ఎత్తిపోతల పునరుద్ధరణకు రూ.43కోట్లు
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
పెనుబల్లి : ఎత్తిపోతల పథకాల పునరుద్ధరణకు సీఎం కేసీఆర్ జిల్లాకు రూ.43కోట్లు మంజూరు చేశారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. బయ్యన్నగూడెంలో సుమారు రూ.కోటి వ్యయంతో 240 ఎకరాలకు, టేకులపల్లిలో రూ.1.65కోట్లతో పునరుద్ధరించనున్న ఎత్తిపోతల పథకాలకు బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో నాగార్జున సాగర్ కాలువపై కేవలం నల్లగొండ జిల్లాకే పరిమితమైన ఎత్తిపోతల పథకాలను అప్పటి సీఎం ఎన్టీఆర్ గుర్తించి.. వి.వెంకటాయపాలెం నుంచి వేంసూరు మండలం గూడూరు వరకు అనేక ఎత్తిపోతల పథకాలను ఏర్పాటు చేసి సాగునీరు అందించారని తెలిపారు. కానీ.. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో ఎత్తిపోతల పథకాలన్నీ నిర్లక్ష్యానికి గురయ్యాయని, మరమ్మతులకు నోచుకోక మూలనపడ్డాయన్నారు. కొత్త రాష్ట్రంలో సత్తుపల్లి నియోజకవర్గంలో రూ.30కోట్లతో ఎత్తిపోతల పథకాలను పునరుద్ధరిస్తున్నట్లు తెలిపారు. బేతుపల్లి హైలెవల్ కాలువ ద్వారా వేంసూరు మండలంలో 10వేల ఎకరాలకు సాగునీరు ఇస్తున్నామన్నారు. గోదావరి నదిపై నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకం మూడు నాలుగేళ్లలో పూర్తవుతుందని, దీని ద్వారా జిల్లాలో ప్రతి ఎకరాకు సాగునీరు అందుతుందన్నారు. హరితహారంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని, మహిళలకు పండ్ల మొక్కలు పంపిణీ చేసి, వాటిని పెంచుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి మాట్లాడుతూ హరితహారం లాంటి పథకాన్ని ప్రతిపక్షాలు తప్పుపట్టడం సరికాదన్నారు. డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు మాట్లాడుతూ 50 శాతం సబ్సిడీతో యంత్ర పరికరాలు, గ్రీన్ హౌస్, ఫాలీ హౌస్ వంటి పథకాలను రైతులు వినియోగించుకోవాలన్నారు. అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు టేకులపల్లిలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ మురళీధర్‌రావు, ఐడీసీ ఈఈ విద్యాసాగర్, ఎంపీడీఓ ఆర్వీ.సుబ్రహ్మణ్యం, తహసీల్దార్ ఆర్ వెంకటలక్ష్మి, ఎంపీపీ చీకటి బేబీ శకుంతల, జెడ్పీటీసీ వాంకుడోతు రజిత, వైస్ ఎంపీపీ చెక్కిలాల లక్ష్మణరావు, ఎంపీటీసీలు నరుకుళ్ల ఉష, బీమిరెడ్డి చందన, సర్పంచ్‌లు మోడె సోమ్లా, రాజిన్ని రమణ, గాయం రమాదేవి, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.