంలో. ఎందుకంటే ఆమె ఒకింటి కోడలు అయి ఉంటుంది. భర్త అనుమతి, అత్తామామల అనుమతి అవసరమవుతాయి. పుట్టింటి కోసం మెట్టినింటి మనిషిని ప్రమాదంలో పడేయడానికి విముఖత ఎదురు కావచ్చు. అయితే అదృష్టవశాత్తు రేణు సింగ్ భర్త, అత్తామామలు అందుకు అంగీకరించారు. రేణు అత్తగారి తమ్ముడు మరొకరికి కిడ్నీ దానం ఇవ్వడం వల్ల ఆ ఇంట్లో అవయవదానం పట్ల అవగాహన ఉంది. ఇక రేణు కొడుకైతే అన్ని వివరాలు గూగుల్ చేసి ‘అమ్మా... పిన్నికి కిడ్నీ ఇవ్వు. నిన్ను నేను సపోర్ట్ చేస్తాను’ అని సపోర్ట్ చేశాడు. ఇంకేం కావాలి... ఒక అక్కకు చెల్లెలిని కాపాడుకోవడానికి. క్రాస్మేచ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అహ్మదాబాద్ కిడ్నీ సెంటర్లో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ కోసం క్షుణ్ణంగా పరీక్షలు చేస్తారు. డి.ఎన్.ఏ టెస్ట్‌తో సహా ఈ పరీక్షలు ఉంటాయి. రేణుకు పరీక్షలు నిర్వహించారు. ఆమె కిడ్నీ పనికి వస్తుందికానీ నేరుగా చెల్లెలికి ఇవ్వడానికి మేచ్ కావడం లేదు. దీంతో డాక్టర్లు క్రాస్మేచ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం రేణు కిడ్నీ పరీక్షల వివరాలను కంప్యూటర్‌కు ఇచ్చారు. కంప్యూటర్ సెర్చ్ చేసి రాజస్థాన్‌లోని మున్నారామ్ అనే కిడ్నీ బాధితునికి రేణు కిడ్నీ సరిపోతుందని మున్నారామ్ తండ్రి కిడ్నీ రాణికి సరిపోతుందని తేల్చింది. అంటే రేణు కిడ్నీని ఆ కుర్రాడికి, ఆ కుర్రాడి తండ్రి కిడ్నీని రేణు చెల్లెలికి అమరుస్తారు. బరువు సమస్య అంతా సరిపోయింది అని సంతోషపడుతున్నంతలో రేణు బరువు ఒక సమస్య అయ్యింది. ఇంత బరువు ఉన్నవారు కిడ్నీ దానమిస్తే ఆ తర్వాత కాంప్లికేషన్స్ వస్తాయి అన్నారు డాక్టరు. రేణును 20 కేజీల బరువు తగ్గమన్నారు. ముంబైలో ఉంటూ ఇదంతా చేయాలంటే సాధ్యం కాదని అక్టోబర్ నుంచి రేణు కూడా అహ్మదాబాద్‌లో ఉండిపోయింది. హాస్పిటల్‌లోని చెల్లెలి బాగోగులు చూసుకుంటూ తాను బరువు తగ్గే పని పెట్టుకుంది. ఆహారంలో క్రమశిక్షణ, వ్యాయామం వీటన్నింటితో జూలై నాటికి 20 కేజీల బరువు తగ్గింది. ఇంత శ్రమ అవసరమా అంటే ‘నేను నా చిన్న చెల్లెల్ని అమ్మలా పెంచాను చిన్నప్పుడు. దాన్నెలా వదులుతాను’ అంటోంది. ఊరుకాని ఊరులో చెల్లెలి కుటుంబం ఉండటం, చెల్లి