breaking news
ration rice issue
-
వేధింపులకు భయపడేది లేదు.. వైఎస్సార్సీపీని వీడేది లేదు: పేర్ని నాని
కృష్ణా, సాక్షి: ఓటేసి గెలిపించిన ప్రజలకు మేలు చేయకుండా.. వ్యవస్థలను రాజకీయ వేధింపులకు వాడుకుంటోందని కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani) మండిపడ్డారు. రేషన్ బియ్యం వ్యవహారంలో కృష్ణా జిల్లా పోలీసులు హైకోర్టును సంప్రదించిన పరిణామంపై ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘మేం ఏపాపం చేయలేదని పోలీసు వ్యవస్థకు తెలుసు. ప్రభుత్వానికి జరిగిన నష్టానికి రెట్టింపు జమచేశాం. అయినా నా భార్య జయసుధ పై ఏడు సంవత్సరాల పైబడి శిక్ష పడే సెక్షను పెట్టి అరెస్టు చేయాలని చూశారు. ఆ సెక్షన్లు ఈ కేసుకు వర్తించవని జిల్లా కోర్టు నా భార్యకు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పుడు నా భార్యకు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని హైకోర్టుకు వెళ్లారు.. మా కుటుంబంపై తప్ప సివిల్ సప్లై శాఖ(Civil Supply Ministry) ఇంతవరకూ ఎవరిపైనా ఒక్క క్రిమినల్ కేసు పెట్టలేదు. అసలు సివిల్ సప్లై శాఖ అనేది ఏర్పడిన తర్వాత ఇప్పటిదాకా ఇప్పటి వరకు ఎవరిపైనా క్రిమినల్ కేసులు లేవు. సాక్షాత్తూ సివిల్ సప్లై మంత్రి వెళ్లి 22 వేల టన్నుల బియ్యం పట్టుకున్నా కేసు లేదు. సీజ్ ద షిప్.. సీజ్ ద గోడౌన్ అన్నా.. ఎవరిపైనా క్రిమినల్ కేసు లేదు. వాళ్లపై పెట్టింది కేవలం 6A కేసు మాత్రమే. నాకు ముందు కానీ నా తర్వాత కానీ ఒక్కరి పైన కూడా క్రిమినల్ కేసులు పెట్టలేదు. కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే నాపై, నా భార్యపై క్రిమినల్ కేసులు పెట్టారు... ఎన్నో జరుగుతున్నా అన్నీ 6A కేసులే. ఈ పరిస్థితి చూస్తేనే వాళ్ల దిగజారుడుతనం తెలుస్తోంది. నన్ను, నా భార్యను, నా కొడుకును ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎదుర్కొంటాం. ఆఖరికి జైలుకు అయినా పోతాం. అంతేగానీ వైఎస్సార్సీపీ(YSRCP) నుంచి తప్పుకునేది లేదు. ఎల్లప్పుడూ జగన్ వెంటే ఉంటాం. కూటమి తప్పుల్ని ఎంగడుతూనే ఉంటాం’’ అని పేర్ని నాని అన్నారు. -
పేదల బియ్యం.. పెద్దలపాలు
ఎంఎల్ఎస్ పాయింట్లలో మతలబు బస్తాకు రెండు కిలోల తగ్గుదల చౌక డిపోకు వస్తుంది బస్తాకు 48 కిలోలే! నెలకు వేయి టన్నులు పక్కదారి మిగిలిన బియ్యం మిల్లుకు తరలింపు ప్రతినెలా తెల్ల రేషన్ కార్డుదారులకు పంచాల్సిన బియ్యం పక్కదారి పడుతున్నాయి. అధికారులు.. కింది స్థాయి సిబ్బంది సహకారంతో యథేచ్ఛగా రేషన్ బియ్యాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. శుక్రవారం పెద్దాపురం మండలం దివిలి గోదాముల నుంచి 198 బస్తాల రేషన్ బియ్యం ఉండూరులోని తేజ రైస్ మిల్లుకు తరలించగా, విజిలెన్స్ అధికారులు పక్కా సమాచారంతో దాడి చేసి పట్టుకోవడంతో ఈ బాగోతం వెలుగు చూసింది. – సాక్షి, రాజమహేంద్రవరం సాధారణంగా సరుకుకు అయిన మొత్తానికి డీలర్ డీడీ తీసిన తర్వాత మండల స్థాయి సరుకు (ఎంఎల్ఎస్) పాయింట్ల నుంచి చౌక డిపోలకు ప్రతినెలా రేషన్ తరలిస్తారు. ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి డీలర్‌కు వస్తున్న 50 కిలోల బస్తాలకు గాను 48 కిలోలే వస్తున్నాయి. డీలర్‌కు చేరే ముందు ప్రతి బస్తాను ఎంఎల్ఎస్ పాయింట్లలో ఈ–వేమెంట్ ద్వారా తూచి ఇవ్వాలి. అందుకు ప్రతి పాయింట్లో ఎలక్ట్రానిక్ కాటాలను ప్రభుత్వం సమకూర్చింది. ఈ యంత్రాలు వచ్చి 16 నెలలైనా ఇప్పటివరకు వినియోగించలేదు. సాధారణ కాటా ద్వారానే బస్తాలను తూకం వేసి పంపుతున్నారు. నెలకు వెయ్యి టన్నులు పక్కదారి! జిల్లాలో 2,444 చౌక డిపోల ద్వారా 15,79,555 కార్డుదారులకు ప్రతినెలా 20 వేల మెట్రిక్ టన్నుల రేషన్ పంపిణీ జరుగుతోంది. పట్టణాలు, గ్రామాల్లో ఒక్కో డీలర్ పరిధిలో 300 నుంచి వెయ్యి కార్డుల వరకూ ఉంటున్నాయి. ఎంఎల్ఎస్ పాయింట్లో లోడింగ్‌కు ముందే బస్తాకు రెండు కిలోల చొప్పున బియ్యాన్ని తగ్గిస్తున్నారు. క్వింటాకు నాలుగు కిలోల బియ్యం తక్కువగా వస్తుండడంతో సరాసరిగా ఒక్కో డీలర్‌కు రెండు నుంచి ఆరు క్వింటాళ్ల బియ్యం తక్కువగా చేరుతోంది. ఇలా ప్రతినెలా సుమారు వెయ్యి టన్నుల బియ్యం ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి పక్కదారి పడుతున్నాయి. ఇలా మిగిలిన బియ్యాన్ని గుట్టుచప్పుడు కాకుండా మార్కెట్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. గోడౌన్ సిబ్బంది, ఎంఎల్ఎస్ పాయింట్ అధికారులు వారి స్థాయికి తగ్గట్టు వాటాలు పంచుకుంటున్నారు. లబ్ధిదారులకే నష్టం చౌకడిపోల వద్ద బియ్యం పక్కదారి పడకుండా ప్రభుత్వం అన్ని షాపుల్లో బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ–పోస్ యంత్రం ద్వారా లబ్ధిదారుని వేలిముద్ర తీసుకున్న తర్వాతే డీలర్ రేషన్ ఇచ్చేలా కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. బియ్యం కూడా ఈ–వేమెంట్ (ఎలక్ట్రానిక్ కాటా) ద్వారా కొలిచి ఇచ్చేలా ప్రతి దుకాణానికి యంత్రాన్ని సమకూర్చింది. ఎంఎల్ఎస్ పాయింట్లో కూడా ఈ–వేమెంట్ ద్వారా బస్తాలను తూకం వేయాల్సి ఉన్నా అక్కడ అమలు కావడంలేదు. తమకు బస్తాకు 50 కిలోల బియ్యం రావడం లేదని, ఈ–వేమెంట్ ద్వారా తూకం వేచి ఇవ్వాల్సిందిగా రేషన్ డీలర్లు సంయుక్త కలెక్టర్(జేసీ) సత్యనారాయణ, డీఎస్ఓ ఉమామహేశ్వరరావుకు పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా, సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. చౌకడిపోలకు బియ్యం తక్కువగా వస్తుండడంతో అంతిమంగా లబ్ధిదారులు నష్టపోతున్నారు. డీలర్ దగ్గరుండి సరుకు తెచ్చుకోవచ్చు రేషన్ బస్తాల్లో తరుగుదల వస్తోందని డీలర్లు ఫిర్యాదు చేశారు. వారే ఎంఎల్ఎస్ పాయింట్ వద్దకు వెళ్లి స్వయంగా తూకం వేయించుకుని తెచ్చుకోమని చెప్పాం. అందరూ వెళ్లలేరు కనుక వారి తరఫున ఒక డీలర్‌ను వెళ్లమని చెప్పాం. తక్కువగా వస్తున్నాయనుకుంటే బయట తూకం వేసి చూసుకోవచ్చు. త్వరలో ఎంఎస్ఎల్ పాయింట్ల వద్ద కూడా ఈ–పోస్ యంత్రాలు పెట్టే ప్రతిపాదన ప్రభుత్వం చేస్తోంది. ఇది అమలులోకి వస్తే ఈ సమస్య ఉండదు. – జి.ఉమామహేశ్వరరావు, డీఎస్ఓ