breaking news
Rajballabh Yadav
-
అత్యాచారం కేసు.. మాజీ మంత్రిపై సస్పెన్షన్ వేటు
పట్నా: మైనర్ బాలికను కిడ్నాప్ చేసి ఆత్యాచారం చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి, పార్టీ ఎమ్మెల్యే రాజ్బల్లాభ్ యాదవ్ ఆర్జేడీ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డ ఆరోపణలపై వివరణ ఇవ్వాలని పార్టీ ఆయనకు నోటీసులు జారీ చేసింది. కిడ్నాప్, అత్యాచారం ఘటనలకు పాల్పడ్డాడని బాధితురాలు కేసు పెట్టడంతో పార్టీ ఆయనపై చాలా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్జేడీ బిహార్ రాష్ట్ర అధ్యక్షుడు రామ చంద్ర పర్బే తమ పార్టీ ఎమ్మెల్యేను సస్పెండ్ చేసినట్లు మీడియాకు వివరించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన నవాడా నుంచి ఆర్జేడీ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు. నలందకు చెందిన బాధిత మైనర్ బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఎమ్మెలయే రాజ్ బల్లాభ్ యాదవ్ పై శనివారం కేసు నమోదు చేశారు. ఈ నెల 6న ఎమ్మెల్యే తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని బాధిత బాలిక తన ఫిర్యాదులో పేర్కొంది. మాజీ మంత్రిని అరెస్ట్ చేయాల్సిందిగా బిహార్ డీఐజీ షాలిన్ శనివారం పోలీసులను ఆదేశించిన విషయం విదితమే. తనపై కేసు నమోదయిందన్న విషయాన్ని తెలుసుకున్నప్పటి నుంచి మాజీ మంత్రి తన ఫోన్ స్విచ్ఛాఫ్ చేశారని పోలీసులు తెలిపారు. బాలికపై అత్యాచారం జరిగిన ప్రాంతంలో ఆధారాలను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్ కు టెస్టులకు పంపేందుకు పోలీస్ బృందం వెళ్లింది. అయితే, ఆధారాల సేకరణ, ఫోరెన్సిక్ టెస్టులు మేజిస్ట్రేట్ సమక్షంలోనే జరగాలంటూ అత్యాచార కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి, ఆర్జేడీ ఎమ్మెల్యే రాజ్ బల్లాభ్ యాదవ్ అనుచరులు, మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు. -
బాలికను రేప్ చేసి.. ఎమ్మెల్యే పరార్
పట్నా: బిహార్‌లో అధికార జేడీయూ, ఆర్జేడీ ఎమ్మెల్యేల ఆగడాలు హెచ్చుమీరుతున్నాయి. ఆర్జేడీ ఎమ్మెల్యే రాజ్‌బల్లాబ్ యాదవ్ ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసినట్టు కేసు నమోదైంది. రాజ్‌బల్లాబ్ యాదవ్‌ను అరెస్ట్ చేయాల్సిందిగా బిహార్ డీజేపీ ఆదేశించారు. కేసు పెట్టవద్దని, ఈ విషయం బయటకు చెప్పవద్దంటూ ఎమ్మెల్యే తనకు 30 వేల రూపాయలు ఇవ్వజూపినట్టు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నెల 6న ఈ ఘటన జరిగింది. ఎమ్మెల్యే ఇంట్లో బాధితురాలికి కాపలాగా ఉన్న ఓ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా ఎమ్మెల్యే ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఎమ్మెల్యే కోసం గాలిస్తున్నారు. శనివారం రాత్రి నవడా జిల్లాలో పలు ప్రాంతాల్లో పోలీసులు దాడులు చేశారు. ఇదే జిల్లా నుంచి రాజ్‌బల్లాబ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఇటీవల బిహార్ అధికార జేడీయూ ఎమ్మెల్యే బీమా భారతి తన భర్త పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకోవడానికి సాయపడినట్టు ఆరోపణలు ఎదుర్కోగా.. అదే పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే సర్ఫరాజ్ ఆలం ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సర్ఫరాజ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.