కోసం తాను వచ్చి ఉండటం ఇవన్నీ ఖర్చుతో కూడుకున్న పనులు. వారి దగ్గర డబ్బులు అయిపోయాయి. కాని అందరి మద్దతు వారికి దొరకుతోంది. ‘లాక్డౌన్ లేకపోతే ఈసరికి సర్జరీ అయిపోయేది. దాని కోసమే ఆశగా ఎదురు చూస్తున్నాం’ అని రేణు సింగ్ అంది. ‘కంటే కూతురిని కను’ అని మన దగ్గర అంటారు. ‘కంటే అక్కను కను. తర్వాత ఎవరినైనా కను’ అని రేణుని చూస్తే అనబుద్ధేస్తుంది. ఆ అక్కచెల్లెళ్లు త్వరలో చిరునవ్వులు చిందిస్తూ చిన్నప్పటి కబుర్లు చెప్పుకుంటారని ఆశిద్దాం. – సాక్షి ఫ్యామిలీ -
ఒక మౌనం ... ఒక మానం ... ఒక సమాధానం
1975.. లక్నో... చలికాలపు ఓ మధ్యాహ్నం... పదిహేనేళ్ల ఓ అమ్మాయి యెజ్డీ మోటార్‌సైకిల్ మీద క్యాజువల్‌గా పెట్రోల్ కోసం పెట్రోల్‌బంక్ దగ్గరకొచ్చి ఆగింది. పెట్రోల్ కొట్టించి బైక్‌ను టర్న్ చేస్తుంటే ఓ పన్నెండేళ్ల అమ్మాయి.... పరిగెత్తుకుంటూ తనవైపే వస్తోంది... భయంలో ఉంది.. వేసుకున్న గౌన్ కింది భాగమంతా రక్తసిక్తమై ఉంది. బైక్ మీద వున్న అమ్మాయి ఏదో కీడు శంకించింది. వెంటనే ఆ అమ్మాయికి ఎదురెళ్లి ‘బైక్ ఎక్కు’ అన్నట్టుగా కళ్లతోనే సైగ చేసింది. ఆ అమ్మాయి మెరుపువేగంతో బైక్ ఎక్కింది. వెనకనుంచి గట్టిగా వాటేసుకొని కూచుంది. వణుకుతున్న ఆ పిల్ల చేతులు ప్రమాద తీవ్రతను చెప్తున్నట్టు అనిపించింది బండి నడుపుతున్న అమ్మాయికి. క్షణం ఆలస్యం చేయకుండా యాక్సిలరేటర్ రైజ్ చేసింది. ఆ వెనకాలే వచ్చిన ఓ మగగుంపు ‘అరే.. భాగ్ గయీ పకడో పకడో’ అంటూ అరుస్తూ ఆ ఇద్దరినీ వెంబడించింది. తమ వెనకాలే వస్తున్న ఆ గుంపును చూసి వెనుక ఉన్న అమ్మాయి బెదిరిపోయింది. బైక్ నడుపుతున్న అమ్మాయి నడుం చుట్టూ చేతులను మరింత బిగిస్తూ.. ‘దీదీ.. హమ్కా బచాయే లెయ్యో’ (నన్ను కాపాడు అక్కా) అంది. ఎక్కడా బ్రేక్ వేయకుండా తిన్నగా తన ఇంటి ముందు ఆపింది యెజ్డీని ఆ అమ్మాయి. స్టాండ్ వేసి అంతే హడావుడిగా పన్నెండేళ్ల పిల్లను తీసుకొని ఇంట్లోకి పరిగెత్తి తలుపేసింది. ఆ అమ్మాయి హడావుడి, కంగారు చూసి వాళ్ల నాన్న ప్రశ్నల వర్షం కురిపించాడు. సమాధానం చెప్పబోతుండగానే బయట గేట్ దబదబ బాదుతున్న చప్పుడైంది. వాకిట్లో రాళ్లుపడుతున్న శబ్దమూ వినిపించడంతో తండ్రి కిటికీ తెరిచి చూశాడు. బయటి గుంపులోని ఒకవ్యక్తి ‘ఏ... ప్రిన్సిపల్.. నీ కూతురు ఓ అమ్మాయిని తీసుకొచ్చింది. మర్యాదగా ఆ పిల్లను వాళ్ల తండ్రికి అప్పగించు’ అంటూ గుంపులోనే ఉన్న ఓ నలభైఏళ్ల వ్యక్తిని చూపించాడు. కిటికీ కర్టెన్ వేసి ఈ ఇద్దరి వైపు చూశాడు అతను. ‘నన్ను పంపించొద్దు..’ అంటూ రెండు చేతులు జోడించి ఏడుస్తోంది ఆ పిల్ల. ఎందుకు వెళ్లవని అడిగాడు. ‘మా నాన్న నా మీద పడి...’ ఇంక చెప్పలేక రెండు చేతుల్లో మొహం దాచుకొని వెక్కివెక్కి ఏడవసాగింది. ఆ మాట విన్న ఆ పెద్దమనిషి నిశ్చేష్టుడయ్యాడు. అతని భార్య ఆ పిల్లను అక్కున చేర్చుకుంది. ‘వద్దు నాన్నా... ఈ అమ్మాయిని వాళ్ల నాన్నకు అప్పగించొద్దు’ అంటూ ఆయన చేతులు పట్టుకొని బతిమాలుతోంది పదిహేనేళ్ల కూతురు. ఇంతలోనే ఏదో వాహనం వచ్చి ఆగిన శబ్దం వినిపించింది. తేరుకున్న పెద్దాయన కిటికీలోంచి చూద్దామనుకునేలోపే తలుపు కొట్టిన చప్పుడు. వెళ్లి తలుపుతీశాడు. ఎదురుగా పోలీస్ ఇన్స్పెక్టర్. ‘ప్రిన్సిపల్ సాబ్.. ఇతని కూతురు మీ ఇంటికి వచ్చింది. మర్యాదగా ఆ పిల్లను ఇతనితో పంపించండి. పరువుగల కుటుంబం మీది. ఇందులో జోక్యం చేసుకొని అనవసరంగా రోడ్డు ఎక్కకండి’ అన్నాడు ఇన్స్పెక్టర్ హెచ్చరిస్తున్నట్టుగా.‘ఈ అమ్మాయిని వాడు రేప్ చేశా...’ అని ఆ పెద్దాయన అంటుండగానే బయటున్న గుంపంతా ఇంట్లోకి జొరబడి పన్నెండేళ్ల పిల్లను బలవంతంగా తీసుకెళ్లింది.‘ఆ విషయం పోలీసులు చూసుకుంటారు. మీకు సంబంధం లేదు’ అంటూ పోలీస్ ఇన్స్పెక్టరూ వెళ్లిపోయాడు. ఆ హెచ్చరికను కాదని ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకుంటే ఏం జరుగుతుందో తెలిసిన ఆ పెద్దాయన మిన్నకుండి పోయాడు. అతని పేరు డాక్టర్ శక్తిధర్సింగ్. లక్నోలోని ఓ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్. ఆయన పదిహేనేళ్ల కూతురి పేరు రేణు సింగ్. ఆర్నెల్ల తర్వాత.. రేణు ఆ అమ్మాయిని మర్చిపోలేదు. ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం చేస్తూనే ఉంది. ప్రయత్నం చేయగా చేయగా వివరాలు తెలిశాయి. తల్లడిల్లి పోయింది. ఆ పిల్లను వీళ్ల ఇంట్లోంచి తీసుకెళ్లిపోయిన ఐదురోజులకే భార్య చనిపోయిన ఓ 42 ఏళ్ల వ్యక్తికిచ్చి పెళ్లిచేశారట. తర్వాత రెండు రోజులకు చెరువులో శవమై తేలిందట. అయ్యో... ఎంత అన్యాయం. జరిగిన సంఘటన గురించి వాళ్ల నాన్నకు చెప్తూ ‘ఆ అమ్మాయిని మనమే చంపేశాం నాన్నా..’ అంటూ ఏడ్చింది. ఆ అపరాధభావంతో రేణుకి కంటి మీద కునుకు కరువైంది. రాత్రిళ్లు ఉలిక్కిపడి లేచేది. నానమ్మ సముదాయించినా సమాధాన పడలేదు. ఆ చిన్న మనసులో అప్పుడే ముద్ర పడింది ఆ అమ్మాయిలాంటి వాళ్లకోసం ఏదో చేయాలని..! ఆ క్షణం నుంచి ఐదేళ్లపాటు ఓ వైపు చదువుతూనే చేయాల్సిన పని గురించి అన్వేషణ సాగించింది. మహిళలకు సంబంధించి ఎక్కడ ఏ యాక్టివిటీ జరిగినా పాల్గొంటూనే ఉంది. సమాధానం.. ఆ అన్వేషణకు గమ్యం 1984లో దొరికింది ఆమెకు. అప్పటిదాకా సామాజికసేవలో తను గడించిన అనుభవంతో ‘సమాధాన్’ అనే సంస్థను స్థాపించింది. నాన్నమ్మ కుంతలాదేవి వెన్నుతట్టి ప్రోత్సహించింది. ఓ పక్క లా చదువుతూనే తన ఈడు అమ్మాయిల్ని పోగేసి ఆడపిల్లల సమస్యల మీద పోరాడేది. స్లమ్స్‌లో ఉన్న పిల్లలకు చదువు చెప్పేది. బాల్యవివాహాలను అడ్డుకునే ప్రయత్నాలూ చేసింది. అలా పదేళ్లు గడిచాయి. అప్పుడు ఆ ‘సమాధాన్’ని రిజిస్టర్ చేసుకొని ఇంకా పెద్దపెద్ద పనులు చేయొచ్చుకదా అని సలహా ఇచ్చారు ఎవరో. నిజంగానే సమాధాన్ని రిజిస్టర్ చేయిస్తే సేవా పరిధిని విస్తృతం చేయొచ్చు అనుకుంది. అప్పటికే లాయర్‌గా తను సంపాదించుకున్న పేరును ఈ సర్వీస్‌కి ఉపయోగించుకోవచ్చు అని నిశ్చయించుకొని 1994లో సమాధాన్‌ను రిజిస్టర్డ్ ఎన్జీవోగా మార్చింది. ఇప్పుడు.. రేణుసింగ్కి 51 ఏళ్లు. ఈ ముప్పైఏళ్లలో సమాధాన్ కొన్ని వందల బాల్యవివాహాలను ఆపింది, కట్నం కోసం పీటల మీద పెళ్లిళ్లు ఆపిన ఎందరినో జైల్లో పెట్టించింది. అదనపు కట్నం కోసం వేధిస్తున్న వాళ్లకు బుద్ధి చెప్పింది. గృహహింస చట్టం కోసం పోరాటంలో తనూ భాగస్వామి అయింది. అలా ఇప్పటిదాకా దాదాపు మూడువేల ఎనిమిది వందల మంది మహిళలను అఘాయిత్యాల నుంచి, గృహహింస నుంచి కాపాడింది. వాళ్లలో అన్ని వయసులవాళ్లు, అన్ని తరగతులకు, అన్ని కులాలకు చెందిన వాళ్లూ ఉన్నారు. వీళ్లలో కొంతమంది యాక్టివిస్ట్లుగా మారి తమలా హింసకు గురవుతున్న స్త్రీల కోసం పోరాడుతున్నారు. ఇంకొంతమంది పై చదువులు చదువుకుని మంచి మంచి ఉద్యోగాల్లో స్థిరపడి, స్వతంత్రంగా బతుకుతున్నారు. ఇంకొంతమంది సమాధాన్ కేంద్రంలోనే కౌన్సెలర్స్గా పనిచేస్తున్నారు. మొబైల్ లీగల్ క్లినిక్ (ఎమ్ఎల్సీ) ‘నిర్భయ’ లాంటి దారుణాలు పెచ్చుమీరుతున్న దరిమిలా స్త్రీల ఆత్మరక్షణార్థం ఈ మధ్యే మొబైల్ లీగల్ క్లినిక్ అనే సెల్‌నూ ప్రారంభించింది సమాధాన్. ‘జనాభాలో సగం మహిళలే ఉన్నా అన్ని విషయాల్లో వారికి అన్యాయమే జరుగుతోంది. ముఖ్యంగా వాళ్ల మీద జరుగుతున్న హింస, అరాచకాలకు ఎక్కడా న్యాయం జరగట్లేదు. అందుకే ఎక్కడ స్త్రీకి అన్యాయానికి, హింసకు గురవుతున్నా మా మొబైల్ లీగల్ క్లినిక్‌కి కాల్చేస్తే చాలు న్యాయ సలహాలు, సహకారం అందించేందుకు సిద్ధంగా ఉంటాం. సహాయం అందించడం కోసం ఇంటిగుమ్మంలో ప్రత్యక్షమవుతాం. ‘మొదలుపెట్టి కొన్ని నెలలే అయినా ఉత్తర భారతమంతా స్పందన ఉంది ఈ సర్వీస్‌కి. త్వరలోనే దక్షిణ భారతానికీ విస్తరించే ప్రయత్నాల్లో ఉన్నాం. ఫండింగ్ విషయంలో కూడా మొదటి నుంచి చాలా నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నాం. ట్యాక్స్ ఎగ్గొట్టే క్రమంలో మాకు ఫండింగ్ చేస్తామని వస్తున్నవాళ్ల దగ్గర పైసా తీసుకోం. దీనికి ఫండింగ్ అంతా వైట్ మనీనే’ అంటారు రేణుసింగ్. ‘ఈ దేశంలో మహిళలందరూ వయసు, వర్గం, వర్ణం, కులం, మతం తేడా లేకుండా ఎప్పుడూ ఏదో ఒక చోట ఏదో ఒక రకమైన హింసకు గురవుతూనే ఉన్నారు. దురదృష్టకరమైన విషయం ఏంటంటే వీళ్లలో చాలా మందికి అలా తాము హింసకు గురవుతున్నామనే విషయం తెలియకపోవడం. ఈ పరిస్థితి మారాలి. స్త్రీలలో చైతన్యం రావాలి. ప్రతి మహిళ ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసంతో బతకాలి. లింగవివక్షలేని, పిల్లలు, ఆడవాళ్ల మీద హింసలేని సమాజం కోసం పోరాడ్డమే మా లక్ష్యం’ అని చెప్తారు రేణుసింగ్. ఒక బలాత్కారాన్ని ప్రశ్నించకపోతే దాంట్లో మనమూ భాగం పంచుకున్నట్టే. ఒక దౌర్జన్యాన్ని నిలదీయకపోతేమనమూ దానికి వత్తాసు పలికినట్టే.ఒక దుర్మార్గాన్ని బహిర్గతం చేయకపోతే మనమూ దానిని సమర్థించినట్టే.ఒక కిరాతకాన్ని చెండాడకపోతే మనమూ దానిని ప్రోత్సహించినట్టే. మహిళలపై జరిగే ప్రతి అత్యాచారానికి సమాజం ప్రేక్షకపాత్ర వహిస్తే సమాజం కూడా అందులో భాగస్వామి అవుతుంది.రేణు ప్రశ్నిస్తోంది... నిలదీస్తోంది... బహిర్గతం చేస్తోంది... చెండాడుతోంది... మౌనంగా ఉండే సమాజానికి ఒక సమాధానంగా నిలుస్తోంది.